“దేవుని వాక్యం నిజంగా ఎంత శక్తివంతమైనదో!”
‘దేవుని వాక్యము సజీవమైనది బలముగలది.’ (హెబ్రీయులు 4:12) దేవుని వాక్యానికి ఉన్న ప్రబలమైన శక్తిని ధ్రువీకరిస్తూ, యెహోవాసాక్షుల క్యాలెండర్—2003 (ఆంగ్లం) ప్రపంచమంతటి నుండి ఆరు నిజ జీవిత కథలను ప్రచురించింది. “ముందు, తర్వాత” అనే శీర్షిక క్రింద ఆ క్యాలెండర్, ప్రజలు తమ నైతికతను మెరుగుపరచుకోవడానికి, వినాశనకరమైన జీవిత విధానాలను విడిచిపెట్టడానికి, తమ కుటుంబ జీవితాన్ని బలపరచుకోవడానికి, దేవునితో వ్యక్తిగత సంబంధం పెంపొందించుకోవడానికి యెహోవాసాక్షుల విద్యా పని ఎలా సహాయం చేసిందో చూపించింది.
2003 క్యాలెండర్ను మెచ్చుకుంటూ మాకు ఎన్నో ప్రశంసా ఉత్తరాలు అందాయి. ఆ ఉత్తరాల్లోని వాఖ్యానాలు కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
“ఈ క్యాలెండర్ నిజ క్రైస్తవులకు, తమలాగే ఇతరులు కూడా విశ్వాసం కోసం తీవ్రమైన పోరాటం చేయవలసి వచ్చిందని రుజువునిస్తోంది. వారు ఇప్పుడు, కొందరు తమ జీవితాల్లో చేసుకున్న మార్పులకు జ్ఞాపికలుగా క్యాలెండర్లోని చిత్రాలను చూడవచ్చు.”—స్టీవెన్, అమెరికా.
“2003 క్యాలెండర్ నా హృదయాన్ని ఎంతగా స్పృశించిందో మీకు తెలియజేయడానికి నేను ఈ కొన్ని మాటలను వ్రాయాలని కోరుకుంటున్నాను. ఒక క్యాలెండర్ నన్ను ఇంతగా ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వ్యక్తులపై బైబిలు చూపగల ప్రభావానికి వ్యక్తిగత ఉదాహరణలను, అద్భుతమైన రుజువులను ప్రజలకు చూపించడానికి వీలుగా, ఇప్పుడు ఈ జీవిత కథలు నేను ప్రకటనా పని కోసం తీసుకెళ్ళేవాటిలో భాగమవుతాయి.”—మార్క్, బెల్జియమ్.
“ఈ క్యాలెండర్ నన్ను ఎంతగానో కదిలించింది. ఆ వ్యక్తులను యెహోవా ఎలా మార్చాడో చదివి తెలుసుకున్నప్పుడు నేను బలమైన భావోద్వేగానికి గురయ్యాను. తత్ఫలితంగా నేను నా జీవితంలో కూడా మార్పులు చేసుకుంటూనే ఉండేందుకు ప్రేరేపించబడ్డాను. ఇప్పుడు నిజంగానే నేను మన ప్రపంచవ్యాప్త సహోదర్వతంలో భాగమని నాకు అనిపిస్తుంది.”—మేరీ, అమెరికా.
“జనసమూహాల ఆధ్యాత్మిక దుస్థితిని బట్టి యేసు ఎంతో కలత చెందాడు. క్రీస్తు మాదిరిని అనుకరిస్తూ మన 2003 క్యాలెండర్లో ఆ జీవిత కథలను ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు. నా జీవితంలో మునుపెన్నడూ ఒక క్యాలెండర్ నన్ను ఇంతగా కదిలించలేదు.”—కసాండ్రా, అమెరికా.
“నేను 11 ఏండ్ల వయస్సులో పొగత్రాగడం ప్రారంభించాను; ఆ తర్వాత నేను మాదకద్రవ్యాలను ఉపయోగించాను. నేను నా జీవితాన్ని అంతం చేసుకోవాలని చాలాసార్లు తలంచాను. నేను యెహోవాను తెలుసుకున్నప్పుడు, ఆ అలవాట్లను మానుకోవడానికి నాకు సహాయం లభించింది. ఈ క్యాలెండర్ నాకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నా సహోదర సహోదరీల ఉదాహరణలు నన్ను మరింత బలపరుస్తున్నాయి. ఈ పోరాటంలో నేను ఒక్కదాన్నే లేనని, యెహోవాపట్ల ప్రేమ ఉండడం, ఆయనకు హృదయపూర్వకంగా సేవచేయడమే అత్యంత ప్రాముఖ్యమైనవని నాకు ఇప్పుడు తెలుసు.”—మార్గరెట్, పోలాండ్.
“దేవుని వాక్యం నిజంగా ఎంత శక్తివంతమైనదో! 2003 క్యాలెండర్ను చూసినప్పుడు నేను కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. ఈ అనుభవాలు, వాటితోపాటు ఉన్న చిత్రాలు నా విశ్వాసాన్ని ఎంతో బలపరిచాయి.”—డార్లీన్, అమెరికా.
“ఈ ప్రజల్లో కొంతమంది పూర్వపు జీవిత విధానానికి నా పూర్వపు జీవిత విధానానికి ఎంతో పోలికవుంది. జయించలేని అలవాట్లు అనిపించేవాటిని కూడా వదులుకోవడానికి యెహోవా నాకు శక్తినిచ్చాడు. ఈ నిజ జీవిత కథలు ప్రచురించినందుకు ధన్యవాదాలు.”—విలియమ్, అమెరికా.