కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 6/1 పేజీలు 8-13
  • స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల”
  • యేసువలె స్వయంత్యాగ స్ఫూర్తిని వృద్ధిచేసుకుని దాన్ని కాపాడుకోండి
  • స్వయం త్యాగం ఎన్నో ఆశీర్వాదాలు తెస్తుంది
  • మనం మన కోసమే జీవించకుండా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసును ఎడతెగక అనుసరించండి
    మన రాజ్య పరిచర్య—1997
  • స్వయంత్యాగం ఎందుకు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 6/1 పేజీలు 8-13

స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట

“ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.”—మత్తయి 16:24.

1. రానైయున్న తన మరణాన్ని గూర్చి యేసు తన శిష్యులకెట్లు తెలియజేశాడు?

మంచు కప్పబడిన హెర్మోను పర్వత పరిసర ప్రాంతంలో యేసుక్రీస్తు తన జీవితంలో మరోపెద్ద మైలురాయి చేరుకున్నాడు. జీవించడానికి ఆయనకింకా సంవత్సరంకంటే తక్కువ సమయముంది. ఆ విషయం ఆయనకేగాని ఆయన శిష్యులకు తెలియదు. వారిప్పుడా విషయం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజమే, తనకు సంభవించే మరణాన్ని గూర్చి ఆయన ముందే గ్రహించాడు, అయితే దాన్నిగూర్చి ఆయన స్పష్టం చేయడం ఇదే మొదటిసారి. (మత్తయి 9:15; 12:40) మత్తయి వ్రాసిన వృత్తాంతమందు మనమిలా చదువుతాము: “అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ” మొదలుపెట్టాడు.—మత్తయి 16:21; మార్కు 8:31, 32.

2. తనకు కలుగనైయున్న శ్రమలను గూర్చి యేసు చెప్పినప్పుడు పేతురు ప్రతిస్పందన ఏమి, దానికి యేసు ఎలా ప్రత్యుత్తరమిచ్చాడు?

2 యేసుకు ఇక కొద్దికాలమే మిగిలివుంది. అశుభ సూచకమన్పించిన అట్టి తలంపుకు పేతురు కోపంగా స్పందిస్తాడు, మెస్సీయ నిజంగా చంపబడతాడనే విషయాన్ని ఆయన అంగీకరించలేదు. కాబట్టి, పేతురు తన యజమానినే గద్దించడానికి సాహసిస్తాడు. ఉద్రేక భావంతో ఆయనిలా అంటాడు: “ప్రభువా, అది నీకు దూరమగుగాక.” అయితే, నిశ్చయముగా ఒకడు విషసర్పం తలను చితకగొట్టునట్లు యేసు వెంటనే పేతురు చూపిన అసందర్భ దయను తృణీకరిస్తూ, “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” అంటాడు.—మత్తయి 16:22, 23.

3. (ఎ) పేతురు ఎట్లు తనకు తెలియకుండానే తనను సాతాను ప్రతినిధిగా చేసుకున్నాడు? (బి) స్వయంత్యాగ విధానానికి పేతురు ఎలా ఒక అడ్డంకుగా ఉండెను?

3 పేతురు తనకు తెలియకుండానే తననొక సాతాను ప్రతినిధిగా చేసుకున్నాడు. యేసు యిచ్చిన ప్రత్యుత్తరము అరణ్యమందు సాతానుకిచ్చిన జవాబంత నిర్ణయాత్మకమై యుండెను. అక్కడ అపవాది ఇబ్బందిలేని జీవితాన్ని, ఏ బాధాలేని రాజరికాన్ని యేసుకిచ్చేందుకు శోధించే ప్రయత్నం చేశాడు. (మత్తయి 4:1-10) అలా నిర్దయగా మాట్లాడుకోవద్దని పేతురు ఆయనను ప్రోత్సహిస్తున్నాడు. అది తన తండ్రి చిత్తం కాదని యేసుకు తెలుసు. తన జీవితం స్వీయాభీష్టమైనది కాక, స్వయంత్యాగ పూరితమైనదై యుండాలి. (మత్తయి 20:28) అటువంటి వైఖరికి పేతురు ఒక అడ్డంకుగా, ఆయన చూపే సానుభూతి ఒక ఉరిగా తయారౌతుంది.a త్యాగంలేని జీవితాన్ని గూర్చిన ఎలాంటి తలంపును అనుమతించిననూ, తాను సాతాను బిగించిన మరణపాశమందు చిక్కుకొని దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకొంటానని యేసు స్పష్టంగా గ్రహించాడు.

4. స్వీయాభీష్టం, సుఖజీవనం యేసుకు, ఆయన అనుచరులకు ఎందుకు తగనిదై యుంది?

4 కాబట్టి పేతురు ఆలోచనను సవరించాల్సి వచ్చింది. యేసుతో తాను పలికిన మాటలు దేవునివి కాక మానవ సంబంధమైనవి. తన జీవితంగాని తన అనుచరుల జీవితంగాని స్వీయాభీష్టంతో, సుఖవంతంగా ఏ బాధాలేకుండా ఉండాలని యేసు కోరలేదు. ఎందుకంటే యేసు ఆ తర్వాత పేతురుతోను, మిగతా శిష్యులతోను ఇట్లన్నాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.”—మత్తయి 16:24.

5. (ఎ) క్రైస్తవ జీవితం జీవించడంలోవున్న సవాలు ఏమి? (బి) అవసరమైన ఏ మూడు సంగతుల కొరకు ఒక క్రైస్తవుడు సిద్ధపడాలి?

5 పదేపదే ఈ కీలకాంశమును అనగా క్రైస్తవ జీవితాన్ని జీవించే సవాలును యేసు ప్రస్తావించాడు. యేసు అనుచరులుగా ఉండడానికి క్రైస్తవులు వారి యజమానునివలె స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించాలి. (మత్తయి 10:37-39) ఆ విధంగా, ఒక క్రైస్తవుడు చేయడానికి సిద్ధపడాల్సిన మూడు సంగతులను ఆయన తెల్పుచున్నాడు: (1) తననుతాను ఉపేక్షించుకోవాలి, (2) హింసను భరించాలి, (3) ఆయనను ఎడతెగక వెంబడించాలి.

“ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల”

6. (ఎ) ఒకవ్యక్తి తననుతాను ఎలా ఉపేక్షించుకుంటాడు? (బి) మనకంటె ఎక్కువగా ఎవరిని మనం ప్రీతిపర్చాలి?

6 ఒకడు తననుతాను ఉపేక్షించుకొనుట అంటే దాని భావమేమి? అంటే ఆ వ్యక్తి తనను పూర్తిగా, అంటే తననుతాను త్యజించుకుంటాడు, అది ఒక విధమైన మరణమని దాని భావం. “ఉపేక్షించుకొనుట” అని అనువదింపబడిన గ్రీకుపదానికి ప్రాథమికంగా “లేదని చెప్పుట”; అంటే “బొత్తిగా నిరాకరించుట” అని అర్థం. కాబట్టి, నీవు క్రైస్తవ జీవిత సవాలును అంగీకరిస్తే, నీవు నీ అభీష్టాల్ని, సుఖసంతోషాల్ని, కోరికల్ని, ఆనందాన్ని యిష్టపూర్వకంగా అప్పగిస్తావు. సారాంశపూర్వకంగా, నీ యావత్‌ జీవితాన్ని, దానికి సంబంధించిన సమస్తాన్ని యెహోవా దేవునికి శాశ్వతంగా ఇస్తావు. ఉపేక్షించుకోవడమంటే ఒకడు తన ఆనందాల్లో కొన్నింటిని అప్పుడప్పుడు నిరాకరించుటకంటే ఎక్కువని దాని భావము. అంటే, ఒకడు తన యావత్‌ యజమానత్వాన్ని నిశ్చయముగా యెహోవాకు అప్పగించుటని దాని భావం. (1 కొరింథీయులు 6:19, 20) తననుతాను ఉపేక్షించుకొనిన వ్యక్తి తననుకాక దేవున్ని ప్రీతిపర్చడానికి జీవిస్తాడు. (రోమీయులు 14:8; 15:3) అంటే అతడు తన జీవితంలోని ప్రతిక్షణంలో స్వార్థకోరికలను నిరాకరించి, యెహోవాకు అంగీకృతమైన క్రియలనే చేస్తాడు.

7. క్రైస్తవుని మ్రాను ఏమిటి, అతడు దానినెట్లు మోస్తాడు?

7 కాబట్టి నీవు సిలువ (మ్రాను NW) మోయుట గంభీరమైన భావాలను కలిగియుంది. మ్రాను మోయుట ఒక బరువైన కార్యము, ఆలాగే అది మరణానికి సూచన. యేసుక్రీస్తు అనుచరునిగా ఉన్నందుకు అవసరమైతే బాధను, అవమానాన్ని, హింసను, చివరకు మరణాన్ని సహితం సహించడానికి ఆ క్రైస్తవుడు ఇష్టపడతాడు. యేసు ఇట్లన్నాడు: “తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.” (మత్తయి 10:38) బాధననుభవించు వారందరు మ్రాను మోయుట లేదు. దుష్టులకు అనేక “వేదనలు” కలవు, గాని వారియొద్ద మ్రాను లేదు. (కీర్తన 32:10) అయితే, క్రైస్తవ జీవితము త్యాగనిరతితో యెహోవాకుచేసే సేవే మ్రాను మోస్తూ జీవించేదై యుంది.

8. తన అనుచరులకు యేసు ఎలాంటి జీవిత మాదిరినుంచాడు?

8 యేసు చెప్పిన చివరి షరతేమనగా మనం ఎడతెగక ఆయనను వెంబడించడం. ఆయన బోధించిన దాన్ని నమ్మి అంగీకరించుటే కాదుగాని, మన జీవితమంతటిలో ఆయనుంచిన మాదిరిని ఎడతెగక అనుసరించవలెనని యేసు కోరుచున్నాడు. ఆయన జీవిత మాదిరియందు మనం చూడగల కొన్ని ప్రముఖమైన అంశాలేవి? తన అనుచరులకిచ్చిన చివరి ఆజ్ఞలో ఆయనిలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, . . . నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) యేసు రాజ్యసువార్తను ప్రకటించి, దాన్ని బోధించాడు. ఆలాగే ఆయన తొలి అనుచరులు, యావత్‌ తొలి క్రైస్తవ సంఘమూ చేసింది. ఆసక్తితో వారు చేసిన ఈ కార్యము, దానికితోడు వారు లోకసంబంధులై యుండనందున, అది వారిమీదకు ద్వేషమును, లోక వ్యతిరేకతను తెచ్చింది, దాని ఫలితంగా వారు భరించే హింస మరింత ఎక్కువైనది.—యోహాను 15:19, 20; అపొస్తలుల కార్యములు 8:4.

9. యేసు ఇతరులను ఎలా చూశాడు?

9 యేసు జీవితమందు మనం చూడగల మరో ప్రముఖమైన మాదిరేమంటే, ఆయన ఇతరులతో వ్యవహరించిన తీరు. ఆయన దయామయుడును, “సాత్వికుడును దీనమనస్సు” గలవానిగా ఉండెను. ఆ విధంగా, ఆయన బోధవిన్నవారు నూతనోత్సాహంపొంది, ఆయన సన్నిధియందు ప్రోత్సాహాన్ననుభవించారు. (మత్తయి 11:29) తనను వెంబడించాలని ఆయన వత్తిడి చేయలేదు లేదా వారెలా చేయాలో చెప్పడానికి అనేక నియమాలుంచలేదు; లేదా తన శిష్యులు కావడానికి వారిని ఒత్తిడి చేసేందుకు తప్పుచేసేవారనే భావాలు వారిలో కలుగజేయలేదు. వారి స్వయంత్యాగ జీవితమందు సహితం వారు నిజమైన ఆనందాన్ని అనుభవించారు. “అంత్యదినములలో” స్వయం తృప్తియనే లౌకిక దృష్టి కలిగియుండే వారికి అదెంత భిన్నంగావుంది!—2 తిమోతి 3:1-4.

యేసువలె స్వయంత్యాగ స్ఫూర్తిని వృద్ధిచేసుకుని దాన్ని కాపాడుకోండి

10. (ఎ) ఫిలిప్పీయులు 2:5-8 ప్రకారం, క్రీస్తు తననెలా ఉపేక్షించుకున్నాడు? (బి) మనం క్రీస్తు అనుచరులమైతే, మనమెలాంటి స్వభావాన్ని కనబర్చాలి?

10 ఉపేక్షించుకోవడంలో యేసు తానుగా ఒక మాదిరి నుంచాడు. ఆయన తన మ్రాను నెత్తికొని తన తండ్రి చిత్తం చేస్తూ దాన్ని ఎడతెగక మోసాడు. ఫిలిప్పీలోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.” (ఫిలిప్పీయులు 2:5-8) అంతకంటే మరింత సంపూర్ణంగా ఎవరు ఉపేక్షించుకొనగలరు? నీవు క్రీస్తుయేసుకు చెంది, ఆయన అనుచరుల్లో ఒకడవైతే, నీవు ఈ మానసిక దృక్పథాన్ని కలిగియుండాలి.

11. స్వయంత్యాగ జీవితాన్ని జీవించడమంటే ఎవరి చిత్తం కొరకు జీవించడమని దానిభావం?

11 యేసు మనకొరకు బాధపడి మరణించినందున, క్రైస్తవులు క్రీస్తుకున్న స్ఫూర్తినే కలిగియుండి, బహుగా సిద్ధపడిన సైనికులవలె తమను సిద్ధపరచుకోవాలని మరో అపొస్తలుడైన పేతురు మనకు చెప్పుతున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.” (1 పేతురు 3:18; 4:1, 2) యేసు స్వయంత్యాగ విధానం ఆయన దేవుని చిత్తాన్నిగూర్చి ఎలా భావించాడో స్పష్టంగా చూపింది. చివరకు అవమానకరమైన మరణమువరకు అన్నివేళలా తన స్వంత అభీష్టంకంటే తన తండ్రి చిత్తాన్నే ఉన్నతంగా ఉంచుతూ ఆయన తన భక్తియందు దృష్టిని కలిగియుండెను.—మత్తయి 6:10; లూకా 22:42.

12. స్వయంత్యాగ జీవితం యేసుకు అప్రీతికరంగా ఉండెనా? వివరించుము.

12 యేసు స్వయంత్యాగ స్ఫూర్తిగల జీవితం శ్రమలతో నిండి, ఒక సవాలుగా ఉన్ననూ, అది అప్రీతికరంగా ఉన్నట్లు ఆయన అనుకోలేదు. బదులుగా, యేసు దైవచిత్తానికి లోబడుటయందు ఆనందించాడు. దేవునిచిత్తం చేయడం ఆయనకు ఆహారంగా ఉండెను. ఒకవ్యక్తి మంచి ఆహారాన్నుండి తృప్తి పొందునట్లే ఆయన దాన్నుండి నిజమైన సంతృప్తి పొందాడు. (మత్తయి 4:4; యోహాను 4:34) ఆ విధంగా, నీ జీవితం నిజంగా సార్థకమైందని నీవు భావించాలంటే, యేసు మానసిక స్వభావాన్ని పెంపొందించుకొనుట ద్వారా ఆయన మాదిరిని అనుకరించుటకంటె శ్రేష్ఠమైనది మరొకటి ఉండజాలదు.

13. ప్రేమ ఎలా స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రేరేపించే శక్తైయుంది?

13 స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రేరేపించే నిజమైన శక్తి ఏమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే, అది ప్రేమ. యేసు ఇలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” (మత్తయి 22:37-39) ఒక క్రైస్తవుడు స్వీయాభీష్టం చేస్తూ, అదే సమయంలో ఆ మాటలకు విధేయుడు కాలేడు. తన సంతోషం, ఆసక్తి ప్రథమంగా యెహోవా యెడల తనకున్న ప్రేమచే, ఆ తర్వాత పొరుగువాని యెడల తనకున్న ప్రేమచే నడిపించబడాలి. యేసు ఆ విధంగా జీవించాడు, తన అనుచరులనుంచి ఆయన కోరేదికూడా అదే.

14. (ఎ) హెబ్రీయులు 13:15, 16లో ఏ బాధ్యతలు వివరింపబడ్డాయి? (బి) ఆసక్తితో సువార్త ప్రకటించుటకు మనలనేది ప్రోత్సహిస్తుంది?

14 అపొస్తలుడైన పౌలు ఈ ప్రేమ నియమాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:15, 16) క్రైస్తవులు యెహోవాకు జంతుబలులు లేక అటువంటివి అర్పించరు గనుక, తమ ఆరాధన కొరకు భూసంబంధమైన ఆలయమందు మానవ యాజకుల అవసరం లేదు. క్రీస్తుయేసు ద్వారా మనం మన స్తుతియాగము అర్పించుదుము. ప్రాముఖ్యముగా ఈ స్తుతియాగము ద్వారానే, ఆయన నామమును ఒప్పుకొనుచు దేవునియెడల మన ప్రేమను చూపుదుము. ప్రత్యేకంగా ప్రేమయందు వేళ్లూనికొనిన మన నిస్వార్థ స్ఫూర్తి అన్ని సమయాల్లో దేవునికి మన జిహ్వఫలాన్ని అర్పించుటకు సిద్ధంగా ఉండునట్లు కృషిచేస్తూ నూతనోత్సాహముతో సువార్త ప్రకటించడానికి మనలను ప్రోత్సహిస్తుంది.

స్వయం త్యాగం ఎన్నో ఆశీర్వాదాలు తెస్తుంది

15. స్యయం త్యాగమును గూర్చి మనకై మనమెలాంటి పరిశోధనాత్మక ప్రశ్నలు వేసికోవాలి?

15 ఒక్క క్షణమాగి ఈ క్రింది ప్రశ్నలను ధ్యానించుము: నా ప్రస్తుత జీవన పద్ధతి స్వయంత్యాగ విధానాన్ని ప్రదర్శిస్తున్నదా? నా లక్ష్యాలు అటువంటి జీవితాన్ని సూచిస్తున్నవా? నా మాదిరినుండి నా కుటుంబ సభ్యులు ఆత్మీయ లాభాల్ని పొందుతున్నారా? (1 తిమోతి 5:8 పోల్చండి.) అనాధల, విధవరాండ్ర విషయమేమి? నా స్వయంత్యాగ స్ఫూర్తి నుండి వారుకూడ ప్రయోజనం పొందుతున్నారా? (యాకోబు 1:27) స్తుతియాగ సేవయందు గడిపే సమయాన్ని నేను ఎక్కువచేయగలనా? పయినీర్‌, బేతేలు, లేదా మిషనరీ సేవాధిక్యతలను చేపట్టుటకు నేను అర్హుడను కాగలనా, లేదా రాజ్య ప్రచారకులు ఎక్కువగా అవసరమున్న ప్రాంతమందు సేవచేయుటకు నేనెక్కడికైనా వెళ్లగలనా?

16. స్వయంత్యాగ జీవితం జీవించడానికి బుద్ధిసూక్ష్మత మనకెలా సహాయపడుతుంది?

16 స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించునట్లు పూర్తి సామర్థ్యానికి చేరుకొనుటకు కొన్నిసార్లు కేవలం కొద్దిపాటి బుద్ధిసూక్ష్మతే కావల్సివుంటుంది. ఉదాహరణకు, ఈక్వెడార్‌లో క్రమ పయినీర్‌గా సేవచేస్తున్న జానెట్‌ ఇంతకుముందు ఉద్యోగం చేసుకునేది. ఈ మధ్యే, సంతోషంగా తన క్రమ పయినీర్‌ సేవా గంటలను పూర్తిచేయడాన్ని ఆమె ఉద్యోగ సమయాలు కష్టతరం చేశాయి. ఆమె తన యాజమానితో తనకున్న సమస్య వివరించి, తన పని గంటలు తగ్గించమని వేడుకుందామని నిర్ణయించుకుంది. ఆయన పనికాలాన్ని తగ్గించడానికి ఇష్టపడనందున, ఆమె పయినీర్‌ సేవచేయగల్గునట్లు పార్ట్‌టైం ఉద్యోగం కొరకు వెదకుచున్న మారియాను తనతోకూడ తీసుకెళ్లింది. వారిద్దరు కలిసి చెరో సగం దినం, అంటే ఒక పూర్తిదినం పనిచేస్తామని చెప్పినప్పుడు, అట్టి ప్రతిపాదనకు ఆ యజమాని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ యిద్దరు సహోదరీలు క్రమ పయినీర్లుగా ఉన్నారు. దీని అద్భుత ఫలితాన్ని చూసిన మీదట, అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన పయినీర్‌ సేవాగంటల్ని చేరుకోవడానికి ఇబ్బందిపడుతున్న కాఫా, తనతోపాటు మాగ్గిని తీసుకెళ్లి తానుకూడ వారి మాదిరిగానే పనిచేస్తానని చెప్పింది. ఇదికూడ అంగీకరింపబడింది. ఆ విధంగా, ఇద్దరు పూర్తికాల సేవను వదులుకోవడానికి బదులు, ఇప్పుడు నలుగురు సహోదరీలు పయినీర్‌ సేవ చేయగల్గుతున్నారు. కాస్త బుద్ధిసూక్ష్మత, చొరవ ప్రయోజనకరమైన సత్ఫలితాలనిచ్చాయి.

17-21. ఒక వివాహిత జంట తమ జీవిత సంకల్పాన్ని ఎలా తిరిగి సార్థకం చేసుకున్నారు, దాని ఫలితమేమి?

17 అంతేకాదు, గత పది సంవత్సరాల కాలంలో ఇవాన్‌ అనుసరించిన స్యయంత్యాగ మార్గాన్ని ఆలోచించండి. ఆమె 1991 మేలో వాచ్‌టవర్‌ సొసైటికి ఈ క్రింది విధంగా వ్రాసింది:

18 “అక్టోబరు 1982లో నేను, నా కుటుంబం బ్రూక్లిన్‌ బేతేలు సందర్శించాము. దాన్ని చూడ్డం నేనక్కడ సేవచేసే కోరికను నాలో కల్గించింది. నేను దాని సంబంధిత దరఖాస్తు చదివినప్పుడు అందులో గమనార్హమైన ఒక ప్రశ్నయేమంటే, ‘గత ఆరునెలల్లో నీ ప్రాంతీయ సేవాగంటల సగటు ఎంత? ఒకవేళ ఆ సేవా గంటలు పదికంటే తక్కువగా ఉంటే, ఎందుకో వివరించుము.’ నేను తక్కువ గంటలు చేయడానికి తగిన కారణమేమిటో నేను చూడలేకపోయాను, కావున నేనొక లక్ష్యం పెట్టుకుని ఐదునెలలపాటు దాన్ని చేరుకున్నాను.

19 “పయినీర్‌ సేవ చేయలేకపోవడానికున్న కొన్ని సాకుల్నిగూర్చి నేను తలంచగల్గిననూ, 1983 ఇయర్‌బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌ను చదివినప్పుడు, పయినీర్‌ సేవచేయడానికి ఇతరులు నాకంటే పెద్ద అడ్డంకులనే అధిగమించగల్గారని నేను తెల్సుకున్నాను. కాబట్టి, ఏప్రిల్‌ 1, 1983లో నేను మంచి ఆదాయంగల ఉద్యోగాన్ని వదిలిపెట్టి మొదట సహాయ పయినీర్‌ సేవచేసి, ఆ తర్వాత సెప్టెంబరు 1, 1983లో క్రమ పయినీర్‌ సేవలో ప్రవేశించాను.

20 “ఆ తర్వాత, 1985 ఏప్రిల్‌లో ఒక చక్కని సంఘ పరిచారకునితో నా వివాహమయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత, ఒక జిల్లా సమావేశంలో పయినీర్‌ సేవను గూర్చి ఇవ్వబడిన ప్రసంగం నా భర్తను కదిలించగా, ఆయన నాతో మెల్లగా, ‘సెప్టెంబరు 1 నుండి నేను పయినీర్‌ సేవ ఆరంభించకుండుటకు ఏదైనా కారణముందంటావా?’ అని అడిగాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆయన నాతో ఈ సేవలో పాల్గొన్నారు.

21 “నా భర్త బ్రూక్లిన్‌ బేతేలు నిర్మాణపనిలో రెండువారాలు స్వచ్ఛందంగా పనిచేసి, అంతర్జాతీయ నిర్మాణ కార్యక్రమానికి కూడ దరఖాస్తు చేశారు. కాబట్టి 1989 మేలో బ్రాంచి నిర్మాణపు పనిలో సహాయపడ్డానికి ఒకనెలపాటు మేము నైజీరియా వెళ్లాము. రేపు మేము జర్మనీకి వెళ్తున్నాము, అక్కడ మాకు పోలాండ్‌ వెళ్లడానికి వీసాలు ఏర్పాటుచేయబడతాయి. అటువంటి చరిత్రాత్మకమైన నిర్మాణపు ప్రణాళికలో పనిచేస్తూ, పూర్తికాల సేవయొక్క ఈ క్రొత్త పద్ధతిలో భాగం వహించడం మాకెంతో పులకింతగా వుంది.”

22. (ఎ) మనకు తెలియకుండానే పేతురువలె మనమెలా ఒక అడ్డంకుగా తయారుకావచ్చును? (బి) స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట దేనిపై ఆధారపడిలేదు?

22 పయినీర్‌ సేవచేయడం మీకు వీలుపడనట్లయిన, పూర్తికాల సేవలో ఉన్నవారు అట్టి ఆధిక్యతను హత్తుకొనియుండుటకు ప్రోత్సహిస్తూ, వీలైతే వారట్టి సేవచేయుటకు వారికి మీరు సహాయం చేయగలరా? లేదా తమ మాటలెట్లు అడ్డంకుగా ఉండగలవో గ్రహించకుండా, పేతురువలె ఒక పూర్తికాల సేవకునితో ఎందుకు ఇబ్బంది పడతావు, హాయిగా ఉండరాదూ అనే కుటుంబ సభ్యులుగా లేదా స్నేహితులుగా మీరుంటారా? నిజమే, ఒక పయినీర్‌ ఆరోగ్యం బాగాపాడైతే లేదా అతడు తన క్రైస్తవ బాధ్యతల్ని నిర్లక్ష్యచేస్తే కొంతకాలం పాటు అతను తన పూర్తికాల సేవను విడిచిపెట్టాల్సి వస్తుంది. స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట అనగా పయినీరుగా, బేతేలు సభ్యునిగా లేక ఇతరత్రా అనే బిరుదుపై ఆధారపడియుండదు. బదులుగా, అది మనమెలాంటి వ్యక్తులము, అనగా మనమెలా తలంచుదుము, మనమేమి చేయుదుము, మనం ఇతరులనెట్లు చూస్తాము, మన జీవితాన్ని మనమెలా జీవిస్తాము అనే దానిపై ఆధారపడియుంటుంది.

23. (ఎ) దేవునితో జతపనివారమై యుండే ఆనందాన్ని మనమెట్లు ఎడతెగక కలిగియుండగలము? (బి) హెబ్రీయులు 6:10-12లో ఎలాంటి అభయం మనకున్నది?

23 మనం నిజంగా స్వయంత్యాగ స్ఫూర్తిని కల్గియున్నట్లయితే, మనం దేవుని జతపనివారమనే ఆనందం మనకుంటుంది. (1 కొరింథీయులు 3:9) మనం యెహోవా హృదయానికి సంతోషం కల్గిస్తున్నామనే సంతృప్తి మనకుంటుంది. (సామెతలు 27:11) మనం నమ్మకంగా నిలిచియున్నంత కాలం యెహోవా ఎన్నడూ మనలను విడువడని లేదా ఎడబాయడనే అభయం మనకుంది.—హెబ్రీయులు 6:10-12.

[అధస్సూచీలు]

a గ్రీకులో “అడ్డంకు” (σκάνδαλον, స్కాండలోన్‌) అనుమాట నిజానికి “బిగించిన బోనులో ఎర తగిలించబడిన భాగం పేరు, కాబట్టి దానంతటదే బోను లేదా ఉరి” అని దాని భావం.—వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌.

మీ తలంపులేమి?

◻ స్వయంత్యాగ విధానానికి పేతురు ఎలా తనకు తెలియకుండానే ఒక అడ్డంకుగా తయారయ్యాడు?

◻ తన్నుతాను ఉపేక్షించుకొనుట అంటే దాని భావమేమి?

◻ క్రైస్తవుడు తన మ్రానునెట్లు మోస్తాడు?

◻ స్వయంత్యాగ స్ఫూర్తిని మనమెట్లు వృద్ధిచేసుకుని, దానిని కాపాడుకొందుము?

◻ స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రేరేపించే శక్తి ఏమైయుంది?

[10వ పేజీలోని చిత్రం]

నిన్నునీవు ఉపేక్షించుకోవడానికి, హింస భరించడానికి, ఎడతెగక యేసును వెంబడించడానికి ఇష్టపడుతున్నావా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి