కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 1/15 పేజీలు 15-20
  • యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన గురించి ముందుగా ఆలోచించండి
  • పూజ్యభావంతో దేవుని సమీపించండి
  • వినయ దృక్పథంతో ప్రార్థించండి
  • హృదయపూర్వకంగా ప్రార్థించండి
  • కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలని జ్ఞాపకముంచుకోండి
  • ప్రార్థించడానికి ఎన్నడూ సిగ్గుపడకండి
  • ప్రార్థన నుండి ఓదార్పును పొందండి
  • భక్తిగలవారు ప్రార్థనలో పట్టుదల కల్గివుంటారు
  • యెహోవాతో మీ సంబంధం ఎలావుందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 1/15 పేజీలు 15-20

యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయండి

“కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన [“యథార్థమైన” NW] చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.”—1 తిమోతి 2:8.

1, 2. (ఎ) యెహోవా ప్రజలకు సంబంధించి 1 తిమోతి 2:8 ప్రార్థనకు ఎలా అన్వయిస్తుంది? (బి) మనమిప్పుడు ఏం పరిశీలిస్తాము?

తన ప్రజలు పరస్పరమూ, తనపట్లనూ యథార్థవంతులై ఉండాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. “కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన [“యథార్థమైన,” NW] చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను” అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు ప్రార్థనకు యథార్థతకు ముడిపెట్టాడు. (1 తిమోతి 2:8) క్రైస్తవులు కలిసి సమకూడే ‘ప్రతిస్థలంలోనూ’ చేసే బహిరంగ ప్రార్థన గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడని స్పష్టమౌతుంది. సంఘ కూటాల్లో ప్రార్థనలో దేవుని ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలి? దేవునిపట్ల లేఖనాధార బాధ్యతలన్నిటినీ జాగ్రత్తగా నిర్వహించే పవిత్రులైన, నీతిమంతులైన, భక్తిపరులైన పురుషులు మాత్రమే. (ప్రసంగి 12:13, 14) వాళ్లు ఆధ్యాత్మికంగానూ నైతికంగానూ పరిశుభ్రంగా ఉండి యెహోవా దేవునికి యథార్థంగా సమర్పించుకొనిన వారై ఉండాలి.

2 ప్రాముఖ్యంగా సంఘ పెద్దలు ‘యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి.’ యేసుక్రీస్తు ద్వారా వారు హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలు దేవుని పట్లగల యథార్థతను చూపించి, సంశయాలకు కోపోద్రేకాలకు దూరంగా ఉండడానికి సహాయం చేస్తాయి. వాస్తవానికి, బహిరంగ ప్రార్థనలో క్రైస్తవ సంఘానికి ప్రాతినిధ్యం వహించే ఆధిక్యతగల ఏ వ్యక్తైనా క్రోధాన్ని, శత్రుభావాన్ని విడనాడి, యెహోవా పట్ల ఆయన సంస్థ పట్ల యథార్థంగా/నమ్మకంగా ఉండాలి. (యాకోబు 1:19, 20) బహిరంగ ప్రార్థనలో ఇతరులకు ప్రాతినిధ్యం వహించే ఆధిక్యతగల వారి కోసం ఇంకా ఏ ఇతర బైబిలు ఆధారిత మార్గనిర్దేశాలు ఉన్నాయి? మన వ్యక్తిగత లేక కుటుంబ ప్రార్థనల్లో మనం అన్వయించుకోవలసిన కొన్ని లేఖనాధారిత సూత్రాలు ఏవి?

ప్రార్థన గురించి ముందుగా ఆలోచించండి

3, 4. (ఎ) బహిరంగంగా చేసే ప్రార్థన గురించి ముందుగానే ఆలోచించడం ఎందుకు ప్రయోజనకరమైనది? (బి) ప్రార్థనల కాలవ్యవధిని గురించి లేఖనాలు ఏమి సూచిస్తున్నాయి?

3 బహిరంగంగా ప్రార్థించమని మనల్ని కోరడం జరిగితే, మనం చేసే ప్రార్థన గురించి మనం కనీసం కొంత ముందుగా ఆలోచించుకునే అవకాశం ఉండవచ్చు. అలా చేస్తే, సుదీర్ఘంగా అసంబద్ధమైన విధంగా ప్రార్థన చేయకుండా సముచితమైన ప్రాముఖ్యమైన విషయాలన్నింటి గురించి ప్రార్థించడం సాధ్యమౌతుంది. అయితే, మన వ్యక్తిగత ప్రార్థనలను కూడా బిగ్గరగా చేయవచ్చు. అలాంటి ప్రార్థనలకు కాలపరిమితి ఉండవలసిన అవసరం లేదు. యేసు తాను తన 12 మంది అపొస్తలులను ఎంపిక చేసుకోవడానికి ముందు ఒక రాత్రంతా ప్రార్థించాడు. అయితే, ఆయన తన మరణ జ్ఞాపకార్థాన్ని ప్రారంభించినప్పుడు, రొట్టె ద్రాక్షారసం గురించి ఆయన చేసిన ప్రార్థనలు స్వల్ప కాలవ్యవధి గలవేనని స్పష్టమౌతుంది. (మార్కు 14:22-24; లూకా 6:12-16) యేసు చేసిన స్వల్ప కాలవ్యవధి గల ప్రార్థనలు కూడా దేవునికి అంగీకారయుక్తమైనవని మనకు తెలుసు.

4 భోజనానికి ముందు ఒక కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రార్థించే ఆధిక్యత మనకు లభించిందనుకోండి. అలాంటి ప్రార్థన కొంత తక్కువ కాలవ్యవధిని కల్గివుండాలి, కాని అప్పుడు చెప్పబడే మాటలు ఆహారం విషయమై మన కృతజ్ఞతను వ్యక్తపర్చేవై ఉండాలి. ఒక క్రైస్తవ కూటం ప్రారంభమయ్యే ముందు లేక ముగిసిన తర్వాత మనం ప్రార్థిస్తున్నట్లయితే, అనేక అంశాలను ఇమిడ్చిన సుదీర్ఘమైన ప్రార్థనను చేయవలసిన అవసరం లేదు. “మాయవేషముగా దీర్ఘప్రార్థనలు” చేసే శాస్త్రులను యేసు విమర్శించాడు. (లూకా 20:46, 47) దైవభక్తిగల వ్యక్తి అలా చేయాలని ఎన్నడూ అనుకోడు. అయితే, కొన్నిసార్లు కొంత ఎక్కువ కాలవ్యవధిగల బహిరంగ ప్రార్థన సముచితమైనదే అవుతుంది. ఉదాహరణకు, సమావేశం తర్వాత చివరి ప్రార్థన చేయడానికి ఎంపిక చేసుకోబడిన పెద్ద ప్రార్థన గురించి ముందుగానే ఆలోచించుకుని, అనేక అంశాల గురించి ప్రస్తావించాలని అనుకోవచ్చు. అయినప్పటికీ, అలాంటి ప్రార్థన కూడా మరీ సుదీర్ఘమైనదై ఉండకూడదు.

పూజ్యభావంతో దేవుని సమీపించండి

5. (ఎ) బహిరంగంగా ప్రార్థించేటప్పుడు మనం ఏమి మనస్సులో ఉంచుకోవాలి? (బి) గౌరవప్రదమైన విధంగా, మర్యాదకరంగా ఎందుకు ప్రార్థించాలి?

5 మనం బహిరంగంగా ప్రార్థిస్తున్నప్పుడు మనం మానవులను ప్రార్థించడం లేదని గుర్తుంచుకోవాలి. బదులుగా, పాపులమైన మనం సర్వోన్నత ప్రభువైన యెహోవాను వేడుకుంటున్నాము. (కీర్తన 8:3-5, 9; 73:28) మనం ఉపయోగించే మాటలను బట్టి, మనం వ్యక్తపర్చే విధానాన్ని బట్టి ఆయనకు ఆగ్రహం తెప్పిస్తామేమోనని మనం భయభక్తులు కల్గివుండాలి. (సామెతలు 1:7) కీర్తనల గ్రంథకర్తయైన దావీదు ఇలా పాడాడు: “నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను.” (కీర్తన 5:7) మనకు అలాంటి దృక్పథం ఉంటే, యెహోవాసాక్షుల కూటం వద్ద బహిరంగంగా ప్రార్థించమని మనల్ని కోరినప్పుడు మనం మన భావాలను ఎలా వ్యక్తపరుస్తాము? మనం ఒక మానవ రాజుతో మాట్లాడుతున్నట్లయితే, మనం ఎంతో గౌరవ మర్యాదలతో మాట్లాడుతాము. మనం ‘యుగములకు రాజైన’ యెహోవాను ప్రార్థిస్తున్నాము గనుక మన ప్రార్థనలు మరింత గౌరవప్రదమైనవిగా, మర్యాదకరమైనవిగా ఉండనవసరం లేదా? (ప్రకటన 15:3) కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం “గుడ్‌ మార్నింగ్‌, యెహోవా,” “నీకు మా ప్రేమలు,” లేక, “మళ్లీ కలుద్దాం” వంటి వాక్యాలను ఉపయోగించము. దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు తన పరలోక తండ్రితో ఎన్నడూ ఆ విధంగా మాట్లాడలేదని లేఖనాలు చూపిస్తున్నాయి.

6. ‘ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరడం’ అంటే ఏమిటి?

6 పౌలు ఇలా చెప్పాడు: “మనము . . . ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.” (హెబ్రీయులు 4:16) మనం పాపభరితమైన స్థితిలోనే ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలియందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం యెహోవాను “ధైర్యముతో” సమీపించవచ్చు. (అపొస్తలుల కార్యములు 10:42, 43; 20:20, 21) అయినప్పటికీ, అలా “ధైర్యముతో” మాట్లాడడమంటే, దానర్థం దేవునితో మనం కబుర్లు చెప్పడమని కాదు; మన్ననలేని మాటలను మనం ఆయనతో మాట్లాడకూడదు. మనం బహిరంగంగా చేసే ప్రార్థనలు యెహోవాకు ప్రీతికరమైనవై ఉండాలంటే మనం సరైన గౌరవమర్యాదలతో ప్రార్థించాలి. ప్రార్థనలను ప్రటకనలు చేయడానికి, వ్యక్తులకు ఉపదేశం ఇవ్వడానికి, లేక ప్రేక్షకులతో ప్రసంగించడానికి ఉపయోగించుకోవడం సముచితం కాదు.

వినయ దృక్పథంతో ప్రార్థించండి

7. యెహోవా ఆలయ ప్రతిష్ట సమయంలో ప్రార్థించేటప్పుడు సొలొమోను వినయ దృక్పథాన్ని ఎలా కనబర్చాడు?

7 మనం బహిరంగంగా ప్రార్థిస్తున్నా లేక వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నా, మనం మనస్సునందు ఉంచుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన లేఖనాధారిత సూత్రం ఏమిటంటే, మనం మన ప్రార్థనల్లో వినయ దృక్పథాన్ని కనబర్చాలి. (2 దినవృత్తాంతములు 7:13, 14) యెరూషలేములో యెహోవా ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో, రాజైన సొలొమోను బహిరంగంగా ప్రార్థించేటప్పుడు వినయ దృక్పథాన్ని కనబర్చాడు. భూమిపై నిర్మించబడిన వాటిలోకెల్లా అత్యంత మహత్తరమైన నిర్మాణాల్లో ఒకటైన దాని నిర్మాణాన్ని సొలొమోను అప్పుడే ముగించాడు. అయినప్పటికీ, ఆయన వినయంగా ఇలా ప్రార్థించాడు: “నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?”—1 రాజులు 8:27.

8. బహిరంగ ప్రార్థనల్లో వినయ దృక్పథాన్ని చూపించగల కొన్ని మార్గాలు ఏవి?

8 బహిరంగ ప్రార్థనలో మనం ఇతరులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మనం సొలొమోను వలె వినయ దృక్పథం కల్గివుండాలి. మనమేదో పవిత్రులమన్నట్లు మాట్లాడకూడదు గాని, మనం మన స్వరంలో వినయ దృక్పథాన్ని ధ్వనింపజేయాలి. వినయంగా చేసే ప్రార్థనలు ఆడంబరమైనవిగా, కృత్రిమమైనవిగా ఉండవు. అవి, ప్రార్థిస్తున్న వ్యక్తి వైపుకు గాక, ఎవరికి ప్రార్థిస్తున్నామో ఆయన వైపుకు అవధానాన్ని మళ్లిస్తాయి. (మత్తయి 6:5) మనం ప్రార్థించే వాటిలో కూడా మన వినయ దృక్పథం కనిపిస్తుంది. మనం వినయంగా ప్రార్థిస్తే, ఆ ప్రార్థన, దేవుడు ఏదో మనం కోరిన విధంగా చేయాలని మనం అధికారపూర్వకంగా అడుగుతున్నట్లు ఉండదు. బదులుగా, యెహోవా పరిశుద్ధ చిత్తానికి అనుగుణ్యంగా ఉండే విధంగా చర్య తీసుకోమని మనం ఆయనను వేడుకుంటాము. “యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము” అని వేడుకున్నప్పుడు కీర్తనల గ్రంథకర్త సరైన దృక్పథం చూపించవలసిన విషయంలో మాదిరిని ఉంచాడు.—కీర్తన 118:25; లూకా 18:9-14.

హృదయపూర్వకంగా ప్రార్థించండి

9. యేసు ఇచ్చిన ఏ చక్కని ఉపదేశాన్ని మత్తయి 6:7 నందు కనుగొనవచ్చు, దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు?

9 మనం బహిరంగంగా చేసే లేక వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు యెహోవాకు ప్రీతికరమైనవై ఉండాలంటే, అవి హృదయపూర్వకంగా చేసేవై ఉండాలి. అలాగైతే, మనం ఏమి చెబుతున్నామనేది యోచించకుండా ఏదో ఒక ప్రార్థన సూత్రాన్ని మనం కేవలం పదే పదే వల్లించము. యేసు తాను కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో ఇలా ఉపదేశించాడు: “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు [పొరపాటుగా] తలంచుచున్నారు.” వేరే మాటల్లో చెప్పాలంటే, యేసు ఇలా అన్నాడు: “బడ బడ వాగొద్దు; అర్థరహితమైన పదాలను పదే పదే ఉచ్చరించవద్దు.”—మత్తయి 6:7, అథస్సూచి, NW.

10. ఒకే విషయాన్ని గురించి ఒకటికంటే ఎక్కువసార్లు ప్రార్థించడం ఎందుకు సరైనది?

10 అయితే, మనం ఒకే విషయాన్ని గురించి మళ్లీ మళ్లీ ప్రార్థించవలసి ఉంటుంది. అది తప్పు కాదు ఎందుకంటే, యేసు ఇలా ఉద్బోధించాడు: “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.” (మత్తయి 7:7, 8) స్థానిక ప్రకటనా పనిని యెహోవా వర్ధిల్లజేస్తున్నాడు గనుక క్రొత్త రాజ్య మందిరం అవసరమైంది అనుకుందాం. (యెషయా 60:22) మనం వ్యక్తిగతంగా ప్రార్థించేటప్పుడు గానీ లేక యెహోవా ప్రజల కూటాల వద్ద బహిరంగంగా ప్రార్థనలు చేసేటప్పుడు గానీ దీని గురించి ప్రస్తావిస్తూనే ఉండడం సముచితం. అలా చేయడం, ‘అర్థరహితమైన పదాలను పదే పదే ఉచ్చరించడమని’ భావం కాదు.

కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలని జ్ఞాపకముంచుకోండి

11. ఫిలిప్పీయులు 4:6, 7 బహిరంగ లేక వ్యక్తిగత ప్రార్థనలకు ఎలా వర్తిస్తుంది?

11 చాలామంది ప్రజలు ఏదైనా అడగడానికే ప్రార్థన చేస్తారు, కాని యెహోవా దేవుని పట్ల మనకున్న ప్రేమ మనం బహిరంగ ప్రార్థనలోనూ వ్యక్తిగత ప్రార్థనలోనూ ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేలా మనల్ని కదిలించాలి. పౌలు ఇలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అవును, ప్రార్థన విజ్ఞాపనలు చేయడమేగాక, ఆధ్యాత్మిక మరియు వస్తుదాయక ఆశీర్వాదాలను బట్టి మనం యెహోవాకు కృతజ్ఞతను తెలియజేయాలి. (సామెతలు 10:22) కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “దేవునికి స్తుతి యాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము.” (కీర్తన 50:14) దావీదు పాడిన ప్రార్థనాపూర్వకమైన పాటలో, హృదయాన్ని తాకే ఈ మాటలు కూడా ఉన్నాయి: “కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను.” (కీర్తన 69:30) బహిరంగ మరియు వ్యక్తిగత ప్రార్థనల్లో మనమలాగే చేయవద్దా?

12. కీర్తన 100:4, 5 నేడు ఎలా నెరవేరుతోంది, దేన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు?

12 దేవుని గురించి కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.” (కీర్తన 100:4, 5) నేడు అన్ని జనాంగాలకు చెందిన ప్రజలూ యెహోవా ఆలయ ఆవరణములలోకి ప్రవేశిస్తున్నారు, దాన్నిబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించవచ్చు. స్థానిక రాజ్యమందిరాన్ని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతను తెలియజేస్తూ, ఆయనను ప్రేమించేవారితో పాటు అక్కడ క్రమంగా సమకూడడం ద్వారా మీరు మీ మెప్పును చూపిస్తున్నారా? అక్కడున్నప్పుడు, మీరు ప్రేమగల మన పరలోక తండ్రికి కృతజ్ఞతా స్తుతి గీతాలను హృదయపూర్వకంగా గొంతెత్తి గానం చేస్తున్నారా?

ప్రార్థించడానికి ఎన్నడూ సిగ్గుపడకండి

13. మనం అపరాధ భావాన్ని బట్టి అనర్హులమని భావించినప్పటికీ మనం యెహోవాకు విన్నవించుకోవాలని లేఖనాధారిత ఏ ఉదాహరణ చూపిస్తుంది?

13 అపరాధ భావాన్ని బట్టి మనం అనర్హులమని భావించినప్పటికీ, మనం దేవుణ్ని సమీపించి, హృదయపూర్వకంగా విన్నవించుకోవాలి. అన్య భార్యలను చేసుకోవడం ద్వారా యూదులు పాపం చేసినప్పుడు, ఎజ్రా మోకాళ్లూని, దేవుని ఎదుట తన యథార్థమైన చేతులనెత్తి, “నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; . . . అయితే మీ దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనిన యెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని” వినయంగా ప్రార్థించాడు.—ఎజ్రా 9:1-15; ద్వితీయోపదేశకాండము 7:3, 4.

14. ఎజ్రా కాలంలో ఉదాహరించబడినట్లుగా, దేవుని క్షమను పొందడానికి ఏమి అవసరం?

14 దేవుని క్షమను పొందడానికి, మనం మన తప్పును ఒప్పుకోవడమే కాదు దానితోపాటు పశ్చాత్తాపపడి, “మారుమనస్సునకు తగిన ఫలములు” ఫలించాలి. (లూకా 3:8; యోబు 42:1-6; యెషయా 66:2) ఎజ్రా కాలంలో, పశ్చాత్తాప దృక్పథంతో పాటు అన్య భార్యలను పంపివేయడం ద్వారా తప్పును సరిదిద్దుకోడానికి కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. (ఎజ్రా 10:44; పోల్చండి 2 కొరింథీయులు 7:8-13.) గంభీరమైన తప్పిదానికి మనం దేవుని క్షమను కోరుతున్నట్లైతే, మనం వినయంగా ప్రార్థన చేసి మన తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపానికి తగిన ఫలములను ఫలిద్దాము. పశ్చాత్తాప దృక్పథమూ తప్పును సరిదిద్దుకోవాలనే కోరికా, క్రైస్తవ పెద్దల ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకునేందుకు కూడా మనల్ని పురికొల్పుతాయి.—యాకోబు 5:13-15.

ప్రార్థన నుండి ఓదార్పును పొందండి

15. మనం ప్రార్థన ద్వారా ఓదార్పును పొందవచ్చునని హన్నా అనుభవం ఎలా చూపిస్తుంది?

15 ఏదైనా కారణాన్ని బట్టి మనకు హృదయావేదన ఉన్నట్లయితే, మనం ప్రార్థన ద్వారా ఓదార్పును పొందవచ్చు. (కీర్తన 51:17; సామెతలు 15:13) యథార్థవంతురాలైన హన్నా అలాగే ఓదార్పును పొందింది. ఇశ్రాయేలులో పెద్ద కుటుంబాలు సర్వసాధారణమైయున్న కాలంలో ఆమె జీవించింది, కాని ఆమెకు మాత్రం పిల్లలు లేరు. ఆమె భర్తయైన ఎల్కానాకు తన రెండవ భార్యయైన పెనిన్నా ద్వారా కుమారులు కుమార్తెలు కలిగారు, హన్నా గొడ్రాలైనందుకు పెనిన్నా ఆమెను ఎత్తిపొడుస్తూ ఉండేది. హన్నా హృదయపూర్వకంగా ప్రార్థించి, తనకు ఒక కుమారుడ్ని అనుగ్రహిస్తే, ‘అతడు బ్రతుకు దినములన్నిటను అతడిని యెహోవాకు అప్పగిస్తానని’ ఆమె మ్రొక్కుకుంది. తాను చేసిన ప్రార్థనను బట్టి, ప్రధాన యాజకుడైన ఏలీ మాటలను బట్టి ఓదార్పు పొందినదై హన్నా, “నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.” ఆమె ఒక కుమారుడ్ని కని అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. తర్వాత, ఆమె యెహోవా ఆలయంలో సేవకు అతడిని అప్పగించింది. (1 సమూయేలు 1:9-28) దేవుడు తన పట్ల చూపిన కనికరాన్ని బట్టి కృతజ్ఞతతో, ఆమె కృతజ్ఞతలు తెల్పుతూ ఒక ప్రార్థన చేసింది—యెహోవా అసమానుడని ఆ ప్రార్థన ఆయనను కొనియాడింది. (1 సమూయేలు 2:1-10) దేవుడు తన చిత్తానికి అనుగుణ్యంగా ఉండే విజ్ఞాపనలన్నిటికీ సమాధానమిస్తాడన్న నమ్మకం కల్గివుండి మనం హన్నాలా ప్రార్థన నుండి ఓదార్పు పొందవచ్చు. మనం ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ఆయన మన భారాన్ని తీసివేస్తాడు లేక మనం దాన్ని సహించగల్గేలా చేస్తాడు గనుక మనం ‘ఇకనుండి దుఃఖముఖులమై ఉండడం మానుకుందాం.’—కీర్తన 55:22.

16. యాకోబు విషయంలో ఉదాహరించబడినట్లుగా, మనకు భయం కల్గినప్పుడు గానీ లేక చింతతో ఉన్నప్పుడు గానీ మనం ఎందుకు ప్రార్థించాలి?

16 ఏదైనా ఒక పరిస్థితిని బట్టి భయం, హృదయవేదన, లేక చింత కలిగితే, తప్పక దేవుని వైపు తిరిగి ప్రార్థన ద్వారా ఓదార్పు పొందాలి. (కీర్తన 55:1-4) విరోధం కలిగివున్న తన అన్నయైన ఏశావును కలవడానికి వెళ్లే ముందు యాకోబు భయపడుతున్నాడు. అయినా యాకోబు ఇలా ప్రార్థించాడు: “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా—నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు—నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే.” (ఆదికాండము 32:9-12) ఏశావు యాకోబును ఆయన సమూహాన్ని నాశనం చేయలేదు. అలా యెహోవా ఆ సందర్భంలో యాకోబుకు ‘మేలు చేశాడు.’

17. కీర్తన 119:52తో పొందికగా, మనం బాధాకరమైన కష్టాలను అనుభవిస్తున్నప్పుడు ప్రార్థన ఎలా మనకు ఓదార్పును తీసుకురావచ్చు?

17 మనం విజ్ఞాపనలను చేస్తున్న సమయంలో, దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం ఓదార్పును పొందవచ్చు. సుదీర్ఘమైన కీర్తనలో—అది సంగీతం కూర్చబడిన విన సొంపైన ప్రార్థన—బహుశ రాకుమారుడైన హిజ్కియా అయ్యుండవచ్చు, ఇలా పాడాడు: “యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని.” (కీర్తన 119:52) మనం బాధాకరమైన కష్టాలను అనుభవిస్తూ, వినయంగా ప్రార్థించినప్పుడు, ఒక బైబిలు సూత్రం గాని లేక దైవిక నియమం గాని మనకు గుర్తు రావచ్చు, అది మనం మన పరలోక తండ్రిని సంతోషపరుస్తున్నామనే ఓదార్పుకరమైన హామీని మనకు ఇవ్వగల చర్యను తీసుకోవడానికి సహాయం చేయవచ్చు.

భక్తిగలవారు ప్రార్థనలో పట్టుదల కల్గివుంటారు

18. ‘భక్తిగల ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థిస్తారని’ ఎందుకు చెప్పవచ్చు?

18 యెహోవా దేవుని పట్ల భక్తిగల వారందరూ ‘ప్రార్థనయందు పట్టుదల కల్గివుంటారు.’ (రోమీయులు 12:12) క్షమను పొందలేకపోవడం ద్వారా తాను అనుభవిస్తున్న ఆవేదనను, పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకోవడం ద్వారా తాను పొందిన ఉపశమనాన్నీ 32వ కీర్తనలో దావీదు వర్ణించాడు. బహుశా బత్షెబాతో తప్పు చేసిన తర్వాత ఆయన దీన్ని కూర్చి ఉండవచ్చు. అందులో దావీదు ఇలా పాడాడు: “కావున [నిజంగా పశ్చాత్తాపపడే వారికి యెహోవా క్షమ లభిస్తుంది గనుక] నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు.”—కీర్తన 32:6.

19. మనం ఎందుకు యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి?

19 యెహోవా దేవునితో మనకున్న సంబంధాన్ని మనం ప్రియమైనదిగా ఎంచుతుంటే, యేసు విమోచన క్రయధనబలి ఆధారంగా మనం ఆయన కనికరం కోసం ప్రార్థిస్తాము. కనికరాన్నీ, సమయోచితమైన సహాయాన్నీ పొందడానికి మనం ధైర్యంగా కృపాసనాన్ని సమీపించవచ్చు. (హెబ్రీయులు 4:16) కాని ప్రార్థన చేయడానికి ఎన్నో కారణాలున్నాయి! కాబట్టి, మనం ‘ఎడతెగక ప్రార్థిద్దాము,’ తరచూ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. (1 థెస్సలొనీకయులు 5:17) రాత్రింబగళ్లు మనం యథార్థమైన చేతులెత్తి ప్రార్థిద్దాము.

మీరెలా సమాధానమిస్తారు?

◻ బహిరంగంగా ప్రార్థించే ముందు దాని గురించి ముందుగా ఆలోచించడం యొక్క ప్రయోజనం ఏమిటి?

◻ మనం ఎందుకు గౌరవప్రదమైన విధంగా మర్యాదకరంగా ప్రార్థించాలి?

◻ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ దృక్పథాన్ని ప్రదర్శించాలి?

◻ ప్రార్థన చేసేటప్పుడు మనం కృతజ్ఞతా స్తుతులను చెల్లించాలని ఎందుకు జ్ఞాపకముంచుకోవాలి?

◻ మనం ప్రార్థన నుండి ఓదార్పును పొందవచ్చునని బైబిలు ఎలా చూపిస్తుంది?

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా ఆలయ ప్రతిష్ఠ సమయంలో బహిరంగంగా ప్రార్థించేటప్పుడు రాజైన సొలొమోను వినయ దృక్పథాన్ని కనపర్చాడు

[18వ పేజీలోని చిత్రాలు]

హన్నాలా మీరు ప్రార్థన ద్వారా ఓదార్పును పొందవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి