“భూదిగంతములవరకు” వెలుగును ప్రసరింపజేయటంలో ఆయన తోడ్పడ్డాడు
ఆధ్యాత్మిక వెలుగును “భూదిగంతములవరకు” ప్రసరింపజేయడానికి అపొస్తలుడైన పౌలు ఉపయోగించుకోబడ్డాడు. దాని ఫలితంగా “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” చాలామంది ‘విశ్వాసులయ్యారు.’—అపొస్తలుల కార్యములు 13:47, 48; యెషయా 49:6.
ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేయాలన్న ప్రగాఢమైన వాంఛ, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన విలియమ్ లాయిడ్ బ్యారీ సమర్పిత జీవితంలోనూ, ఆయన చేసిన అవిశ్రాంతమైన క్రైస్తవ కృషిలోనూ కూడా ప్రతిఫలిస్తుంది. బ్రదర్ బ్యారీ 1999, జూలై 2న హవాయిలోని జిల్లా సమావేశంలో సేవ చేస్తూ ఉండగానే చనిపోయారు.
లాయిడ్ బ్యారీ న్యూజీలాండ్‌లో 1916, డిసెంబరు 20న జన్మించారు. అంతకు మునుపే ఆయన తల్లిదండ్రులు వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ పంపిణీ చేస్తున్న సి.టి. రస్సెల్ యొక్క ప్రచురణల్లో పూర్తి ఆసక్తిని కనబర్చారు. అలా, బ్రదర్ బ్యారీ దైవభక్తిగల క్రైస్తవ గృహంలో పెరిగారు.
క్రీడల్లోను, విద్యాభ్యాసంలోను ఆసక్తి ఉన్నా, సైన్సులో డిగ్రీ సంపాదించినా బ్రదర్ బ్యారీ ఆధ్యాత్మిక విషయాలపైనే పూర్తిగా అవధానముంచడాన్ని మానుకోలేదు. ఆ విధంగా, 1939, జనవరి 1న ఆయన పూర్తికాల పరిచర్యను చేపట్టి, ఆస్ట్రేలియా బ్రాంచి ఆఫీసులో బేతేలు కుటుంబ సభ్యుడయ్యారు. 1941లో ప్రభుత్వం సొసైటీని నిషేధించిన తర్వాత బ్రదర్ బ్యారీ ఆఫీసు పనిలో బిజీగా ఉండిపోయారు, కొన్నిసార్లు తోటి విశ్వాసుల ప్రోత్సాహార్థమై శీర్షికలను వ్రాసే నియామకాలను కూడా స్వీకరించారు. ఆయన బహిరంగ పరిచర్యలో మాదిరికరమైన నడిపింపును ఇచ్చారు.
ఫిబ్రవరి 1942లో బ్రదర్ బ్యారీ మెల్బా అనే ఒక పూర్తికాల పరిచారకురాలిని వివాహం చేసుకున్నారు. ఆయన ప్రియమైన భార్య మెల్బా ఈ సంవత్సరాలన్నింట్లోను ఆయన ప్రక్కనే ఉంటూ అనేక దేశాల్లో విశ్వసనీయంగా పనిచేసింది. వారిద్దరూ అమెరికాలోని వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు చెందిన 11వ తరగతికి హాజరై విదేశీ క్షేత్రాల్లో సేవచేసేందుకైన పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి నియామకం—‘భూదిగంతములు’ అని అనేకులు పరిగణించే జపాను దేశం. వారు 1949 నవంబరులో అక్కడికి చేరుకున్న తర్వాత రేవు నగరమైన కోబెలో మిషనరీలుగా సేవచేయడం ప్రారంభించారు. అప్పట్లో జపాన్‌లో కేవలం 12 మంది మాత్రమే సువార్తను ప్రకటిస్తున్నారు. బ్రదర్ బ్యారీ అక్కడి భాషనూ పద్ధతులనూ నేర్చుకుని, జపాను ప్రజలపట్ల ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకున్నారు. వాళ్లతో ఆయన తర్వాతి 25 సంవత్సరాలు సేవచేశారు. “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారిపట్ల ఆయనకు గల ప్రేమ జపానులో అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ సహోదరులకు స్పష్టంగా కన్పించింది, ఇది ఆ బ్రాంచిని ఆయన దశాబ్దాలపాటు ప్రతిభావంతంగా పర్యవేక్షించడానికి తోడ్పడింది.
1975వ సంవత్సరం మధ్యభాగంలో జపాన్‌లో దాదాపు 30,000 మంది సాక్షులు ఉండగా, బ్యారీ దంపతులు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్కు బదిలీ చేయబడ్డారు. ఆత్మాభిషిక్త క్రైస్తవునిగా బ్రదర్ బ్యారీ యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసేందుకు ఆహ్వానించబడ్డారు. (రోమీయులు 8:16, 17) శీర్షికలు వ్రాయడంలో ఆయనకున్న అనుభవం రైటింగ్ డిపార్ట్మెంట్లోని ఆయన క్రొత్త నియామకంలో చాలా ఉపయోగపడింది. బ్రాంచిలోనూ, అంతర్జాతీయంగానూ ఆయనకున్న విస్తారమైన అనుభవం, పరిపాలక సభలోని పబ్లిషింగ్ కమిటీ సభ్యునిగా అమూల్యమైన తోడ్పాటునందించేందుకు ఆయనకు సహాయపడింది.
సంవత్సరాలు గడిచినా, బ్రదర్ బ్యారీ ప్రాచ్యదేశాలపట్లా అందులోని ప్రజలపట్లా తనకుగల ప్రేమను ఎన్నడూ చల్లారిపోనివ్వలేదు. ఆయన ప్రసంగాల్లోను వ్యాఖ్యానాల్లోను మిషనరీలుగా సేవచేసిన అనేకమందిని గురించిన హృదయాన్ని ఉత్తేజపర్చే కథలు దొర్లుతుంటాయని గిలియడ్ స్కూల్లోని విద్యార్థులకూ, బేతేలు కుటుంబ సభ్యులకూ తెలుసు. బ్రదర్ బ్యారీ తన స్వంత అనుభవాలను ఉత్సాహంగా నెమరువేసుకుంటుండగా ‘భూదిగంతముల్లోని’ రాజ్యప్రచార కార్యకలాపాలు కళ్లముందు సజీవంగా కదలాడేవి. వీటిలో కొన్ని 1960, సెప్టెంబరు 15 కావలికోట సంచికలో ప్రచురించబడిన ఆయన స్వీయ వృత్తాంతంలో పేర్కొనబడ్డాయి.
“నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారిపట్ల బ్రదర్ బ్యారీకి ఉన్న ఆసక్తి, ఇప్పుడు ‘క్రీస్తుతోడి వారసునిగా’ ఆయనలో ఇంకా కొనసాగుతుందని మా నమ్మకం. నిజమే, యెహోవాకు పూర్తిగా అంకితమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా, దేవుని ప్రజలపట్ల ప్రేమగల వ్యక్తిగా ఆయన్ని ఎరిగున్న వారందరూ ఆయన్ని ప్రేమించిన వారందరూ ఆయన లేని లోటును అనుభవిస్తారు. అయినా, బ్రదర్ బ్యారీ భూమిపై తన జీవితం చివరి వరకూ విశ్వసనీయంగా సహనాన్ని కనపర్చినందుకు మేము హర్షిస్తున్నాము.—ప్రకటన 2:10.
[16వ పేజీలోని చిత్రం]
“లేఖనాలపై అంతర్దృష్టి” (ఆంగ్లం) 1988లో విడుదలైనప్పుడు లాయిడ్ బ్యారీ, జాన్ బార్
[16వ పేజీలోని చిత్రం]
గిలియడ్ పాఠశాల యొక్క 11వ తరగతి పట్టభద్రులు, జపాన్‌లో 40 ఏండ్ల తర్వాత కలవడం