వీటన్నిటి వెనుకా ఎవరున్నారు?
కంబోడియాలోని అడవిలో అడ్డువచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ ముందుకు సాగుతున్న 19వ శతాబ్దపు అన్వేషకుడైన ఏన్రీ మూవో అనే ఫ్రాన్స్ దేశస్థుడు, ఒక ఆలయం చుట్టూ ఉన్న వెడల్పైన కందకాన్ని చేరుకున్నాడు. ఆయన నిల్చున్న చోటినుండి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో, ఆలయం యొక్క ఐదు గోపురాలు 60 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కల్గివున్నాయి. అదే ఆంకర్‌వాట్. అది భూమిపైనున్న అతిపెద్ద మతసంబంధమైన కట్టడం. మూవో దాన్ని కనుగొనే సమయానికే అది ఏడు శతాబ్దాలపాటు వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచింది.
నాచుపట్టివున్న ఆ గోపురాలు మానవ నిర్మితాలేనని మూవో ఒక్క చూపులోనే చెప్పగల్గాడు. “ఎవరో ప్రాచీన మైకెలాంజిలో నిర్మించిన ఆ కట్టడం, గ్రీసువారి లేక రోమనుల ఏ కట్టడాలకన్నా కూడా అత్యంత పెద్దది” అని వ్రాశాడాయన. శతాబ్దాలపాటు అవి ఆలనాపాలనా లేకుండా విడిచిపెట్టబడినప్పటికీ, ఆ అద్భుతమైన నిర్మాణాల వెనుక ఒక రూపనిర్మాణకుడు ఉన్నాడన్న విషయంలో ఆయనకు సందేహం కలుగలేదు.
ఆసక్తికరంగా, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రూపనిర్మాణకుని కృతి అయి ఉండాలన్నది వివరించడానికి, శతాబ్దాల క్రితం వ్రాయబడిన, జ్ఞానంతో నిండిన ఒక పుస్తకం అదే విధమైన తర్కాన్ని ఉపయోగించింది. అది తప్పక సృష్టించబడి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:3) ‘ప్రకృతి పని చేసే విధానానికీ మానవ నిర్మితాలకూ తేడా ఉంది’ అని చెబుతూ కొందరు ఈ సాదృశ్యంతో ఏకీభవించకపోవచ్చు. అయితే, ఆ అభ్యంతరాన్ని శాస్త్రవేత్తలందరూ ఒప్పుకోకపోవచ్చు. లెహై విశ్వవిద్యాలయంలో జీవరసాయనశాస్త్ర సహ అధ్యాపకుడైన మైఖేల్ బీహీ, “జీవ రసాయన వ్యవస్థలు నిర్జీవమైన వస్తువులుకావు” అని అంగీకరించిన తర్వాత, “సజీవ జీవరసాయన వ్యవస్థలను జ్ఞానవంతంగా రూపించవచ్చా?” అని అడుగుతున్నాడు. జెనెటిక్ ఇంజినీరింగ్ వంటి పద్ధతుల ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పుడు జీవుల్లో మౌలిక మార్పులను రూపనిర్మాణం చేస్తున్నారని అటు తర్వాత ఆయన చూపిస్తున్నాడు. స్పష్టంగా, చేతనాచేతన వస్తువులను రూపించి, నిర్మించవచ్చు! బీహీ, సూక్ష్మాతి సూక్ష్మమైన జీవ కణాల ప్రపంచంలోకి పరిశీలించి చూస్తూ, పని చేయడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడే కాంపోనెంట్లతో రూపొందించబడిన అద్భుతమైన సంకీర్ణ వ్యవస్థల గురించి చర్చిస్తున్నాడు. ఆయన అభిప్రాయమేమిటి? “జీవ కణాన్ని పరిశోధించడానికి—జీవాన్ని పరమాణువు స్థాయిలో పరిశోధించడానికి—చేయబడుతున్న ఈ సమిష్టి ప్రయత్నాల ఫలితం, స్పష్టమైన స్వరంతో ఇలా ఎలుగెత్తి చెబుతుంది, అది ‘రూపనిర్మాణమే!’”
ఖగోళ శాస్త్రజ్ఞులూ, పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞులూ ప్రపంచాన్నీ, విశ్వాన్నీ అలాగే నిశితంగా పరిశీలించి, అబ్బురపర్చే కొన్ని వాస్తవాలను కనుగొన్నారు. ఉదాహరణకు, విశ్వ స్థిరరాశుల్లో వేటి విలువలోనైనా సూక్ష్మాతి సూక్ష్మమైన మార్పు వచ్చినా విశ్వం నిర్జీవమైపోతుందని వాళ్లకిప్పుడు తెలుసు.a ఖగోళ శాస్త్రజ్ఞుడైన బ్రాండన్ కార్టర్ ఈ వాస్తవాలను ఆశ్చర్యకరమైన కాకతాళీయతలు అని పిలిచాడు. కాని మీరు మర్మమైన అంతర్‌సంబంధిత కాకతాళీయతల పరంపరను ఎదుర్కున్నారనుకోండి, వాటి వెనుక ఎవరో ఒకరు ఉన్నారని కనీసం మీకు అనుమానమైనా కలుగదా?
వాస్తవానికి, ఈ సంక్లిష్ట వ్యవస్థలన్నింటి వెనుకా, కచ్చితంగా సవరించబడిన “కాకతాళీయతల” వెనుకా ఒక రూపనిర్మాణకుడు ఉన్నాడు. ఎవరు? “ఆ రూపనిర్మాణకుడ్ని వైజ్ఞానిక పద్ధతుల ద్వారా గుర్తించడం చాలా కష్టం,” అని అధ్యాపకుడైన బీహీ అంగీకరిస్తున్నాడు, ఆ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ప్రయత్నించే పనిని “తత్త్వశాస్త్రానికి మరియు వేదాంతశాస్త్రానికి” ఆయన వదిలివేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆ ప్రశ్న మీకు అసంబద్ధమైనదని మీరు భావించవచ్చు. అయితే, సరిగ్గా మీకు అవసరమైనదాన్నే చక్కగా పాక్ చేసి మీకు పంపించారనుకోండి, దాన్ని మీకు ఎవరు పంపించారో తెలుసుకోవాలని మీరు కోరుకోరా?
సూచనార్థకంగా చెప్పాలంటే, మనం అలాంటి పాకేజ్‌ను—మనం జీవించి ఉండి జీవితాన్ని ఆస్వాదించడాన్నీ సాధ్యం చేసే అద్భుతమైన బహుమానాలతో నింపబడిన ఒక పాకేజ్‌ను—అందుకున్నాము. జీవాన్ని పోషించడానికి అవసరమైన విశేషమైన వ్యవస్థలన్నీవున్న ఈ భూమే ఆ పాకేజ్. ఈ బహుమానాలను మనకు ఎవరిచ్చారో తెలుసుకోవాలని మనం కోరుకోవద్దా?
సంతోషకరంగా, ఆ పాకేజ్‌ను పంపిన వ్యక్తి దానికి ఒక నోట్‌ను జతచేశాడు. మునుపు ప్రస్తావించబడిన, జ్ఞానంతో నిండిన ప్రాచీన పుస్తకమైన బైబిలే ఆ “నోట్.” బైబిలు దాని ప్రారంభ మాటల్లో, మనకు ఆ పాకేజ్‌ను ఎవరిచ్చారనే ప్రశ్నకు విశేషమైన సరళతతోనూ స్పష్టతతోనూ ఇలా సమాధానమిస్తోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”—ఆదికాండము 1:1.
సృష్టికర్త తన “నోట్”లో తనను తాను ఈ పేరుతో గుర్తించుకుంటున్నాడు: “ఆకాశములను సృజించి . . . భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును . . . ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” (ఇటాలిక్కులు మావి.) (యెషయా 42:5) అవును, విశ్వాన్ని రూపించి, భూమిపైనున్న స్త్రీ పురుషులను సృష్టించిన దేవుని పేరు యెహోవా. కాని యెహోవా ఎవరు? ఆయన ఎటువంటి దేవుడు? భూమిపైనున్న ప్రజలందరూ ఆయన చెప్పేది ఎందుకు వినాలి?
[అధస్సూచి]
a “స్థిరరాశులు” అంటే విశ్వమంతటిలోనూ ఎక్కడా మారుతున్నట్లు కనిపించని విలువలు. రెండు ఉదాహరణలు ఏమిటంటే, కాంతి వేగం, ద్రవ్యరాశితో గురుత్వాకర్షణ శక్తికున్న సంబంధం.
[3వ పేజీలోని చిత్రం]
ఆంకర్‌వాట్‌ను మనుష్యులే నిర్మించారు
[4వ పేజీలోని చిత్రం]
మీరు ఒక బహుమానాన్ని అందుకున్నప్పుడు, అదెవరు పంపించారనేది తెలుసుకోవాలనుకోరా?