కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 12/15 పేజీలు 27-31
  • మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంతులేని వ్యథ
  • ఏ రోజు గురించి ఆ రోజు
  • పునరుత్థాన నిరీక్షణ నిజమైన ఓదార్పునిస్తుంది
  • నిరీక్షించడానికి కారణం
  • జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు వాళ్లకేమి అవసరం? మీరెలా సహాయం చేయవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • “కడపటి శత్రువు” ఓడించబడును!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 12/15 పేజీలు 27-31

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?

ఓ భర్త, “తననువలె తన భార్యను ప్రేమింపవలెను” అని బైబిలు స్పష్టంగా చెబుతుంది. అలాగే భార్య కూడా “తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” వాళ్లిద్దరూ ‘ఏక శరీరముగా’ తమతమ పాత్రలను పోషించాలి. (ఎఫె. 5:33; ఆది. 2:23, 24) కాలం గడుస్తున్నకొద్దీ దంపతుల మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అంతకంతకూ ఎక్కువవుతాయి. పక్కపక్కన పెరిగే రెండు చెట్ల వేళ్లు పెనవేసుకున్నట్లే, అన్యోన్య దంపతుల భావాలు సమయం గడిచేకొద్దీ ప్రగాఢమై, సన్నిహితంగా పెనపేసుకుపోతాయి.

అయితే భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే అప్పుడేంటి? వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధం తెగిపోతుంది. ఇక బ్రతికివున్న భర్తకు లేదా భార్యకు మిగిలేది గుండెకోత, ఒంటరితనమే. కొన్నిసార్లయితే కోపం, తప్పుచేశాననే భావాలు కూడా వెంటాడతాయి. డానెల్లా అనే ఆవిడ తన 58 ఏళ్ల దాంపత్య జీవితంలో, భాగస్వాములను పోగొట్టుకున్న ఎంతోమందిని చూసింది.a అయితే తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇలా అంది: ‘భాగస్వామి చనిపోతే కలిగే బాధేమిటో నాకు ఇదివరకు అర్థమయ్యేదికాదు. అది అనుభవిస్తే తప్ప తెలియదు.’

అంతులేని వ్యథ

భర్త లేదా భార్య చనిపోయినప్పుడు కలిగే ఒత్తిడి మిగతా ఒత్తిళ్ల కన్నా ఎంతో తీవ్రంగా ఉంటుందని కొంతమంది పరిశోధకులు అంటారు. అలాంటి దుఃఖంలో ఉన్న చాలామంది ఆ మాటలను ఒప్పుకుంటారు. మిల్లీ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్తలేని తన జీవితం గురించి వివరిస్తూ ఆవిడిలా అంది: “ఒక్కసారిగా నా కాళ్లుచేతులు పడిపోయినట్లు అనిపించింది.” 25 ఏళ్లు కాపురం చేసిన తన భర్త చనిపోయినప్పుడు అనుభవించిన మానసిక వ్యథను గుర్తుతెచ్చుకుంటూ ఆమె ఆ మాటలు చెప్పింది.

చనిపోయిన తమ భర్తల గురించి ఏళ్ల తరబడి బాధపడేవాళ్లు మరీ ఎక్కువగా దుఃఖిస్తున్నారని సూజన్‌ అనుకునేది. ఆ తర్వాత, 38 ఏళ్లు కాపురం చేసిన ఆమె భర్త చనిపోయాడు. ఆయన చనిపోయి 20 ఏళ్లు అవుతున్నా, “నేను ప్రతీరోజూ ఆయన్ని తలుచుకుంటాను” అని ఆమె అంటోంది. ఆయన లేడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె కన్నీళ్లు ఆగవు.

భాగస్వామిని కోల్పోయినప్పుడు కలిగే బాధ తీవ్రంగా ఉంటుందని, చాలాకాలం ఉంటుందని బైబిలు ఒప్పుకుంటుంది. శారా చనిపోయినప్పుడు ఆమె భర్తయైన అబ్రాహాము, “శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.” (ఆది. 23:1, 2) పునరుత్థానంపై నమ్మకం ఉన్నా, తన ప్రియ భార్య చనిపోయినప్పుడు అబ్రాహాము తీవ్రంగా దుఃఖించాడు. (హెబ్రీ. 11:17-19) యాకోబు విషయానికొస్తే తన ప్రియమైన భార్య రాహేలు మరణించిన చాలా కాలానికిగానీ ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆయన తన కొడుకులతో తన భార్య గురించి ఇష్టంగా మాట్లాడాడు.​—ఆది. 44:27; 48:7.

బైబిల్లోని ఆ ఉదాహరణల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవాలి? తమ భాగస్వామి చనిపోయినప్పుడు భర్త లేదా భార్య చాలాకాలం పాటు బాధపడతారు. అయితే అలాంటి వాళ్ల కన్నీళ్లను, బాధను మనం బలహీనతలుగా చూడకూడదు గానీ, తమ సర్వస్వాన్ని కోల్పోయినట్లు భావించి వాళ్లు పడే ఆ బాధ సహజమేనని అర్థం చేసుకోవాలి. వాళ్లకు మన సానుభూతి, సహాయం చాలాకాలం వరకు అవసరం కావచ్చు.

ఏ రోజు గురించి ఆ రోజు

భర్తను లేదా భార్యను పోగొట్టుకున్నవాళ్ల జీవితం, పెళ్లికాక ముందున్న ఒంటరి జీవితంలా ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా కాపురం చేస్తున్న భర్తకు తన భార్య బాధగా, చిరాకుగా ఉన్నప్పుడు ఆమెను ఎలా ఓదార్చాలో, ఆమె దిగులును ఎలా పోగొట్టాలో తెలుసు. ఆయన చనిపోతే, ఆమెను ప్రేమించే, ఆదరించే ఆ దిక్కు లేకుండా పోతుంది. అలాగే తన భర్త బాగోగులు ఎలా చూసుకోవాలో, ఆయనను ఎలా సంతోషపెట్టాలో ఏళ్లు గడుస్తుండగా భార్య నేర్చుకుంటుంది. కోమలమైన ఆమె చేతి స్పర్శకు, ఊరటనిచ్చే మాటలకు, ఆయనకేవి ఇష్టమో, ఏవి అవసరమో వంటి విషయాల్లో ఆమె చూపించే శ్రద్ధకు ఏవీ సాటిరావు. అలాంటి భార్య చనిపోయినప్పుడు భర్తకు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. దాంతో తమ భాగస్వామిని కోల్పోయిన కొంతమందికి భవిష్యత్తు అంధకారంగా, భయంభయంగా అనిపిస్తుంది. అలాంటివాళ్లు ధైర్యంగా, మనశ్శాంతిగా ఉండేందుకు ఏ బైబిలు సూత్రం సహాయం చేయవచ్చు?

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను ఏ రోజుకు ఆ రోజు సహించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు

“రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” (మత్త. 6:34) యేసు వస్తుపరమైన అవసరాల గురించి ఆ మాటలు చెప్పినా, అవి తమ భాగస్వామిని కోల్పోయిన చాలామందికి బాధను దిగమింగుకునేలా సహాయం చేశాయి. తన భార్యను పోగొట్టుకున్న కొన్ని నెలల తర్వాత ఛార్లెస్‌ అనే ఆయన ఇలా రాశాడు: “నా మోనీక్‌ను కోల్పోయాననే బాధ నన్నింకా వేధిస్తూనే ఉంది, కొన్నిసార్లైతే అది మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, అలాంటి బాధ సహజమేనని, సమయం గడిచేకొద్దీ అది మెల్లమెల్లగా తగ్గుతుందని నేను అర్థంచేసుకున్నాను.”

అయితే, ‘గడిచే ఆ సమయాన్ని’ ఛార్లెస్‌ ఓపిగ్గా భరించాల్సి వచ్చింది. మరి ఆయనేమి చేశాడు? ఆయనిలా అన్నాడు: “యెహోవా సహాయంతో నేను ఏ రోజు బాధ గురించి ఆ రోజు ఆలోచించడం నేర్చుకున్నాను.” ఆయన శోక సముద్రంలో మునిగిపోలేదు. ఆయన బాధ రాత్రికి రాత్రే మటుమాయమైపోలేదు, అలాగని చెప్పి ఆయన దుఃఖంలో కూరుకుపోలేదు. ఒకవేళ మీరు భాగస్వామిని కోల్పోతే ఏ రోజు బాధ గురించి ఆ రోజు ఆలోచించండి. రేపటిరోజు ఎలాంటి ఆనందాన్ని, ఊరటను తీసుకొస్తుందో మీకు తెలియదు.

మనుషులు చనిపోవడం యెహోవా ఆది సంకల్పంలో భాగం కాదు. బదులుగా అది ‘అపవాది క్రియలలో’ ఒక భాగం. (1 యోహా. 3:8; రోమా. 6:23) చాలామందిని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికీ, వాళ్లకు ఏ నిరీక్షణా లేకుండా చేయడానికీ సాతాను మరణాన్ని, దానివల్ల వచ్చే భయాన్ని ఉపయోగిస్తున్నాడు. (హెబ్రీ. 2:14, 15) తమ జీవితంలో ఎప్పటికీ, చివరికి దేవుని నూతనలోకంలో కూడా నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని పొందలేమని బాధపడుతూ ప్రజలు నైరాశ్యంలో కూరుకుంటే సాతాను ఎంతో సంతోషిస్తాడు. అలా, భాగస్వామిని కోల్పోయినప్పుడు ప్రజలుపడే వేదన ఆదాము పాపం వల్ల, సాతాను తంత్రాల వల్ల వచ్చింది. (రోమా. 5:12) సాతాను నిర్దాక్షిణ్యంగా వాడే ఆయుధమైన మరణాన్ని యెహోవా నామరూపాల్లేకుండా చేసి అతను కలిగించిన నష్టాన్ని భర్తీ చేస్తాడు. సాతాను ఉపయోగించే భయమనే బంధకాల నుండి అప్పుడు బయటపడే వాళ్లలో తమ భాగస్వాములను కోల్పోయిన మీరూ, మీలాంటి ఎంతోమంది ఉంటారు.

ఈ భూమ్మీద పునరుత్థానం అయ్యే వాళ్ల విషయానికొస్తే, మానవ సంబంధాల్లో తప్పకుండా ఎన్నో మార్పులు వస్తాయి. తల్లిదండ్రులు, తాతముత్తాతలు మళ్లీ బతికి తమ పిల్లలతో, మనవళ్లతో పాటు పరిపూర్ణతకు ఎదగడాన్ని ఊహించండి. వృద్ధాప్యపు ఛాయలు మటుమాయమైపోతాయి. యౌవనులు తమ తాతముత్తాతలను ఇప్పుడు చూస్తున్న విధానానికి, అప్పుడు చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి మార్పులవల్ల కుటుంబ జీవనం ఎంతో మెరుగౌతుంది.

అయితే పునరుత్థానమయ్యే వాళ్ల గురించి మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములను మరణంలో పోగొట్టుకున్నవాళ్ల సంగతేంటి? తన మొదటి భర్తను, తర్వాత రెండవ భర్తను అలా చివరికి ఏడుగురు భర్తలను మరణంలో కోల్పోయిన ఒక స్త్రీ గురించి సద్దూకయ్యులు ఓ ప్రశ్న వేశారు. (లూకా 20:27-33) పునరుత్థానం తర్వాత వాళ్ల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? మనకైతే తెలియదు, తెలియని అలాంటివాటి గురించి ఊహాగానాలు చేయాల్సిన లేదా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని దేవుని మీద నమ్మకం ఉంచడమే. ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, యెహోవా భవిష్యత్తులో చేయబోయే ప్రతీదీ చాలా శ్రేష్ఠంగా, ఎదురుచూసే విధంగా ఉంటుందే గానీ భయపడే విధంగా అస్సలు ఉండదు.

పునరుత్థాన నిరీక్షణ నిజమైన ఓదార్పునిస్తుంది

బైబిలు స్పష్టంగా చెబుతున్న బోధల్లో, చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారనే బోధ ఒకటి. గతంలో పునరుత్థానమైన వాళ్లకు సంబంధించిన బైబిలు వృత్తాంతాలు, ‘సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని బయటికి వచ్చెదరు’ అనే వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనే భరోసా ఇస్తాయి. (యోహా. 5:28, 29) అప్పుడు ప్రజలు తమవాళ్లను మళ్లీ సజీవంగా కలుసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతారు. తిరిగి బతికినవాళ్లు పొందే సంతోషాన్ని మనం కనీసం ఊహించనైనా ఊహించలేము.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికి వస్తుండగా, ముందెన్నడూ చూడని సంభ్రమాశ్చర్యంతో భూమి నిండిపోతుంది. చనిపోయిన వందలకోట్ల మంది పునరుత్థానమై తిరిగి మనతోపాటు జీవిస్తారు. (మార్కు 5:39-42; ప్రక. 20:13) భవిష్యత్తులో జరగనున్న ఆ అద్భుతం గురించి ధ్యానిస్తుంటే, తమ ప్రియమైన వాళ్లను మరణంలో కోల్పోయిన వాళ్లందరూ ఓదార్పు పొందుతారు.

చనిపోయిన వాళ్లందరూ తిరిగి లేచినప్పుడు ఇక బాధపడడానికి ఎవరికైనా ఏ కారణమైనా ఉంటుందా? ఏమాత్రం ఉండదని బైబిలు చెబుతుంది. “మరెన్నడును ఉండకుండ మరణమును [యెహోవా] మ్రింగివేయును” అని యెషయా 25:8 చెబుతుంది. మరణంతో పాటు, అది తీసుకొచ్చే బాధలను కూడా ఆయన పూర్తిగా తీసేస్తాడు, అందుకే ఆ వచనం ఇంకా ఇలా అంటోంది: “ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.” మీ జీవిత భాగస్వామి మరణం వల్ల మీరిప్పుడు పడుతున్న బాధ పునరుత్థానం తర్వాత మీకు కనీసం గుర్తుకైనా రాదు.

నూతనలోకంలో యెహోవా చేయబోయే వాటిని ఏ మనిషి పూర్తిగా అర్థంచేసుకోలేడు. ఆయనిలా అంటున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” (యెష. 55:9) పునరుత్థానం జరుగుతుందని యేసు చెప్పిన మాటను నమ్మితే, మనం కూడా అబ్రాహాములాగే యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నామని చూపిస్తాం. కాబట్టి క్రైస్తవులందరూ దేవుడు కోరేవాటిని ఇప్పుడే చేయడం చాలా ప్రాముఖ్యం. అలాచేస్తే పునరుత్థానమయ్యే ఇతరులతోపాటు నూతనలోకంలో జీవించడానికి మనం యోగ్యులమని తీర్పు పొందుతాం.​—లూకా 20:35.

నిరీక్షించడానికి కారణం

భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడే బదులు నిరీక్షణతో ఉండండి. మనుష్యుల దృష్టిలో భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంది. అయితే, మరింత మెరుగైన పరిస్థితులను యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. మన అవసరాలన్నిటినీ, కోరికలన్నిటినీ యెహోవా ఎలా తీరుస్తాడో ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యంకాకపోయినా ఆయనలా చేస్తాడనే విషయంలో మనకు సందేహం ఉండకూడదు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదానికొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.” (రోమా. 8:24, 25) దేవుని వాగ్దానాలు నెరవేరుతాయనే బలమైన నిరీక్షణ మనకుంటే, భాగస్వామిని కోల్పోయిన బాధను ఓర్చుకోగలుగుతాం. ఓర్పు ఉంటే, యెహోవా మన “హృదయవాంఛలను తీర్చే” గొప్ప భవిష్యత్తును సొంతం చేసుకుంటాం. ఆయన తన “గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి” పరుస్తాడు.​—కీర్త. 37:4; 145:16; లూకా 21:19.

సంతోషకరమైన భవిష్యత్తు ఇస్తానన్న యెహోవా వాగ్దానంపై నమ్మకం ఉంచండి

యేసు మరణం సమీపించినప్పుడు ఆయన అపొస్తలులు ఎంతో కలతపడ్డారు. అప్పుడు యేసు ఈ మాటలతో వాళ్లను ఓదార్చాడు: “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. . . . మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.” (యోహా. 14:1-4, 18, 27) యేసు చెప్పిన ఆ మాటలు శతాబ్దాలుగా, అభిషిక్త అనుచరులు నిరీక్షించడానికి, సహించడానికి ఆధారంగా నిలిచాయి. అలాగే పునరుత్థానంలో తమ ఆత్మీయులను చూడాలని ఎంతగానో కోరుకుంటున్నవాళ్లు కూడా నిరాశానిస్పృహల్లో కూరుకుపోవడానికి ఏ కారణమూ లేదు. అలాంటివాళ్లను యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఎన్నడూ విడిచిపెట్టరనే నిశ్చింతతో మీరు ఎల్లప్పుడూ ఉండవచ్చు!

a అసలు పేర్లు కావు.

భాగస్వామిని కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్లను ఓదార్చండి

పెళ్లయిన ఒక క్రైస్తవుడు/క్రైస్తవురాలు చనిపోయినప్పుడు చాలామంది ఆ ఇంటికి వచ్చి, బ్రతికివున్న భాగస్వామిని కొంతకాలంపాటు ఓదార్చి, సహాయసహకారాలు అందిస్తారు. ఉదాహరణకు, భర్తను కోల్పోయిన స్త్రీ, తనపై కుటుంబ సభ్యులు, మిత్రులు చూపించే శ్రద్ధకు కృతజ్ఞత చూపిస్తుండవచ్చు. అయితే ఆమె బాధ నెమ్మదినెమ్మదిగానే తగ్గుతుంది కాబట్టి, కొంతకాలం పాటు ఆమెకు ఇతరుల ఓదార్పు, మద్దతు అవసరం. బైబిలు ఇలా చెబుతుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”​—సామె. 17:17.

అలాంటి బాధలో ఉన్న వ్యక్తిని మీరు ఎలా పలకరించాలి? బైబిలు ఈ నిర్దేశాన్ని ఇస్తుంది: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులునై యుండుడి.” (1 పేతు. 3:8) భర్తను లేదా భార్యను పోగొట్టుకున్న వ్యక్తి కొంతకాలం వరకూ బాధ నుండి తేరుకోకపోవచ్చు. కాబట్టి మంచి ఉద్దేశంతోనైనా, “మీకిప్పుడు ఎలా ఉంది?” “మీరు బానే ఉన్నారా?” వంటి ప్రశ్నలను అడగడం సబబు కాదు. ‘నాకిప్పుడు ఎలా ఉందో మీకేమాత్రం తెలియదు,’ ‘ఇలాంటి సమయంలో నేను బాగా ఎలా ఉంటాను?’ అని దుఃఖిస్తున్న ఆ వ్యక్తి అనుకోవచ్చు. అందుకే మనస్ఫూర్తిగా, “మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది,” లేదా “సంఘంలో మిమ్మల్ని చూడడం నాకెంతో ప్రోత్సాహంగా ఉంది” వంటి సానుకూల మాటల్ని చెప్పడం మంచిది.

దుఃఖంలో మునిగివున్న వ్యక్తిని మీరు భోజనానికి ఆహ్వానించవచ్చు, లేదా కాసేపు అలా నడుద్దాం రమ్మని పిలవవచ్చు. భార్యను పోగొట్టుకున్న మార్కోస్‌ తనను పరామర్శించడానికి వచ్చిన ఆప్తుల వల్ల ఓదార్పు పొందాడు. వాళ్లు ఏమి మాట్లాడేవాళ్లు? ఆయనిలా అన్నాడు: “నన్ను ప్రోత్సహించే మాటలే తప్ప నా సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు.” భర్తను పోగొట్టుకున్న నీనా ఇలా చెప్పింది: “నా మేలు కోరే స్నేహితులు తరచూ సరైన సమయంలో సరైన మాటలు అనేవాళ్లు. కొన్నిసార్లయితే, వాళ్లేమీ మాట్లాడేవాళ్లు కాదు, నా దగ్గర ఉండేవాళ్లంతే.”

బాధలో ఉన్నవాళ్లు జరిగిన విషాదం గురించి మీకు చెప్పాలనుకుంటుంటే ఆసక్తిగా, ఓపిగ్గా వినండి. కుతూహలంతో ప్రశ్నలు అడగకుండా జాగ్రత్తపడండి. తీర్పు తీర్చకండి. ఆ వ్యక్తి తన దుఃఖాన్ని ఎలా వ్యక్తం చేయాలి, ఎంతకాలం బాధపడాలి వంటి విషయాల్లో సలహాలు ఇవ్వకండి. ఒంటరిగా వదిలేయమని ఆ వ్యక్తి మీకు చెబితే నొచ్చుకోకండి. మీరు వేరే సమయంలో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లవచ్చు. ఆ వ్యక్తిపై ప్రేమ చూపిస్తూనే ఉండండి.​—యోహా. 13:34, 35.

భవిష్యత్తు గురించి మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?

యెహోవా తన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడోనని ఆలోచించడం సహజమే. తనకు కుమారుణ్ణి ఇస్తానన్న దేవుని వాగ్దానం గురించి అబ్రాహాము తరచూ ఆలోచించేవాడు. అయితే ఓపికగా ఉండమని దేవుడు ఆయనను ప్రోత్సహించాడు. ఆ నమ్మకస్థుడు ఎదురుచూసింది చివరికి నెరవేరింది.​—ఆది. 15:2-5; హెబ్రీ. 6:10-15.

యోసేపు చనిపోయాడనే వార్త విన్నప్పుడు యాకోబు తన కుమారుణ్ణి తలుచుకుని ఎంతో బాధపడ్డాడు. తన కొడుకు చనిపోయాడనుకుని, సంవత్సరాల తర్వాత కూడా యాకోబు దుఃఖించాడు. అయితే నమ్మకస్థుడైన యాకోబు కలలో కూడా ఊహించని గొప్ప ఆశీర్వాదాన్ని యెహోవా ఇచ్చాడు. యాకోబు మళ్లీ యోసేపును కలుసుకోవడంతోపాటు తన మనవళ్లను కూడా చూశాడు. యాకోబు ఇలా అన్నాడు: “నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచి యున్నాడు.”​—ఆది. 37:33-35; 48:11.

ఆ రెండు ఉదాహరణల నుండి ఏమి నేర్చుకోవచ్చు? మొదటిది, తన చిత్తాన్ని నెరవేర్చకుండా సర్వశక్తిగల దేవుణ్ణి ఏదీ ఆపలేదు. రెండవది, మనం యెహోవాకు ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి అనుగుణంగా పనిచేస్తుంటే ఆయన ఇప్పుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు, భవిష్యత్తులో కూడా మన అవసరాలను, కోరికలను పూర్తిగా తీరుస్తాడు. పౌలు ఇలా రాశాడు: “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.”​—ఎఫె. 3:20, 21.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి