4 అబ్రాహాము
యెహోవా తరఫున యుద్ధం చేసిన మొట్టమొదటి వ్యక్తి
యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముకు ఇలా మాటిచ్చాడు: “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.” ఆ మాట చరిత్రనే మలుపు తిప్పింది. భవిష్యత్తులో ఆ జనం సొంతం చేసుకోబోయే అందమైన దేశాన్ని కూడా దేవుడు అబ్రాహాముకు చూపించాడు. (ఆది. 12:2; 13:14, 15) కానీ అబ్రాహాము కుటుంబాన్ని నాశనం చేసి, యెహోవా మాటిచ్చిన దాన్ని ఆదిలోనే అంతం చేయాలని సాతాను అనుకున్నాడు. ఎందుకంటే అబ్రాహాము వంశం నుండి ఒక “సంతానం” రాబోతుందని, ఆ సంతానం తనని, తన చెడ్డ లోకాన్ని వేర్లతో సహా తీసేస్తుందని సాతానుకు తెలుసు.—ఆది. 3:15.
అందుకే సాతాను గురి మొత్తం అబ్రాహాము, ఆయన కుటుంబం మీదే ఉంది. సాతాను దాడుల వల్ల, అబ్రాహాము అన్న కొడుకైన లోతు బాగా దెబ్బతిన్నాడు. అసలు ఏం జరిగిందంటే: దేవుడు మాటిచ్చిన దేశాన్ని అబ్రాహాము లోతుకు చూపించి, ఎక్కడ ఉండాలో ఎంచుకునే అవకాశాన్ని ముందుగా అతనికే ఇచ్చాడు. ఆ దేశంలో బాగా పంటలు పండే ఒక మంచి ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. అయితే అది సొదొమకు దగ్గర్లో ఉంది. అందులోని మనుషులు “చాలా చెడ్డవాళ్లు, యెహోవా దృష్టిలో ఘోరమైన పాపులు.” (ఆది. 13:8-13) సొదొమ రాజు, ఇంకో నలుగురు కనాను రాజులు కలిసి ఏలాము రాజుకు పన్ను కట్టేవాళ్లు. అలా పన్ను కడుతూ విసిగిపోయిన ఐదుగురు రాజులు ఏలాము రాజుకు ఎదురుతిరిగారు. అప్పుడు ఏలాము రాజు వాళ్ల తిరుగుబాటును అణచివేయాలని అనుకున్నాడు. అందుకే అతను దూరదేశాల్లో ఉన్న ముగ్గురు రాజుల్ని పోగుచేసుకుని యుద్ధానికి దిగాడు. తిరుగుబాటు చేసిన ఆ ఐదుగురు రాజులు యుద్ధంలో ఓడిపోయారు. గెలిచిన నలుగురు రాజులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తూ తాము ఓడించిన ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లారు, వాళ్ల వస్తువుల్ని దోచుకున్నారు. ఆ బందీల్లో లోతు, ఆయన కుటుంబం కూడా ఉంది.
అబ్రాహాము తన 318 మంది సేవకుల్ని వెంటబెట్టుకొని బలమైన నలుగురు రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని తరిమికొట్టి ఓడించాడు
ఈ విషయం అబ్రాహాముకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోతు ఆ ప్రాంతాన్ని ఎంచుకుని తన చేతులారా సమస్యల్ని కొని తెచ్చుకున్నాడని అనుకుంటాడా? లేదా ఆయన్ని కాపాడాలని అనుకుంటాడా? ఒకవేళ అబ్రాహాము లోతును కాపాడడానికి వెళ్లాలని అనుకుంటే, ఆయన పెద్ద యుద్ధమే చేయాలి. కానీ ఆయన గుడారాల్లో నివసించే ఒక మామూలు కాపరి, యుద్ధ వీరుడు కాదు. నలుగురు రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని ఆయనొక్కడే ఎలా ఓడించగలడు? ఆ నలుగురిలో ఒకరు షీనారు ప్రాంతానికి రాజు. అబ్రాహాము వదిలొచ్చిన ఊరు నగరం షీనారు ప్రాంతంలోనే ఉంది! అబ్రాహాము స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఇలా అనుకునేవాళ్లు: ‘ఒకవేళ నేను షీనారు రాజుతో యుద్ధం చేస్తే, సకల సౌకర్యాలు ఉండే ఊరు నగరంలో మళ్లీ అడుగుపెట్టడం ఇంక కుదరనే కుదరదు.’ మరి అబ్రాహాము అలా అనుకున్నాడా? లేదు. యెహోవా తనకు విజయాన్ని ఇస్తాడనే పూర్తి నమ్మకంతో లోతును కాపాడడానికి బయల్దేరాడు.
ఈ సమయానికల్లా, అబ్రాహాము దగ్గర 1,000 కంటే ఎక్కువమంది సేవకులు ఉండుంటారు. వాళ్లలో బాగా శిక్షణ పొందిన 318 మంది సేవకులతో అబ్రాహాము యుద్ధానికి సిద్ధమయ్యాడు. వాళ్లతోపాటు ఇంకొంతమంది స్నేహితుల్ని కూడా వెంటబెట్టుకుని ఆ నలుగురు రాజుల మీద యుద్ధానికి బయల్దేరాడు. వాళ్లు ఉత్తరం వైపు చాలా దూరం ప్రయాణించి దాను వరకు వెళ్లారు. అక్కడ తమ శత్రు సైన్యాలు ఉండడం చూశారు. అప్పుడు, అబ్రాహాము తన మనుషుల్ని గుంపులుగా విడగొట్టి, రాత్రిపూట ఆ శత్రువుల మీద దాడికి దిగాడు. అబ్రాహాము, ఆయన మనుషులు చాలా తక్కువమందే అయినా శత్రు సైన్యాల్ని పరుగులు పెట్టించారు. అలా ఆ నలుగురు రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని వదలకుండా అబ్రాహాము తరుముతూనే ఉన్నాడు. చివరికి, దమస్కు దగ్గర అబ్రాహాము వాళ్లను పూర్తిగా ఓడించి, కనాను నుండి వాళ్లు తీసుకొచ్చిన వస్తువుల్ని, మనుషుల్ని వెనక్కి తెచ్చాడు. అలా లోతును, ఆయన కుటుంబాన్ని అబ్రాహాము కాపాడాడు!
అబ్రాహాముకు ఉన్న ధైర్యం, విశ్వాసం చూసి యెహోవాకు ఎలా అనిపించింది? అది తెలుసుకోవడానికి, అబ్రాహాము షాలేము నగరం వైపుగా వెళ్లినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ నగరానికి రాజు మెల్కీసెదెకు. ఆయన యెహోవాకు యాజకుడిగా కూడా సేవ చేసేవాడు. మెల్కీసెదెకు షాలేము నగరం నుండి బయటకు వచ్చి అబ్రాహామును కలిసి, యెహోవా దీవెన ఆయన మీద ఉందని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము దోపుడు సొమ్ములో శ్రేష్ఠమైన వాటి నుండి పదోవంతును యెహోవా ప్రతినిధి అయిన మెల్కీసెదెకుకు ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా తనకు వినయం ఉందని, తన సొంత శక్తితో కాదుగానీ యెహోవా సహాయంతోనే శత్రువుల్ని ఓడించానని అబ్రాహాము చూపించాడు.
ఇది దేవుడు జరిగించిన యుద్ధం అని అనడంలో ఏ సందేహం లేదు. “యెహోవా యుద్ధాలు అనే పుస్తకం” ఒకటి ఉండేదని బైబిలు చెప్తుంది. (సంఖ్యా. 21:14) అందులో రాయబడిన మొట్టమొదటి యుద్ధం అబ్రాహాముదే అయ్యుంటుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వాగ్దాన దేశంలో ఉన్న చెడ్డ ప్రజలైన కనానీయులతో అబ్రాహాము వారసులు పోరాడారు. అప్పుడు కూడా యెహోవా తన నమ్మకమైన ప్రజలకు వరుస విజయాల్ని ఇచ్చాడు.
కానీ, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తనను విడిచిపెట్టారో అప్పుడు యెహోవా వాళ్లను కాపాడడం ఆపేశాడు. చివరికి, వాళ్లు ఆయన కొడుకును అంటే మెస్సీయను వద్దనుకున్నప్పుడు, ఆయన వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేశాడు. వాళ్ల స్థానంలో క్రీస్తు పరిపాలన కింద ఉండే అభిషిక్త క్రైస్తవుల్ని దీవించడం మొదలుపెట్టాడు. యేసు తన శిష్యులకు యుద్ధాలు చేయవద్దని చెప్పాడు. (మత్త. 26:52) అయితే, ఆధ్యాత్మిక యుద్ధం చేయడం నేర్పించాడు. అంటే సాతానుతో, అబద్ధ బోధలతో, ఈ లోకంలోని చెడు ప్రవర్తనతో ఎలా పోరాడాలో నేర్పించాడు. ఒక యుద్ధంలో పోరాడాలంటే ఎంత ధైర్యం కావాలో ఆధ్యాత్మిక యుద్ధం చేయడానికి కూడా అంతే ధైర్యం కావాలి. ఈ విషయంలో యేసు జీవితమే మనకు మంచి ఆదర్శం.
ఈ వచనాలు చదవండి:
ప్రశ్న:
అబ్రాహాము ఎలా ధైర్యం చూపించాడు?
ఎక్కువ తెలుసుకోండి
1. ఈ కథ నిజమని చెప్పడానికి ఏ పురావస్తు ఆధారాలు ఉన్నాయి? (w89 7/1 5 ¶4–6 ¶1-wcgr)
2. బైబిలు చెప్తున్న వివరాల్ని బట్టి సొదొమ, గొమొర్రా ఎక్కడ ఉన్నాయి? దాన్ని నిరూపించడానికి ఏ ఆధారాలు ఉన్నాయి? (it “ఉప్పు సముద్రం” ¶6-wcgr) చిత్రం 1
BestTravelPhotography/iStock via Getty Images Plus
చిత్రం 1: ప్రాచీన సొదొమ నగరం ఎక్కడైతే ఉంది అనుకుంటున్నామో అక్కడ ఇప్పటికీ ఖర్జూర చెట్లు, ఇతర పంట పొలాలు సమృద్ధిగా పండుతున్నాయి
3. మెల్కీసెదెకు షాలేము నగరానికి రాజుగా, యాజకుడిగా సేవ చేశాడు. ఇంతకీ, షాలేము ఎక్కడ ఉంది? (it “షాలేము”-wcgr)
4. మెల్కీసెదెకు ఎలా యేసుకు సూచనగా ఉన్నాడు? (it “ప్రధానయాజకుడు” ¶27-28-wcgr) చిత్రం 2
చిత్రం 2
మనం నేర్చుకునే పాఠాలు
దేశంలోని మంచి ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశాన్ని అబ్రాహాము ముందుగా లోతుకే ఇచ్చాడు. ఇంట్లోవాళ్ల దగ్గర, బ్రదర్స్-సిస్టర్స్ దగ్గర, వేరేవాళ్ల దగ్గర మనం అబ్రాహామును ఎలా అనుకరించవచ్చు? చిత్రం 3
చిత్రం 3
తన అన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడని తెలిసినప్పుడు అబ్రాహాము ఆయన్ని వదిలేయలేదు. దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
అబ్రాహాము చూపించినట్టే మీరు ఇంకా ఎలా ధైర్యం చూపించవచ్చు?
మనసుపెట్టి ఆలోచించండి
ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?
ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?
కొత్త లోకంలో అబ్రాహామును, లోతును కలిసినప్పుడు వాళ్లను నేను ఏం అడగాలనుకుంటున్నాను?
ఇవి కూడా చూడండి
యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడానికి అబ్రాహాముకు ఏది సహాయం చేసిందో చూడండి.
ఊరు నగరాన్ని వదిలి రాకముందు కూడా అబ్రాహాము ఎలా ధైర్యం చూపించాడు?