కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wcg అధ్యా. 52 పేజీలు 232-235
  • సహాయకుడిగా ఉన్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహాయకుడిగా ఉన్నాడు
  • ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎక్కువ తెలుసుకోండి
  • మనం నేర్చుకునే పాఠాలు
  • మనసుపెట్టి ఆలోచించండి
  • ఇవి కూడా చూడండి
  • మార్కు ‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యౌవన సహోదరులారా—మార్కును, తిమోతిని చూసి నేర్చుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • “ఓదార్పు పుత్రుడు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • “సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
wcg అధ్యా. 52 పేజీలు 232-235

52 మార్కు

సహాయకుడిగా ఉన్నాడు

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

యువకుడిగా ఉన్నప్పుడే మార్కు ధైర్యం చూపించాడు. ఆయనకు యోహాను అనే పేరు కూడా ఉంది. ఒకసారి ఒక పెద్ద గుంపు కత్తులతో, కర్రలతో వచ్చి యేసును బంధించినప్పుడు అపొస్తలులందరూ పారిపోయారు. కానీ “ఒక యువకుడు” మాత్రం ధైర్యంగా యేసు వెనకాలే వెళ్లాడని బైబిలు చెప్తుంది. ఆ గుంపులో ఉన్న కొంతమంది, ఆ యువకుడిని చూసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయన నారవస్త్రం ఊడిపోయింది. దాంతో ఆయన “బట్టలు లేకుండానే” అంటే లోపలి వస్త్రంతోనే పారిపోయాడు. ఈ సంఘటన మార్కు సువార్తలోనే కనిపిస్తుంది కాబట్టి, ఆ యువకుడు మార్కే అయ్యుంటాడని కొంతమంది అంటారు.

బహుశా మార్కు తన తల్లితో కలిసి యెరూషలేములో ఉండి ఉంటాడు. వాళ్లది డబ్బున్న కుటుంబం అయ్యుండొచ్చు. ఎందుకంటే, యేసు చనిపోయిన తర్వాత వాళ్ల ఇంట్లోనే సంఘ కూటాలు జరిగేవి. అందుకే అపొస్తలుడైన పేతురు కూడా, దేవదూత తనను చెరసాల నుండి విడిపించిన రాత్రి వాళ్ల ఇంటికే వెళ్లాడు. కాబట్టి, మార్కుకు యేసు అపొస్తలుల్లో, శిష్యుల్లో చాలామంది తెలుసని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన వాళ్ల నుండి ధైర్యం చూపించడం నేర్చుకుని ఉంటాడు.

దాదాపు క్రీస్తు శకం 46లో, మార్కు దగ్గరి బంధువైన బర్నబా అపొస్తలుడైన పౌలుతో కలిసి యెరూషలేముకు వచ్చాడు. వాళ్లిద్దరూ మార్కుకు మంచి శిక్షణ ఇవ్వాలనుకున్నారు. అందుకే వాళ్లు తిరిగి అంతియొకయకు వెళ్తున్నప్పుడు ఆయన్ని కూడా తీసుకెళ్లారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, పౌలు బర్నబాలు మిషనరీ యాత్రకు వెళ్లాలనుకున్నప్పుడు మార్కును కూడా రమ్మని అడిగారు. అప్పుడు ఆయన ధైర్యంగా, ఆ ఉత్సాహవంతులైన మిషనరీలకు “సహాయకుడిగా” ఉండడానికి ఒప్పుకుని వాళ్లతో వెళ్లాడు.

ఆ రోజుల్లో ప్రయాణాలు చేయడం అంత తేలిక కాదు. అది ఎంత కష్టమో, అందులోకి దిగితే గానీ తెలీదు. ఎందుకంటే, పౌలు ఒక ఉత్తరంలో తను చేసిన ప్రయాణాల గురించి చెప్తూ ‘నదుల్లో, దొంగల చేతుల్లో, నగరంలో, ఎడారిలో, సముద్రంలో ప్రమాదాలు ఎదుర్కొన్నాను’ అని రాశాడు. (2 కొరిం. 11:26) కాబట్టి మార్కు వాళ్లతో కలిసి ప్రయాణించడానికి చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. అంతేకాదు, ఒక సహాయకుడిగా మార్కు వాళ్లు చెప్పిందల్లా చేయాలి. అది ఆయనకు తలకుమించిన భారంగా అనిపించిందా? అలా అనిపించినట్టు బైబిలు చెప్పట్లేదు గానీ, పంఫూలియకు చేరుకున్నప్పుడు మార్కు వాళ్లను వదిలేసి యెరూషలేముకు వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఆయన అలా వెళ్లిపోయేసరికి, పౌలు బర్నబా ఇద్దరూ బాధపడి ఉంటారు. కానీ పౌలు మాత్రం కాస్త ఎక్కువే నొచ్చుకున్నాడు.

పౌలు, బర్నబా తమ మొదటి మిషనరీ యాత్రను పూర్తి చేసుకున్న కొంతకాలానికి రెండో ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. అప్పుడు బర్నబా మార్కుకు ఇంకో అవకాశాన్ని ఇచ్చి తమతోపాటు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ పౌలు దానికి ఒప్పుకోలేదు. బహుశా ఆయనకు మార్కు మీద నమ్మకం పోయి ఉండవచ్చు. పౌలు, బర్నబా ఇద్దరూ తమ మాటే నెగ్గాలని పట్టుబట్టి ‘చాలా కోపంతో గొడవపడ్డారు.’ ఆ తర్వాత, బర్నబా మార్కును తీసుకొని కుప్రకు వెళ్లి ప్రకటించాడు. పౌలు ఇంకొకర్ని వెంటబెట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

జరిగినదాని విషయంలో మార్కుకు ఎలా అనిపించి ఉంటుంది? ఆయన చాలా బాధపడి ఉంటాడు. ఎందుకంటే, తను ఎంతో గౌరవించే పౌలు తనవల్ల నొచ్చుకున్నాడు; ఇద్దరు మంచి స్నేహితులు విడిపోవడానికి తను కారణం అయ్యాడు. అలాగని మార్కు దాన్నే తలచుకొని బాధపడుతూ కూర్చున్నాడా? పౌలు తనను కాదన్నాడని కోపం పెంచుకున్నాడా? లేదు!

మార్కు తనకున్న గొప్ప సేవావకాశాన్ని కోల్పోయినా, డీలాపడిపోకుండా ముందుకు వెళ్లాడు

సహోదర సహోదరీలకు మార్కు సహాయం చేస్తూనే ఉన్నాడు. దాదాపు క్రీస్తు శకం 60-61 వరకు పౌలు రోములో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అప్పుడు పౌలు ఒక ఉత్తరం రాస్తూ, తనతో ఉన్న మార్కు గురించి ఇలా అన్నాడు: “నాకు ఎంతో ఊరటను ఇచ్చాడు.” ఆ తర్వాత కొంతకాలానికి, అంటే క్రీస్తు శకం 62-64 మధ్యలో, మార్కు గురించి అపొస్తలుడైన పేతురు కూడా రాశాడు. వయసు పైబడుతున్న పేతురుకు సహాయం చేయడానికి మార్కు చాలా దూరం ప్రయాణించి బబులోనుకు వెళ్లాడని అర్థమౌతుంది. పేతురు మార్కు గురించి రాస్తున్నప్పుడు “నా కుమారుడు” అని పిలిచాడు. అలా పిలిచాడు అంటే మార్కు ఆయనకు ఎంత “ఊరటను” ఇచ్చి ఉంటాడో కదా! పేతురు యేసుతో గడిపిన క్షణాల గురించి చాలా విషయాల్ని మార్కుకు ఖచ్చితంగా చెప్పి ఉంటాడు. మార్కు బహుశా రోములో ఉన్నప్పుడు తన పేరు మీదున్న సువార్త పుస్తకాన్ని రాశాడు. అందులో పేతురు తనతో చెప్పిన విషయాల్ని కూడా చేర్చాడు.

పౌలు చేతికి, సైనికుడి చేతికి మధ్య గొలుసు కట్టేసి ఉంది. మార్కు తన కుడి చేతిని పౌలు భుజం మీద వేసి ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆయన తన ఎడమ చేతిలో ఒక కూజా పట్టుకొని, పౌలుకు తాగడానికి ఏదో ఇస్తున్నాడు. ఇంకో ఇద్దరు సహోదరులు పౌలు కూర్చున్న బల్ల దగ్గర కూర్చొని గ్రంథపు చుట్టలు రాస్తూ, వాటిని పరిశీలిస్తున్నారు.

పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో మార్కు గురించి చివరిసారి కనిపిస్తుంది. ఆ సమయానికి పౌలు మళ్లీ జైల్లో ఉన్నాడు. ఆయన ఆ ఉత్తరంలో తిమోతిని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ, మార్కును కూడా వెంటబెట్టుకుని రమ్మని చెప్పాడు. ఎందుకంటే, “అతను పరిచర్యలో నాకు సహాయంగా ఉంటాడు” అని పౌలు అన్నాడు. పౌలు చివరి రోజుల్లో మార్కు, తిమోతి ఆయన పక్కనే ఉంటూ ఊరటనివ్వాలని ఖచ్చితంగా కోరుకుని ఉంటారు. యెహోవా సేవలో ఏ కష్టం వచ్చినా, నిరుత్సాహం ఎదురైనా మార్కు ధైర్యం చూపించాడు, సహోదరులకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అందుకే, యెహోవాకు మార్కు అంటే చాలా ఇష్టం.

ఈ వచనాలు చదవండి:

  • మార్కు 14:50-52

  • అపొస్తలుల కార్యాలు 13:2-5, 13; 15:36-40

  • కొలొస్సయులు 4:10, 11

  • 2 తిమోతి 4:11

  • 1 పేతురు 5:13

ప్రశ్న:

మార్కు ఎలా ధైర్యం చూపించాడు?

ఎక్కువ తెలుసుకోండి

  1. 1. మార్కు డబ్బున్న కుటుంబంలో పుట్టిపెరిగాడు అని ఎలా చెప్పవచ్చు? (w10 3/15 6 ¶7–7 ¶1)

  2. 2. పౌలు బర్నబాలకు “సహాయకుడిగా” మార్కు ఏం చేసి ఉంటాడు? (అపొ. 13:5; w10 3/15 7 ¶5)

  3. 3. మార్కు ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడు? (w10 3/15 8 ¶5-7) చిత్రం 1

    మార్కు ఎడారిలో నడుచుకుంటూ, కాస్త దూరంలో కనిపిస్తున్న ఒక నగరం వైపు వెళ్తున్నాడు. వెనకాల మ్యాపులో ఆయన బహుశా వెళ్లిన కొన్ని ప్రాంతాల పేర్లు కనిపిస్తున్నాయి. అవేంటంటే: 1. రోము. 2. ఎఫెసు. 3. కొలొస్సయి. 4. పెర్గే. 5. కుప్ర. 6. అంతియొకయ (సిరియాకు చెందిన). 7. యెరూషలేము. 8. బబులోను.

    చిత్రం 1: మార్కు బహుశా వెళ్లిన కొన్ని ప్రాంతాలు

  4. 4. మార్కు తన సువార్తలో పేతురు చెప్పిన కొన్ని విషయాల్ని రాసి ఉంటాడని ఎలా చెప్పవచ్చు? (w08 2/1 26 ¶1-wcgr)

మనం నేర్చుకునే పాఠాలు

  • మార్కు ఒక అపొస్తలుడని లేదా ప్రవక్తని బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. అయినా, ఆయన వినయంగా ఇతరులకు సేవ చేశాడు. నేడు మనం ఇతరులకు ఎలా సేవ చేయవచ్చు?

  • మార్కు కొంతకాలంపాటు పౌలుతో కలిసి సేవ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయినా, మార్కు నమ్మకంగా ఉన్నాడు. మనం ఏదైనా సేవావకాశం కోల్పోతే ఆయనలా ఎలా ఉండవచ్చు? చిత్రం 2

    చిత్రాలు: ఒక బ్రదర్‌ సంఘంలో తనకున్న సేవావకాశాన్ని కోల్పోయాడు, అయినా వేరేవాళ్లకు సహాయం చేస్తూనే ఉన్నాడు. తర్వాతి చిత్రాల్లో అది కనిపిస్తుంది. ఆ బ్రదర్‌, ఆయన భార్య మీటింగ్‌లో జరుగుతున్న ఒక ప్రకటన విని బాధపడుతున్నారు. తర్వాతి వారాల్లో జరిగిన మీటింగ్‌లో, ఆ బ్రదర్‌ ఒక పెద్దవయసు సిస్టర్‌ కోసం, ఇంకో సిస్టర్‌ కోసం రాజ్యమందిరం తలుపును తెరిచి సంతోషంగా పలకరిస్తున్నాడు. తర్వాత, ఆ బ్రదర్‌ ఒక షాపుకి వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తికి jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇచ్చి, తన ఫోన్‌లో ఏదో చూపిస్తున్నాడు. ఆయన భార్య వెనక నుండి చూసి సంతోషిస్తుంది.

    చిత్రం 2

  • మార్కులాగే మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?

మనసుపెట్టి ఆలోచించండి

  • ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?

  • ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?

  • క్రీస్తుతో కలిసి మనల్ని పరిపాలించే వాళ్లలో మార్కు ఉండడం మీకెందుకు సంతోషంగా అనిపిస్తుంది?

ఇవి కూడా చూడండి

మార్కు సువార్తకున్న ప్రత్యేకత ఏంటి?

మార్కుకి పరిచయం (3:18)

పట్టువిడువకుండా ముందుకు వెళ్లాలని మీ పిల్లలకు నేర్పించడానికి మార్కు ఉదాహరణ చెప్పండి.

“మార్కు పట్టువిడువలేదు” (w08 2/1 24-26-wcgr)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి