బైబిలు ప్రశ్నలకు జవాబులు
మన పాపాలకు క్షమాపణ ఉందా?
దేవుని ఆమోదం పొందడం మరీ కష్టం కాదు
మనుషులందరూ పాపులు అని బైబిలు చెప్తుంది. పాపం చేయాలనే స్వభావం మొదటి మనిషి ఆదాము నుండి మనకు వారసత్వంగా వచ్చింది. అందుకే మనం కొన్నిసార్లు చెడ్డ పనులు చేసి, తర్వాత వాటి గురించి బాధపడతాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా మన పాపాలకు మూల్యం చెల్లించాడు. ఆ మూల్యాన్నే విమోచన క్రయధనం అంటారు, దానివల్ల పాప క్షమాపణ సాధ్యమైంది. అది దేవుడు ఇచ్చిన బహుమతి.—రోమీయులు 3:23, 24 చదవండి.
కొంతమంది ఘోరమైన పాపాలు చేశారు, వాళ్లు తమ పాపాల్ని దేవుడు క్షమిస్తాడా అని ఆలోచిస్తుంటారు. సంతోషం కలిగించే విషయం ఏంటంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, “ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.” (1 యోహాను 1:7) కాబట్టి మనం నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే, మనం చేసిన పెద్దపెద్ద పాపాల్ని కూడా యెహోవా సంతోషంగా క్షమిస్తాడు.—యెషయా 1:18 చదవండి.
దేవుడు మన పాపాల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి?
యెహోవా దేవుడు మన పాపాల్ని క్షమించాలని మనం కోరుకుంటే, మనం ఆయన గురించి నేర్చుకోవాలి. అంటే ఆయన మార్గాల గురించి, సలహాల గురించి, ఆయన కోరేవాటి గురించి తెలుసుకోవాలి. (యోహాను 17:3) తమ పాపాల గురించి పశ్చాత్తాపపడి, మారడానికి ప్రయత్నించే వాళ్లను యెహోవా చాలా ఎక్కువగా క్షమిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 3:19 చదవండి.
దేవుని ఆమోదం పొందడం మరీ కష్టం కాదు. యెహోవా మన బలహీనతల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన కరుణ, దయ ఉన్న దేవుడు. ఆయన ప్రేమ, దయ గురించి ఆలోచించినప్పుడు ఆయన్ని సంతోషపెట్టాలంటే ఏంచేయాలో ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటాం.—కీర్తన 103:13, 14 చదవండి.