కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 8/1 పేజీలు 23-27
  • వివాహము మాత్రమే సంతోషమునకు కీలకమై యున్నదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివాహము మాత్రమే సంతోషమునకు కీలకమై యున్నదా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంతోషముగా ఉండుటకు కారణములు
  • “ప్రభువునందు మాత్రమే”
  • “ప్రభువునందు” వివాహము వీలుకాలేదు
  • నిజమైన సంతోషమునకు కీలకము
  • “కొడుకులు కూతుళ్ల . . . కంటె శ్రేష్ఠమైనది”
  • సంతోషమునకు వివాహము మాత్రమే కీలకము కాదు
  • యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • పెళ్లి గురించి బైబిలు ఏం చెప్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 8/1 పేజీలు 23-27

వివాహము మాత్రమే సంతోషమునకు కీలకమై యున్నదా?

“ఆమెకిష్టమైనవానిని పెండ్లిచేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలు.”—1 కొరింథీయులు 7:39, 40.

1. లేఖనములు యెహోవాను ఎట్లు వర్ణించుచున్నవి, ఆయన తాను సృష్టించిన ప్రాణులయెడల ఏమిచేసెను?

యెహోవా “సంతోషముగల దేవుడు.” (1 తిమోతి 1:11, NW) సమృద్ధిగా అనుగ్రహించు వానిగా ఆయన, తన సేవలో సంతోషముగా ఉండుటకు తన తెలివిగల—మానవ మరియు ఆత్మీయ—ప్రాణులందరికి కచ్ఛితముగా ఏమి అవసరమో అట్టి “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అందుబాటులో ఉండునట్లు చేయుచున్నాడు. (యాకోబు 1:17) ఆ విషయములో, సంగీతము పూర్తిగా ఆలపించు పక్షి, తోకాడిస్తూ ఆనందంతో గంతులువేయు కుక్కపిల్ల, ఆటలాడు డాల్ఫిన్‌ వీటన్నింటిని యెహోవా, తమతమ అలవాట్ల ప్రకారము జీవితములో ఆనందించు ప్రాణులుగా సృష్టించెననుటను రుజువు చేయుచున్నవి. కవితాభావనలో కీర్తనల రచయిత “యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి” అని చెప్పునంత మేరకు వెళ్లెను.—కీర్తన 104:16.

2. (ఎ) తన తండ్రి చిత్తము చేయుటలో యేసు సంతోషమును కనుగొనెనని ఏమి చూపించుచున్నది? (బి) సంతోషమునకు యేసు శిష్యులు ఏ కారణములు కలిగియున్నారు?

2 యేసుక్రీస్తు ‘దేవుని పరిపూర్ణ తత్వముయొక్క మూర్తిమంతమై యున్నాడు.’ (హెబ్రీయులు 1:3) కాబట్టి, యేసు “సంతోషము గలవాడును, అద్వితీయుడునగు సర్వాధికారి” అని పిలువబడవలెననుటలో ఆశ్చర్యమేమియు లేదు. (1 తిమోతి 6:15 NW) ఆహారము, కేవలము ఆనందము ననుభవించుటకంటె యెహోవా చిత్తముచేయుట ఎట్లు మరింత తృప్తి నివ్వగలదనుటకు ఆయన అద్భుతకరమైన మాదిరిని దయచేయు చున్నాడు. దేవునియందు భయభక్తులతో మెలగుట, అనగా ఆయనయెడల మిక్కిలి పూజ్యభావమును కలిగియుండి, ఆయనను అప్రీతిపరచుటకు సరియైన భయమును కలిగియుండుటలో ఆనందముండగలదని కూడ యేసు మనకు చూపించుచున్నాడు. (కీర్తన 40:8; యెషయా 11:3; యోహాను 4:34) రాజ్య ప్రచారయాత్ర ముగించుకొని ఆ 70 మంది శిష్యులు “సంతోషముతో” తిరిగివచ్చినప్పుడు, యేసుకూడ “పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను.” ప్రార్థనలో తన ఆనందమును తండ్రికి వ్యక్తముచేసిన తర్వాత, ఆయన తన శిష్యులవైపు తిరిగి ఇట్లనెను: “మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరి.”—లూకా 10:17-24.

సంతోషముగా ఉండుటకు కారణములు

3. సంతోషమునకుగల కొన్ని కారణములు ఏమైయున్నవి?

3 ఈ అంత్యకాలములో యెహోవా వాక్యము మరియు సంకల్పముల నెరవేర్పులో మనముచూసే సంగతులను చూచుటకు మన కన్నులును సంతోషించ వలదా? యెషయా, దానియేలు, దావీదువంటి నమ్మకమైన ప్రవక్తలు మరియు రాజులు అర్థము చేసికోలేని ప్రవచనములను అర్థము చేసికొనుటకు మనము అమితానందము నొందవలదా? మన రాజు మరియు సంతోషముగల సర్వాధికారియైన యేసుక్రీస్తు నాయకత్వము క్రింద, సంతోషముగల దేవుడైన యెహోవాను సేవించుటకు, మనము ఆనందించుట లేదా? మనము ఆనందిస్తున్నామనుకోండి.

4, 5. (ఎ) యెహోవా సేవలో సంతోషముగా నిలిచియుండుటకు, మనము దేనిని విసర్జించవలెను? (బి) సంతోషమునకు దోహదపడు కొన్ని సంగతులు ఏమైయున్నవి, మరియు ఇది ఏ ప్రశ్నను లేవనెత్తును?

4 అయితే, మనము దేవుని సేవలో సంతోషముగా నిలిచియుండ వలెనంటే, సంతోషము కొరకు మనము ముందుగా కోరుకునేవి లౌకిక ఆలోచనలపై ఆధారపడి యుండకూడదు. వాటిలో వస్తుదాయక సంపత్తి, డంబమైన జీవన విధానము వంటివి చేరియుండును గనుక, అవి సులభముగా మన తలంపులను అస్పష్టము చేయగలవు. ఈ లోకము గతించిపోవుచున్నది గనుక, అటువంటి సంగతులపై ఆధారపడు ఎటువంటి ‘సంతోషమైనను’ తాత్కాలికమై యుండును.—1 యోహాను 2:15-17.

5 లౌకిక లక్ష్యాలను సాధించుట నిజమైన సంతోషమును తీసుకురాదని యెహోవాయొక్క సమర్పిత సేవకులనేకమంది గ్రహించియున్నారు. తన సేవకుల నిజమైన సంతోషమునకు దోహదపడగల ఆత్మీయ, వస్తుదాయక సంగతులను కేవలము మన పరలోకపు తండ్రి దయచేయుచున్నాడు. “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా అందింపబడుచున్న ఆత్మీయాహారము నిమిత్తము మనమెంత కృతజ్ఞులమై యున్నాము! (మత్తయి 24:45-47) దేవుని ప్రేమగల హస్తమునుండి మనము పొందుచున్న భౌతికాహారము మరియు ఇతర వస్తుదాయక సంగతుల కొరకు కూడ మనము కృతజ్ఞత కలిగియున్నాము. ఇంకా, వివాహమను అద్భుతకరమైన యీవియు, తత్సంబంధమైన కుటుంబ జీవితానందములు కూడ కలవు. విధవరాండ్రయిన తన కోడళ్ల విషయములో నయోమి హృదయపూర్వకముగా ఇష్టపడుటను ఈ మాటలలో వ్యక్తపర్చెననుటలో ఆశ్చర్యము లేదు: “మీలో ఒక్కొక్కతె పెండ్లిచేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక.” (రూతు 1:9) కావున వివాహమనునది మరింత సంతోషమునకు ద్వారము తెరచుటలో ఒక కీలకమైయున్నది. అయితే సంతోషదాయక జీవితమునకు ముఖద్వారము తెరచుటలో వివాహము మాత్రమే కీలకమైయున్నదా? ఇది ఆ ప్రకారముగానే యున్నదాయని ప్రత్యేకముగా యువత గంభీరముగా పరీక్షించుకొనవలెను.

6. ఆదికాండము ప్రకారము, వివాహ యేర్పాటు యొక్క ప్రాథమిక సంకల్పము ఏమైయుండెను?

6 వివాహారంభమును గూర్చి గుర్తుచేయుచు, బైబిలు ఇట్లనుచున్నది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా—మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:27, 28) వివాహమును యెహోవా ప్రారంభించుట ద్వారా, ఆదాము మరియెక్కువమంది మానవ ప్రాణులను ఉనికిలోనికి తెచ్చుటకు ఉపయోగించబడెను. ఆ విధముగా మానవజాతి విస్తరించుటకు ఆరంభమాయెను. అయితే వివాహమునకు దీనికంటే ఎక్కువ భావము కలదు.

“ప్రభువునందు మాత్రమే”

7. వివాహముయొక్క ఏ అవసరత ఒకానొక నమ్మకమైన పితరుడు గొప్ప ప్రయత్నములు చేయుటకు కారణమాయెను?

7 వివాహమునకు యెహోవా దేవుడే కర్త గనుక, తన సేవకులకు సంతోషము కలిగించు రీతిలో వివాహబంధమునకు ఆయనే ప్రమాణములు నిర్ణయించుటకు మనము అపేక్షింతుము. పితరుల కాలములలో, యెహోవా ఆరాధికులు కానివారిని వివాహము చేసికొనుట గట్టిగా నిరుత్సాహపరచబడెను. పితరుని కుమారుడైన ఇస్సాకునకు కనానీయ స్త్రీలలోనుండి భార్యను తీసుకురాకుండు నిమిత్తము అబ్రాహాము తన సేవకుడైన ఎలియాజరును యెహోవా పేరిట ప్రమాణము చేయించెను. ఎలియాజరు ఎంతోదూరము ప్రయాణించి, ‘తన యజమాని కుమారునికి యెహోవా నియమించిన స్త్రీని’ కనుగొనుటకు అబ్రాహాము ఇచ్చిన ఆదేశములను నమ్మకముగా అనుసరించెను. (ఆదికాండము 24:3, 44) అలా ఇస్సాకు రిబ్కాను వివాహము చేసికొనెను. వారి కుమారుడైన ఏశావు అన్యులైన హిత్తీయులలోనుండి తనకు భార్యలను ఎన్నుకొనినప్పుడు, ఈ స్త్రీలు “ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.”—ఆదికాండము 26:34, 35; 27:46; 28:1, 8.

8. ధర్మశాస్త్రము వివాహము విషయమై ఎటువంటి నిషేధము నుంచెను, ఎందుకు?

8 ధర్మశాస్త్రము ప్రకారము, ప్రత్యేకముగా చెప్పబడిన కనానీయుల పురుషులను లేక స్త్రీలను వివాహము చేసికొనుట నిషేధింపబడెను. యెహోవా తన ప్రజలకిట్లు ఉపదేశించెను: “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.”—ద్వితీయోపదేశకాండము 7:3, 4.

9. వివాహమును గూర్చి బైబిలు క్రైస్తవులకు ఏ సలహా నిచ్చుచున్నది?

9 అదేప్రకారము యెహోవాను ఆరాధించని వారిని వివాహము చేసికొనుటను గూర్చిన నిషేధములు క్రైస్తవ సంఘమునకును అన్వయించుననుటలో ఆశ్చర్యము లేదు. అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు ఇట్లు సలహానిచ్చెను: “మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” (2 కొరింథీయులు 6:14, 15) ఆ సలహా వివిధ రీతులలో అన్వయించును, మరి నిశ్చయముగా అది వివాహమునకు అన్వయించును. యెహోవా సమర్పిత సేవకులందరికి పౌలుయొక్క స్పష్టమైన ఉపదేశమేమనగా, వారు కేవలము ఎవరైతే ‘ప్రభువునందు ఉందురో వారిని మాత్రమే’ వివాహము చేసికొనుటకు ఆలోచించవలెను.—1 కొరింథీయులు 7:39, NW అధస్సూచి.

“ప్రభువునందు” వివాహము వీలుకాలేదు

10. అనేకమంది అవివాహిత క్రైస్తవులు ఏమి చేయుచున్నారు, మరియు ఏ ప్రశ్న ఉత్పన్నమగుచున్నది?

10 అనేకమంది అవివాహిత క్రైస్తవులు ఒంటరిగా ఉండు దైవానుగ్రహ గుణమును పెంపొందించుకొనుట ద్వారా యేసుక్రీస్తు మాదిరిని అనుకరించుటకు ఎన్నుకొనిరి. ఆలాగే ప్రస్తుతము దైవభక్తిగల జతను కనుగొని, “ప్రభువునందు” వివాహమాడుటకు వీలుకానందున, యథార్థపరులైన అనేకమంది క్రైస్తవులు యెహోవాయందు తమ నమ్మికయుంచి, అవిశ్వాసిని వివాహమాడుటకు బదులు అవివాహితులుగానే నిలిచియుండిరి. పవిత్రముగా తమ అవివాహిత స్థితిని కాపాడుకొనుటకు శక్తిమంతులను చేయుచు, దేవుని ఆత్మ వారిలో సంతోషము, సమాధానము, విశ్వాసము, ఆశానిగ్రహమువంటి ఫలములను ఫలింపజేసెను. (గలతీయులు 5:22, 23) దేవునియెడల భక్తికి సంబంధించిన ఈ పరీక్షను విజయవంతముగా ఎదుర్కొను వారిలో ఎక్కువమంది మన క్రైస్తవ సహోదరీలే ఉన్నారు. వారియెడల మనకు మిక్కిలి గౌరవము కలదు. అనేక దేశాలలో, వారు సహోదరులకంటె ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, గనుక ప్రకటించు పనిలో వారు ఎక్కువ భాగమును కలిగియున్నారు. నిజమే, “యెహోవా తానుగా ఈ మాట సెలవిచ్చుచున్నాడు; సువార్త ప్రకటించు స్త్రీలు ఒక గొప్ప సైన్యముగా ఉన్నారు.” (కీర్తన 68:11 NW) వాస్తవానికి, అటు పురుషులు ఇటు స్త్రీలలోకూడ అవివాహిత దేవుని సేవకులు అనేకమంది తమ యథార్థతను కాపాడుకొనుచున్నారు ఎందుకంటె వారు ‘తమ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మికయుంచారు, కాగా ఆయన వారి త్రోవలను సరాళము చేయుచున్నాడు.’ (సామెతలు 3:5, 6) అయితే ప్రస్తుతము “ప్రభువునందు” వివాహము చేసికొనలేని వారు నిశ్చయముగా అసంతోషులై యుందురా?

11. బైబిలు సూత్రములయెడల గౌరవమునుబట్టి అవివాహితులుగా నిలిచియుండు క్రైస్తవులకు ఏ అభయము కలదు?

11 సంతోషముగల, సర్వాధికారియగు యేసుక్రీస్తు ఆధ్వర్యములో, సంతోషముగల దేవుడగు యెహోవా సేవచేయుచున్న సాక్షులమను సంగతిని మనము గుర్తుంచుకొందము. అందువలన “ప్రభువునందు” వివాహజతను కనుగొనలేకపోయినందుకు ఒంటరిగానే ఉండుటకు బైబిలులో స్పష్టముగా వ్రాయబడియున్న నిషేధములయెడల మనకున్న గౌరవము మనలను ప్రేరేపించిన, దేవుడు మరియు క్రీస్తు మనలను అసంతోషులుగా ఉండుటకు విడిచిపెట్టుదురని తలంచుట న్యాయసమ్మతముగా ఉండునా? నిశ్చయముగా కాదు. కాబట్టి అవివాహిత స్థితిలోకూడ క్రైస్తవులు సంతోషముగా ఉండుట సాధ్యమేయని మనము తేల్చిచెప్పవలెను. మనము వివాహితులమైనను లేక అవివాహితులమైనను మనము నిజముగా సంతోషముగా ఉండునట్లు యెహోవా చేయగలడు.

నిజమైన సంతోషమునకు కీలకము

12. అవిధేయులైన దేవదూతల చర్యనుబట్టి, వివాహమునుగూర్చి అదేమి సూచిస్తున్నది?

12 సంతోషమునకు దేవుని సేవకులందరికి వివాహము మాత్రమే కీలకము కాదు. ఉదాహరణకు, దేవదూతలనే తీసికొనండి. జలప్రళయమునకు ముందు, కొంతమంది దేవదూతలు తాము వివాహము చేసికొనలేమను అసంతృప్తితో, ఆత్మీయ ప్రాణులకు అసహజమైన కోరికలను పెంచుకొని, స్త్రీలను వివాహము చేసికొనుటకు మానవ శరీరములను ధరించుకొనిరి. ఆ విధముగా ఈ దేవదూతలు, ‘తమ నివాసస్థలమును విడిచినందున’ దేవుడు “మహాదినమున జరుగు తీర్పువరకు [వారిని] కటికచీకటిలో నిత్యపాశములతో . . . బంధించి భద్రముచేసెను.” (యూదా 6; ఆదికాండము 6:1, 2) స్పష్టమైన విషయమేమంటె, దూతలు వివాహము చేసికొనుటకు దేవుడు ఎన్నడును ఏర్పాటుచేయలేదు. కావున వారి సంతోషమునకు కేవలము వివాహము మాత్రమే కీలకము కానేరదు.

13. పరిశుద్ధ దేవదూతలు ఎందుకు సంతోషముగా ఉన్నారు, ఇది దేవుని సేవకులందరికి ఏమి సూచించుచున్నది?

13 అయినను, నమ్మకమైన దేవదూతలు సంతోషముగానే ఉన్నారు. “ఉదయ నక్షత్రములు ఆనందముతో స్తుతిగానం చేస్తు, దేవుని [దూతల] కుమారులందరు ఏకముగా కూడి పాడుచుండగా’ యెహోవా భూమియొక్క పునాదులు వేసెను.” (యోబు 38:7, ది న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌) పరిశుద్ధ దూతలెందుకు సంతోషముగా ఉన్నారు? ఎందుకనగా యెహోవా దేవుని “ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము” నెరవేర్చుటకు వారు నిత్యము ఆయన సన్నిధిని ఉన్నారు. ఆయన “చిత్తము నెరవేర్చుటకు” వారు ఆనందించుచున్నారు. (కీర్తన 103: 20, 21, అధస్సూచి NW) అవును, నమ్మకముగా యెహోవాను సేవించుటద్వారా పరిశుద్ధ దేవదూతలకు సంతోషము కలుగును. మానవుల నిజమైన సంతోషమునకు కూడా కీలకమదే. ఆ విషయానికొస్తే, సంతోషముతో ఇప్పుడు దేవున్ని సేవించు వివాహిత అభిషక్త క్రైస్తవులు పరలోక జీవితానికి పునరుత్థానము చేయబడినప్పుడు మరలా వివాహము చేసికొనరు, గాని వారు దైవిక చిత్తముచేయు ఆత్మీయ ప్రాణులుగా సంతోషముగా ఉందురు. కావున వివాహితులైనను లేక అవివాహితులైనను, యెహోవా యథార్థ సేవకులందరు సంతోషముగా ఉండగలరు, ఎందుకనగా నిజమైన సంతోషం కొరకు మనము సృష్టికర్తకు చేయు నమ్మకమైన సేవయే ఆధారము.

“కొడుకులు కూతుళ్ల . . . కంటె శ్రేష్ఠమైనది”

14. ప్రాచీన ఇశ్రాయేలీయులలోని దైవభక్తిగల షండులకు ఏ ప్రవచనార్థక వాగ్దానము చేయబడెను, మరియు ఇది ఎందుకు ఆశ్చర్యకరముగా కన్పించవచ్చును?

14 యథార్థపరుడైన ఒక క్రైస్తవుడు వివాహము చేసికొనకపోయినను, అతని సంతోషము చెక్కుచెదరకుండా ఉండునట్లు దేవుడు చూడగలడు. ప్రాచీన ఇశ్రాయేలీయులలో షండుల నుద్దేశించి ప్రవచనార్థకముగా చెప్పిన ఈ మాటలనుండి మనము ప్రోత్సాహము పొందవచ్చును: “నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను.” (యెషయా 56:4, 5) వారి పేరు శాశ్వతముగా ఉండుటకు వీరికి భార్యపిల్లలు వాగ్దానము చేయబడునని ఒకడు ఎదురు చూసియుండవచ్చును. కాని వారికి “కొడుకులు కూతుళ్ల . . . కంటె శ్రేష్ఠమైనది”—యెహోవా యింట శాశ్వతమైన పేరు వాగ్దానము చేయబడెను.

15. యెషయా 56:4, 5 నెరవేర్పునుగూర్చి ఏమి చెప్పవచ్చును?

15 “దేవుని ఇశ్రాయేలు” ఇమిడియున్న ప్రవచనార్థక చిత్రీకరణలో ఈ షండులు పరిగణించబడినట్లయిన, వారు యెహోవా ఆత్మీయ గృహము లేక ఆలయములో శాశ్వత స్థానము అనుగ్రహింపబడు అభిషక్తులను సూచిస్తున్నారు. (గలతీయులు 6:16) నిస్సందేహముగా, ఈ ప్రవచనము పునరుత్థానము చేయబడిన ప్రాచీనకాల ఇశ్రాయేలీయులలోని దైవభక్తిగల షండులకు అక్షరార్థముగా అన్వయింపును కలిగియుండును. వారు క్రీస్తు విమోచన బలిని అంగీకరించి, యెహోవా సంతోషించు దానియందు కొనసాగినట్లయిన, వారు దేవుని నూతన లోకములో “నిత్యమైన పేరు” సంపాదింతురు. ఈ అంత్యకాలములో యెహోవా సేవకొరకు తమనుతాము సంపూర్ణముగా వినియోగించుకొనుటకు వివాహమును, మాతృమూర్తులగుటను త్యాగముచేసే “వేరే గొఱ్ఱెల” లోని వారికి కూడ ఇది అన్వయించగలదు. (యోహాను 10:16) వారిలో కొందరు అవివాహితులుగా, పిల్లలులేని వారిగా మరణించవచ్చు. కాని నమ్మకముగా ఉండినట్లయితే, నూతన విధానములో పునరుత్థానమందు వారు “కొడుకులు కూతుళ్ల . . . కంటె శ్రేష్ఠమైన”—“కొట్టివేయబడని” పేరు పొందుదురు.

సంతోషమునకు వివాహము మాత్రమే కీలకము కాదు

16. వివాహము అన్ని సమయములలో సంతోషము తీసుకురాదని ఎందుకు చెప్పగలం?

16 విడదీయరాని రీతిలో సంతోషము వివాహముతో సంబంధము కలిగియున్నదని కొంతమంది ప్రజలు భావింతురు. అయితే, ఈనాటి యెహోవా ప్రజలలో సహితము వివాహము అన్ని సమయములలో సంతోషము తీసుకురాదని అంగీకరించవలెను. అది కొన్ని సమస్యలను తీర్చగలదు అయితే తరచు అది అవివాహితులు అనుభవించు వాటికంటె వ్యవహరించుటకు మరింత కష్టమైన ఇతర సమస్యలు తీసుకురాగలదు. వివాహము ‘శరీరసంబంధమైన శ్రమలు’ తీసుకువచ్చునని పౌలు చెప్పెను. (1 కొరింథీయులు 7:28) వివాహిత వ్యక్తి “చింతగలవాడును,” “విభాగింపబడిన మనస్సుగలవాడును” అయిన సందర్భాలు కలవు. అతడు లేక ఆమె “పరధ్యానులు కాకుండా ప్రభువు సన్నిధానవర్తనులై యుండుట” తరచు కష్టముగా ఉన్నట్లు కనుగొనుచున్నారు.—1 కొరింథీయులు 7:33-35 NW.

17, 18. (ఎ) కొంతమంది ప్రయాణ కాపరులు ఏమని రిపోర్టుచేసిరి? (బి) పౌలు ఏ సలహానిచ్చెను, దానిని అన్వయించుట ఎందుకు ప్రయోజనకరమై యున్నది?

17 వివాహము, ఒంటరిగా ఉండుట ఈ రెండును దేవుడు అనుగ్రహించిన యీవులైయున్నవి. (రూతు 1:9; 19:10-12 మత్తయి 19:10-12) అయితే, వీటిలో ఏ స్థితియందైనను కృతకృత్యులయ్యేందుకు ప్రార్థనాపూర్వక ఆలోచన అగత్యము. అనేకమంది సాక్షులు లేతప్రాయములోనే వివాహముచేసికొని, తరచు తత్ఫలితముగావచ్చు బాధ్యతలను మోయుటకు సిద్ధముగా లేనప్పుడే తలిదండ్రులగుచున్నారని ప్రయాణ కాపరులు రిపోర్టు చేయుచున్నారు. వీటిలో కొన్ని వివాహములు విచ్ఛిన్నమగుచున్నవి. ఇతర దంపతులైతే తమ సమస్యలను పరిష్కరించుకొనుచున్నారు గాని వారి వివాహము సంతోషమును తీసికొనిరాలేదు. ఒక ఆంగ్ల నాటక రచయిత విలియం కాంగ్రీవ్‌ ఇలా వ్రాసెను, తొందరపడి వివాహము చేసికొనువారు “దీర్ఘకాలం పశ్చాత్తాపపడుదురు.”

18 కొంతకాలము వరకు ఒంటరిగానే యుండవలసి ఉండునని కొంతమంది యౌవన సహోదరులు బెతేలుసేవకు దరఖాస్తు చేయుటనుండి లేక మినిస్టీరియల్‌ ట్రెయినింగ్‌ పాఠశాలకు స్వచ్ఛందముగా వచ్చుటనుండి తప్పుకొనుచున్నారని కూడ ప్రాంతీయ కాపరులు రిపోర్టు చేయుచున్నారు. అయితే సరియైన “ఈడు” రాకముందే వివాహము చేసికొనకూడదని పౌలు సలహా నిచ్చుచున్నాడు, అంటే తొలిప్రాయమందలి లైంగికావేశపు కోరిక సన్నగిల్లు వరకు వేచియుండుట అని దాని భావము. (1 కొరింథీయులు 7:36-38) అవివాహిత వయోజనునిగా గడుపు సంవత్సరములు ఆ వ్యక్తికి అమూల్యమైన అనుభవము, పరిజ్ఞానము వచ్చునట్లుచేసి, వివాహిత జతను ఎంపికచేసికొనవలెనా లేక జాగ్రత్తగా పరిశీలించిన మీదట ఒంటరిగానే ఉండిపోవలెనా అని నిర్ణయించుకొనుటకు అతడు లేక ఆమెను ఒక మెరుగైన స్థానములో ఉంచును.

19. వివాహం చేసికొను నిజమైన అవసరతను మనము కలిగిలేనట్లయిన ఆ విషయములను మనమెట్లు దృష్టించవచ్చును?

19 మనలో కొందరు లైంగిక సాన్నిహిత్యము కొరకు బలమైన కోరికగల ఈడు దాటినవారిగా యున్నారు. అప్పుడప్పుడు మనము వివాహపు ఆశీర్వాదములనుగూర్చి ఆలోచిస్తూ ఉండవచ్చును కాని వాస్తవమందు ఒంటరిగా ఉండు దైవానుగ్రహ గుణము మనకుండ వచ్చును. ఆయన సేవలో కొన్ని ఆధిక్యతలను వదులుకొను పరిస్థితి కలిగించు వివాహపు అవసరత నిజానికి లేకుండా, అవివాహిత స్థితిలోనే మనము సమర్థవంతముగా సేవచేయుటను యెహోవా చూడవచ్చును. వివాహము వ్యక్తిగత అవసరము కానట్లయిన, మనము వివాహానుగ్రహము పొందనట్లయిన, మన కొరకు దేవుడు ప్రత్యేకమైన దానినేదో కలిగియుండవచ్చును. కాబట్టి మనకవసరమైన దానిని ఆయన అనుగ్రహించునని మనము నమ్మిక కలిగియుందుము గాక. అన్యులును మారుమనస్సునొంది జీవము కలిగియుండులాగున దేవుడు వారిని అనుగ్రహించెనని ‘చెప్పుకొనుచు దేవుని మహిమపరచిన’ యూదా సహోదరుల వలెనే, మన కొరకు దేవుని చిత్తమని కన్పించిన దానిని వినయముతో అంగీకరించుట ఫలితముగా మహాగొప్ప సంతోషము కలుగును.—అపొ. కార్యములు 11:1-18.

20. (ఎ) ఒంటరిగా యుండుటనుగూర్చి యౌవనులైన క్రైస్తవులకు ఇక్కడ ఏ సలహా ఇవ్వబడినది? (బి) నిజమైన సంతోషము విషయములో ఏ ప్రాముఖ్యమైన సంగతి సత్యమై యుండును?

20 కావున, వివాహము సంతోషమునకు కీలకము కాగలదు, అయినను అది సమస్యలకును ద్వారము తెరువగలదు. అయితే ఒకటి మాత్రము నిశ్చయము: సంతోషమునకు వివాహము మాత్రమే కీలకము కాదు. అన్ని సంగతులు పరిశీలించిన దానినిబట్టి చూస్తే, ప్రత్యేకముగా యౌవన క్రైస్తవులు అనేక సంవత్సరములు అవివాహితులుగా ఉండుటకు ప్రయత్నించుట జ్ఞానయుక్తము. అటువంటి సంవత్సరములను యెహోవాను సేవించుటకు చక్కగా ఉపయోగించి ఆత్మీయముగా ఎదుగవచ్చును. వయస్సు లేక ఆత్మీయ ఎదుగుదల ఎంతున్నను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న వారి విషయములో ఈ ప్రాముఖ్యమైన అంశము సత్యమైయుండును: యెహోవాకు నమ్మకముగా చేయు సేవలోనే నిజమైన సంతోషమును కనుగొనవచ్చును. (w92 5/15)

మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ యెహోవా సేవకులెందుకు సంతోషముగా ఉన్నారు?

◻ మహాగొప్ప సంతోషమునకు వివాహము ఎందుకు కీలకము కాదు?

◻ వివాహజత ఎంపిక విషయములో, యెహోవా ప్రజలనుండి ఏమి చేయవలసి యున్నారు?

◻ ఒంటరిగాయుండు క్రైస్తవులు సంతోషముగా ఉండగలరని నమ్ముట ఎందుకు న్యాయసమ్మతముగా ఉన్నది?

◻ వివాహము, సంతోషములను గూర్చి దేనిని ఒప్పుకొనవలెను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి