కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wcg పేజీలు 246-255
  • “నేను భయపడను”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను భయపడను”
  • ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన చేసుకోండి
  • “ధైర్యం తెచ్చుకోండి!”
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీరు ధైర్యం చూపించగలరు!
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
wcg పేజీలు 246-255

ముగింపు

“నేను భయపడను”

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

1. ధైర్యం గురించి మాట్లాడుకోవడానికి ఇంకేం లేదా?

ఈ పుస్తకం మొత్తం చదివేశాం, చాలామంది గురించి తెలుసుకున్నాం. ధైర్యం గురించి మాట్లాడుకోవడానికి ఇంకేం లేదా? మనలో ధైర్యాన్ని నింపే చాలామంది ఉదాహరణలు బైబిల్లో ఇంకా ఉన్నాయి. అవి ఒక్క పుస్తకంలో సరిపోయేవి కావు. అయితే ధైర్యం చూపించడానికి మనం ఏం చేయాలో, మనకు ఏం కావాలో ఇప్పుడు చూద్దాం.

2. యెహోవాకు నమ్మకంగా ఉంటూ ధైర్యం చూపించిన వాళ్లలో ఇంకెవరైనా మీకు గుర్తొస్తున్నారా?

2 ఈ పుస్తకంలో చెప్పిన వాళ్లు కాకుండా, బైబిల్లో తిరుగులేని ధైర్యం చూపించిన వాళ్లు ఇంకెవరైనా మీకు గుర్తొస్తున్నారా? బహుశా మీకు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, యోనా, మలాకీ లాంటి హీబ్రూ లేఖనాల్లో ఉన్న ప్రవక్తలు గుర్తొచ్చి ఉంటారు. అపొస్తలుడైన పౌలు చెప్పిన కొన్ని కష్టాల్ని వాళ్లు కూడా అనుభవించారు. కొంతమంది ‘ఎగతాళికి గురయ్యారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధించబడ్డారు, చెరసాల పాలయ్యారు.’ ఇంకొంతమంది “చాలీచాలని పరిస్థితుల్లో జీవించారు, శ్రమలు ఎదుర్కొన్నారు, ప్రజలు తమతో చెడుగా వ్యవహరించినప్పుడు సహించారు.” మరికొంతమందిని చంపేశారు. (హెబ్రీ. 11:36, 37) అయినా, వాళ్లంతా ధైర్యం చూపిస్తూ యెహోవా వైపు నిలబడ్డారు.

3-4. రాజైన దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు, బైబిల్లో పేర్లు లేని ఇద్దరు స్త్రీలు ఎలా సహాయం చేశారు?

3 ధైర్యం చూపించిన వాళ్లలో చాలామంది పేర్లు బైబిల్లో లేవు. ఉదాహరణకు, రాజైన దావీదు కాలంలో ఉన్న ఇద్దరు స్త్రీల గురించి ఆలోచించండి. అబ్షాలోము తన తండ్రైన దావీదును చంపాలని అనుకున్నప్పుడు ఆ స్త్రీలు దావీదుకు సహాయం చేశారు. క్రూరుడు, పొగరుబోతు అయిన అబ్షాలోము తన తండ్రి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దావీదు యెరూషలేమును వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆయన సాదోకు అనే యాజకుడిని యెరూషలేముకు తిరిగి వెళ్లమని, అబ్షాలోము పన్నాగాల్ని తెలుసుకుని తనకు చేరవేయమని చెప్పాడు. సాదోకు తను తెలుసుకున్న సమాచారాన్ని దావీదు ఇద్దరు సేవకులకు చెప్పడానికి ‘ఒక సేవకురాలిని’ పంపించాడు. ఆమె తన ప్రాణాల్ని పణంగా పెట్టి వాళ్లకు విషయం చెప్పింది. ఆ ఇద్దరు సేవకులు దావీదు దగ్గరికి బయల్దేరినప్పుడు, ఒక యువకుడు వాళ్లను చూసి అబ్షాలోముకు చెప్పాడు. దాంతో ఆ సేవకులు తెలివిగా ఒక బావిలో దాక్కున్నారు. అప్పుడు ఆ బావి యజమాని భార్య, బావి మీద ఒక బట్టను కప్పి ధాన్యాన్ని ఆరబోసింది. అబ్షాలోము మనుషులు దావీదు సేవకుల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆమె వాళ్లను తప్పుదారి పట్టించింది. ఆ ఇద్దరు స్త్రీల పేర్లు బైబిల్లో లేవు. కానీ, వాళ్లు చూపించిన ధైర్యం వల్ల యెహోవా ఎంచుకున్న రాజు కాపాడబడ్డాడు!—2 సమూ. 15:23-37; 17:8-22.

చిత్రాలు: బైబిల్లో పేర్లు లేని ఇద్దరు స్త్రీలు రాజైన దావీదును కాపాడడానికి ధైర్యంగా సహాయం చేశారు. 1. దావీదు ఇద్దరు సేవకులతో ఒక సేవకురాలు మాట్లాడుతుంది. 2. దావీదు సేవకుల్ని బావిలో దాచిపెట్టిన స్త్రీ. వెనకాల, అబ్షాలోము పంపిన ఇద్దరు మనుషులు ఆమె ఇంటి నుండి వెళ్లిపోతున్నారు.

ధైర్యం చూపించిన ఒక సేవకురాలు, అలాగే బావి యజమాని భార్య

4 బైబిల్లో ధైర్యం చూపించిన స్త్రీపురుషుల ఉదాహరణలు బోలెడన్ని ఉన్నాయి. వాళ్లలో కొంతమంది పేర్లు మనకు తెలుసు, ఇంకొంతమందివి తెలీవు. వాళ్లలో డబ్బున్నవాళ్లు-పేదవాళ్లు, అధికారంలో ఉన్నవాళ్లు-మామూలు మనుషులు ఉన్నారు. కానీ వాళ్లందరూ ధైర్యం చూపిస్తూ యెహోవా వైపు నిలబడ్డారు. వాళ్ల కథలు ఈరోజు మనందరిలో ధైర్యాన్ని నూరిపోస్తాయి.

ప్రార్థన చేసుకోండి

5-7. హింస వచ్చినప్పుడు పౌలు ఎలా ధైర్యం చూపించగలిగాడు?

5 బైబిల్లో ధైర్యం చూపించిన స్త్రీపురుషుల ఆదర్శాన్ని మనమెలా పాటించవచ్చు? ఒక విషయం గుర్తుంచుకోండి: వాళ్లు పుట్టుకతోనే ధైర్యవంతులు కాదు. అలాగని వాళ్లు తమ శక్తి-సామర్థ్యాలతో ధైర్యాన్ని పెంచుకుని యెహోవా సేవ చేశారా అంటే, అదీ కాదు. మరి వాళ్లకు ఏది సహాయం చేసింది?

6 అపొస్తలుడైన పౌలు ఉదాహరణే తీసుకోండి. ఫిలిప్పీలో ఉన్నప్పుడు ఒక గుంపు పౌలు, సీల మీద దాడి చేసి, వాళ్ల వస్త్రాల్ని చింపి, కర్రలతో చాలా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత వాళ్లను చెరసాలలోని చీకటి గదిలో వేసి, వాళ్ల కాళ్లను బొండలో బిగించారు. (అపొ. 16:12, 19-24) విడుదలయ్యాక పౌలు ప్రకటించడానికి భయపడ్డాడా? ఒకవేళ భయపడినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, ఆయన కూడా మనలాంటి మామూలు మనిషే. అయితే, యెహోవా తన నుండి ఏం కోరుతున్నాడో పౌలుకు తెలుసు. కాబట్టి ఆయన థెస్సలొనీక నగరానికి వెళ్లి ప్రకటించాలి. అలా వెళ్లడానికి ఆయనకు చాలా ధైర్యం, బలం కావాలి. వాటిని ఎలా కూడగట్టుకున్నాడు?

7 పౌలు కొంతకాలానికి ఇలా రాశాడు: “మేము ఫిలిప్పీలో ఉండగా మొదట్లో బాధలు అనుభవించాం, అవమానాలపాలయ్యాం. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినాసరే, మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, ఎంతో వ్యతిరేకత మధ్య మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.” (1 థెస్స. 2:2) దేవుడు అప్పగించిన పని చేయడానికి తనకు ధైర్యం అవసరమని పౌలుకు తెలుసు. మరి ఆ ధైర్యం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది? అప్పటికప్పుడు పుట్టేసిందా, లేదా ఆయనలో ఉన్న ప్రత్యేకమైన సామర్థ్యం వల్ల ధైర్యం చూపించగలిగాడా? లేదు. ఆయన “దేవుని సహాయంతో” ధైర్యం కూడగట్టుకున్నాడని రాశాడు. అంటే, తనకు ధైర్యం ఇవ్వమని యెహోవాను ఆయన వినయంగా అడిగాడు. యెహోవా కూడా ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు.

8. ధైర్యం చూపించడానికి పౌలులాగే మీరు కూడా ఏం చేయవచ్చు?

8 పౌలు చేసినట్టే మీరు కూడా చేయవచ్చు. ధైర్యం చూపించగలిగే ప్రత్యేక సామర్థ్యం మీలో లేదని మీకు అనిపిస్తుందా? అయినా దిగులు పడకండి. యెహోవాకు ప్రార్థించండి, ధైర్యం ఇవ్వమని ఆయన్ని బ్రతిమాలండి. ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు.—అపొ. 4:29.

9. విశ్వాసం పెంచుకునేలా సహాయం చేయమని యెహోవాను అడగడం ఎందుకు తెలివైన పని?

9 ధైర్యానికి విశ్వాసానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి, విశ్వాసం పెంచుకునేలా సహాయం చేయమని కూడా మీరు యెహోవాను అడగవచ్చు. ఎందుకంటే, అది పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గల. 5:22, 23) అంతేకాదు, ప్రతీ క్రైస్తవుడు ధరించాల్సిన ఆధ్యాత్మిక కవచంలో అదీ ఒక భాగం. (ఎఫె. 6:16) విశ్వాసానికి ఎంత శక్తి ఉందంటే, అది ఉన్న వ్యక్తి ‘లోకాన్ని జయించగలడు’ అని బైబిలు చెప్తుంది. (1 యోహా. 5:4) ధైర్యం చూపించాలంటే ముందు యెహోవా మీద విశ్వాసం ఉండాలి. కష్టాల్లో యెహోవా సహాయం చేస్తాడనే విశ్వాసం మీకు ఉంటే, ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యం చూపించగలుగుతారు. కాబట్టి యేసు శిష్యులు ప్రార్థించినట్టే ప్రతీ క్రైస్తవుడు, ‘ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా సహాయం చేయి’ అని యెహోవాను అడగాలి.—లూకా 17:5.

“ధైర్యం తెచ్చుకోండి!”

10-11. క్రైస్తవులు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

10 యెరూషలేము, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్న క్రైస్తవులు, త్వరలోనే కష్టమైన కాలాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పౌలుకు తెలుసు. ఎందుకంటే, యెరూషలేము నగరం నాశనమౌతుంది అని యేసు ముందే చెప్పాడు. అందుకే, క్రైస్తవుల్లో ధైర్యం నింపుతూ పౌలు ఒక ఉత్తరం రాశాడు. (లూకా 19:41-44; 21:20-24) ఇంతకీ ఆయన ఏం రాశాడు? ఆయన వాళ్లకు యెహోవా ఇచ్చిన ఈ అభయాన్ని గుర్తుచేశాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” ఈ పుస్తకం పరిచయ మాటల్లో కూడా ఆ అభయాన్ని చూశాం. అది వాళ్లకు ఎలా సహాయం చేస్తుంది? పౌలు ఇంకా ఇలా రాశాడు: “అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: ‘నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?’”—హెబ్రీ. 13:5, 6.

11 క్రీస్తు శకం 70లో యెరూషలేము ఎలా నాశనం అయిందో బైబిలు చెప్పట్లేదు. కానీ మనకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు: నమ్మకంగా ఉన్న క్రైస్తవులు పౌలు ఇచ్చిన సలహాను పాటించారు. వాళ్లు ధైర్యం తెచ్చుకుని యేసు చెప్పినట్టే సరైన సమయంలో ‘కొండలకు పారిపోవడం మొదలుపెట్టారు.’—లూకా 21:20, 21.

12. (ఎ) కష్టమైన కాలాలు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండడానికి ఏ మాటలు సహాయం చేస్తాయి? (బి) ఈ చివరి రోజుల్లో కొంతమంది ఎలా తిరుగులేని ధైర్యం చూపించారు? మీరు ఎలా ఉండాలని నిర్ణయించుకున్నారు? (“వాళ్లలా ధైర్యం చూపించండి” అనే బాక్సు చూడండి.)

12 ఇప్పుడు అలాగే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా, యెహోవా మీకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. (యెహె. 38:1, 2, 10-12; మత్త. 24:21) కాబట్టి యెహోవా మనల్ని కాపాడతానని ఇచ్చిన మాటను మర్చిపోవద్దు. (యెహె. 38:19-23; 2 థెస్స. 3:3) తనను ప్రేమించేవాళ్లను, తన మీద విశ్వాసం ఉంచే వాళ్లను యెహోవా ఎప్పుడూ విడిచిపెట్టడు. ఒకప్పుడు యెహోవా యెహోషువతో చెప్పినట్టే మీతో కూడా ఇలా అంటున్నాడు: “ధైర్యంగా, ఎంతో నిబ్బరంగా ఉండు”! (యెహో. 1:7, 9, 18) అంతేకాదు, “ధైర్యం తెచ్చుకోండి!” అని యేసు చెప్పిన మాటల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఏ కష్టాన్నైనా తట్టుకుని, ధైర్యంగా నిలబడేలా మీకు సహాయం చేయడానికి పవిత్రశక్తిని ఇస్తానని యేసు మాటిచ్చాడు. ఆయన మాట తప్పడు. (యోహా. 14:26; 15:26, 27; 16:33) కాబట్టి మీరు భయపడకుండా ధైర్యంగా ఉండగలరు!

చిత్రాలు: కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌. 1. టీనేజీ వయసులో ఉన్న ఒక సిస్టర్‌ క్లాస్‌రూమ్‌లో తన స్కూల్‌ పుస్తకాన్ని అలాగే “జీవం సృష్టించబడిందా?” (ఇంగ్లీష్‌) అనే బ్రోషుర్‌ని పట్టుకొని ధైర్యంగా నవ్వుతోంది. 2. శరణార్థుల శిబిరంలో, ఒక జంట వాళ్ల పాపను పట్టుకొని సంతోషంగా ఉన్నారు. 3. ఒక యువ సహోదరుడు జైలు కటకటాల నుండి చూస్తూ నవ్వుతున్నాడు.

మన పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తానని మాటిచ్చాడు, దానివల్ల ఏ కష్టాన్నైనా ధైర్యంగా తట్టుకోగలుగుతాం

వాళ్లలా ధైర్యం చూపించండి

మార్టిన్‌ పోయెట్‌జింగర్‌, గెర్‌ట్రూడ్‌

మార్టిన్‌ పోయెట్‌జింగర్‌, గెర్‌ట్రూడ్‌.

మార్టిన్‌ అలాగే గెర్‌ట్రూడ్‌ పెళ్లి చేసుకుని, ఇద్దరూ కలిసి సంతోషంగా పయినీరింగ్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే, పెళ్లయిన మూడున్నర నెలలకే వాళ్లను అరెస్టు చేసి ఇద్దర్నీ వేర్వేరు జైళ్లలో పెట్టారు. మార్టిన్‌ను 1936లో అరెస్టు చేసి ఢకావ్‌లో ఉన్న జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత, గెర్‌ట్రూడ్‌ని కూడా అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ తొమ్మిది సంవత్సరాలు ఒకరినొకరు చూసుకోలేదు; అసలు బ్రతికున్నారో లేదో కూడా చాలా ఏళ్ల వరకు ఒకరికొకరికి తెలీదు. అయితే, యెహోవాకు నమ్మకంగా ఉండాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. మార్టిన్‌ను తర్వాత మౌట్‌హౌసన్‌లో ఉన్న జైలుకు మార్చి, అక్కడ ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. గెర్‌ట్రూడ్‌ని ఒంటరిగా మూడున్నర ఏళ్ల పాటు ఒక జైలు గదిలో ఉంచారు. ఆ తర్వాత నాలుగేళ్లు ఆమెను రావెన్స్‌బ్రూక్‌లో ఉన్న జైల్లో ఉంచారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక మార్టిన్‌ బ్రతికే ఉన్నాడని ఆమెకు తెలిసింది. ఆయన, అలాగే దాదాపు 100 మంది సాక్షులు ఇంకా మౌట్‌హౌసన్‌ జైల్లోనే ఉన్నారు. అప్పుడు గెర్‌ట్రూడ్‌ సైనికాధికారిని బ్రతిమాలడంతో మార్టిన్‌నే కాదు మిగతా సాక్షుల్ని కూడా విడుదల చేశారు. చివరికి మార్టిన్‌, గెర్‌ట్రూడ్‌ కలుసుకుని మళ్లీ పయినీరింగ్‌ చేయడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వాళ్లిద్దర్ని న్యూయార్క్‌లో ఉన్న బ్రూక్లిన్‌ బెతెల్‌కు పిలిచారు. అక్కడ మార్టిన్‌ పరిపాలక సభ సభ్యుడిగా సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయన తరచూ బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఇలా ప్రోత్సహించేవాడు: ‘ధైర్యమే మీ అత్యంత విలువైన ఆస్తి!’ మార్టిన్‌, గెర్‌ట్రూడ్‌ ఇద్దరూ చనిపోయేంతవరకు యెహోవాకు నమ్మకంగా, సంతోషంగా సేవ చేశారు.

‘ధైర్యమే మీ అత్యంత విలువైన ఆస్తి!’—ఎమ్‌. పోయెట్‌జింగర్‌

వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా

వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా.

వ్యాలెంటీనా బెలారస్‌లో ఉండేది. 1945లో ఆమెకు దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడు, ఆమెను ఒక యెహోవాసాక్షి కలిసి బైబిలు గురించి, యెహోవా గురించి చెప్పాడు. ఆ విషయాలు ఆమెకు ఎంతో నచ్చాయి. ఆ బ్రదర్‌ ఆమెను ఇంకో రెండుసార్లు కలిశాడు; ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆమె ఆయన్ని చూడలేదు. యెహోవాసాక్షుల మీద నిషేధం ఉండేసరికి వ్యాలెంటీనా వాళ్లను కలుసుకోలేకపోయింది. అయినా, ఆమె ధైర్యంగా నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్పడం మొదలుపెట్టింది. దాంతో ఆమెను అరెస్టు చేసి ఎనిమిది ఏళ్లపాటు జైల్లో ఉంచారు. తర్వాత 1953లో, ఆమె విడుదలైన వెంటనే బైబిలు సత్యాల్ని మళ్లీ వేరేవాళ్లకు చెప్పడం మొదలుపెట్టింది. దాంతో ఆమెను అరెస్టు చేసి ఇంకో పదేళ్లపాటు వేర్వేరు జైళ్లకు మారుస్తూ వచ్చారు. అలా ఒక జైలుకు వచ్చినప్పుడు, ఆమె చాలామంది సహోదరీల్ని కలిసింది. వాళ్లు రహస్యంగా దాచిపెట్టుకున్న బైబిల్ని వ్యాలెంటీనాకు చూపించారు. ఆమె మొదటిసారి ఆ బైబిల్ని తనకు సత్యం చెప్పిన బ్రదర్‌ దగ్గర చూసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత సహోదరీల దగ్గర చూసింది. ఆమె 1967లో విడుదలయ్యాక, బాప్తిస్మం తీసుకుని ఒక యెహోవాసాక్షి అయ్యింది. ఆమె ఉత్సాహంగా ప్రకటించడంతో, 1969లో ఆమెను మళ్లీ అరెస్టు చేసి మూడేళ్లపాటు జైల్లో ఉంచారు. అయినా ఆమె ప్రకటించడం మాత్రం ఆపలేదు. 2001లో ఆమె చనిపోయే సమయానికల్లా 44 మందికి సత్యం నేర్పించింది. తను గడిపిన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె ఇలా అంది: “నాకు ఉండడానికంటూ ఓ ఇల్లు లేదు. నా దగ్గర ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది నా సూట్కేసే. అయినా యెహోవా సేవలో సంతోషంగా, సంతృప్తిగా గడిపాను.”

“నాకు ఉండడానికంటూ ఓ ఇల్లు లేదు. నా దగ్గర ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది నా సూట్కేసే. అయినా యెహోవా సేవలో సంతోషంగా, సంతృప్తిగా గడిపాను.”—వి. గోర్నోఫ్‌స్కయా

ఆల్‌ఫ్రెడో ఫెర్నాండెజ్‌

ఆల్‌ఫ్రెడో ఫెర్నాండెజ్‌.

ఆల్‌ఫ్రెడోకు దాదాపు 19 ఏళ్లు ఉన్నప్పుడు, అర్జెంటీనా సైన్యంలో చేరమనే పిలుపు వచ్చింది. కానీ, ఆయన బైబిలు నుండి నేర్చుకున్న విషయాల్ని బట్టి యుద్ధాలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాడు. అందుకే సైన్యంలో చేరడానికి గానీ, ఆ బట్టలు వేసుకోవడానికి గానీ ఆయన మనస్సాక్షి ఒప్పుకోలేదు. దాంతో ఆయన్ని జైల్లో వేసి, చిత్రహింసలు పెట్టారు. కొన్నిసార్లు అయితే, ఆయన్ని చంపేస్తున్నట్టు కూడా భయపెట్టారు. అయినా, ఆల్‌ఫ్రెడో క్రమంగా బైబిల్ని చదివేవాడు, నేర్చుకున్న వాటిని రాసుకునేవాడు. ఆయన్ని విచారిస్తున్నప్పుడు మిలిటరీ యూనిఫాం వేసుకుంటే ఆయన్ని విడుదల చేస్తామని జడ్జి చెప్పాడు. కానీ ఆయన దానికి అస్సలు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన్ని మళ్లీ జైలుకు పంపించేశారు. అక్కడ ఆయన్ని హింసించడం మొదలుపెట్టారు, దాంతో ఆయన ఆరోగ్యం చాలావరకు పాడైంది. అప్పుడు జైల్లో పనిచేస్తున్న డాక్టర్‌, ‘ఈసారి నేను నిన్ను చూసేసరికి శవమై కనిపిస్తావు’ అని అన్నాడు. తనకు రోజులు తక్కువ ఉన్నాయని అర్థమైన ఆల్‌ఫ్రెడో, ఇంటికి ఒక ఉత్తరం రాశాడు. దాన్ని ఇలా మొదలుపెట్టాడు: ‘నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, నేను ఇలాంటి ఉత్తరం రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా పరిస్థితుల్ని బట్టి రాయాల్సి వస్తుంది.’ తర్వాత, జైల్లో ఉన్నంతకాలం తనకు అండగా నిలబడినందుకు ఆయన తన కుటుంబానికి థ్యాంక్స్‌ చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: ‘మీలాంటి కుటుంబాన్ని ఇచ్చినందుకు మన ప్రేమగల దేవుడైన యెహోవాకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు మీ గుండె ఎంత భారంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ బాధ మిమ్మల్ని కృంగిపోనివ్వకుండా చూసుకోండి, బదులుగా దాన్ని జయించి బయటికి రండి. ఓదార్పునిచ్చే పవిత్ర లేఖనాలపై మీ మనసును ఉంచండి. నేను చనిపోయినంత మాత్రాన మీకు శాశ్వతంగా దూరమైనట్టు కాదు. కాబట్టి మీరు నన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా, యెహోవాకు నమ్మకంగా ఉండాలనే కోరిక మీలో పెరుగుతుందని ఆశిస్తున్నాను.’ మూడేళ్లు జైల్లో ఉన్న తర్వాత, అంటే 1982లో 21 ఏళ్లు ఉన్నప్పుడు ఆల్‌ఫ్రెడో చనిపోయాడు. ఆయన చివరివరకు నమ్మకంగా ఉన్నాడు.

‘బాధ మిమ్మల్ని కృంగిపోనివ్వకుండా చూసుకోండి, బదులుగా దాన్ని జయించి బయటికి రండి.’—ఎ. ఫెర్నాండెజ్‌

కారెన్‌ ఓమ్‌

కారెన్‌, రెయినర్‌ ఓమ్‌.

కారెన్‌ చిన్నప్పటి నుండి యెహోవాసాక్షి. ఆమె చాలా సంతోషంగా ఉండేది, అందరితో కలిసిపోయేది. ఆమె తన పయినీర్‌ సేవను చాలా ఇష్టంగా చేసేది. కొంతకాలానికి, రెయినర్‌ అనే బ్రదర్‌ను పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి అమెరికాలో ఉన్న బెతెల్‌లో సేవ చేసింది. అయితే, దాదాపు 55 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలిసింది. ఆ వ్యాధి వల్ల నెమ్మదినెమ్మదిగా ఆమె నరాలన్నీ చచ్చుబడిపోయి, తర్వాత పక్షవాతం వచ్చి చనిపోతుంది. ఆ వ్యాధి వచ్చిందని కారెన్‌కు తెలిసినప్పటి నుండి తను డీలా పడిపోకూడదని, ఉన్న కొద్ది సమయాన్ని సరైన విధంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అందుకే ఎక్కువగా బైబిల్ని అధ్యయనం చేసేది, ఇతరులకు మంచివార్త చెప్పేది. మారుతున్న తన పరిస్థితికి తగ్గట్టు, ఆమె తన జీవితాన్ని కూడా మార్చుకుంది. తన మాట్లాడే సామర్థ్యం తగ్గిపోతున్నప్పుడు ఆమె ఒక కంప్యూటర్‌ను వాడడం నేర్చుకుంది. దానికున్న ప్రత్యేకత ఏంటంటే, ఆమె కంటి కదలికల్ని బట్టి స్క్రీన్‌ మీద అక్షరాలు సెలెక్ట్‌ అవుతాయి. అలా ఒక్కో అక్షరాన్ని ఎంపిక చేసుకొని పదాల్ని కూర్చడం కష్టమే అయినా ఆమె మీటింగ్‌ కోసం కామెంట్లను, పరిచర్య కోసం ఉత్తరాల్ని టైప్‌ చేసేది. బెతెల్‌లో కారెన్‌ను చూసుకున్న ఒక సిస్టర్‌ ఆమె గురించి ఇలా చెప్పింది: “‘నాకే ఎందుకు ఇలా జరిగింది?’ అని ఆమె ఎప్పుడూ అనలేదు. తను చనిపోవడానికి కేవలం రెండు వారాల ముందు, నేను ప్రీచింగ్‌ చేసిన ఒకామెకు కారెన్‌ ఉత్తరం రాస్తూ చివర్లో ఇలా అంది: ‘నీకు బాధగా ఉండి, ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే నేనున్నానని గుర్తుపెట్టుకో.’” కారెన్‌ను చూసుకున్న ఇంకో సిస్టర్‌ ఇలా చెప్పింది: “తనకున్న జబ్బును బట్టి కారెన్‌ ఎప్పుడూ ఏడ్వలేదు. నిజానికి, ఆమె బాధపడడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ పునరుత్థానం మీద ఆమెకు బలమైన విశ్వాసం ఉంది కాబట్టి, బాధపడాల్సిన అవసరమే లేదని ఆమె అనుకుంది. త్వరలో యెహోవా తనను తిరిగి బ్రతికిస్తాడని, అప్పుడు ఆరోగ్యంగా, పరిపూర్ణంగా అవుతానని ఆమె నమ్మింది.” ఈ వ్యాధి వచ్చిన కొత్తలో కారెన్‌ వాళ్ల చెల్లి ఆమెను ఇలా అడిగింది: “ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు?” అప్పుడు ఆమె ఒక్కమాటలో ఇలా చెప్పింది: “మనకు కావాల్సిన ధైర్యాన్ని యెహోవాయే ఇస్తాడు.” అదే నిజమని రుజువైంది, చివరివరకు ధైర్యంగా ఉండేలా యెహోవా కారెన్‌కు సహాయం చేశాడు. కారెన్‌ కృతజ్ఞతలు చెప్తూ, ఓదారుస్తూ, ప్రోత్సహిస్తూ రాసిన చాలా ఉత్తరాల్ని ఆమె చనిపోయాక ఆమె భర్త తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చాడు.

“మనకు కావాల్సిన ధైర్యాన్ని యెహోవాయే ఇస్తాడు.”—కె. ఓమ్‌

13. మీరు ఇప్పుడు ధైర్యం చూపించడానికి ఏది సహాయం చేస్తుంది?

13 మీరు కొత్త లోకాన్ని ఊహించుకోండి: భూమంతా శాంతి విలసిల్లుతుంది. యెహోవా జ్ఞాపకంలో ఉన్న వాళ్లందరూ బ్రతుకుతారు. అప్పుడు మీరు ఈ పుస్తకంలో ఉన్న వ్యక్తులనే కాదు, ధైర్యం చూపించిన ఇంకా చాలామందిని కలుస్తారు. వాళ్లందరూ ఈ సాతాను లోకంలో యెహోవాను నమ్మకంగా ఆరాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు, ఆఖరికి తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారు. అలా చేసినందుకు, వాళ్లు కొత్త లోకంలో తిరిగి లేచాక బాధపడతారని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా లేదు! మరి మీ సంగతేంటి? మీరు వాళ్లతో కలిసి ఈ భూమిని అందమైన పరదైసులా మారుస్తారు. ఆ కొత్త లోకంలో ఉన్నప్పుడు, చివరి రోజుల్లో యెహోవాను ఆరాధించి తప్పు చేశారని మీకు అనిపిస్తుందా? అసలు అలాంటి ఆలోచనే రాదు! కాబట్టి, చివరి శ్వాస వరకు ధైర్యం చూపిస్తూ, యెహోవాకు నమ్మకంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకోండి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం బట్టి శాశ్వతకాలం సంతోషిస్తారు!

బ్రదర్స్‌, సిస్టర్స్‌, అలాగే పిల్లలు పరదైసులో జీవితాన్ని ఆనందిస్తున్నారు. కొంతమంది జిరాఫీలకు తినిపిస్తుంటే, ఇంకొంతమంది కారాకల్‌ అనే అడవిపిల్లిని చూస్తున్నారు, పిజ్జా చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, సంగీతాన్ని వాయిస్తున్నారు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి