దేవుడు కోరేవాటిని తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం
“సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.”—1 కొరింథీయులు 9:16.
1, 2. (ఎ) మనం ఏ రెండు అంశాలుగల పనిలో భాగం వహించాలని యెహోవా కోరుతున్నాడు? (బి) దేవుని రాజ్య వారసులయ్యేందుకు యథార్థవంతులైన ప్రజలు ఏమి నేర్చుకోవాలి?
యెహోవా యొద్ద మానవజాతి కొరకు సువార్త ఉంది. ఆయనకొక రాజ్యం ఉంది, ప్రతిచోటా ఉన్న ప్రజలు దాని గురించి వినాలని ఆయన అపేక్షిస్తున్నాడు! ఒకసారి మనం ఈ సువార్త గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఇతరులతో పంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండు అంశాలు గల పని. మొదటిగా, మనం దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. “యుగసమాప్తిని” గూర్చిన తన ప్రవచనంలో యేసు ఇలా చెప్పాడు: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:3, 14.
2 ఈ పని యొక్క రెండవ అంకంలో రాజ్య ప్రకటనకు అనుకూలంగా ప్రతిస్పందించే వారికి బోధించడం ఇమిడి ఉంది. యేసు తన పునరుత్థానం తర్వాత తన శిష్యుల పెద్ద గుంపుతో, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” చెప్పాడు. (మత్తయి 28:19, 20) ‘క్రీస్తు ఆజ్ఞాపించినవి’ ఆయన సొంతంగా చెప్పినవి కావు; దేవుని ఆజ్ఞలను లేక దేవుడు కోరేవాటిని చేయమని ఆయన ఇతరులకు బోధించాడు. (యోహాను 14:23, 24; 15:10) కాబట్టి, ‘క్రీస్తు ఆజ్ఞాపించినవి’ ఇతరులకు బోధించడంలో, దేవుడు కోరేవాటిని వారికి నేర్పించడం ఇమిడి ఉంటుంది. యథార్థవంతులైన ప్రజలు దేవుని రాజ్య వారసులవ్వాలంటే వారు ఆయన కోరేవాటికనుగుణంగా ఉండాలి.
3. దేవుని రాజ్యమంటే ఏమిటి, రాజ్య వర్తమానాన్ని అలాంటి సువార్తగా చేసే దేనిని అది సాధిస్తుంది?
3 దేవుని రాజ్యమంటే ఏమిటి? రాజ్య వర్తమానాన్ని అలాంటి సువార్తగా చేసే దేనిని అది సాధిస్తుంది? దేవుని రాజ్యమంటే పరలోక ప్రభుత్వం. అది యెహోవాకు ఎంతో ప్రియమైనది, ఎందుకంటే దాని ద్వారానే ఆయన తన నామంపైనున్న నిందనంతటినీ తొలగించి దాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ రాజ్యం, తన చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమిపై కూడా నెరవేరేలా చేయడానికి యెహోవా ఉపయోగించే ఉపకరణం. అందుకే, దేవుని రాజ్యం రావాలని ప్రార్థించమని యేసు మనకు నేర్పించి, దానికి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వమని పురికొల్పాడు. (మత్తయి 6:9, 10, 33) తన రాజ్యం గురించి మనం ఇతరులకు బోధించడం యెహోవాకు ఎందుకంత ప్రాముఖ్యమైనదో మీరు గ్రహించారా?
ఒక సవాలేగాని భారం కాదు
4. సువార్తను ప్రకటించాలనే మన బాధ్యత భారమైనది కాదని ఎలా వివరించవచ్చు?
4 ఈ సువార్తను ప్రకటించడం భారమైనదా? ఎంత మాత్రం కాదు! ఉదాహరించేందుకు: తన కుటుంబ వస్తుసంబంధ అవసరతలు తీర్చే బాధ్యత ఒక తండ్రికి ఉంది. అలా చేయలేక పోవడం క్రైస్తవ విశ్వాసాన్ని నిరాకరించడంతో సమానం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) కాని ఆ బాధ్యత ఒక క్రైస్తవ పురుషునికి భారమైనదా? ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తే, వారి బాగోగులు చూసుకోవాలని ఆయన కోరుకుంటాడు గనుక అది ఆయనకు భారంగా ఉండదు.
5. ప్రకటనపని మరియు శిష్యులను చేసేపని బాధ్యతలే అయినప్పటికీ, వాటిలో భాగం వహించడానికి మనం ఎందుకు ఆనందించాలి?
5 అలాగే, ప్రకటన పని మరియు శిష్యులను చేసే పని ఒక బాధ్యత, ఒక అవసరత, దానిపై మన జీవితాలే ఆధారపడి ఉన్నాయి. పౌలు దాన్ని ఈ విధంగా చెప్పాడు: “సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” (1 కొరింథీయులు 9:16; యెహెజ్కేలు 33:7-9 పోల్చండి.) అయితే, ప్రకటించడానికి మనలను పురికొల్పేది ప్రేమేగాని కేవలం కర్తవ్యం కాదు. ప్రాముఖ్యంగా మనం దేవున్ని ప్రేమిస్తాము, కాని మనం మన పొరుగువారిని కూడా ప్రేమిస్తాము, వాళ్లు సువార్తను వినడం ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. (మత్తయి 22:37-39) అది వారికి భవిష్యత్తు కొరకు ఒక నిరీక్షణను అంటే, దేవుని రాజ్యం అన్యాయాలను సరిచేస్తుందని, అణిచివేతనంతటినీ తొలగిస్తుందని, శాంతి ఐక్యతలను పునఃస్థాపిస్తుందనే నిరీక్షణను ఇస్తుంది, ఇదంతా దాని నీతియుక్తమైన పరిపాలనకు లోబడివుండేవారికి నిరంతర ఆశీర్వాదాలను తెస్తుంది. అలాంటి సువార్తను ఇతరులతో పంచుకోవడానికి మనం ఆనందించడం లేదా, అవును ఉత్తేజితులమవ్వడం లేదా?—కీర్తన 110:3.
6. ప్రకటనపని మరియు శిష్యులను చేసేపని నిజమైన సవాలును ఎందుకు ముందుంచుతాయి?
6 అదే సమయంలో, ప్రకటించడం, శిష్యులను చేయడం అనే ఈ పని నిజంగా సవాలుతో కూడినదే. ప్రజలు భిన్నంగా ఉంటారు. అందరికీ ఒకే ఆసక్తులు లేక సామర్థ్యాలు ఉండవు. కొందరు బాగా చదువుకున్నవారు, ఇతరులు అంతగా చదువుకోని వారు ఉంటారు. ఒకప్పుడు చదవడం అనేది అభిమాన కార్యంగా ఉండి, ఇప్పుడు తరచూ కష్టసాధ్యమైనదిగా దృష్టించబడుతోంది. అత్యధిక అక్షరాస్యతా రేటు ఉన్నదని గొప్పలు చెప్పుకొనే దేశాల్లో కూడా “చదవగలిగినప్పటికీ చదవడంలో ఆసక్తి లేని స్వభావం లేదా పరిస్థితి” అని నిర్వచింపబడిన పఠననిరాసక్తత పెరుగుతున్న సమస్యగానే ఉంది. మరి దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి, అలాంటి వైవిద్యంగల పూర్వాపరాలు ఆసక్తులు ఉన్న ప్రజలకు మనమెలా సహాయం చేయగలము?—1 కొరింథీయులు 9:20-23, పోల్చండి.
ఇతరులకు సహాయం చేసేందుకు సరిగా సంసిద్ధం చేయబడ్డాము
7. దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” మనల్ని ఎలా సంసిద్ధులను చేశాడు?
7 మీకు సరైన ఉపకరణాలు లేక పరికరాలు ఉంటే సవాలుతో కూడిన కార్యాన్ని సులభంగా నెరవేర్చవచ్చు. నేడు ఒక పని కొరకు తగినదైన ఉపకరణం రేపు మెరుగు చేయబడవచ్చు లేక మారుతున్న అవసరతలనుబట్టి దానికి బదులుగా మరొకటి రావచ్చు. దేవుని రాజ్య వర్తమానాన్ని ప్రకటించాలని మనకివ్వబడిన ఆజ్ఞ విషయం కూడా అంతే. సంవత్సరాల కాలంలో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” మనకు కచ్చితంగా సరైన ఉపకరణాలను అంటే గృహ బైబిలు పఠనాలను నిర్వహించడంలో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రచురణలను అందజేశాడు. (మత్తయి 24:45) అలా మనం దేవుడు కోరేవాటి గురించి ‘ప్రతి జనములోనుండి, వంశములో నుండి వచ్చిన వారికి, ఆయా భాషలు మాట్లాడే ప్రజలకు’ సహాయం చేసేందుకు మనం సంసిద్ధులమయ్యాము. (ప్రకటన 7:9) ప్రపంచ క్షేత్రంలో మారుతున్న అవసరతలను తీర్చేందుకు ఎప్పటికప్పుడు మనకు అదనపు ఉపకరణాలు అందజేయబడుతున్నాయి. కొన్ని ఉదాహరణలను మనం పరిశీలిద్దాము.
8. (ఎ) బైబిలు విద్యను వ్యాప్తిచేయడంలో “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” అనే పుస్తకం ఏ పాత్రనిర్వహించింది? (బి) 1968లో బైబిలు పఠన పని కొరకు ఏ ఉపకరణం అందజేయబడింది, అది ప్రత్యేకంగా ఎలా రూపొందించబడింది? (సి) శిష్యులను చేసే పనిలో ట్రూత్ పుస్తకం ఎలా సహాయం చేసింది?
8 “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే పుస్తకం 1946 నుండి 1968 వరకు బైబిలు విద్య కొరకు శక్తివంతమైన ఉపకరణంగా ఉపయోగించబడింది, 54 భాషల్లో దాదాపు 1,92,50,000 ప్రతులు ముద్రించబడ్డాయి. 1968లో విడుదల చేయబడిన నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం, ఆసక్తిగలవారితో బైబిలును పఠించేందుకు అనేక సంవత్సరాలపాటు ప్రభావవంతంగా ఉపయోగించబడింది. మునుపు, కొందరు సంవత్సరాల తరబడి యెహోవాసాక్షులతో పఠిస్తూ బాప్తిస్మం తీసుకోకుండా ఉండడం సర్వసాధారణమైన విషయం. కాని విద్యార్థి తాను నేర్చుకుంటున్నదాన్ని అన్వయించుకోవడాన్ని ప్రోత్సహిస్తూ, అతన్ని నిమగ్నం చేయడానికి ఈ ఉపకరణం రూపొందించబడింది. ఫలితం? యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “సెప్టెంబరు 1, 1968 మొదలుకొని ఆగస్టు 31, 1971 వరకున్న మూడు సేవా సంవత్సరాల్లో, మొత్తం 4,34,906 మంది బాప్తిస్మం తీసుకున్నారు అంటే దానికి ముందున్న మూడు సేవా సంవత్సరాల్లో బాప్తిస్మం తీసుకున్న వారి సంఖ్యకంటే రెండింతల కన్నా ఎక్కువ!” ట్రూత్ పుస్తకం విడుదలైనప్పటి నుండీ, దాని ప్రతులు ఆశ్చర్యం కలిగించే సంఖ్యల్లో, అంటే 117 భాషల్లో 10,70,00,000 కంటే ఎక్కువ ప్రతులు పంచిపెట్టబడ్డాయి.
9. నిరంతరము జీవించగలరు పుస్తకంలో ఏ ప్రత్యేకమైన అంశం ఉంది, రాజ్య ప్రచారకుల సంఖ్యలపై అది ఏ ప్రభావాన్ని చూపింది?
9 మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం 1982లో బైబిలు పఠనాలను నిర్వహించడంలో ప్రాథమిక పుస్తకంగా ఉపయోగించబడింది. ఈ ఉపకరణంలో 150 కంటే ఎక్కువ దృశ్య చిత్రాలున్నాయి, ప్రతి చిత్రం యొక్క బోధనాంశాన్ని క్లుప్తంగా ఉన్నతపరిచే అర్థవంతమైన వ్యాఖ్యానాలు వాటికున్నాయి. మన రాజ్య పరిచర్య యొక్క అక్టోబరు 1982 సంచిక ఇలా తెలియజేసింది: “‘దేవుడు సత్యవంతుడై ఉండునుగాక’ అనేది మన ప్రధాన పఠన పుస్తకంగా ఉండిన దాదాపు 20 సంవత్సరాలలో (1946 నుండి 1960వ పడి మధ్యభాగం వరకు) మన సంస్థలో 10,00,000 కంటే ఎక్కువమంది క్రొత్త రాజ్యప్రచారకులు చేర్చబడ్డారు. తర్వాత 1968లో నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం విడుదలై అది మన ప్రధాన పఠన పుస్తకంగా ఉన్నప్పుడు మరో 10,00,000 మంది ప్రచారకులు జతచేయబడ్డారు. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే మన క్రొత్త పఠన పుస్తకాన్ని ఉపయోగించి, రాజ్య ప్రచారకుల సంఖ్యల్లో మనం అలాంటి విస్తృతినే చూస్తామా? యెహోవా చిత్తం అదే అయితే, తప్పకుండా చూస్తాము!” నిజంగా యెహోవా చిత్తం అదే, ఎందుకంటే 1982 నుండి 1995 వరకు 27,00,000 కంటే ఎక్కువమంది రాజ్యప్రచారకులు చేరారు!
10. ఏ క్రొత్త ఉపకరణం 1995లో అందజేయబడింది, బైబిలు విద్యార్థులు చక్కగా శీఘ్రంగా ఆత్మీయ అభివృద్ధి చెందడానికి అది ఎందుకు సహాయం చేయాలి?
10 “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 9:37) నిజంగా కోత విస్తారమే. చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. కొన్ని దేశాల్లో ప్రజలు బైబిలు పఠనాల కొరకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సి వస్తోంది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానాన్ని త్వరగా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” 1995లో ఒక క్రొత్త ఉపకరణాన్ని అందజేశాడు, అది నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పేరుగల 192 పేజీల పుస్తకం. ఈ విలువైన ఉపకరణం అబద్ధ సిద్ధాంతాల గురించి వివరించదు. అది బైబిలు సత్యాలను అనుకూల విధానంలో అందజేస్తుంది. బైబిలు విద్యార్థులు చక్కగా, శీఘ్రంగా ఆత్మీయ అభివృద్ధి చెందడానికి అది సహాయం చేస్తుందని నిరీక్షించడం జరిగింది. 125 భాషల్లో 4,55,00,000 ప్రతులు ముద్రింపబడి, అదనంగా 21 భాషల్లోకి అనువదింపబడుతూ, జ్ఞానము పుస్తకం ప్రపంచ క్షేత్రంపై ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిస్తోంది.
11. నిరక్ష్యరాసులకు, సరిగ్గా చదవలేనివారికి బోధించడానికి సహాయపడేందుకు ఏ ప్రభావవంతమైన ఉపకరణం అందజేయబడింది, మన భూవ్యాప్త బోధనా కార్యక్రమంపై అది ఒక శక్తివంతమైన గుర్తును ఎలా వేసింది?
11 ‘నమ్మకమైన దాసుడు’ కొన్నిసార్లు, ప్రత్యేకమైన లేక పరిమితమైన ప్రజల కొరకు రూపొందించబడిన పరికరాలను అందజేశాడు. ఉదాహరణకు, తమ సాంప్రదాయ లేక మతపరమైన పూర్వరంగాలను బట్టి ప్రత్యేకమైన సహాయం అవసరమయ్యే ప్రజల మాటేమిటి? దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి మనం వారికెలా సహాయం చేయగలము? 1982లో సరిగ్గా మనకు అవసరమైనదాన్నే మనం అందుకున్నాము, అది భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే 32 పేజీల బ్రొషూరు. విస్తృతంగా చిత్రాలతో ఉన్న ఈ ప్రచురణ, నిరక్షరాస్యులకు లేక సరిగా చదవలేనివారికి బోధించడంలో ప్రభావవంతమైన పరికరంగా పని చేసింది. ఇందులో ప్రాథమిక లేఖన బోధలు ఎంతో సరళంగా, సుళువుగా అర్థం చేసుకునే విధంగా అందజేయబడ్డాయి. జీవితమును అనుభవించుము అనే ఈ బ్రొషూరు విడుదలైనప్పటి నుండి మన భూవ్యాప్త బోధనా కార్యక్రమానికి ఎంతగానో దోహదపడింది. ఇంత వరకు వాచ్‌టవర్ సంస్థ ప్రచురించినవాటన్నిటిలోకి ఎంతో విస్తృతంగా అనువదింపబడిన ప్రచురణగా దాన్ని చేస్తూ, 239 భాషల్లో 10,51,00,000 ప్రతులు ముద్రించబడ్డాయి!
12, 13. (ఎ) విస్తృతంగా వ్యాపించివున్న ప్రేక్షకులను చేరడానికి ‘నమ్మకమైన దాసుడు’ 1990 నుండి ఏ క్రొత్త మార్గాన్ని అందజేశాడు? (బి) మనం మన ప్రాంతీయ పరిచర్యలో సంస్థ యొక్క వీడియోలను ఎలా ఉపయోగించవచ్చు? (సి) శిష్యులను చేసే మన పనిలో సహాయం చేసేందుకు ఇటీవలనే ఏ క్రొత్త ఉపకరణం అందజేయబడింది?
12 విస్తృతంగా వ్యాపించివున్న ప్రేక్షకులను చేరడానికి ‘నమ్మకమైన దాసుడు’ 1990 మొదలుకొని ముద్రిత ప్రచురణలతోపాటు ఒక క్రొత్త మార్గాన్ని తెరిచే ఒక ఉపదేశ మూలాన్ని మనకు అందజేశాడు—అవే వీడియో క్యాసెట్లు. ఆ సంవత్సరం అక్టోబరులో, యెహోవాసాక్షులు—ఆ నామం వెనుకనున్న సంస్థ అనే 55 నిమిషాల వీడియో విడుదల చేయబడింది, అదే వాచ్‌టవర్ సంస్థ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి వీడియో. అందంగా జ్ఞానవంతంగా అందజేయబడిన ఈ వీడియో భూమియందంతటా సువార్త ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్న యెహోవా యొక్క సమర్పిత ప్రజల ప్రపంచవ్యాప్త సంస్థను చూపిస్తుంది, ఇది 35 భాషల్లో లభ్యమౌతోంది. శిష్యులను చేసే మన పనిలో సహాయం చేసేందుకు ఈ వీడియో ప్రత్యేకంగా రూపొందించబడింది. రాజ్య ప్రచారకులు వెంటనే ఈ క్రొత్త పరికరాన్ని ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించనారంభించారు. కొందరు దాన్ని చూపించడానికి లేక ఆసక్తిగల వారికి ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా దాన్ని తమ పుస్తకాల సంచీలో వెంట ఉంచుకునేవారు. అది విడుదల చేయబడినప్పుడు, ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా వ్రాశాడు: “లక్షలాది మంది ప్రజల మనస్సులను, హృదయాలను చేరడానికి వీడియోలు 21వ శతాబ్దపు మాధ్యమంగా తయారయ్యాయి, కాబట్టి ప్రపంచవ్యాప్త రాజ్య పనిని కొనసాగించడంలో సంస్థ ఉపయోగించే అనేక వీడియోలలో ఇది కేవలం మొదటిదై ఉండాలన్నది మా ఆశ.” వాస్తవానికి, మూడు భాగాల పరంపర అయిన బైబిలు—వాస్తవాలు మరియు ప్రవచనాలతో కూడిన పుస్తకం, నాజీ విధ్వంసదాడికి వ్యతిరేకంగా యెహోవాసాక్షుల స్థిరమైన స్థానం వంటివాటితో సహా ఎన్నో వీడియోలు అందజేయబడ్డాయి. సంస్థకు చెందిన వీడియోలు మీ భాషలో లభ్యమౌతుంటే, మీరు వాటిని మీ ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించారా?a
13 ఇటీవల ఒక క్రొత్త ఉపకరణం అంటే శిష్యులను చేసే మన పనిలో సహాయపడేందుకు, దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రొషూరు అందజేయబడింది. అదెందుకు ప్రచురించబడింది? దాన్నెలా ఉపయోగించవచ్చు?
క్రొత్త ఉపకరణాన్ని పరీక్షించడం
14, 15. దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు ఎవరి కొరకు రూపొందించబడింది, దానిలో ఏమి ఉంది?
14 దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే క్రొత్త ప్రచురణ, ఇప్పటికే దేవున్ని నమ్ముతూ బైబిలును గౌరవించే ప్రజల కొరకు రూపొందించబడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన, ఎన్నో సంవత్సరాల అనుభవంగల ప్రయాణ పైవిచారణకర్తలు అలాగే గిలియడ్ శిక్షణ పొందిన మిషనరీలు ఈ బ్రొషూరును సిద్ధం చేయడంలో తోడ్పడ్డారు. అందులో, బైబిలులోని ప్రాథమిక బోధలతోకూడిన సమగ్ర పఠనాధ్యయనం ఉంది. అందులోని పదజాలం వాత్సల్యపూరితంగా, సరళంగా, సూటిగా ఉంటుంది. అదే సమయంలో, సమాచారం మరీ సరళీకరించబడలేదు. అది కేవలం “పాలు” మాత్రమే కాదుగాని, అనేకమంది ప్రజలు అర్థం చేసుకొనగలిగేలా దేవుని వాక్యంలో నుండి “బలమైన ఆహారము”ను కూడా అందజేస్తుంది.—హెబ్రీయులు 5:12-14.
15 ఇటీవలి సంవత్సరాల్లో వివిధ దేశాలకు చెందిన రాజ్య ప్రచారకులు సరిగ్గా అలాంటి ప్రచురణ కొరకే అడిగారు. ఉదాహరణకు, పాపువా న్యూ గినియా నందలి వాచ్‌టవర్ సంస్థ బ్రాంచి ఇలా వ్రాసింది: “మతసంబంధమైన పరస్పర వ్యతిరేక బోధలను బట్టి ప్రజలు అయోమయంలో ఉన్నారు. వారు తమ సొంత బైబిళ్లలో చూసుకొనగలిగేలా అనేక బైబిలు లేఖనాల మద్దతువున్న సత్యం యొక్క కచ్చితమైన వ్యాఖ్యానాలు వారికి అవసరం. నిజ క్రైస్తవుల నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు, ఆయనకు ఏ ఆచారాలు అలవాట్లు అనంగీకారమైనవి అనేవాటి గురించి వారికి స్పష్టమైన, ప్రత్యేకమైన వివరణ అవసరం.” దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి అలాంటి వారికి సహాయం చేసేందుకు మనకు సరిగ్గా అవసరమైనదే దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు.
16. (ఎ) క్రొత్త బ్రొషూరులోని సరళమైన వివరణల నుండి ప్రాముఖ్యంగా ఎవరు ప్రయోజనం పొందవచ్చు? (బి) మీ ప్రాంతంలోనివారు దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు నుండి ఎలా ప్రయోజనం పొందగలరు?
16 మీరు ఈ క్రొత్త పరికరాన్ని ఎలా ఉపయోగించవచ్చు? మొదటిగా, చదవడం కష్టమైనవారితో లేక చదవాలనే ఇష్టంలేనివారితో పఠించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.b అలాంటి వ్యక్తులు బ్రొషూరులోని సరళమైన వివరణల నుండి ప్రయోజనం పొందవచ్చు. విడుదల చేయకముందు పంపబడిన ఈ ప్రచురణ యొక్క ఒక ప్రతిని పునఃసమీక్షించిన తర్వాత, వాచ్‌టవర్ బ్రాంచీలు ఇలా వ్రాశాయి: “ఎక్కువగా చదవడాన్ని ఇష్టపడని ప్రజలున్న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ బ్రొషూరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.” (బ్రెజిల్) “తమ మాతృభాషను చదవలేని మరియు ఫ్రెంచి చదవడం ఇప్పటికీ కష్టంగా ఉన్న అనేకమంది ప్రవాసులు ఉన్నారు. అలాంటివారితో పఠించడానికి ఈ బ్రొషూరును ఒక సహాయకంగా ఉపయోగించవచ్చు.” (ఫ్రాన్స్) దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు నుండి ప్రయోజనం పొందగల వారెవరైనా మీ ప్రాంతంలో ఉన్నారేమో మీరు గుర్తు తెచ్చుకోగలరా?
17. ఈ క్రొత్త బ్రొషూరు అనేక దేశాల్లో ఎలా ప్రయోజనకరంగా ఉండగలదు, ఎందుకు?
17 రెండవదిగా, అనేక దేశాల్లో ప్రజలు ఎంత చదువుకున్నవారైనా వారు దైవభయంగల వారైతే వారితో బైబిలు పఠనాలు ప్రారంభించడానికి ఈ బ్రొషూరు ఉపయోగకరంగా ఉండగలదు. అయితే, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో పఠనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలి. కాని కొన్ని సందర్భాల్లో బ్రొషూరులో నుండి పఠనాన్ని ప్రారంభించడం సుళువుగా ఉండవచ్చు. తర్వాత సముచితమైన సమయంలో, పఠనాన్ని జ్ఞానము పుస్తకానికి మార్చుకోవాలి, అదే మన ప్రాథమిక మరియు శ్రేష్ఠమైన పఠన సహాయకం. దేవుడు కోరుతున్నాడు అనే ఈ బ్రొషూరు ఉపయోగం గురించి, వాచ్‌టవర్ బ్రాంచీలు ఇలా వ్రాశాయి: “బైబిలు పఠనాలను ప్రారంభించడం కష్టమే, ప్రచారకులు బ్రొషూరు నుండి ప్రారంభిస్తే క్రొత్త పఠనాలను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.” (జర్మనీ) “క్రొత్త బైబిలు పఠనాలను ప్రారంభించడంలో ఈ విధమైన బ్రొషూరు ఎంతో ప్రభావవంతంగా ఉండగలదు, వాటిని ఆ తర్వాత జ్ఞానము పుస్తకంతో కొనసాగించవచ్చు.” (ఇటలీ) “జపానీయులు మంచి విద్యావంతులైనప్పటికీ, అనేకులకు బైబిలు గురించి దాని ప్రాథమిక బోధల గురించి పరిమితమైన జ్ఞానము మాత్రమే ఉంది. ఈ బ్రొషూరు జ్ఞానము పుస్తకానికి ఒక చక్కని మెట్టుగా పనిచేయాలి.”—జపాన్.
18. దేవుడు కోరేవాటికి సరితూగడం గురించి మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి?
18 ప్రపంచమంతటా ఉన్న సంస్థ యొక్క బ్రాంచీలు ఈ బ్రొషూరు కొరకు విజ్ఞప్తి చేశాయి, దాన్ని 221 భాషల్లోకి అనువదించడానికి అనుమతించడం జరిగింది. యెహోవా దేవుడు వారి నుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు మనకు తోడ్పడడంలో ఈ క్రొత్త ప్రచురణ విలువైనదిగా నిరూపించబడాలి. మన వంతుగా, ప్రకటించి శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞతోసహా దేవుడు కోరేవాటికి సరితూగడం యెహోవాను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు చూపించడానికి మనకు ఒక అమూల్యమైన అవకాశాన్ని ఇస్తుందని జ్ఞాపకముంచుకుందాము. అవును, దేవుడు మన నుండి కోరేది భారమైనది కాదు. అది శ్రేష్ఠమైన జీవన మార్గం!—కీర్తన 19:7-11.
[అధస్సూచీలు]
a యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు అనే పుస్తకం ఇలా చెబుతుంది: “వీడియో క్యాసెట్లు ముద్రిత పేజీల లేక వ్యక్తిగత సాక్ష్యం యొక్క స్థానాన్ని ఎంతమాత్రం తీసుకోలేవు. సువార్తను వ్యాప్తి చేయడంలో సంస్థ ప్రచురణలు ప్రముఖ పాత్ర వహించడంలో కొనసాగుతాయి. యెహోవాసాక్షుల ఇంటింటి ప్రకటనాపని వారి పరిచర్యలో సుస్థిరమైన లేఖనాధారం గల అంశంగానే మిగిలి ఉంటుంది. అయితే, యెహోవా యొక్క అమూల్యమైన వాగ్దానాలలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, మన కాలంలో ఆయన భూమిపై చేస్తున్నదాని ఎడల మెప్పును కలిగించడానికి వీడియో క్యాసెట్లు విలువైన పరికరాలుగా ఇప్పుడు వీటికి అదనపు సహాయకాలుగా ఉంటాయి.”
b దేవుడు కోరుతున్నాడు బ్రొషూరుతో పఠనాన్ని ఎలా నిర్వహించాలనేదాని గూర్చిన వివరణ కొరకు, 16-17 పేజీలలో గల, “దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేసేందుకు ఒక క్రొత్త ఉపకరణం” అనే శీర్షికను చూడండి.
మీరు వివరించగలరా?
◻ రెండు అంశాలుగల ఏ పనిలో తన సేవకులు భాగం వహించాలని యెహోవా అపేక్షిస్తున్నాడు?
◻ ప్రకటించే మరియు శిష్యులను చేసే మన బాధ్యత మనకు ఎందుకు భారమైనది కాదు?
◻ ప్రకటించే మరియు శిష్యులను చేసే మన పనిలో ఉపయోగించడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఏ ఉపకరణాలను అందజేశాడు?
◻ దేవుడు కోరుతున్నాడు బ్రొషూరు ఎవరి కొరకు రూపొందించబడింది, మనం దాన్ని మన పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చు?
[24వ పేజీలోని చిత్రం]
ప్రకటించడానికి, శిష్యులను చేయడానికి మనకప్పగించబడిన పని భారమైనది కాదు
[26వ పేజీలోని చిత్రం]
“దేవుడు సత్యవంతుడై ఉండును గాక” (1946, 1952లో సవరించబడింది): 54 భాషల్లో, 1,92,46,710 ప్రతులు (ఆంగ్లం చూపించబడింది)
“నిత్యజీవమునకు నడుపు సత్యము” (1968): 117 భాషల్లో, 10,70,00,000 ప్రతులు (ఫ్రెంచి చూపించ బడింది)
“మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించ గలరు” (1982): 130 భాషల్లో 8,09,00,000 ప్రతులు (రష్యన్ చూపించ బడింది)
“నిత్యజీవానికి నడిపించే జ్ఞానము” (1995): 125 భాషల్లో, 4,55,00,000 ప్రతులు (జర్మన్ చూపించబడింది)