కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/15 పేజీలు 22-25
  • అపాయం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపాయం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రమాదంలో జీవించిన ఓ వ్యక్తి
  • అపాయకర పరిస్థితులనుండి దూరంగా ఉండడం
  • ప్రమాదంనుండి విడిపించుకోవడం, తప్పించుకోవడం
  • లోతు భార్య వెనక్కి చూడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • లోతు భార్యను గుర్తుపెట్టుకోండి
    నా బైబిలు పుస్తకం
  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఒత్తిడిని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/15 పేజీలు 22-25

అపాయం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి

నావికులకన్నా అపాయానికి అప్రమత్తంగా ఉండగల వ్యక్తులు చాలా తక్కువ. వాతావరణం, కెరటాలు, తమ ఓడ తీరానికి ఎంత దూరంగా ఉంది అన్న విషయాలను గూర్చి వారు అప్రమత్తంగా ఉండాలి. కెరటాలూ గాలులూ కూడి ఓడను తీరంవైపుకు నెట్టే పరిస్థితి వచ్చినప్పుడు, నావికులు చాలా కష్టాన్ని, అపాయాన్ని ఎదుర్కొంటారు.

కెరటారలూ గాలులూ కూడి ఓడను తీరంవైపు నెట్టే ఈ పరిస్థితుల్లో—ముఖ్యంగా ఓడ తెరచాపలతో నడుస్తున్నట్లైతే, ఒక నావికుడు తన నౌకకూ తీరానికి తగినంత దూరం ఉన్నదో లేదో చూసుకుంటాడు. ‘ఒక నావికునికి, కెరటాలు గాలులూ కూడి ఓడను తీరంవైపు నెట్టే తుఫానులో చిక్కుకోవడంకన్నా అతి దుర్భర స్థితి బహుశ మరొకటుండదేమో’ అని నావికారంగానికి సంబంధించిన ఒక పత్రిక చెబుతోంది. దానికి యివ్వబడిన పరిష్కారమేంటి? ‘మీ నౌకను ఎన్నడు అటువంటి అపాయంలో చిక్కుకోనివ్వకండి.’ ఇసుక తీరాన గానీ లేక రాతి తీరాన గానీ ఓడను కూరుకుపోనివ్వకుండా చూడాలంటే, అపాయం నుండి దూరంగా ఉండడం మంచిది.

క్రైస్తవులు తమ విశ్వాసమనే ఓడ బద్దలు కాకుండా అపాయాల సూచనను పసిగట్టగల్గాలి. (1 తిమోతి 1:19) ఒక చక్కని జీవితాన్ని గడపడానికి ఈనాటి పరిస్థితులు, అనుకూలంగా లేవు. గాలులూ కెరటాల మూలంగా ఒక ఓడ ఎలా దారి మళ్లిపోగలదో, అలాగే మన అపరిపూర్ణ శరీరమందలి ఎడతెగని పోరాటం వల్ల, పెనుతుఫానులా మనపై నిర్విరామంగా విరుచుకుపడుతున్న లోకాత్మ వల్ల—మన సమర్పిత జీవితాలు కూడా పెడదారి పట్టగలవు.

ప్రమాదంలో జీవించిన ఓ వ్యక్తి

ప్రమాదకరమైన ఆత్మీయ నీటిలో అనాలోచితంగా చిక్కుకోవడం ఎంత సులభమో!

చుట్టూ భూమి ఉన్న మృత సముద్రంవద్ద సంభవించిన ఒక ఉదాహరణను పరిశీలించండి. మేము లోతు ఉదాహరణను సూచిస్తున్నాం. సొదొమ నందు నివసించాలన్న అతని నిర్ణయం అతనికి అనేక సమస్యలను, ఎంతో దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. వారివారి పశువులకాపరుల మధ్య కొట్లాట చెలరేగినప్పుడు అబ్రాహాము, లోతు వేర్వేరు ప్రాంతాల్లో జీవించడానికి అంగీకరించారు. మనకు తెలిసినట్లుగా లోతు, యొర్దాను జిల్లాను ఎన్నుకుని, ఆ జిల్లా నందున్న పట్టణాల్లో ఒకదానియందు తన శిబిరాన్ని వేసుకున్నాడు. ఆ తర్వాత, సొదొమ ప్రజల జీవిత విధానం అతన్ని కలవరపర్చినప్పటికి ఆయన ఆ పట్టణంలో నివసించాలని నిర్ణయించుకున్నాడు.—ఆదికాండము 13:5-13; 2 పేతురు 2:8.

యెహోవాను ఎంతగానో బాధపెట్టి, చుట్టుప్రక్కల నివసించే ప్రజలు ఆర్తనాదాలు చేసేటట్లు చేసిన ఆ పేరుమోసిన అవినీతికరమైన పట్టణంలోనే లోతు ఎందుకు నివసిస్తూవచ్చాడు? సొదొమ ఎంతగానో వర్ధిల్లుతున్న ప్రాంతం గనుక నిస్సందేహంగా లోతు, అతని భార్య ఆ పట్టణంలోని వస్తుసంబంధ ప్రయోజనాలను అనుభవించి ఉండవచ్చు. (యెహెజ్కేలు 16:49, 50) బహుశ లోతు కూడా సొదొమ యొక్క వర్ధిల్లుతున్న ఆర్థిక స్థితికి ఆకర్షితుడయ్యుంటాడు. ఆయన ఆ ప్రాంతంలో నివసించడానికి కారణమేమైనప్పటికి, ఆయన దాన్ని విడిచి వెళ్లినదానికంటె యింకా ముందే అక్కడనుండి వెళ్లాల్సింది. యెహోవా దూతలు తొందరపెట్టి బలవంతపెట్టినందుకే లోతు కుటుంబం ఆ అపాయకర ప్రాంతాన్ని విడిచారు.

ఆదికాండములోని వృత్తాంతం యిలా అంటోంది: “తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి—‘లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని’ చెప్పిరి. ఆతురతతో కూడిన ఆ హెచ్చరిక విని కూడా లోతు “తడవు చేసెను.” చివరికి ఆ దూతలు “అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి.”—ఆదికాండము 19:15, 16.

పట్టణ వెలుపల, దూతలు లోతు కుటుంబానికి కొన్ని చివరి ఉపదేశాలను యిచ్చారు: “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్ము!” (ఆదికాండము 19:17) అయినప్పటికి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి బదులుగా ప్రక్కనున్న సోయరు అనే ఊరికి పోవడానికి అనుమతించమని లోతు ప్రాధేయపడ్డాడు. (ఆదికాండము 19:18-22) స్పష్టంగా, ప్రమాదంనుండి వీలైనంత ఎడముంచుకోడానికి లోతు యిష్టపడలేదు.

సోయరుకు వెళ్లే దారిలో, లోతు భార్య తాను విడిచి వచ్చిన వస్తువులపై మక్కువతో వెనక్కి తిరిగి సొదొమ వైపు చూసింది. దూతల ఉపదేశాన్ని లక్ష్యపెట్టకపోవడం వల్ల ఆమె తన ప్రాణాన్ని కోల్పోయింది. నీతిమంతుడైన లోతు, తన యిద్దరు కుమార్తెలతో ఆ పట్టణ నాశనం నుండి తప్పించుకున్నాడు. కానీ అపాయానికి సమీపంలో జీవించడానికి ఎంచుకోవడంవల్ల ఆయన ఎంత గొప్ప మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందో!—ఆదికాండము 19:18-26; 2 పేతురు 2:7.

అపాయకర పరిస్థితులనుండి దూరంగా ఉండడం

ఒకవేళ మనం అపాయకర పరిస్థితులకు దగ్గిర ఉంటే లేక దానిలో నుండి బయటకు రావడానికి ఆలస్యం చేస్తే ఏమి జరుగుతుందో లోతు అనుభవం చూపుతోంది. మంచి నావికునిలా మనం ఎన్నడూ అలాంటి అపాయంలో పడిపోవడానికి అనుమతించకూడదని యీ నివేదిక చెబుతుంది. అపాయంనుండి మనం తప్పించుకోవాల్సిన కొన్ని ప్రమాదకర విషయాలేవి? వ్యాపార వ్యవహారాల్లో ఎక్కువగా నిమగ్నమైపోవడం, లౌకిక సహవాసులతో సన్నిహిత స్నేహమేర్పర్చుకోవడం, లేక వివాహం చేసుకోడానికి స్వతంత్రులు కాని సందర్భాల్లో వ్యతిరేక లింగ వ్యక్తులతో భావోద్రేకంగా సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకోవడం వంటి వాటిల్లో చిక్కుకొని కొందరు క్రైస్తవులు తప్పుడు మార్గాల్లోకి మళ్లారు.

ప్రతి సందర్భంలోనూ, ప్రమాదం నుండి దూరంగా ఉండడమే వివేకయుక్త మార్గం. ఉదాహరణకు, వ్యాపారంలో బంగారు అవకాశాలు అనబడేవి తెచ్చే ఆత్మీయ ప్రమాదాలకు మనం అప్రమత్తంగా ఉంటున్నామా? కొందరు సహోదరులు తమ కుటుంబాలను, ఆరోగ్యాన్ని, వారి దైవపరిపాలనా బాధ్యతలను సహితం విడనాడి, వ్యాపార కార్యసాధనలో నిమగ్నమైపోయారు. కొన్నిసార్లు డబ్బు తెచ్చే సుఖవంతమైన జీవిత విధానం ఎంతో ఆకర్షణీయం కావచ్చు. మరికొన్నిసార్లు తమ వ్యాపార సామర్థ్యానికి అది ఒక సవాలు కావచ్చు. వారి ఉద్దేశం, యితర సహోదరులకు ఉద్యోగాన్నందించడం లేక ప్రపంచవ్యాప్తంగా జరిగే పనికొరకు మరింత ఉదారంగా విరాళాలివ్వడమే అని కొందరు వాదిస్తారు. బహుశా, వ్యాపారం చక్కగా సాగుతున్నప్పుడు, రాజ్యాసక్తులకు అధిక సమయాన్ని కేటాయించవచ్చులే అని వారు భావిస్తూ ఉండవచ్చు.

అయితే వీటిల్లో కొన్ని అనుకోని ఆపదలేమిటి? అస్థిర ఆర్థిక పరిస్థితి, “అనుకోని సంఘటనలు,” చక్కని పథకం వేసుకున్న వ్యాపార వృత్తిని ముంచి వేయగలవు. (ప్రసంగి 9:11) అప్పుల్లో మునిగిపోవడం కలతను తెస్తుంది, అంతేకాదు అది ఆత్మీయ విషయాలకు తావులేకుండా చేస్తుంది. వ్యాపారం జోరుగా సాగుతున్నా, అది అధిక సమయాన్ని మానసిక శక్తిని వినియోగించవచ్చు అంతేకాదు, దానికి ఎక్కువ లౌకిక సహవాసం అవసరం కావచ్చు.

స్పెయిన్‌ నందు ఒక క్రైస్తవ పెద్ద తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, ఒక భీమా సంస్థవారు ఆయనకు ఒక ఆకర్షణీయ అవకాశాన్ని అందించారు. స్వతంత్ర భీమా ఏజెంటుగా ఎంతో డబ్బును సంపాదించే అవకాశాలున్నప్పటికి, చివరికి ఆయన ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. “అది అంత సులభమైన నిర్ణయం కాదుకాని అలా వద్దన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.” అని ఆయన వివరిస్తున్నాడు. “ఒక విషయమేంటంటే, నా దైవపరిపాలనా సంబంధాలతో పరోక్షంగానైనా డబ్బు సంపాదించడానికి నేను వెనుకాడాను. స్వతంత్రంగా పనిచేసే ఆలోచన నాకిష్టమైనా, నేను ఎంతో దూరం ప్రయాణించి ఉద్యోగానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సివస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే అది కుటుంబాన్ని సంఘాన్ని అలక్ష్యంచేయడానికి దారితీసి ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, ఒకవేళ నేనా ప్రతిపాదనను అంగీకరించి ఉంటే, నా జీవితాన్ని నేను అదుపులో పెట్టుకోలేక పోయుండేవాన్ని.”

ఏ క్రైస్తవుడూ తన జీవితంపై అదుపును ఎన్నడూ కోల్పోనివ్వడు. ఎంతో ధనాన్ని కూడబెట్టి పనినుండి విరమించి, సుఖ జీవనాన్ని అనుభవించాలని కోరిన ఒక మానవుని గూర్చిన ఉదాహరణను వివరిస్తూ యేసు, అటువంటి జీవితంవల్ల ఫలించే విషాదకర పరిణామాలను చూపించాడు. అయితే, తాను కావల్సినంత డబ్బును సమకూర్చుకున్నాడని తీర్మానించుకున్న ఆ రోజు రాత్రే అతను చనిపోయాడు. “దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని” ఆయన చెప్పాడు.—లూకా 12:16-21; యాకోబు 4:13-17 పోల్చండి.

లోకస్థులతో ఎక్కువగా సహవసించే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వారు మన పొరుగువారు, ఓ తోటి విద్యార్థి, తోటి ఉద్యోగి, లేక వ్యాపార సహవాసియైనా కావచ్చు. ‘అతను సాక్షులను గౌరవిస్తాడు, మంచి నైతిక విలువలుకలవాడు, అంతేకాదు మేము అప్పుడప్పుడు సత్యాన్ని గూర్చి కూడా మాట్లాడుతాం’ అని మనం తర్కించవచ్చు. అయినా, కాలం గడిచేకొలది మన ఆత్మీయ సహోదర సహోదరీలకన్నా కూడా లౌకిక సహవాసాన్ని మనం ఎన్నుకోగలమని యితరుల అనుభవం నిరూపిస్తుంది. అలాంటి సహవాసంవల్ల ఏ ప్రమాదాలు సంభవించగలవు?

మనం జీవించే కాలం యొక్క అత్యవసరతను మనం తక్కువగా పరిగణించడం లేక ఆత్మీయ విషయాల కంటే కూడ వస్తుసంబంధ విషయాల్లో ఎక్కువ ఆసక్తిని చూపించడానికి ప్రారంభించవచ్చు. బహుశ, మన లౌకిక స్నేహితునికి అయిష్టం కల్గిస్తామేమోననే భయంతో, లోకం మెప్పును పొందడానికి కూడ మనం యిష్టపడతాము. (1 పేతురు 4:3-7 పోల్చండి.) మరో వైపు, కీర్తన గ్రంథకర్తయైన దావీదు మాత్రం యెహోవాను ప్రేమించిన ప్రజలతో సహవసించడానికి ఎన్నుకున్నాడు. “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను” అని ఆయన రాశాడు. (కీర్తన 22:22) దావీదు మాదిరిని మనం అనుకరించి, మనకు ప్రయోజనకరమైన స్నేహాన్ని వెదకినట్లైతే మనం కాపాడబడతాము.

మరో అపాయకరమైన ప్రవర్తన ఏమంటే, వివాహమాడే స్వాతంత్ర్యం లేనప్పుడు వ్యతిరేక లింగ వ్యక్తితో భావోద్రేకంగా సన్నిహితమవ్వడం. ఒక వ్యక్తి ఆకర్షణీయంగానూ, వారి మాటలు ఉత్తేజపూరితంగానూ, తనవంటి దృక్పథంగల మరియు హాస్య ధోరణిగల వారికి ఆకర్షితులుకావడం ప్రమాదాన్ని తేవచ్చు. ‘నేను ఎంతవరకు వెళ్లాలో నాకు బాగా తెలుసు. మేము స్నేహితులం మాత్రమే’ అని తర్కిస్తూ ఒకరు తమ వ్యతిరేక లింగ వ్యక్తుల సహవాసాన్ని అనుభవించవచ్చు. అయితే ఒక్కసారి మొగ్గతొడిగిన భావాలను అదుపుచేయడం అంత సులభమేమీ కాదు.

పెళ్లైన యౌవన సహోదరి మేరి, మైఖెల్‌ సహవాసంలో సంతోషించేది.a ఆయన మంచి సహోదరుడేగాని స్నేహం చేయడానికి కష్టంగా భావించేవాడు. వారిలో అనేక పరస్పరాసక్తులున్నాయి, వారు కలిసి పరిహసించుకోగలరని తెలుసుకున్నారు. ఒక పెళ్లికాని సహోదరుడు తనతో వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటున్నాడని తెలుసుకొని గొప్పగా భావించుకుంది. కొద్దికాలంలోనే, అమాయక స్నేహం కాస్తా భావోద్రేక సంబంధానికి దారితీసింది. వారు చాలా సమయాన్ని కలిసి గడుపుతూ వచ్చారు, చివరికి వారు అవినీతికి పాలుపడ్డారు. “మొదట్లోనే నేను ప్రమాదాన్ని గమనించాల్సింది” అని మేరి విలపిస్తోంది. “స్నేహం వికసించినప్పుడు, మమ్మల్ని తనలోకి లాగేసుకునే ఊబిలా అది తయారయ్యింది.”

బైబిలు హెచ్చరికను మనం ఎన్నడూ మర్చిపోకూడదు: “హృదయం అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:9) ఓడను రాళ్లకు ఢీకొనేట్లు చేసే కెరటాల్లా మన మోసకర హృదయం మనలను నాశనకర భావోద్రేక సంబంధానికి నడిపిస్తుంది. దాని పరిష్కారం? మీకు వివాహమాడే స్వాతంత్ర్యం లేకపోతే, మీకు ఆకర్షణీయంగా కనిపించినవారితో భావోద్రేకపరంగా మీరు దూరంగా ఉండడానికి గట్టి కృషిచేయండి.—సామెతలు 10:23.

ప్రమాదంనుండి విడిపించుకోవడం, తప్పించుకోవడం

అప్పటికే మనం ప్రమాదంలో ఉన్నట్లైతే అప్పుడేం చేయాలి? గాలి, కెరటాలు తమ్మును రాళ్ల తీరానికి నెడుతున్నప్పుడు నావికులు, తమ ఓడలను సముద్రం వైపుకు నడిపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు, లేక ప్రమాదరహిత నీటిని చేరేంతవరకూ గాలి తట్టుకు తిరుగుతారు. లేఖనాధార సలహాను గైకొని, యెహోవా సహాయంకొరకు మనం హృదయపూర్వకంగా ప్రార్థించి, పరిపక్వతగల క్రైస్తవ సహోదరుల సహకారాన్ని కోరినట్లైతే మనం మరలా సురక్షిత మార్గాన పయనించవచ్చు. మరోసారి మనం సమాధానకర మనస్సునూ హృదయాన్ని ఆశీర్వాదాలుగా పొందగలము.—1 థెస్సలొనీకయులు 5:17.

మన పరిస్థితులు ఏమైనప్పటికి, “లోక సంబంధమైన” విషయాలనుండి దూరంగా ఉండడం వివేకంగల పని. (గలతీయులు 4:3) లోతుకు భిన్నంగా, చాలా సంవత్సరాలవరకు గుడారాల్లో నివసించాల్సివచ్చినప్పటికి, అబ్రాహాము లోకస్థులైన కనానీయులనుండి వేరుగా నివసించడానికి ఎన్నుకున్నాడు. బహుశ అతనికి కొన్ని వస్తుసంబంధ సుఖాలు లేకపోవచ్చు కాని, అతని సాధారణ జీవిత విధానం ఆయనను ఆత్మీయంగా కాపాడింది. ఆయన విశ్వాసమనే ఓడ బ్రద్దలయ్యే బదులు, “నమ్మినవారికందరికి అతడు తండ్రి” అయ్యాడు.—రోమీయులు 4:11.

స్వయం సమ్మోహిత లోక “శక్తి” మునుపెన్నటికంటే యిప్పుడు బలంగా ఉన్న లోకంలో మనం ఉన్నాం గనుక, మనం కూడ అబ్రాహాము మాదిరిని అనుసరించాలి. (ఎఫెసీయులు 2:2) అన్ని విషయాల్లోనూ మనం యెహోవా నడిపింపును అంగీకరిస్తే, ఆయన ప్రేమ పూర్వక సంరక్షణను అనుభవించడంతో మనం ఆశీర్వదించబడతాము. “నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును.” నిస్సందేహంగా, ప్రమాదకర మార్గాల్లో పడిపోకుండా “నీతిమార్గములలో” పయనించడం, నిత్య ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది.—కీర్తన 23:3, 6.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[24వ పేజీలోని చిత్రం]

మీరు వివాహం చేసుకోడానికి స్వతంత్రులుకాకపోతే, మీకు ఆకర్షణీయంగా కన్పించినవారితో భావోద్రేకపరంగా దూరంగా ఉండండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి