మనస్సాక్షి—భారమా లేక వరమా?
‘నా మనస్సాక్షి నన్ను బాధిస్తోంది!’ మనలో ప్రతి ఒక్కరమూ మనస్సాక్షి కలిగించే వేదనను అప్పుడప్పుడూ అనుభవిస్తాము. అలాంటి భావాలు సామాన్య మానసిక వ్యాకులత మొదలుకొని బాధాకరమైన వ్యధ వరకు వ్యాపించవచ్చు. కలత చెందిన మనస్సాక్షి కృంగుదలను కూడా కలిగించవచ్చు లేక విఫలమయ్యామనే తీవ్రమైన భావననూ కలిగించవచ్చు.
ఈ దృక్కోణం నుండి చూస్తే, మరి మనస్సాక్షి ఒక భారం కాదా? అదొక భారమేనని కొందరు భావించవచ్చు. గతించిన తరాలకు చెందిన ఆలోచనాపరులు తరచూ మనస్సాక్షిని ఒక స్వాభావికమైన, జన్మ సిద్ధమైన శక్తిగా పరిగణించారు. అది దేవుని ద్వారా స్వయంగా ఇవ్వబడిన నైతిక మార్గదర్శి అని అనేకులు భావించారు. అందుకని మనస్సాక్షి “మానవునిలో దేవుని ప్రత్యక్షత” అని, “మన ఆది స్వభావం” అని, లేక “దేవుని స్వరం” అని కూడా పిలువబడింది.
అయితే, ఇటీవలి సంవత్సరాల్లో, మనస్సాక్షి అనేది చాలావరకూ మనం అలవరచుకున్న శక్తి అని, అంటే తలిదండ్రుల మరియు సమాజపు ప్రభావం యొక్క ఫలితమని భావించడం ప్రఖ్యాతి గాంచింది. ఉదాహరణకు, మనం మనస్సాక్షి అని పిలిచేది మన తలిదండ్రుల వ్యక్తిగత విలువలనూ నమ్మకాలను అలవర్చుకోవడం మాత్రమేనని విశ్వసిస్తూ, తనను శిక్షిస్తారనే భయంతోనే పిల్లవాడు అవాంఛనీయ ప్రవర్తనను నివారిస్తాడని, కొందరు మనస్తత్త్వ శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. విలువలనూ ప్రమాణాలను వ్యాప్తిచేయడంలో సాధారణ సమాజం పోషించే పాత్రను కొందరు సూచిస్తారు. మనస్సాక్షి కలిగించే వేదనను కొందరు మనం చేయాలని ఇష్టపడే దానికీ నిరంకుశ సమాజం మనల్ని చేయమని శాసించే దానికీ మధ్యగల పోరాటంకంటే ఎక్కువ కాదని భావిస్తారు!
మనస్సాక్షిని గురించిన సిద్ధాంతాలు అనేకం ఉన్నప్పటికీ, అలా చేయాలని తమ మనస్సాక్షి తమకు చెప్పింది గనుక తరచు కొంతమంది తమ తలిదండ్రులను, కుటుంబాలను మరియు యావత్ సమాజాలను ఎదిరించి నిలబడ్డారు. కొందరు తమ మనస్సాక్షి నిమిత్తం తమ జీవితాలను కూడా బలి అర్పించేందుకు ఇష్టపడ్డారు! ప్రపంచంలోని సంస్కృతులలో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, హత్య, దొంగతనం, వ్యభిచారం, అబద్ధమాడటం, వావివరుసలు తప్పి వ్యభిచరించడం వంటివి దాదాపు విశ్వవ్యాప్తంగా తప్పుగానే దృష్టించబడుతున్నాయి. మనస్సాక్షి అనేది స్వాభావికమైనదనీ, జన్మ సిద్ధమైనదనీ ఇది నిరూపించదా?
మనస్సాక్షి—బైబిలు దృక్కోణం
ఈ విషయంపై నిజమైన అధికారి యెహోవా దేవుడే. ఎంతైనా, “ఆయనే [దేవుడే] మనలను పుట్టించెను మనము ఆయన వారము.” (కీర్తన 100:3) ఆయనకు మన నిర్మాణాన్ని గురించి పూర్తిగా తెలుసు. మానవుడు దేవుని “స్వరూపమందు” నిర్మించబడ్డాడని దేవుని వాక్యమైన బైబిలు వివరిస్తుంది. (ఆదికాండము 1:26) తప్పొప్పులను యోచించగల వివేచనతో మానవుడు సృష్టించబడ్డాడు; ప్రారంభం నుండీ కూడా మనస్సాక్షి అనేది మానవుని స్వభావంలోని ఒక స్వయం సిద్ధ భాగంగా ఉంది.—ఆదికాండము 2:16, 17 పోల్చండి.
రోమీయులకు తాను వ్రాసిన లేఖలో అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాడు, ఆయనిలా వ్రాశాడు: “[దేవుని] ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” (రోమీయులు 2:14, 15) యూదులకు ఇవ్వబడిన దైవిక ధర్మశాస్త్రం క్రింద పెంచబడని అనేకులు సమాజం యొక్క వత్తిడి మూలంగా కాక “స్వాభావికముగా” దేవుని ధర్మశాస్త్రం యొక్క కొన్ని సూత్రాలను అనుసరించారనే విషయాన్ని గమనించండి!
కాబట్టి, మనస్సాక్షి అనేది ఒక భారం కాకుండా దైవిక బహుమానం, వరం అయివుంది. అది మనకు బాధను కలిగిస్తుందన్నది వాస్తవమే. అయితే, అది చెప్పేది సరిగ్గా విన్నప్పుడు, సంపూర్ణ సంతృప్తిని మరియు అంతరంగ శాంతిని అది మనకు బహుమానంగా ఇస్తుంది. అది మనకు మార్గనిర్దేశకాన్నిచ్చి, కాపాడి, పురికొల్పగలదు. ది ఇంటర్‌ప్రెటర్స్ బైబిల్ ఇలా వ్యాఖ్యానిస్తుంది: “ఒక వ్యక్తి తాను చేసే దానికి మరియు తాను చేయవలసి ఉన్నదని భావించే దానికీ మధ్యగల అఖాతాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే అతని మానసిక మరియు భావోద్రేక ఆరోగ్యం భద్రపర్చబడగలదు.” ఆ అఖాతాన్ని ఎవరైనా ఎలా పూడ్చగలరు? మన మనస్సాక్షిని మలచి, దానికి తర్ఫీదునివ్వడం సాధ్యమేనా? తదుపరి శీర్షికలో ఈ ప్రశ్నలు పరిశీలించబడతాయి.