‘మేము మీతో వస్తాం’
“దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.”—జెక. 8:23.
1, 2. (ఎ) మనకాలంలో ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం? (ప్రారంభ చిత్రం చూడండి.)
మనకాలం గురించి యెహోవా ఇలా చెప్పాడు, “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెక. 8:23) ఈ లేఖనంలోని యూదుడు, దేవుడు తన పవిత్రశక్తితో అభిషేకించిన వాళ్లను సూచిస్తున్నాడు. బైబిలు వాళ్లను “దేవుని ఇశ్రాయేలు” అని కూడా పిలుస్తుంది. (గల. 6:16) అలాగే “పదేసిమంది,” భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్న ప్రజల్ని సూచిస్తున్నారు. అభిషిక్తుల గుంపుపై యెహోవా ఆశీర్వాదం ఉందని ఈ ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్లతో కలిసి యెహోవాను ఆరాధించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు.
2 జెకర్యా ప్రవక్తలాగే యేసు కూడా దేవుని ప్రజలందరూ ఐక్యంగా ఆరాధిస్తారని చెప్పాడు. పరలోకంలో జీవితం కోసం ఎదురుచూసే వాళ్లందర్నీ “చిన్న మంద” అని, భూమ్మీద నిత్యజీవం కోసం ఎదురుచూసే వాళ్లందర్నీ “వేరే గొర్రెలు” అని యేసు పిలిచాడు. కానీ వాళ్లందరూ కలసి ఒకే మందగా ఉంటూ తనను అనుకరిస్తారని ఆయన చెప్పాడు. (లూకా 12:32; యోహా. 10:16) రెండు గుంపులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇలా అనుకోవచ్చు: (1) నేడున్న అభిషిక్తులందరి పేర్లు వేరే గొర్రెలకు తెలిసుండాలా? (2) అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి? (3) మీ సంఘంలో ఎవరైనా జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకోవడం మొదలుపెడితే వాళ్లను మీరు ఎలా చూడాలి? (4) జ్ఞాపకార్థ చిహ్నాలను తీసుకునే వాళ్ల సంఖ్య పెరగడం చూసి మీరు ఆందోళనపడాలా? వీటికి జవాబులు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
నేడున్న అభిషిక్తులందరి పేర్లు వేరే గొర్రెలకు తెలిసుండాలా?
3. అభిషిక్తులందరూ తమ పరలోక బహుమానాన్ని పొందుతారో లేదో మనమెందుకు ఖచ్చితంగా చెప్పలేం?
3 ఇప్పుడు భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులందరి పేర్లు వేరే గొర్రెలకు తెలిసుండాలా? అవసరంలేదు. ఎందుకంటే, అభిషిక్తులందరూ తమ పరలోక బహుమానాన్ని పొందుతారో లేదో ఖచ్చితంగా చెప్పలేం.[1] దేవుడు వాళ్లను పరలోకంలో జీవించడానికి అభిషేకించినా వాళ్లు చివరివరకు నమ్మకంగా ఉంటేనే ఆ బహుమానాన్ని పొందుతారు. సాతానుకు ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్లను “మోసపరచుటకు,” “అబద్ధపు ప్రవక్తలను” ఉపయోగిస్తాడు. (మత్త. 24:24) అభిషిక్త క్రైస్తవులు నమ్మకస్థులని యెహోవా తీర్పుతీర్చే వరకు వాళ్లు ఆ బహుమానాన్ని పొందుతారో లేదో ఖచ్చితంగా చెప్పలేం. యెహోవా తన చివరి ముద్రను లేదా చివరి ఆమోదాన్ని వాళ్లు చనిపోయే ముందుగానీ, “మహాశ్రమలు” ప్రారంభమవ్వడానికి ముందుగానీ ఇస్తాడు.—ప్రక. 2:10; 7:3, 14.
4. నేడు భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులందరి పేర్లు తెలీకపోతే వేరే గొర్రెలు వాళ్లను ఎలా వెంబడిస్తారు?
4 నేడు భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులందరి పేర్లు తెలీకపోతే, వేరే గొర్రెలు వాళ్లను ఎలా వెంబడిస్తారు? “పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు” అని బైబిలు చెప్తుంది. ఈ వచనంలో ‘ఒక యూదుని’ అనే మాట ఉన్నప్పటికీ “మీకు,” “మీతో” అనే మాటలు ఒకరికన్నా ఎక్కువమందిని సూచిస్తున్నాయి. అంటే ‘యూదుడు’ అనే మాట కేవలం ఒక్క వ్యక్తిని కాదుగానీ అభిషిక్తుల గుంపు అంతటినీ సూచిస్తుంది. వేరే గొర్రెలకు ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్లు ఆ గుంపుతో కలిసి యెహోవాను సేవిస్తారు. అయితే ఆ గుంపులో ఉన్న ప్రతీ ఒక్కరి పేర్లు తెలుసుకుని, వాళ్లలో ఒక్కొక్కరినీ అనుకరించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే మన నాయకుడు యేసు అని, మనం ఆయన్ను మాత్రమే అనుకరించాలని బైబిలు చెప్తుంది.—మత్త. 23:10.
అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి?
5. ఏ హెచ్చరిక గురించి అభిషిక్త క్రైస్తవులందరూ జాగ్రత్తగా ఆలోచించాలి? ఎందుకు?
5 1 కొరింథీయులు 11:27-29 వచనాల్లో ఉన్న హెచ్చరిక గురించి అభిషిక్త క్రైస్తవులందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. (చదవండి.) అపొస్తలుడైన పౌలు ఆ లేఖనంలో ఏ విషయాన్ని చెప్తున్నాడు? ఒక అభిషిక్తుడు, యెహోవాతో మంచి సంబంధం లేకుండా జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకుంటే అతను వాటిని ‘అయోగ్యంగా’ తీసుకున్నట్టే అని పౌలు చెప్తున్నాడు. (హెబ్రీ. 6:4-6; 10:26-29) అభిషిక్త క్రైస్తవులు “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము” పొందాలంటే వాళ్లు చివరివరకు నమ్మకంగా ఉండాలని ఆ హెచ్చరిక గుర్తుచేస్తుంది.—ఫిలి. 3:13-16.
6. అభిషిక్త క్రైస్తవులు తమ గురించి తాము ఎలా భావించాలి?
6 అభిషిక్త క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు, “మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” (ఎఫె. 4:1-3) యెహోవా ఇచ్చే పవిత్రశక్తి తన సేవకులు గర్వంగా కాదుగానీ వినయంగా ఉండడానికి సహాయం చేస్తుంది. (కొలొ. 3:12) కాబట్టి అభిషిక్త క్రైస్తవులు తాము ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకోరు. అంతేకాదు యెహోవా తమకు ఇతరులకన్నా ఎక్కువ పవిత్రశక్తిని ఇస్తాడని లేదా బైబిలు సత్యాల్ని ఇతరులకన్నా తామే బాగా అర్థంచేసుకోగలమని అనుకోరు. రొట్టె, ద్రాక్షారసం తీసుకోమని వాళ్లు ఎవ్వరికీ సలహాలు ఇవ్వరు. బదులుగా, ఎవరిని అభిషేకించాలనేది యెహోవా మాత్రమే నిర్ణయిస్తాడని వాళ్లు వినయంగా ఒప్పుకుంటారు.
7, 8. అభిషిక్త క్రైస్తవులు ఏమి ఆశించరు? ఎందుకు?
7 అభిషిక్తులు తమ పరలోక నిరీక్షణను ఓ గౌరవంగా భావించినప్పటికీ, ఇతరులు తమను ప్రత్యేకంగా చూడాలని మాత్రం ఆశించరు. (ఎఫె. 1:17-19; ఫిలిప్పీయులు 2:2, 3 చదవండి.) యెహోవా తమను అందరికి తెలిసేలా అభిషేకించలేదని కూడా వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు అభిషేకించబడ్డారనే విషయాన్ని ఇతరులు వెంటనే నమ్మకపోతే వాళ్లు ఆశ్చర్యపోరు. బదులుగా, దేవుడు తనకు ప్రత్యేక బాధ్యతను ఇచ్చాడని ఓ వ్యక్తి ఎవరితోనైనా చెప్తే దాన్ని వెంటనే నమ్మవద్దని బైబిలు చెప్తున్న విషయాన్ని అభిషిక్తులు గుర్తిస్తారు. (ప్రక. 2:2) ఇతరులు తమను ప్రత్యేకంగా చూడాలని అభిషిక్త క్రైస్తవులు కోరుకోరు. అందుకే వాళ్లు ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు తాము అభిషిక్తులమని చెప్పుకోరు. నిజానికి వాళ్లు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకపోవచ్చు. అంతేకాదు వాళ్లు పరలోకంలో చేయబోయే అద్భుతకార్యాల గురించి ఎన్నడూ గొప్పలు చెప్పుకోరు.—1 కొరిం. 1:27-29; 1 కొరింథీయులు 4:6-8 చదవండి.
8 అభిషిక్త క్రైస్తవులు ఇతర అభిషిక్తులతో మాత్రమే సమయం గడుపుతూ తామంతా ఓ ప్రత్యేక గుంపు అన్నట్లు భావించరు. ఇతర అభిషిక్తుల కోసం వెతికి వాళ్లతో తమ భావాల్ని పంచుకోవాలని లేదా బైబిల్ని అధ్యయనం చేయడానికి ఓ గుంపుగా కలుసుకోవాలని ప్రయత్నించరు. (గల. 1:15-17) ఒకవేళ అభిషిక్తులు అలా చేస్తే సంఘం ఐక్యంగా ఉండదు. పైగా దేవుని ప్రజలు సమాధానంగా, ఐక్యంగా ఉండడానికి సహాయం చేసే పవిత్రశక్తికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది.—రోమీయులు 16:17, 18 చదవండి.
వాళ్లను మీరు ఎలా చూడాలి?
9. అభిషిక్త సహోదరసహోదరీలను మీరు ఎలా చూడాలి? (ప్రేమ “అమర్యాదగా నడువదు” అనే బాక్సు చూడండి.)
9 అభిషిక్త సహోదరసహోదరీలను మీరు ఎలా చూడాలి? యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “మీరందరు సహోదరులు . . . తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మత్త. 23:8-12) కాబట్టి ఓ వ్యక్తి అభిషిక్తుడైనప్పటికీ ఆయన్ను మరీ ఎక్కువగా అభిమానించడం తప్పు. బైబిలు సంఘపెద్దల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల విశ్వాసాన్ని అనుకరించమని ప్రోత్సహిస్తుందిగానీ ఏ మనిషినీ మన నాయకునిగా చేసుకోమని చెప్పట్లేదు. (హెబ్రీ. 13:7) నిజమే, బైబిలు కొంతమందిని “రెట్టింపు సన్మానమునకు పాత్రులు” అని పిలుస్తుంది. అంటే “బాగుగా పాలన” చేస్తున్నందుకు “వాక్యమందును ఉపదేశమందును” ప్రయాసపడుతున్నందుకు వాళ్లను సన్మానించమని చెప్తుందిగానీ అభిషిక్తులైనందుకు కాదు. (1 తిమో. 5:17) మనం ఒకవేళ అభిషిక్తులను మరీ ఎక్కువ పొగిడినా, వాళ్లమీద ఎక్కువ దృష్టి పెట్టినా అది వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు అది వాళ్లలో గర్వాన్ని కూడా పెంచుతుంది. (రోమా. 12:3) అభిషిక్త సహోదరసహోదరీలు అలాంటి గంభీరమైన తప్పు చేయాలని మనలో ఎవ్వరం కోరుకోం.—లూకా 17:2.
జ్ఞాపకార్థ ఆచరణ రోజు రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మీరు ఎలా చూడాలి? (9-11 పేరాలు చూడండి)
10. అభిషిక్త క్రైస్తవుల మీద మనకు గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు?
10 యెహోవా అభిషేకించిన వాళ్లమీద మనకు గౌరవం ఉందని ఎలా చూపించవచ్చు? వాళ్లు ఎలా అభిషిక్తులయ్యారో మనం అడగకూడదు. అది వాళ్ల వ్యక్తిగత విషయం, దాన్ని తెలుసుకునే హక్కు మనకు లేదు. (1 థెస్స. 4:11) ఒకవేళ వాళ్ల భర్త/భార్య, అమ్మానాన్నలు లేదా ఇతర కుటుంబసభ్యులు కూడా అభిషిక్తులేనా అని కూడా మనం అడగకూడదు. నిరీక్షణ అనేది వారసత్వంగా పొందేది కాదు. (1 థెస్స. 2:11, 12) మనం ఇతరుల్ని నొప్పించే ప్రశ్నలు కూడా అడగకూడదు. ఉదాహరణకు, మీ భర్త లేకుండా భూమ్మీద నిత్యం ఎలా జీవిస్తారని అభిషిక్త సహోదరుని భార్యతో అనకూడదు. ఏదేమైనా యెహోవా తన ‘గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తాడని’ మనకు ఖచ్చితంగా తెలుసు.—కీర్త. 145:16.
11. “ముఖస్తుతి” చేయకుండా ఉంటే మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
11 అభిషిక్త క్రైస్తవులను ఇతరులకన్నా ప్రాముఖ్యమైన వాళ్లుగా చూడకపోవడం వల్ల మనకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఎలా? కొంతమంది, అభిషిక్తులు కాకపోయినా తాము అభిషిక్తులమని చెప్పుకునే “కపట సహోదరులు” సంఘంలో ఉంటారని బైబిలు చెప్తుంది. (గల. 2:4, 5; 1 యోహా. 2:19) అంతేకాదు కొంతమంది అభిషిక్త క్రైస్తవులు చివరివరకు నమ్మకంగా ఉండకపోవచ్చని కూడా బైబిలు చెప్తుంది. (మత్త. 25:10-12; 2 పేతు. 2:20, 21) మనం “ముఖస్తుతి” చేయకుండా ఉంటే ఇతరులను అనుకరించం. ఆఖరికి అభిషిక్తుల్ని లేదా చాలాకాలంపాటు యెహోవాను సేవించినవాళ్లను కూడా అనుకరించం. అలాచేస్తే, ఒకవేళ వాళ్లు కొంతకాలానికి తమ విశ్వాసాన్ని కోల్పోయి, సంఘాన్ని విడిచిపెట్టినా మనం మాత్రం విశ్వాసంతో యెహోవాను సేవించడం మానేయం.—యూదా 14-16, అధస్సూచి.
భాగంవహించేవాళ్ల సంఖ్య పెరుగుతుంటే ఆందోళనపడాలా?
12, 13. జ్ఞాపకార్థ చిహ్నాలను తీసుకునేవాళ్ల సంఖ్య పెరగడం చూసి మనం ఎందుకు ఆందోళనపడకూడదు?
12 చాలా సంవత్సరాలపాటు, జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. అయితే మనం దాని గురించి ఆందోళనపడాలా? లేదు. ఎందుకో చూద్దాం.
13 యెహోవా “తనవారిని ఎరుగును.” (2 తిమో. 2:19) జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్యను లెక్కించే సహోదరులకు ఎవరు నిజంగా అభిషిక్తులో తెలీదు. అది యెహోవాకు మాత్రమే తెలుసు. కాబట్టి రొట్టె-ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్యలో, అభిషిక్తులు కాకపోయినా అభిషిక్తులమని అనుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు, మొదట్లో జ్ఞాపకార్థ చిహ్నాలను తీసుకున్నవాళ్లు కొంతకాలం తర్వాత ఆపేశారు. ఇంకొంతమంది, బహుశా మానసిక సమస్యల వల్ల తాము క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలిస్తామని అనుకుంటారు. కాబట్టి భూమ్మీద ఎంతమంది అభిషిక్త క్రైస్తవులు మిగిలి ఉన్నారో మనకు ఖచ్చితంగా తెలీదు.
14. మహాశ్రమలు మొదలయ్యే సమయానికి ఎంతమంది అభిషిక్తులు మిగిలివుంటారని బైబిలు చెప్తుంది?
14 అభిషిక్తుల్ని పరలోకానికి తీసుకెళ్లేందుకు యేసు వచ్చే సమయానికి వాళ్లు భూమ్మీద చాలా భాగాల్లో ఉంటారు. ‘ఆయన గొప్పబూరతో తన దూతలను పంపిస్తాడు. వాళ్లు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొన్నవాళ్లను పోగుచేస్తారు’ అని బైబిలు చెప్తుంది. (మత్త. 24:31) అయితే అంత్యదినాల్లో కేవలం కొంతమంది అభిషిక్తులు మాత్రమే భూమ్మీద మిగిలివుంటారని కూడా బైబిలు చెప్తుంది. (ప్రక. 12:17) కానీ మహాశ్రమలు మొదలయ్యే సమయానికి ఎంతమంది మిగిలి ఉంటారనేది మాత్రం బైబిలు చెప్పట్లేదు.
15, 16. యెహోవా 1,44,000 మందిని ఎన్నుకునే విషయంలో మనమేమి గుర్తుపెట్టుకోవాలి?
15 అభిషిక్తుల్ని ఎప్పుడు ఎన్నుకోవాలో యెహోవా నిర్ణయిస్తాడు. (రోమా. 8:28-30) యేసు పునరుత్థానం అయ్యాకే యెహోవా అభిషిక్త క్రైస్తవుల్ని ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. బహుశా మొదటి శతాబ్దంలోని నిజ క్రైస్తవులందరూ అభిషిక్తులై ఉంటారు. ఆ తర్వాత వందల సంవత్సరాల వరకు, క్రైస్తవులమని చెప్పుకున్న వాళ్లలో చాలామంది క్రీస్తును అనుకరించలేదు. అయినప్పటికీ ఆ సంవత్సరాలన్నిటిలో నమ్మకంగా ఉన్న కొంతమంది నిజక్రైస్తవుల్ని యెహోవా అభిషేకించాడు. వాళ్లు యేసు చెప్పినట్లు గురుగుల మధ్య పెరిగిన గోధుమల్లాంటివాళ్లు. (మత్త. 13:24-30) ఈ అంత్యదినాల్లో కూడా 1,44,000[2] మందిలో భాగంగా ఉండడానికి యెహోవా ఎంతోమందిని ఎన్నుకున్నాడు. ఒకవేళ ఆయన అంతం రావడానికి కొంచెం ముందు ఎవరినైనా అభిషేకించినా, ఆయన సరైనదే చేస్తున్నాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (యెష. 45:9; దాని. 4:35; రోమీయులు 9:10-12, 16 చదవండి.)[3] అంతేకానీ చివరన వచ్చిన పనివాళ్లకు కూడా సమాన జీతం ఇచ్చిన తమ యజమాని మీద సణిగిన పనివాళ్లలా మనం ఉండకుండా జాగ్రత్తపడాలి.—మత్తయి 20:8-15 చదవండి.
16 పరలోక నిరీక్షణ ఉన్న ప్రతీ ఒక్కరు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసుడు” కాదు. (మత్త. 24:45-47) మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా యెహోవా, యేసు కొంతమందినే ఉపయోగించుకుని అనేకమందికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నారు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని రాయడానికి యెహోవా మొదటి శతాబ్దపు అభిషిక్త క్రైస్తవుల్లోని కొద్దిమందినే ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా, నేడు కూడా తన ప్రజలకు “తగినవేళ అన్నము” పెట్టే బాధ్యతను యెహోవా కేవలం కొంతమంది అభిషిక్త క్రైస్తవులకే ఇచ్చాడు.
17. మనం ఈ ఆర్టికల్‌లో ఏమి నేర్చుకున్నాం?
17 మనం ఈ ఆర్టికల్‌లో ఏమి నేర్చుకున్నాం? యెహోవా తన ప్రజలకు రెండు రకాల బహుమానాల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘యూదునికి’ సూచనగా ఉన్నవాళ్లకు పరలోక బహుమానాన్ని, ‘పదేసిమందికి’ సూచనగా ఉన్నవాళ్లకు భూమ్మీద నిత్యం జీవించే బహుమానాన్ని యెహోవా ఇస్తాడు. కానీ ఈ రెండు గుంపుల వాళ్లు ఒకే నియమాలు పాటిస్తూ, నమ్మకంగా కొనసాగాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు ఈ రెండు గుంపులవాళ్లు వినయంగా ఉండాలి. దానితోపాటు వాళ్లు ఐక్యంగా ఉంటూ సంఘ సమాధానం కోసం కృషిచేయాలి. కాబట్టి అంతం సమీపిస్తుండగా మనమందరం యెహోవాను సేవిస్తూ ‘ఒక్క మందగా’ క్రీస్తును అనుకరిద్దాం.
^ [1] (3వ పేరా) కీర్తన 87:5, 6 వచనాల ప్రకారం పరలోకంలో యేసుతోపాటు రాజులుగా పరిపాలించే వాళ్లందరి పేర్లను దేవుడు భవిష్యత్తులో మనకు చెప్పవచ్చు.—రోమా. 8:19.
^ [2] (15వ పేరా) పవిత్రశక్తితో ఒక వ్యక్తిని అభిషేకించడంలో యేసు పాత్ర ఉన్నా, ఎవర్ని అభిషేకించాలో నిర్ణయించేది మాత్రం యెహోవాయే అని అపొస్తలుల కార్యములు 2:33వ వచనం చెప్తుంది.
^ [3] (15వ పేరా) మరింత సమాచారం కోసం కావలికోట 2007, మే 1 సంచికలో 30-31 పేజీల్లో ఉన్న “పాఠకుల ప్రశ్నలు” చూడండి.