“వారు నిరుత్తరులైయున్నారు” అని సృష్టి చెప్పుచున్నది
“ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.”—రోమీయులు 1:20.
1, 2. (ఎ) యోబు యెహోవాకు ఏ తీవ్ర ఫిర్యాదు చేశాడు? (బి) ఆ తరువాత యోబు ఎలా స్పందించాడు?
యెహోవా దేవునియెడల అవిచ్ఛిన్న యథార్థతను కల్గిన ప్రాచీనకాల మనుష్యుడైన యోబును సాతాను కఠినంగా పరీక్షించాడు. అపవాది యోబు తన ఆస్తినంతటిని పోగొట్టుకొనేలా, అతని కుమారులు కుమార్తెలు చనిపోయేలా చేశాడు, అసహ్యకరమైన వ్యాధితో అతన్ని మొత్తాడు. తనపై ఈ విపత్తులన్నింటిని దేవుడే తీసుకువస్తున్నాడని యోబు తలంచి, కోపంతో యెహోవాకు యిలా ఫిర్యాదుచేశాడు: “దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? . . . నేనుదోషిని కానని . . . నీవు ఎరిగియుండియు నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?”—యోబు 1:12-19; 2:5-8; 10:3, 6, 7.
2 ఇది జరిగిన కొన్నాళ్ల తరువాత, దేవునితో యోబు పల్కిన మాటలు పూర్తి వ్యత్యాసంగా ఉన్నాయి: “ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.” (యోబు 42:3, 5, 6) యోబు స్వభావాన్ని మార్చదగిన దేమి సంభవించింది?
3. సృష్టిని గూర్చి యోబు ఎటువంటి క్రొత్త దృష్టిని సంపాదించాడు?
3 ఈ మధ్యకాలంలో యెహోవా సుడిగాలిలో యోబుతో మాట్లాడాడు. (యోబు 38:1) ఆయన యోబును అనేక ప్రశ్నలడిగాడు. ‘నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? భూమిపై వర్షించునట్లు మేఘములకు ఆజ్ఞ ఇయ్యగలవా? గడ్డిని మొలిపించగలవా? నక్షత్రకూటమిని బంధింపగలవా అవి వాటి కర్తవ్యములను నిర్వహించునట్లు నడిపించగలవా?’ యోబు 38 నుండి 41 అధ్యాయాలలో యెహోవా ఇలాంటివి, తన సృష్టిని గూర్చిన మరి అనేక ప్రశ్నలతో యోబుపై ప్రశ్నల వర్షం కురిపించాడు. మానవునికి దేవునికి మధ్యనున్న మహా అగాధాన్ని, దేవుని సృష్టిలో ప్రస్ఫుటమగుచున్న జ్ఞానము, శక్తిని ఆయన యోబుకు జ్ఞాపకం చేస్తూ, వాటిని చేయాలంటే తన శక్తికి మించిన పనియని లేదా కనీసం వాటిని గ్రహించజాలడని యోబు తెలుసుకొనునట్లు చేశాడు. సర్వోన్నతుడైన దేవుని అద్భుతశక్తిని, అపారమైన జ్ఞానాన్ని ఆయన సృష్టికార్యములద్వారా గ్రహించి, యోబు విస్మయమొంది, యెహోవాతో వాదించుటకు తాను చేసిన సాహసమును గూర్చి తలంచుటకు భీతిచెందాడు. కావునే అతడిలా అన్నాడు: “వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.”—యోబు 42:5.
4. యెహోవా సృష్టి నుండి మనమేమి గ్రహించాలి, దానిని చూచుటలో విఫలులైన వారి విషయమేమిటి?
4 యెహోవా లక్షణాలను ఆయన సృష్టియందు చూడవచ్చునని ప్రేరేపిత బైబిలు రచయిత ఒకరు అనేక శతాబ్దాల తరువాత స్థిరపర్చెను. అపొస్తలుడైన పౌలు రోమీయులు 1:19, 20 నందు యిలా వ్రాసెను: “దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.”
5. (ఎ) మానవులు ఎట్టి సహజ కోరికను కల్గియున్నారు, కొందరు దానిని ఎలా అసంగతముగా తీర్చుకున్నారు? (బి) ఏథెన్సునందలి గ్రీకులకు పౌలు ఏ సిఫారసు చేశాడు?
5 సర్వోన్నతుని ఆరాధించవలెననే సహజ కోరికతో మానవుడు సృజించబడ్డాడు. ఈ ఆవశ్యకతను గూర్చి పేర్కొంటూ డా. కె. జి. జంగ్ “అది విశేషంగా మానవునికుండే సహజ స్వభావమని, మానవ చరిత్రయంతటిలో అది ప్రత్యక్ష పర్చబడిందని” ది అన్డిస్కవర్డ్ సెల్ఫ్ అను తన పుస్తకములో వ్రాశాడు. ఆరాధించవలెననే మానవుని అంతరంగ కోరికను గూర్చి పౌలు మాట్లాడాడు, ఏథెన్సునందలి గ్రీకులు తమకు తెలిసిన, తెలియని అనేక దేవతల కొరకు విగ్రహాలను, బలిపీఠములను ఎందుకు చేసుకున్నారో అది వివరిస్తున్నది. నిజ దేవుడైన యెహోవాను వెదకి తమకున్న ఈ అంతరంగ కోరికను సరియైన రీతిలో తృప్తిపర్చుకోవలెనని “వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోనని, . . . ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడుకాడని” పౌలు వారికి తెలియజేసి నిజ దేవున్ని పరిచయం చేశాడు. (అపొస్తలుల కార్యములు 17:22-30) ఆయన సృష్టికి మన మెంత సన్నిహితులమైతే అంతగా మనమాయన లక్షణాలకు సహజగుణాలకు సన్నిహితులౌతాము.
విస్మయమొందించు నీటి చక్రం
6. యెహోవాకున్న ఏ లక్షణాలను మనము నీటి చక్రములో చూడగలము?
6 యెహోవాకున్న ఏ లక్షణాలను మనము గ్రహించగలం, ఉదాహరణకు, అనేక టన్నుల నీటిని మేఘాల్లో ఉంచగల సామర్థ్యాన్ని గ్రహించగలమా? ఆయన ప్రేమ, జ్ఞానాన్ని మనం చూడగల్గుచున్నాము, వాటినిబట్టే ఆయన భూమిని ఆశీర్వదించుటకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ప్రసంగి 1:7 నందు పేర్కొనబడిన నీటి చక్రం ద్వారా ఆయన ఈ అద్భుత నిర్మాణాన్ని ఏర్పాటు చేశాడు: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.” అది ఎలా సంభవిస్తున్నదో బైబిలు పుస్తకమైన యోబు విశదంగా వర్ణిస్తుంది.
7. నీరు సముద్రముల నుండి మేఘములకెలా వెళ్తోంది, పొగమంచు రూపముననున్న మేఘాలు అనేక టన్నుల నీటిని ఎలా మోయగలవు?
7 నదీప్రవాహములు సముద్రములో పడినప్పుడు, అవి అక్కడ నిలువవు. “సముద్రము నుండి నీటిని తీసి తాను సృజించిన పొగమంచు నుండి వర్షాన్ని కురిపించును.” ఎందుకంటే నీరు ఆవిరి రూపంలో ఉంది, తుదకు అది నిర్మలమైన పొగమంచుగా మారును, యిది “ఆయన పరిపూర్ణ నైపుణ్యముతో చేసిన అద్భుత కార్యము మేఘములను పైన వ్రేలాడదీసాడు.” (యోబు 36:27; 37:16; ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) మేఘాలు పొగమంచుగా ఉన్నంత కాలం అవి తేలుతాయి: “బరువు చేత పొగమంచు చీలిపోకుండునట్లు ఆయన మేఘములలో నీళ్లను బందించెను.” లేదా మరో తర్జుమా ప్రకారం: “బరువుతో మేఘాలు చిట్లిపోకుండా ఆయన నీళ్లను దట్టమైన మేఘములలో దాచి ఉంచెను.”—యోబు 26:8; ది జెరూసలేమ్ బైబిల్, NE.
8. ఏ విభిన్న పద్ధతుల ద్వారా “ఆకాశపు కలశములలోని వర్షము” కుమ్మరించబడి, నీటి చక్రము పూర్తగును?
8 భూమి మీద వర్షము కురియునట్లుగా ఈ “ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?” (యోబు 38:37) ఎవరైతే “పరిపూర్ణ నైపుణ్యముతో” వాటిని అక్కడ మొదటపెట్టారో ఆయనే “తాను సృజించిన పొగమంచునుండి వర్షాన్ని” కురిపిస్తాడు. పొగమంచునుండి వర్షాన్ని కురిపించుటకు ఏమి అవసరం? ధూళి లేదా ఉప్పువంటి సూక్ష్మాతిసూక్ష్మ అణువులు గాలిలో చదరపు సెంటీమీటరుకు వేల నుండి లక్షలవరకు ఉన్నాయి, అవి న్యూక్లియస్గా ఉండి చుట్టూ నీటిబిందువు ఏర్పడునట్లు చేస్తాయి. సగటు వర్షపుచుక్క తయారగుటకు పది లక్షల సూక్ష్మ మేఘబిందువులు అవసరమని అంచనా వేయబడింది. ఇదంతా జరిగిన తరువాతనే మేఘాలు భూమిపై కుండపోతగా వర్షాన్ని కురిపించి ఏరులుగా పారునట్లుచేసి నీటిని సముద్రాలలోనికి తరలిస్తాయి. ఆ ప్రకారంగా, నీటిచక్రం పూర్తవుతుంది. ఇదంతా నడిపింపు లేకుండా సంభవించగలదా? అట్టి భావన క్షమించరానిదే!
సొలొమోను జ్ఞానానికి మూలము
9. చీమను గూర్చిన ఏ అద్భుతాన్ని సొలొమోను కనుగొన్నాడు?
9 ప్రాచీన కాలంలో, సొలొమోను జ్ఞానానికి సాటి లేదు. ఆ జ్ఞానము ఎక్కువగా యెహోవా సృష్టిపై అవధానాన్ని నిల్పింది: “లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునేగాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటిని గూర్చి (సొలొమోను) వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.” (1 రాజులు 4:33) అదే సొలొమోను రాజు యిలా వ్రాశాడు: “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.”—సామెతలు 6:6-8.
10. సమకూర్చుకొనే చీమలను గూర్చిన సొలొమోను వృత్తాంతము ఎలా కొనియాడబడింది?
10 శీతాకాలమందు తమ్మును పోషించు కొనడానికి వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకొనుమని చీమలకు ఎవరు నేర్పారు? చీమలు శీతాకాలము కొరకు ధాన్యాన్ని తెచ్చుకొని నిలువ చేస్తాయన్న సొలొమోను వృత్తాంతపు ప్రామాణికత్వం అనేక శతాబ్దాలు సందేహించబడింది. దాని సాక్ష్యాధారాన్ని ఎవరు కనుగొనలేక పోయారు. అయితే 1871లో బ్రిటీషు జీవశాస్త్ర పరిశోధకుడొకరు భూగర్భ ధాన్యపు గిడ్డంగులను కనుగొన్నాడు, దానితో వాటిని గూర్చి పేర్కొనిన బైబిలు ప్రామాణికత కొనియాడబడింది. అయితే శీతాకాలపు చలిరానైయున్నదని వేసవిలో తెలిసికొని అందును గూర్చి ఏమి చేయాలో తెలిసికొనే జ్ఞానాన్ని ఈ చీమలు ఎలా పొందగల్గాయి? యెహోవా సృష్టి ప్రాణుల్లో అనేకము తమ జీవనాన్ని కొనసాగించుటకై అవి సహజ జ్ఞానంతో నిర్దేశించబడినవని బైబిలే వివరిస్తున్నది. తమ సృష్టికర్త నుండి ఇట్టి ఆశీర్వాదాన్ని పొందిన వాటిలో సమకూర్చుకొనే ఈ చీమలున్నాయి. వాటిని గూర్చి సామెతలు 30:24 యిలా అంటున్నది: “అవి మిక్కిలి జ్ఞానముగలవి.” అట్టి జ్ఞానము కాకతాళీయంగా సంభవించిందనడం సహేతుకం కాదు; దాని వెనుకనున్న జ్ఞానవంతుడైన సృష్టికర్తను ఎరుగకపోవుట క్షమించరానిదే.
11. (ఎ) అతి పెద్ద వృక్షమైన సికోయ ఎందుకు మహాద్భుతమైంది? (బి) కిరణ జన్య సంయోగ క్రియలో మొదటి చర్యను గూర్చి అంత ఆశ్చర్యపడాల్సిందేముంది?
11 అతి పెద్దదైన సికోయా వృక్షంవద్ద నిలుచున్న వ్యక్తి దాని మహత్తర వైభవాన్ని చూచి ఆశ్చర్యచకితుడై దానియెదుట తానొక చిన్న చీమ అని భావిస్తాడు. ఆ వృక్ష పరిమాణం మహాద్భుతం: 90 మీటర్ల పొడవు, 11 మీటర్ల చుట్టుకొలత, దాని బెరడు 0.6 మీటర్ల మందం, వ్రేళ్లు మూడులేక నాలుగు ఎకరాల కంటే ఎక్కువగా విస్తరించి ఉంటాయి. అయిననూ, దాని పెరుగుదలలో యిమిడియున్న భౌతిక, రసాయన ప్రక్రియలు అంతకన్నా మహాద్భుతమైనవి. వాటి ఆకులు వ్రేళ్లనుండి నీటిని, గాలిలోనుండి బొగ్గుపులుసు వాయువును, సూర్యుని నుండి శక్తిని తీసుకొని పిండి పదార్థాన్ని తయారుచేసుకొని ప్రాణవాయువుని విడుదల చేస్తుంది, దీనిని కిరణజన్య సంయోగక్రియ అంటారు. దీనిలో 70 రకాల రసాయన ప్రక్రియలున్నాయి, వాటిలో అన్నింటిని గ్రాహ్యము చేసుకోలేకపోయాం. ఆశ్చర్యకరంగా, మొదటి ప్రక్రియ సరియైన రంగు, సరియైన తరంగ దైర్ఘ్యము కల్గిన సూర్యుని నుండి వచ్చే వెలుతురుపై ఆధారపడియుంది; లేనట్లయితే కిరణజన్య సంయోగ క్రియను జరిగించేందుకు హరితకణాలతో అది విలీనం కాదు.
12. (ఎ) సికోయ వృక్షము నీటిని వాడుకొనుటలో గుర్తించాల్సిందేమిటి? (బి) వృక్షము పెరుగుటకు నత్రజని ఎందుకు అవసరం, దాని చక్రము ఎలా పూర్తగును?
12 ఈ వృక్షం వ్రేళ్లనుండి 90 మీటర్ల ఎత్తువరకు విస్తారమైన నీటిని లాగుతుందన్న వాస్తవం కూడా అమోఘమైనది. కిరణ జన్య సంయోగక్రియకు అవసరమైన దానికన్నా ఎక్కువ నీటిని అది లాక్కుంటుంది. మిగిలిన దానిని ఆకులద్వారా గాలిలోనికి వాయురూపమున విడిచిపెడుతుంది. మనం చెమటద్వారా ఎలా చల్లబడుతుంటామో, ఆలాగే అది వృక్షాన్ని నీటితో చల్లబరుస్తుంది. పెరుగుదలకు దోహదపడే మాంసపుకృత్తులు తయారుకావడానికి పిండిపదార్థానికి లేదా చక్కెరకు నత్రజని జత చేయాల్సి ఉంటుంది. వాయు రూపముననున్న నత్రజనిని ఆకులు గాలినుండి తీసుకొని ఉపయోగించలేవు, కాని మట్టిలోనున్న సూక్ష్మజీవులు భూమిలోని వాయురూప నత్రజనిని నైట్రైట్లుగా మారిస్తే, ఈ నైట్రైట్లు నీటిలో కరిగి, చెట్టు వ్రేళ్లనుండి ఆకుల వరకు వెళ్తాయి. ఈ నైట్రైట్లను తమ మాంసపుకృత్తులలో వాడుకొనిన వృక్షాలు, జంతువులు చనిపోయి కుళ్లిపోయినపుడు మరలా ఈ నత్రజని విడుదలౌతుంది, ఈ విధంగా నత్రజని చక్రం పూర్తవుతుంది. ఇందు యిమిడియున్న పెక్కింటి కలయికే అద్భుతం, కాబట్టి దీనిని ఒక హఠాత్ పరిణామము సాధించ లేదు.
భాష, మాటలు, స్వరము లేకున్నను అవి మాట్లాడును
13. నక్షత్రములతో నిండిన ఆకాశాలు దావీదుకు ఏమి తెల్పాయి, అవి మనకు కూడా ఏమి తెల్పుచూ ఉన్నాయి?
13 రాత్రివేళ నక్షత్రములతో నిండియున్న ఆకాశం దాన్ని తిలకించేవారిని భక్తిపారవశ్యులను చేయుట సృష్టికర్తను ఎంత అద్భుతంగా ప్రతిబింబిస్తుంది! దావీదు తన విస్మయాన్ని కీర్తన 8:3, 4 నందు వ్యక్తపర్చాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” చూడగల్గే కన్నులు, వినగల్గే చెవులు, గ్రహించగల్గే హృదయమున్న ఎవరితోనైనా నక్షత్రములతో నిండియున్న ఈ ఆకాశములు దావీదుతో మాట్లాడగల్గినట్లే మాట్లాడగలవు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి.”—కీర్తన 19:1-4.
14. మన నక్షత్రములలో ఒకానొకదాని అధికశక్తి మనకెందుకు ప్రాముఖ్యము?
14 నక్షత్రములను గూర్చి మనము తెలుసుకొనేకొలది, మరింత బిగ్గరగా అవి మనతో మాట్లాడును. వాటి మహత్తరశక్తిని గమనించుమని యెషయా 40:26లో మనకు పిలుపు ఇవ్వబడింది: “మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడేగదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.” వాటిలో ఒకటైన మన సూర్యుని ఆకర్షణశక్తి, అధికశక్తే భూమిని దాని కక్ష్యలో ఉంచి, చెట్లు పెరుగునట్లు చేసి మనకు వెచ్చదనాన్నిచ్చి, భూమిపై జీవరాసులు నివసించగల్గేటట్లు చేస్తున్నది. అపొస్తలుడైన పౌలు ప్రేరేపితుడై యిలా అన్నాడు: “మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదు.” (1 కొరింథీయులు 15:41) మన సూర్యునివంటి పసుపువర్ణ నక్షత్రములు, నీలివర్ణనక్షత్రములు, ఎర్రగా ఉండి సూర్యుని కంటెపెద్ద పరిమాణములో ఉండే నక్షత్రములు, పరిమాణంలో సూర్యునికంటె పెద్దగా ఉండి అంతగా వెలుతురులేని తెల్లనక్షత్రములు, న్యూట్రాను నక్షత్రములు, గ్రహింపనలవికాని శక్తిని విడుదల చేసే విస్పోటపు నక్షత్రరాసులను గూర్చి విజ్ఞానశాస్త్రానికి తెలుసు.
15. అనేకమంది పరిశోధకులు సృష్టినుండి ఏమి తెలుసుకున్నారు, దేన్ని అనుకరించ ప్రయత్నించారు?
15 అనేకమంది పరిశోధకులు సృష్టినుండే నేర్చుకొని, జీవరాసుల సామర్థ్యాలను అనుకరించ ప్రయత్నించారు. (యోబు 12:7-10) సృష్టిలో ఉన్న కొన్ని అసాధారణ విషయాలను గమనించండి. సముద్రపు నీటిలోని ఉప్పును తీసివేయగల గ్రంధులున్న సముద్రపు పక్షులు; విద్యుత్తు నుత్పన్నము చేయగల చేప, పాము చేపలు, మినుకుమినుకు వెలుతురును పుట్టించు చేప, క్రిములు, కీటకాలు; శబ్దతరంగ విధానాన్ని ఉపయోగించు గబ్బిలాలు, డాల్ఫిన్లు; కాగితాన్ని తయారు చేసే కందిరీగలు; వారధులు నిర్మించే చీమలు; ఆనకట్టలు కట్టే జలచరాలు; తమలోనే థర్మామీటరు గల పాములు; గాలిగొట్టాలను, నీటిలోపల ఉపయోగించదగు గాలి ఉపకరణాలను వాడుతున్న చెరువు కీటకాలు; నీటి పంకానుపయోగించు ఆక్టోపస్; ఏడు రకాల గూడులను తయారు చేయగల సాలీడులు, ఉచ్చులు, వలలు, చిక్కములను తయారుచేసి గాలిలో తేలియాడే పిల్ల సాలీళ్లను కని, ఎంతో ఎత్తున వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి; సబ్మెరైన్ వలే తేలియాడగల ట్యాంకులను ఉపయోగించు చేప, గుల్లలు గల చేపలు; విజ్ఞానశాస్త్రం వివరించ లేనంతటి ఆశ్చర్యకరమైన వలసప్రయాణాలు చేసే పక్షులు, కీటకాలు, సముద్ర తాబేలు, చేప, సస్తనజాతులను పరిశీలించండి.
16. విజ్ఞానశాస్త్రం కనుగొనక పూర్వమే ఏవిజ్ఞాన శాస్త్ర సత్యాలను బైబిలు వేలాది సంవత్సరాల ముందే తెల్పింది?
16 విజ్ఞానశాస్త్ర సత్యాలను విజ్ఞానశాస్త్రం కనుగొనక పూర్వం వేలాది సంవత్సరాల ముందే బైబిలు వాటిని పేర్కొంది. రోగక్రిములను గూర్చి పాశ్చర్ తెలుసుకొనుటకు వేలాది సంవత్సరముల పూర్వమే మోషే ధర్మశాస్త్రం (సా.శ.పూ. 16వ శతాబ్దం) వాటిని గుర్తించింది. (లేవీయకాండము 13, 14 అధ్యాయములు) సా.శ.పూ. 15వ శతాబ్దంలో యోబు యిలా పేర్కొన్నాడు: “ఆయన . . . శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.” (యోబు 26:7) క్రీస్తుకంటే వెయ్యి సంవత్సరాల ముందు, రక్తప్రసరణను గూర్చి సొలొమోను వ్రాశాడు. దానిని గూర్చి తెలుసుకొనడానికి వైద్యవిజ్ఞాన రంగం 15వ శతాబ్దము వరకు వేచియుండాల్సి వచ్చింది. (ప్రసంగి 12:6) దానికంటె ముందు జన్యు విధానాన్ని గూర్చిన విజ్ఞానాన్ని కీర్తన 139:16 ప్రతిబింబించింది: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.” వలసపోవుటను గూర్చి జీవశాస్త్ర విద్వాంసులు గ్రహించకముందు సా.శ.పూ. 7వ శతాబ్దంలో యిర్మీయా 8:7 నందు యిర్మీయా దానిని గూర్చి వ్రాశాడు: “ఆకాశమునున్న సంకుబుడి కొంగకు తన వలస కాలము తెలుసు, తెల్లగువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకును తాము తిరిగిరావలసిన కాలము తెలుసు.”—NE.
పరిణామ సిద్ధాంతవాదులు ఎంచుకున్న “సృష్టికర్త”
17. (ఎ) సృష్టివింతలకు కారకుడైన వివేకముగల సృష్టికర్తను గుర్తెరుగ నిరాకరించువారిని గూర్చి రోమీయులు 1:21-23 ఏమంటున్నది? (బి) ఒక్కమాటలో చెప్పాలంటే, పరిణామ సిద్ధాంతవాదులు దేనిని తమ “సృష్టికర్తగా” ఎంచుకుంటున్నారు?
17 సృష్టివింతలకు కారకుడైన వివేకముగల సృష్టికర్తను గుర్తెరుగుటకు నిరాకరించిన వారిని గూర్చి ఒక లేఖనమిట్లంటున్నది: “వారు . . . తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి.” వారు “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.” (రోమీయులు 1:21-23, 25) పరిణామ సిద్ధాంతవాదుల విషయంలో అదే జరిగింది, ప్రోటోజోవా-క్రిములు-చేప-ఉభయచరాలు-సరీసృపాలు-సస్తనజాతుల నుండి పరిణామం చెందినదనే ఊహాజనిత “నరవానరాన్ని” వారు తమ “సృష్టికర్తగా” కొనియాడుతున్నారు. అయితే, ఈ గొలుసును ప్రారంభించడానికి నిజంగా ఏకకణ జీవి లేదన్న సంగతి వారికి తెలుసు. ప్రస్తుతం మనకు తెలిసిన సూక్ష్మాతి సూక్ష్మ క్రిమిలో పదివేల కోట్ల అణువులున్నాయి—ఇది అద్భుతమైన కలయిక—వేలాది రసాయిన ప్రతిచర్యలు ఒకేసారి సంభవించడం కాకతాళీయంగా రూపుదిద్దుకోదు.
18, 19. (ఎ) జీవాన్ని కలుగజేసిన ఘనతను ఎవరు మాత్రమే పొందనర్హులు? (బి) యెహోవా సృష్టిని మనమెంత చూడగలము?
18 జీవాన్ని కలుగజేసినవాడు యెహోవా దేవుడే. (కీర్తన 36:9) ఆయనే మొదట మహాసంభవాన్ని కలుగజేసాడు. యెహోవా అను ఆయన నామానికి “సంభవింపజేయువాడు” అని అర్థం. ఆయన సృష్టిని మనం లెక్కించజాలము. నిజమే, మానవుడు ఎరిగినవాటికంటే మరెన్నో లక్షలు ఉన్నాయి. కీర్తన 104:24, 25 దీనిని గూర్చి సూచననిస్తున్నది: “యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి.” ఈ విషయమై యోబు 26:14 యిలా స్పష్టీకరిస్తున్నది: “ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?” కొన్నింటినే చూస్తున్నాము, గుసగుసలే వింటున్నాము, అయితే ఆయన మహాబల గర్జనను పూర్తిగా గ్రహించుట అసాధ్యము.
19 అయితే ఆయనను తన భౌతిక సృష్టిని బట్టియే కాక ఆయనను చూడగల శ్రేష్ఠమైన మూలాన్ని మనము కలిగియున్నాము. ఆ శ్రేష్ఠమైన మూలమే ఆయన వాక్యమైన బైబిలు. తదుపరి శీర్షికలోని ఆ మూలమునకు మన దృష్టి సారిద్దాము.
మీకు జ్ఞాపకమున్నవా?
◻ యెహోవా సుడిగాలిలో నుండి తనతో మాట్లాడినప్పుడు యోబు ఏమి గ్రహించాడు?
◻ కొందరు నిరుత్తరులని పౌలు ఎందుకు అన్నాడు?
◻ నీటి చక్రము ఎలా పనిచేస్తుంది?
◻ సూర్యుని వెలుగు మనకు ఏ ప్రాముఖ్యమైన విషయాలను నెరవేర్చును?
◻ విజ్ఞానశాస్త్రం కనుగొనక ముందే ఏ విజ్ఞానశాస్త్ర సత్యాలను బైబిలు బయలుపర్చింది?