కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/1 పేజీలు 4-7
  • దేవుడు మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక ప్రాచీన ఉదాహరణ
  • యెహోవా మిమ్మల్ని ఆకర్షించాడు
  • యేసు చేసిన అద్భుతాలు
  • యెహోవా ఫలము దయచేయువాడగుట
  • యెహోవా మీపట్ల శ్రద్ధ కలిగివున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/1 పేజీలు 4-7

దేవుడు మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడు

నలభైయవ పడిలోవున్న క్రైస్తవ స్త్రీయైన మేరీ, తన జీవితంలో ఎంతో బాధ అనుభవించింది. ఒక దశాబ్దం క్రితం ఆమె భర్త వ్యభిచారం మూలంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, తన నలుగురు పిల్లల ఎడల ఒంటరి తల్లిగా తన పాత్రను నిర్వర్తించడానికి మేరీ ఎంతో పోరాడింది. కాని ఆమె ఇప్పటికీ ఒంటరిదే, ఒక్కోసారి ఒంటరితనం భరించలేనిదిగా అనిపిస్తుంది. ‘అంటే నా గురించి, తండ్రిలేని నా పిల్లల గురించి దేవుడు శ్రద్ధ కల్గిలేడని దీని భావమా?’ అని మేరీ ఆలోచిస్తుంటుంది.

మీరు అలాంటి వేదననే అనుభవించినా అనుభవించకపోయినా, మేరీ భావాలతో మీరూ తప్పకుండా సహానుభూతి కల్గివుంటారు. మనమందరం కష్టతరమైన పరిస్థితులను సహించాము, యెహోవా మన కొరకు ఎప్పుడు, ఎలా చర్య తీసుకుంటాడా అని మనం ఆలోచించి ఉండవచ్చు. ఈ అనుభవాల్లో కొన్ని, మనం దేవుని కట్టడలను హత్తుకొని ఉండడం యొక్క సూటీయైన ఫలితమే. (మత్తయి 10:16-18; అపొస్తలుల కార్యములు 5:29) మిగతావి, సాతానుచే పరిపాలింపబడుతున్న లోకంలో మనం అపరిపూర్ణ మానవులుగా జీవిస్తున్న దాని పరిణామమే. (1 యోహాను 5:19) “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచున్నదని” అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—రోమీయులు 8:22.

అయితే, మీరు ఒక కష్టతరమైన శ్రమను అనుభవిస్తున్నారన్న వాస్తవం యొక్క భావం యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టాడని లేక మీ యోగక్షేమాల్లో ఆసక్తి కలిగిలేడని కాదు. దీని గురించి మీరు ఎలా నిశ్చయత కలిగివుండవచ్చు? దేవుడు మీ గురించి శ్రద్ధ కల్గివున్నాడని ఏది చూపిస్తుంది?

ఒక ప్రాచీన ఉదాహరణ

వ్యక్తులుగా ప్రజల ఎడల యెహోవా కల్గివున్న శ్రద్ధను గూర్చిన స్పష్టమైన రుజువును బైబిలు అందజేస్తోంది. దావీదును పరిశీలించండి. యౌవనస్థుడైన ఈ గొఱ్ఱెల కాపరి విషయంలో యెహోవా వ్యక్తిగతమైన శ్రద్ధ కల్గివుండి, “తన చిత్తానుసారమైన మనస్సుగల” వానిగా ఆయనను కనుగొన్నాడు. (1 సమూయేలు 13:14) ఆ తర్వాత, దావీదు రాజుగా పరిపాలించేటప్పుడు, “నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా” ఉంటానని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడు.—2 సమూయేలు 7:9.

అంటే దీని భావం దావీదు ఏ బాధా లేకుండా “కష్టాలు లేని” జీవితాన్ని గడిపాడనా? కాదు, తన పరిపాలనకు ముందు మరియు పరిపాలనా కాలంలోనూ దావీదు కష్టతరమైన శ్రమలను ఎదుర్కొన్నాడు. రాజు కాకముందు అనేక సంవత్సరాలు ఆయన అతిక్రూరమైన రాజగు సౌలుచే ఎడతెగక తరుమబడ్డాడు. దావీదు తన జీవితంలోని ఈ కాలంలో, ఇలా వ్రాశాడు: ‘నా ప్రాణము సింహములమధ్య, కోపోద్రేకుల మధ్య నున్నది. వారి దంతములు శూలములు అవి అంబులు.’—కీర్తన 57:4.

అయినప్పటికీ, ఈ కష్టమంతటిలో దావీదు యెహోవా చూపిన వ్యక్తిగత శ్రద్ధ గురించి ఒప్పించబడ్డాడు. యెహోవాకు తాను చేసిన ప్రార్థనలో ఆయన ఇలా ప్రకటించాడు. “నా సంచారములను నీవు లెక్కించి యున్నావు.” అవును, బాధనంతటినీ యెహోవా వ్రాసి ఉంచాడని దావీదు ఉద్దేశం. తర్వాత దావీదు ఇలా జతచేశాడు: “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి. అవి నీ కవిలెలో కనబడును గదా?”a (కీర్తన 56:8) ఈ ఉపమానం ద్వారా, కేవలం పరిస్థితి గురించే కాదు అది భావోద్రేకాలపై చూపే ప్రభావం గురించి కూడా యెహోవాకు తెలుసన్న నిశ్చయతను దావీదు వ్యక్తపర్చాడు.

తన జీవితావసాన దశలో, వ్యక్తిగత అనుభవం ద్వారా దావీదు ఇలా వ్రాయగలిగాడు: “ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.” (కీర్తన 37:23, 24) మీ శ్రమలు ఎడతెగనివి, కొనసాగేవి అయినప్పటికీ యెహోవా మీ సహనాన్ని గమనిస్తాడని, దాన్ని విలువైనదిగా ఎంచుతాడని మీరు కూడా నిశ్చయత కలిగివుండవచ్చు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.

అంతేగాక, మీ మార్గంలో ఏ అడ్డంకు వచ్చినా సహించడానికి మీకు కావలసిన బలాన్నివ్వడం ద్వారా యెహోవా మీ పక్షంగా చర్య తీసుకోగలడు. దావీదు ఇలా వ్రాశాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:19) వాస్తవానికి, యెహోవా కనుదృష్టి “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై . . . లోకమందంతట సంచారము చేయుచున్నది” అని బైబిలు మనకు తెలియజేస్తుంది.—2 దినవృత్తాంతములు 16:9.

యెహోవా మిమ్మల్ని ఆకర్షించాడు

యెహోవా యొక్క వ్యక్తిగత శ్రద్ధను గురించిన అదనపు రుజువును యేసు మాటల్లో కనుగొనవచ్చు. ఆయనిలా చెప్పాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) అవును, క్రీస్తు బలి ప్రయోజనాల నుండి మేలు పొందడానికి యెహోవా ప్రజలకు వ్యక్తిగతంగా సహాయం చేస్తాడు. ఎలా? చాలా మేరకు, రాజ్య ప్రకటన పని ద్వారా అలా చేస్తాడు. నిజమే, ఈ పని “సకల జనములకు సాక్ష్యార్థం”గా ఉంటుంది, అయినప్పటికీ అది వ్యక్తిగత ప్రాతిపాదికపై ప్రజలను చేరుతుంది. సువార్త వర్తమానాన్ని మీరు విని ప్రతిస్పందించడమన్న వాస్తవం, మీ ఎడల యెహోవాకున్న వ్యక్తిగతమైన శ్రద్ధకు నిదర్శనం.—మత్తయి 24:14.

యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తులను తన కుమారునివైపు, నిత్య జీవ నిరీక్షణవైపు కూడా ఆకర్షిస్తాడు. వారసత్వంగా వచ్చిన పరిమితులూ అపరిపూర్ణతలు ఏవైనా ఉన్నప్పటికీ, ఆత్మీయ సత్యాలను గ్రహించి, అన్వయించుకోవడానికి ఇది ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది. నిజంగా, దేవుని ఆత్మ యొక్క సహాయం లేకుండా ఒకరు దేవుని సంకల్పాలను అర్థం చేసుకోలేరు. (1 కొరింథీయులు 2:11, 12) పౌలు థెస్సలొనీకయులకు వ్రాసినట్లుగా, “విశ్వాసము అందరికి లేదు.” (2 థెస్సలొనీకయులు 3:2) యెహోవాచే ఆకర్షించబడడానికి ఇష్టాన్ని చూపించేవారికే ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తాడు.

యెహోవా ప్రజలను ఎందుకు ఆకర్షిస్తాడంటే, వ్యక్తులుగా వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, వారు రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. యెహోవా వ్యక్తిగత శ్రద్ధను గూర్చిన ఎంతటి దృఢమైన నిదర్శనం! “ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు” అని యేసు చెప్పాడు. (మత్తయి 18:14) అవును, దేవుని దృష్టికి ప్రతి మనిషి ఒక విశేషమైన వ్యక్తిగా ప్రాముఖ్యమే. అందుకే పౌలు ఇలా వ్రాయగలిగాడు: “ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.” (రోమీయులు 2:6) మరియు అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని [వ్యక్తిని] ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

యేసు చేసిన అద్భుతాలు

మానవుల ఎడల దేవునికున్న వ్యక్తిగత శ్రద్ధ ఆయన కుమారుడైన యేసు చేసిన అద్భుతాల్లో మనస్సును కరిగించేరీతిగా ప్రదర్శించబడింది. ఈ స్వస్థతల వెంట ప్రగాఢమైన భావాలున్నాయి. (మార్కు 1:40, 41) యేసు, “తండ్రి యేది చేయుట . . . చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు” గనుక ఆయన చూపించిన కరుణ, తన సేవకులలో ప్రతి ఒక్కరి ఎడల యెహోవాకున్న ప్రేమపూర్వక శ్రద్ధను తెలియజేస్తుంది.—యోహాను 5:19.

మార్కు 7:31-37 నందు వ్రాయబడివున్న, యేసు చేసిన ఒక అద్భుతాన్ని గూర్చిన వృత్తాంతాన్ని పరిశీలించండి. ఇక్కడ యేసు చెవుడు మరియు నత్తి గల ఒక వ్యక్తిని స్వస్థపర్చాడు. ఆయన, “సమూహములోనుండి . . . [ఆ వ్యక్తిని] ఏకాంతమునకు తోడుకొని” పోయాడని బైబిలు తెలియజేస్తోంది. ఆ తర్వాత, “ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి—ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.”

యేసు ఈ వ్యక్తిని సమూహములో నుండి దూరంగా ఎందుకు తీసుకువెళ్లాడు? బహుశా చెవుడుగలిగి, అతి కష్టంతో మాట్లాడగల ఆ వ్యక్తి, చూసేవారి ఎదుట ఇబ్బందిగా భావించవచ్చు. యేసు ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందిని గమనించి, అతనిని ఏకాంతంలో స్వస్థపర్చాడు. ఒక బైబిలు పండితుడు ఇలా తెలియజేస్తున్నాడు: “ఈ కథంతా కూడా యేసు ఆ మనిషిని కేవలం ఒక రోగి వలె పరిగణించలేదని మనకు ఎంతో స్పష్టంగా చూపిస్తుంది; ఆయన అతనిని ఒక వ్యక్తి వలె పరిగణించాడు. ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన అవసరత ఒక ప్రత్యేకమైన సమస్య ఉన్నాయి, అతని భావాలు దెబ్బతినని విధంగా, అతడు అర్థం చేసుకొనదగినట్లుగా, యేసు అతనితో ఎంతో వాత్సల్యపూరితమైన శ్రద్ధతో వ్యవహరించాడు.”

యేసుకు ప్రజల గురించి వ్యక్తిగత శ్రద్ధ ఉండేదని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆయన మీ గురించి కూడా అంతే శ్రద్ధ కలిగివున్నాడని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు. నిజమే ఆయన బలి మరణం, విమోచన పొందదగిన మానవజాతితో కూడిన మొత్తం ప్రపంచం ఎడల ప్రేమ యొక్క వ్యక్తీకరణ అయ్యుంది. అయినా, మీరు ఆ చర్యను పౌలు వలె వ్యక్తిగతంగా తీసుకోవచ్చు, ఆయనిలా వ్రాశాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.’ (గలతీయులు 2:20) “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని యేసు చెప్పాడు గనుక, యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి గురించి ఒకేలాంటి శ్రద్ధను కల్గివున్నాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—యోహాను 14:9.

యెహోవా ఫలము దయచేయువాడగుట

దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందడంలో, బైబిలునందు తెలియపర్చబడినట్లుగా ఆయన వ్యక్తిత్వం యొక్క ప్రతి కోణాన్ని తెలుసుకోవడం ఇమిడి ఉంది. యెహోవా అనే నామం యొక్క భావం “తానే కర్త అవుతాడు,” అంటే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి యెహోవా తాను ఏమి కాదలచుకుంటే అది కాగలడని ఇది సూచిస్తుంది. చరిత్రంతటిలో ఆయన అనేక పాత్రలు నిర్వహించాడు. వాటిలో సృష్టికర్త, తండ్రి, సర్వోన్నత ప్రభువు, కాపరి, సైన్యములకధిపతియగు యెహోవా, ప్రార్థనాలకించువాడు, న్యాయాధిపతి, గొప్ప ఉపదేశకుడు, విమోచకుడు వంటివి కూడా ఇమిడి ఉన్నాయి.b

దేవుని నామం యొక్క పూర్తి భావాన్ని గుణగ్రహించాలంటే, ఫలము దయచేయువానిగా యెహోవా పాత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి. పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”—హెబ్రీయులు 11:6.

నేడు తనను పూర్ణహృదయముతో సేవించడాన్ని ఎన్నుకొనే వారికి యెహోవా పరదైసు భూమిపై నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఆ గొప్ప వాగ్దానం నెరవేరడం కొరకు ఎదురు చూడడం స్వార్థమూ కాదు, తాము అక్కడ జీవిస్తున్నట్లు ఊహించుకోవడం అహంకారమూ కాదు. మోషే “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.” (హెబ్రీయులు 11:26) అలాగే పౌలు, విశ్వాసులైన అభిషిక్త క్రైస్తవుల కొరకు చేయబడిన దేవుని వాగ్దాన నెరవేర్పు కోసం ఆతురతతో ఎదురు చూశాడు. ఆయనిలా వ్రాశాడు: “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.”—ఫిలిప్పీయులు 3:14.

సహించేవారి కొరకు యెహోవా వాగ్దానం చేస్తున్న ప్రతిఫలం కోసం మీరు కూడా ఎదురుచూడవచ్చు. ఆ ప్రతిఫలం కొరకు నిరీక్షించడం, దేవుని గూర్చిన మీ జ్ఞానంలో మరియు ఆయన సేవలోని మీ సహనంలో ఒక సమగ్రమైన భాగమై ఉంది. కాబట్టి యెహోవా మీకు ఇవ్వబోయే ఆశీర్వాదాల గురించి ప్రతిరోజూ ధ్యానించండి. శీర్షికారంభంలో ప్రస్తావించబడిన మేరీ, ఇది చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేసింది. ఆమె ఇలా చెబుతుంది: “యేసు యొక్క విమోచనా క్రయధన బలి నాకు అన్వయిస్తుందని నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఇటీవలనే అంగీకరించాను. ఒక వ్యక్తిగా యెహోవా నా ఎడల శ్రద్ధ కలిగివున్నాడని నేను భావించడం మొదలుపెడుతున్నాను. నేను ఇరవై ఏళ్లకు పైగా క్రైస్తవురాలిగా ఉన్నాను, కాని కేవలం ఇటీవలనే నేను దీన్ని విశ్వసించడం నిజంగా మొదలుపెట్టాను.”

యెహోవా తన ప్రజల గురించి ఒక గుంపుగా మాత్రమే కాదు వ్యక్తులుగా కూడా శ్రద్ధ తీసుకుంటాడని లక్షలాదిమంది ఇతరులతోపాటు మేరీ కూడా, బైబిలును పఠించడం మరియు హృదయపూర్వకంగా ధ్యానించడం ద్వారా తెలుసుకుంటోంది. అపొస్తలుడైన పౌలు దీని గురించి ఎంతగా ఒప్పించబడ్డాడంటే, ఆయన ఇలా వ్రాశాడు: “ఆయన [దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:7) అవును, దేవుడు వీ గురించి శ్రద్ధ కల్గివున్నాడు!

[అధస్సూచీలు]

a బుడ్డి అంటే నీళ్లు, నూనె, పాలు, ద్రాక్షారసము, వెన్న మరియు జున్ను వంటివి పోసి ఉంచుకోవడానికి జంతుచర్మంతో చేయబడిన పాత్ర. ప్రాచీన కాలంలోని సీసాలు ఎంతో విభిన్నమైన పరిమాణాలు, ఆకారాలు కలిగి ఉండేవి, వాటిలో కొన్ని చర్మంతో చేయబడిన సంచులు, ఇతరమైనవి చిన్న మూతిగలిగి మూతలున్న పాత్రలు.

b న్యాయాధిపతులు 11:27; కీర్తన 23:1; 65:2; 73:28; 89:26; యెషయా 8:13; 30:20; 40:28; 41:14 చూడండి. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన పరిశుద్ధ లేఖనముల నతన లోక అనువాదము—రెఫరెన్సులతో కడినది అనుబంధం 1జె, పేజీ 1568 కూడా చూడండి.

[6వ పేజీలోని బాక్సు]

పునరుత్థానం—దేవుడు శ్రద్ధ కల్గివున్నాడనటానికి నిదర్శనం

ప్రతి వ్యక్తి గురించి దేవునికి గల ఆసక్తి యొక్క ఒప్పింపజేసే రుజువు బైబిలులో యోహాను 5:28, 29 నందు కనిపిస్తుంది: “ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు యొక్క] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”

ఆసక్తికరంగా, ఇక్కడ టాʹఫోస్‌ (సమాధి) బదులు మ్నె·మిʹన్‌ (జ్ఞాపకార్థ సమాధి) అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. టాʹఫోస్‌ అనే పదం కేవలం భూస్థాపనం అనే తలంపునిస్తుంది. కాని మరణించిన వ్యక్తి యొక్క జీవన విధానం గుర్తుంచుకోబడుతుందని మ్నె·మిʹన్‌ సూచిస్తుంది.

ఈ విషయంలో, పునరుత్థానం చేయాలంటే యెహోవా దేవుడు ఏమి చేయవలసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా తిరిగి జీవానికి తేవాలంటే, ఆయన ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్కటి అంటే అతడు లేక ఆమె వారసత్వంగా పొందిన గుణాలు, పూర్తి జ్ఞాపకంతో సహా తెలుసుకొని ఉండాలి. అలాగైతేనే ఆ వ్యక్తి అదే గుర్తింపుతో తిరిగి జీవానికి తేబడతాడు.

అయితే, మానవ దృక్కోణం నుండి ఇది అసాధ్యమే కాని “దేవునికి అసాధ్యము కాదు.” (మార్కు 10:27) ఒక వ్యక్తి హృదయంలో ఏముందో కూడా ఆయన గుర్తించగలడు. ఒక వ్యక్తి అనేక శతాబ్దాల క్రితం మరణించినప్పటికీ, అతనిని గూర్చిన దేవుని జ్ఞాపకం విఫలమవ్వదు; అది చెరిగిపోదు. (యోబు 14:13-15) అందుకే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల గురించి ప్రస్తావిస్తూ వాళ్లు మరణించి శతాబ్దాలు గడచిన తర్వాత కూడా, యెహోవా “సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని” యేసు చెప్పగలిగాడు.—ఇటాలిక్కులు మావి, లూకా 20:38.

కాబట్టి, మరణించిన కోటానుకోట్లమంది యెహోవా దేవుని జ్ఞాపకంలో పూర్తి వివరాలతో ఉన్నారు. దేవుడు మానవుల గురించి వ్యక్తిగత ప్రాతిపాదిక మీద శ్రద్ధ కల్గివున్నాడనడానికి ఎంతటి ఆశ్చర్యం కలుగజేసే నిదర్శనం!

[7వ పేజీలోని చిత్రం]

యేసు తాను స్వస్థపర్చిన వారి విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి