కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 ఫిబ్రవరి పేజీలు 13-17
  • యెహోవాకు అన్నీ సాధ్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు అన్నీ సాధ్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయడం
  • ఒకప్పటి బందీలు కిర్గిజ్‌స్థాన్‌కు సత్యాన్ని తీసుకొచ్చారు
  • సత్యం మా ఊరుకు వచ్చింది
  • నా భార్య సత్యాన్ని వెంటనే గ్రహించింది
  • నిషేధం ఉన్నప్పటికీ మీటింగ్స్‌కు, బాప్తిస్మానికి ఏర్పాట్లు
  • పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం
  • కుటుంబంతో, పరిచర్యలో బిజీ అయ్యాం
  • మర్చిపోలేని మార్పులు
  • ఆయన తన యౌవనంలో తీసుకున్న నిర్ణయం గురించి ఎప్పుడూ బాధపడలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • విషయసూచిక
    తేజరిల్లు!—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 ఫిబ్రవరి పేజీలు 13-17
బాషన్‌బై బడిబాయెఫ్‌

జీవిత కథ

యెహోవాకు అన్నీ సాధ్యం

బాషన్‌బై బడిబాయెఫ్‌ చెప్పినది

“మరణం ఇక ఉండదు, చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు” అని ఒకావిడ చెప్పడం, బస్సులో వెళ్తున్న నా భార్య మైరామ్‌బుబు విన్నది. దాంతో ఆమెలో కుతూహలం పెరిగింది. బస్సు ఆగి ప్రయాణికులు దిగిపోతుండగా, నా భార్య ఆ మాటలు చెప్పిన స్త్రీ వెనకాలే వెళ్లింది. ఆ స్త్రీ పేరు ఆపూన్‌ మామ్‌బెసాడికోవ, ఆమె ఒక యెహోవాసాక్షి. ఆ రోజుల్లో సాక్షులతో మాట్లాడడం చాలా ప్రమాదకరం. కానీ కొంతకాలం తర్వాత మేం ఆమె దగ్గర నేర్చుకున్న విషయాలు మా జీవితాల్ని మార్చేశాయి.

ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయడం

నేను 1937లో, కిర్గిజ్‌స్థాన్‌లోని టాక్‌మాక్‌ దగ్గర ఉమ్మడి వ్యవసాయం చేసే చోట పుట్టాను. మేము కిర్గిజ్‌ ప్రజలం, కిర్గిజ్‌ భాష మాట్లాడతాం. మా అమ్మానాన్న పొలంపని చేసేవాళ్లు. వాళ్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉమ్మడి వ్యవసాయం చేసేవాళ్లు. అప్పట్లో రైతులకు ఇంట్లోకి కావాల్సిన సరుకుల్ని క్రమంగా ఇచ్చేవాళ్లు, కానీ జీతాలు మాత్రం సంవత్సరానికి ఒక్కసారే ఇచ్చేవాళ్లు. నన్ను, మా చెల్లిని పెంచడానికి మా అమ్మ కష్టపడేది. నేను కేవలం ఐదు సంవత్సరాలే స్కూల్‌కి వెళ్లాను, ఆ తర్వాత నేను కూడా రోజంతా వ్యవసాయం చేసేవాణ్ణి.

కిర్గిజ్‌స్థాన్‌ మ్యాప్‌
టెస్కే ఆలా-టు పర్వతాలు

టెస్కే ఆలా-టూ పర్వతాలు

మా ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉండేది. మా అవసరాల కోసం ఒళ్లు హూనమయ్యేలా పనిచేసేవాళ్లం. యువకుడిగా ఉన్నప్పుడు, నాకు జీవిత సంకల్పం లేదా భవిష్యత్తు గురించిన ఆలోచనే ఉండేది కాదు. అయితే యెహోవా దేవునికి, ఆయన సంకల్పానికి సంబంధించిన అద్భుతమైన సత్యాలు నా జీవితాన్ని మార్చేస్తాయని నేనెప్పుడూ ఊహించలేదు. ఆ సత్యాలు కిర్గిజ్‌స్థాన్‌కు ఎలా చేరాయి, ఎలా వ్యాప్తి చెందాయి అనేది ఒక ఆసక్తికరమైన కథ. అదంతా మా స్వస్థలమైన ఉత్తర కిర్గిజ్‌స్థాన్‌లో జరిగింది.

ఒకప్పటి బందీలు కిర్గిజ్‌స్థాన్‌కు సత్యాన్ని తీసుకొచ్చారు

కిర్గిజ్‌స్థాన్‌లో యెహోవా దేవుని గురించిన సత్యపు విత్తనం 1950లో మొలకెత్తింది. ఆ సత్యాన్ని తెలుసుకున్న ప్రజలు, శక్తివంతమైన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చాల్సి వచ్చింది. ఎందుకు? ఇప్పుడు కిర్గిజ్‌స్థాన్‌ అని పిలవబడుతున్న దేశం ఒకప్పుడు యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌లో (యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌) ఒక భాగం. యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌లో ఉన్న యెహోవాసాక్షులంతా రాజకీయ విషయాల్లో ఎవ్వరి పక్షం వహించేవాళ్లు కాదు. (యోహా. 18:36) కాబట్టి వాళ్లను, కమ్యూనిస్టు ప్రభుత్వానికి శత్రువులుగా పరిగణించి హింసించారు. కానీ నిజమైన ఆసక్తిగల ప్రజలకు దేవుని వాక్యం చేరకుండా ఏ సిద్ధాంతం ఆపలేకపోయింది. నిజానికి, నా జీవితమంతటిలో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠాల్లో ఒకటేమిటంటే, యెహోవాకు “అన్నీ సాధ్యం.”—మార్కు 10:27.

ఎమీల్‌ యాస్టెన్‌

ఎమీల్‌ యాస్టెన్‌

హింసవల్ల కిర్గిజ్‌స్థాన్‌లో యెహోవాసాక్షుల సంఖ్య పెరిగింది. ఎలా? యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌లో సైబీరియా కూడా ఒక రాష్ట్రంగా ఉండేది. ప్రభుత్వానికి శత్రువులుగా పరిగణించే వాళ్లను సైబీరియాకు బందీలుగా పంపించేవాళ్లు. అక్కడినుండి విడుదలైన చాలామంది కిర్గిజ్‌స్థాన్‌కు వచ్చారు. వాళ్లలో కొంతమంది తమతోపాటు బైబిలు సత్యాన్ని కూడా తీసుకొచ్చారు. అలాంటివాళ్లలో ఒకాయన ఎమీల్‌ యాస్టెన్‌, ఆయన 1919లో కిర్గిజ్‌స్థాన్‌లో పుట్టాడు. లేబర్‌ క్యాంప్‌లో పరిచయమైన యెహోవాసాక్షుల ద్వారా ఆయన సత్యం తెలుసుకున్నాడు. 1956లో ఆయన కిర్గిజ్‌స్థాన్‌కు తిరిగొచ్చి, మా ప్రాంతానికి దగ్గర్లో ఉన్న జోకులుక్‌లో స్థిరపడ్డాడు. 1958⁠లో అక్కడ మొట్టమొదటి సంఘం ఏర్పడింది.

విక్టర్‌ వింటర్‌

విక్టర్‌ వింటర్‌

దాదాపు ఒక సంవత్సరం తర్వాత, విక్టర్‌ వింటర్‌ అనే సహోదరుడు జోకులుక్‌ వచ్చాడు. నమ్మకమైన ఈ సహోదరునికి ఒకదాని వెనక ఒకటి కష్టాలు వచ్చాయి. ఎవ్వరి పక్షం వహించకుండా ఉన్నందుకు ఆయనకు రెండుసార్లు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఆయన మరో 10 సంవత్సరాలు జైల్లో, ఇంకో 5 సంవత్సరాలు బందీగా గడిపాడు. అంత హింస ఉన్నప్పటికీ సత్యారాధన విస్తరించింది.

సత్యం మా ఊరుకు వచ్చింది

ఎడ్వార్ట్‌ వార్టర్‌

ఎడ్వార్ట్‌ వార్టర్‌

1963 నాటికి కిర్గిజ్‌స్థాన్‌లో దాదాపు 160 మంది యెహోవాసాక్షులు తయారయ్యారు. వాళ్లలో చాలామంది జర్మనీ, యుక్రెయిన్‌, రష్యాకు చెందినవాళ్లు. అందులో ఒకాయన ఎడ్వార్ట్‌ వార్టర్‌. ఆయన 1924లో జర్మనీలో బాప్తిస్మం తీసుకున్నాడు. 1940లలో నాజీలు ఆయన్ని కాన్సంట్రేషన్‌ క్యాంప్‌కు పంపించారు. కొన్నేళ్ల తర్వాత యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌లోని కమ్యూనిస్టులు ఎడ్వార్ట్‌ను బందీగా పంపించారు. యెహోవాకు నమ్మకంగా సేవ చేసిన ఈ సహోదరుడు 1961లో మా ఊరుకు దగ్గర్లో ఉన్న కాంట్‌ అనే పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు.

ఎలీజబెత్‌ ఫాట్‌; ఆక్సామే సుల్‌తానాలీయెవా

ఎలీజబెత్‌ ఫాట్‌; ఆక్సామే సుల్‌తానాలీయెవా

యెహోవాకు నమ్మకంగా సేవచేసిన ఎలీజబెత్‌ ఫాట్‌ కూడా కాంట్‌లో ఉండేది. బట్టలు కుట్టడం ఆమె వృత్తి. ఆ పనిలో ఆమెకు ఎంత నైపుణ్యం ఉండేదంటే డాక్టర్లు, టీచర్లు వంటివాళ్లు వచ్చి ఆమె దగ్గర బట్టలు కుట్టించుకునేవాళ్లు. ఆక్సామే సుల్‌తానాలీయెవా అనే ఆవిడా కూడా ఎలీజబెత్‌ దగ్గరకు వచ్చేది. ఆక్సామే భర్త పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయంలో ఒక అధికారి. ఆక్సామే, ఎలీజబెత్‌ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చినప్పటికీ జీవిత సంకల్పం గురించి, చనిపోయినవాళ్ల స్థితి గురించి చాలా ప్రశ్నలు అడిగేది. ఆ ప్రశ్నలన్నిటికీ ఎలీజబెత్‌ నేరుగా బైబిలు తీసి జవాబు చెప్పింది. దాంతో, ఆక్సామే ఉత్సాహవంతమైన ప్రచారకురాలు అయ్యింది.

నికాలై షీంపోష్‌

నికాలై షీంపోష్‌

దాదాపు ఆ సమయంలోనే, మాల్డోవాకు చెందిన నికాలై షీంపోష్‌ అనే సహోదరుడిని ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. ఆయన సుమారు 30 సంవత్సరాలు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాడు. సహోదరుడు నికాలై సంఘాలను సందర్శించడంతోపాటు మన సాహిత్యాన్ని ప్రింట్‌ చేసి, పంపిణీ చేసే పని చూసుకునేవాడు. ఆయన చేసే పనుల్ని అధికారులు గమనించారు. అందుకే ఎడ్వార్ట్‌ వార్టర్‌ ఆయనకు ఈ ప్రోత్సాహకరమైన సలహా ఇచ్చాడు, “అధికారులు ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, మాకు సాహిత్యం బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయం నుండి వస్తుందని ధైర్యంగా చెప్పు. KGB అధికారి కళ్లలోకి సూటిగా చూడు. నువ్వు దేనికీ భయపడనక్కర్లేదు.”—మత్త. 10:19.

ఎడ్వార్ట్‌, నికాలై మాట్లాడుకున్న కాసేపటికే, నికాలైను కాంట్‌లో ఉన్న KGB ప్రధాన కార్యాలయానికి రమ్మనే కబురు వచ్చింది. ఆ తర్వాత జరిగినదాని గురించి నికాలై ఇలా చెప్పాడు, “సాహిత్యం ఎక్కడ నుండి వస్తుందని KGB అధికారి అడిగాడు. బ్రూక్లిన్‌ నుండి వస్తుందని చెప్పాను. ఆ అధికారికి ఏమి మాట్లాడాలో అర్థంకాలేదు. దాంతో నన్ను వెళ్లిపోమన్నాడు, ఇంకెప్పుడూ పిలవలేదు.” అలాంటి ధైర్యంగల సాక్షులు, నా స్వస్థలమైన ఉత్తర కిర్గిజ్‌స్థాన్‌లో మంచివార్తను జాగ్రత్తగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే, యెహోవా గురించిన అద్భుతమైన సత్యం చివరికి 1981⁠లో మా తలుపు తట్టింది. నా భార్య మైరామ్‌బుబుయే ఆ సత్యాన్ని మొదట విన్నది.

నా భార్య సత్యాన్ని వెంటనే గ్రహించింది

మైరామ్‌బుబు సొంతూరు కిర్గిజ్‌స్థాన్‌లోని నార్న్‌. 1974, ఆగస్టు నెలలో ఒకరోజు ఆమె మా చెల్లెలు ఇంటికి వచ్చింది. అప్పుడే ఆమెను మొదటిసారి కలిశాను. మొదటిసారి చూడగానే ఆమె నాకు చాలా నచ్చింది. ఆ రోజే మేమిద్దరం పెళ్లిచేసుకున్నాం.

ఆపూన్‌ మామ్‌బెసాడికోవ

ఆపూన్‌ మామ్‌బెసాడికోవ

1981 జనవరిలో మైరామ్‌బుబు బస్సులో మార్కెట్‌కు వెళ్తుండగా, నేను మొదట్లో చెప్పిన ఆ మాటల్ని విన్నది. దానిగురించి నా భార్య ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంది. అందుకే ఆమె ఆ స్త్రీ పేరు, అడ్రస్‌ అడిగింది. ఆ స్త్రీ తన పేరు ఆపూన్‌ అని చెప్పిందిగానీ అడ్రస్‌ చెప్పకుండా జాగ్రత్తపడింది. ఎందుకంటే 1980లలో కూడా యెహోవాసాక్షుల పనిపై నిషేధం ఉండేది. ఆమె మా అడ్రస్‌ తీసుకుంది. ఆరోజు నా భార్య ఇంటికి చాలా సంతోషంగా వచ్చింది.

“నేను అద్భుతమైన విషయాలు విన్నాను. రాబోయే కాలంలో మనుషులు చనిపోరని ఒకామె నాకు చెప్పింది. పైగా క్రూర జంతువులు కూడా సాధు జంతువుల్లా మారతాయంటా” అని మైరామ్‌బుబు చెప్పింది. నాకైతే, అది ఒక కట్టు కథలా అనిపించింది. “ఆమె వచ్చి వాటిగురించి వివరంగా చెప్పేదాకా ఎదురుచూద్దాం” అని అన్నాను.

మూడు నెలల తర్వాత ఆపూన్‌ మా ఇంటికి వచ్చింది. ఆ తర్వాత వేరే సహోదరీలు వచ్చి కలిశారు. కిర్గిజ్‌ ప్రజల్లో మొట్టమొదట సత్యం తెలుసుకున్న వాళ్లలో ఈ సహోదరీలు కూడా ఉన్నారు. వాళ్లు యెహోవా గురించిన, మనుషుల విషయంలో ఆయన సంకల్పం గురించిన అద్భుతమైన సత్యాలను మాకు పరిచయం చేశారు. పరదైసును పోగొట్టుకోవడం నుండి పరదైసును తిరిగిపొందడం వరకు (ఇంగ్లీషు)a పుస్తకం నుండి మాకు స్టడీ చేసేవాళ్లు. టాక్‌మాక్‌ ప్రాంతంలో ఆ పుస్తకం ఒక్క కాపీయే ఉండేది కాబట్టి మాకోసం ఒక కాపీ రాసుకున్నాం.

మేం మొట్టమొదట నేర్చుకున్న విషయాల్లో ఆదికాండము 3:15లో ఉన్న ప్రవచనం ఒకటి. దేవుడు నియమించిన మెస్సీయ రాజైన యేసు ద్వారా ఆ ప్రవచనం నెరవేరుతుంది. అది ప్రతీఒక్కరూ వినాల్సిన ప్రాముఖ్యమైన సందేశం. మనం ప్రకటనా పని చేయడానికిగల ముఖ్యమైన కారణం కూడా అదే. (మత్త. 24:14) కొంతకాలానికే మేం నేర్చుకున్న బైబిలు సత్యాలకు తగ్గట్టుగా జీవించడం మొదలుపెట్టాం.

నిషేధం ఉన్నప్పటికీ మీటింగ్స్‌కు, బాప్తిస్మానికి ఏర్పాట్లు

ఓరోజు టాక్‌మాక్‌లోని సహోదరుడు మమ్మల్ని ఒక పెళ్లికి ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన కాసేపటికే, యెహోవాసాక్షులు ఇతరులకన్నా వేరుగా ఉన్నారని నేనూ, నా భార్య గ్రహించాం. ఆ పెళ్లిలో మందు ఏర్పాటు లేదు, కార్యక్రమమంతా చాలా పద్ధతిగా జరిగింది. అప్పటివరకు మేం వెళ్లిన పెళ్లిళ్లకు, యెహోవాసాక్షుల పెళ్లికి చాలా తేడా ఉంది. ఎందుకంటే, వేరే పెళ్లిళ్లో అతిథులు తరచూ మందు తాగేవాళ్లు, చెడుగా ప్రవర్తించేవాళ్లు, బూతులు మాట్లాడేవాళ్లు.

టాక్‌మాక్‌లో జరిగిన మీటింగ్స్‌కు కూడా అప్పుడప్పుడు వెళ్లాం. వాతావరణం అనుమతించిన దాన్నిబట్టి, అడవుల్లో ఆ మీటింగ్స్‌ జరిగేవి. పోలీసులు మమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటారని సహోదరసహోదరీలకు తెలుసు కాబట్టి, మీటింగ్స్‌ జరిగే సమయంలో ఒక సహోదరుణ్ణి కాపలా ఉంచేవాళ్లు. చలికాలంలో మీటింగ్స్‌ని ఒక ఇంట్లో జరుపుకునేవాళ్లం. ఒకటి రెండుసార్లు పోలీసు ఆ ఇంటికి వచ్చి, ఏమి చేస్తున్నామని మమ్మల్ని అడిగాడు కూడా. నేనూ, మైరామ్‌బుబు 1982 జూలైలో చుయ్‌ నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. (మత్త. 10:16) కేవలం కొంతమంది సహోదరసహోదరీలమే అడవిలో కలుసుకొని, రాజ్య గీతం పాడి, బాప్తిస్మ ప్రసంగం విన్నాం.

పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం

బాలిక్చిలో ఉంటున్న ఒక ఆసక్తిపరుణ్ణి వెళ్లి కలవమని 1987⁠లో ఒక సహోదరుడు నాకు చెప్పాడు. మా ఇంటి నుండి అక్కడికి ట్రైన్‌లో వెళ్లాలంటే నాలుగు గంటలు పడుతుంది. బాలిక్చిలో కొంతకాలం ప్రీచింగ్‌ చేశాక, అక్కడ చాలామంది ఆసక్తిపరులు ఉన్నారని అర్థమైంది. మా పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి అది నిజంగా ఒక మంచి అవకాశం.

నేనూ, మైరామ్‌బుబు తరచూ బాలిక్చికి వెళ్లేవాళ్లం. చాలావరకు వారాంతాల్లో అక్కడే ఉండిపోయి ప్రీచింగ్‌ చేసేవాళ్లం, మీటింగ్స్‌ నిర్వహించేవాళ్లం. దాంతో మన ప్రచురణలు చదివేవాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. టాక్‌మాక్‌ నుండి మన ప్రచురణల్ని, బంగాళదుంపలు రవాణా చేయడానికి ఉపయోగించే సంచిలో తీసుకెళ్లేవాళ్లం. ప్రతీనెల రెండు సంచుల నిండా ప్రచురణల్ని తీసుకెళ్లినా సరిపోయేవి కావు. మేం బాలిక్చికి వెళ్లేటప్పుడు, అక్కడినుండి తిరిగొచ్చేటప్పుడు ట్రైన్‌లో కూడా సాక్ష్యమిచ్చేవాళ్లం.

మేం బాలిక్చిలో మంచివార్త ప్రకటించిన ఎనిమిది సంవత్సరాలకు అంటే 1995⁠లో అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అన్ని సంవత్సరాలు మేం టాక్‌మాక్‌ నుండి బాలిక్చికి వెళ్లిరావడానికి చాలా ఖర్చు అయింది. ధనవంతులం కాకపోయినా ఆ ఖర్చులను ఎలా భరించగలిగాం? ఒక సహోదరుడు మా ఖర్చుల కోసం ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. పరిచర్యను విస్తృతం చేసుకోవాలనే మా కోరికను చూసి, యెహోవా మాకోసం ‘ఆకాశపువాకిండ్లను విప్పాడు.’ (మలా. 3:10) ఖచ్చితంగా యెహోవాకు అన్నీ సాధ్యం.

కుటుంబంతో, పరిచర్యలో బిజీ అయ్యాం

1992⁠లో నేను సంఘపెద్ద అయ్యాను. మా దేశంలోని కిర్గిజ్‌ భాష మాట్లాడే సహోదరుల్లో మొదట సంఘపెద్ద అయ్యింది నేనే. టాక్‌మాక్‌లోని మా సంఘంలో కొత్త పద్ధతుల్లో ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టాం. కొన్ని విద్యా సంస్థలకు వెళ్లి ప్రీచింగ్‌ చేసినప్పుడు, చాలామంది కిర్గిజ్‌ యువతీయువకులు బైబిలు స్టడీకి ఒప్పుకున్నారు. అలా మేం స్టడీ ఇచ్చినవాళ్లలో ఒకరు, ప్రస్తుతం బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు. మరో ఇద్దరు ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నారు. మీటింగ్స్‌కి వస్తున్న ఇతరులకు కూడా మేం సహాయం చేశాం. ఎలాగంటే, 1990 తొలినాళ్లలో మన ప్రచురణలు రష్యా భాషలో ఉండేవి, మీటింగ్స్‌ కూడా ఆ భాషలోనే జరిగేవి. కానీ మీటింగ్స్‌కి వచ్చే చాలామంది మాతృభాష కిర్గిజ్‌ కాబట్టి, వాళ్లు సత్యాన్ని వెంటనే గ్రహించేలా మీటింగ్స్‌లో చెప్పే విషయాల్ని కిర్గిజ్‌ భాషలోకి అనువదించేవాణ్ణి.

తమ పిల్లల్లో ఎనిమిది మందితో బాషన్‌బై బడిబాయెఫ్‌, ఆయన భార్య

1989⁠లో నేనూ, నా భార్య, మా పిల్లల్లో ఎనిమిదిమంది

మరోవైపు పిల్లల్ని పెంచడంలో కూడా నేనూ, నా భార్య బిజీ అయ్యాం. మా పిల్లల్ని ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి తీసుకెళ్లేవాళ్లం. నా కూతురు గూల్‌సైరా 12 ఏళ్లు ఉన్నప్పుడు వీధిలో వెళ్లేవాళ్లతో బైబిలు గురించి మాట్లాడేది. మా పిల్లలకు లేఖనాలు కంఠస్తం చేయడం చాలా ఇష్టం. ఆ విధంగా వాళ్లూ, ఆ తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లలూ సంఘ పనుల్లో బిజీ అయిపోయారు. నాకు 9 మంది పిల్లలు, 11 మంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. వాళ్లందరిలో 16 మంది యెహోవాను ఆరాధిస్తున్నారు.

మర్చిపోలేని మార్పులు

1950లలో మా ప్రాంతంలో యెహోవా సేవను మొదలుపెట్టిన సహోదరసహోదరీలు అక్కడ జరిగిన మార్పులను చూసి ఆశ్చర్యపోతారు. దానికి ఒక కారణమేమిటంటే, 1990ల నుండి మంచివార్తను ప్రకటించే విషయంలో, పెద్దపెద్ద గుంపులుగా కలుసుకొని మీటింగ్స్‌ జరుపుకునే విషయంలో మేం మరింత స్వేచ్ఛను ఆనందించాం.

వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికి ప్రకటిస్తున్న బాషన్‌బై బడిబాయెఫ్‌, ఆయన భార్య

నా భార్యతో కలిసి ప్రీచింగ్‌ చేస్తూ

నేనూ, నా భార్య 1991లో మొదటిసారి సమావేశానికి హాజరయ్యాం. అది ఆల్మా-ఆటాలో జరిగింది, కజక్‌స్థాన్‌లో ఉన్న ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఆల్మటి అని పిలుస్తున్నారు. కిర్గిజ్‌స్థాన్‌లోని సహోదరులు 1993లో బిష్‌కెక్‌లోని స్పార్టాక్‌ స్టేడియంలో మొదటిసారి సమావేశం జరుపుకున్నారు. ఆ స్టేడియంని ప్రచారకులు వారం రోజులపాటు ముందుగానే శుభ్రం చేశారు. దానికి ఆ స్టేడియం మేనేజరు ఎంతగా ముగ్ధుడయ్యాడంటే, అక్కడ సమావేశాన్ని ఉచితంగా జరుపుకోవడానికి అనుమతిచ్చాడు.

1994⁠లో, మొట్టమొదటిసారి మన ప్రచురణల్ని కిర్గిజ్‌ భాషలో ప్రచురించినప్పుడు మేం మరో మైలురాయిని చేరుకున్నాం. ఇప్పుడు బిష్‌కెక్‌లోని బ్రాంచి కార్యాలయంలో, ఒక అనువాద జట్టు కిర్గిజ్‌ భాషలో క్రమంగా సాహిత్యాన్ని అనువదిస్తుంది. 1998⁠లో, కిర్గిజ్‌స్థాన్‌లో జరుగుతున్న యెహోవాసాక్షుల పనికి చట్టపరమైన గుర్తింపు వచ్చింది. సంస్థ అభివృద్ధి చెందింది, ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్‌లో 5,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. నేడు చైనీస్‌, ఇంగ్లీష్‌, కిర్గిజ్‌, రష్యా, రష్యన్‌ సంజ్ఞా భాష, టర్కిష్‌, వీగుర్‌, ఉజ్‌బెక్‌ భాషల్లో మొత్తం 83 సంఘాలు, 25 గ్రూపులు ఉన్నాయి. వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఈ సహోదర సహోదరీలందరూ యెహోవాను ఐక్యంగా ఆరాధిస్తున్నారు. మర్చిపోలేని ఈ మార్పులన్నీ యెహోవా వల్లే సాధ్యమయ్యాయి.

యెహోవా నా జీవితాన్ని కూడా మార్చేశాడు. నేను ఒక పేద రైతు కుటుంబంలో పెరిగాను, కేవలం ఐదు సంవత్సరాలే స్కూల్‌కి వెళ్లాను. కానీ యెహోవా నన్ను ఒక సంఘపెద్దగా సేవచేయడానికి అలాగే నాకన్నా ఎక్కువ చదువుకున్నవాళ్లకు అమూల్యమైన బైబిలు సత్యాల్ని నేర్పించడానికి ఉపయోగించుకుంటున్నాడు. నిజానికి, యెహోవా అసాధారణ విషయాలు జరిగేలా చేయగలడు. నాకు ఎదురైన అనుభవాల్నిబట్టి యెహోవా గురించి సాక్ష్యమిస్తూ నమ్మకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, యెహోవాకు “అన్నీ సాధ్యం.”—మత్త. 19:26.

a యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి