37వ పాఠం
పని గురించి, డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?
పని గురించి లేదా డబ్బు గురించి మీరు ఎప్పుడైనా ఆందోళనపడ్డారా? ఒకవైపు మన అవసరాలు తీర్చుకోవడానికి పని చేస్తూనే, మరోవైపు యెహోవా ఆరాధనకు సమయం ఇవ్వడం కష్టంగా ఉండవచ్చు. ఈ విషయంలో మనకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఇస్తుంది.
1. పని గురించి బైబిలు ఏం చెప్తుంది?
మనం సంతోషంగా పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: “తన కష్టార్జితంతో సుఖపడడం కన్నా మనిషికి మేలైనది ఏదీ లేదు.” (ప్రసంగి 2:24) యెహోవా కష్టపడి పని చేస్తాడు. మనం కూడా ఆయనలా కష్టపడి పని చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు, మనకూ సంతృప్తి ఉంటుంది.
పని చేయడం ముఖ్యమే. కానీ, యెహోవా ఆరాధనను పక్కన పెట్టేంతగా పనిలో మునిగిపోకూడదు. (యోహాను 6:27) మనం యెహోవాకు మొదటి స్థానం ఇస్తే, ఆయన మన అవసరాలు తీరుస్తానని మాటిస్తున్నాడు.
2. డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?
‘డబ్బు రక్షణగా ఉంటుంది’ అని బైబిలు చెప్తున్నా, మనం సంతోషంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే చాలదు అని కూడా హెచ్చరిస్తుంది. (ప్రసంగి 7:12) కాబట్టి డబ్బును ప్రేమించకండి అని, “ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (హెబ్రీయులు 13:5 చదవండి.) ఉన్నవాటితో సంతృప్తిగా జీవిస్తే, లేనివాటి కోసం ఆరాటపడుతూ కష్టాల్ని కొనితెచ్చుకోం. అలాగే అనవసరమైన అప్పుల్లో కూరుకుపోం. (సామెతలు 22:7) అంతేకాదు జూదం వల్ల, చిటికెలో ధనవంతుల్ని చేస్తామని చెప్పే స్కీమ్‌ల వల్ల ప్రమాదాల్లో చిక్కుకోం.
3. మన డబ్బును నిస్వార్థంగా ఎలా ఉపయోగించవచ్చు?
యెహోవా, ఇచ్చే గుణం ఉన్న దేవుడు. మనం కూడా ఇచ్చే గుణం చూపిస్తూ, ‘మనకున్న వాటిని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు’ ఆయన్ని అనుకరిస్తాం. (1 తిమోతి 6:18) సంఘ పనుల కోసం, అవసరంలో ఉన్నవాళ్ల కోసం, ముఖ్యంగా మన సహోదర సహోదరీల కోసం మన డబ్బును నిస్వార్థంగా ఉపయోగించవచ్చు. మనం ఎంత ఇస్తున్నాం అనేది కాదు గానీ, ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం అనేదే యెహోవాకు ముఖ్యం. మనం హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది, యెహోవా కూడా సంతోషిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 20:35 చదవండి.
ఎక్కువ తెలుసుకోండి
పనిని దాని స్థానంలో ఉంచడం వల్ల, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో చూడండి.
4. మీరు పని చేసే తీరు యెహోవాకు ఘనత తెస్తుంది
మనం యెహోవాకు స్నేహితులమైతే, పని విషయంలో ఆయనలాగే ఆలోచిస్తాం. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
పని విషయంలో జేసన్‌కు ఉన్న ఆలోచన, పని స్థలంలో ఆయన ప్రవర్తన మీకు నచ్చాయా? ఎందుకు?
పనిని దాని స్థానంలో ఉంచడానికి ఆయన ఏం చేశాడు?
కొలొస్సయులు 3:23, 24 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మనం మనస్ఫూర్తిగా పని చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
పని చేయడం ముఖ్యమే. కానీ, యెహోవా ఆరాధనను పక్కన పెట్టేంతగా పనిలో మునిగిపోకూడదు
5. ఉన్నవాటితో సంతృప్తిగా జీవిస్తే ప్రయోజనం పొందుతాం
చాలామంది వీలైనంత ఎక్కువ డబ్బు కూడబెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ, బైబిలు మనల్ని అలా చేయమని చెప్పట్లేదు. 1 తిమోతి 6:6-8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
బైబిలు మనల్ని ఏం చేయమని ప్రోత్సహిస్తుంది?
మన దగ్గర అంతగా డబ్బులు లేకపోయినా సంతోషంగా జీవించవచ్చు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
ఈ వీడియోలో చూపించినవాళ్లు పేదవాళ్లే అయినా, వాళ్లు ఎందుకు సంతోషంగా ఉన్నారు?
మన దగ్గర ఎక్కువ డబ్బు ఉండి కూడా, ఇంకా కావాలని అనిపిస్తుంటే అప్పుడేంటి? ఆ ఆలోచన ఎంత ప్రమాదకరమో వివరిస్తూ యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. లూకా 12:15-21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
యేసు చెప్పిన ఉదాహరణ నుండి మీరేం నేర్చుకున్నారు? —15వ వచనం చూడండి.
సామెతలు 10:22; 1 తిమోతి 6:10 చదవండి, పోల్చండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
ఏది ముఖ్యం అని మీకు అనిపిస్తుంది, యెహోవాకు స్నేహితులుగా ఉండడమా లేక ధనవంతులుగా ఉండడమా? ఎందుకు?
డబ్బు వెనక పరుగులు పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయి?
6. యెహోవా మన అవసరాలను చూసుకుంటాడు
పని విషయంలో, డబ్బు విషయంలో సమస్యలు వచ్చినప్పుడు యెహోవా మీద మనకున్న విశ్వాసం పరీక్షించబడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చో తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
ఈ వీడియోలో చూపించిన సహోదరుడికి ఏ సమస్యలు వచ్చాయి?
ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఆయన ఏం చేశాడు?
మత్తయి 6:25-34 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
తనకు మొదటి స్థానం ఇస్తే ఏం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు?
కొంతమంది ఇలా అంటారు: “నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కష్టపడి పని చేయాలి. కాబట్టి ప్రతీవారం మీటింగ్స్‌కి రావడం కుదరదు.”
యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వడమే ఎప్పుడూ సరైనదని, మీకు ఏ లేఖనాన్ని బట్టి నమ్మకం కలుగుతుంది?
ఒక్కమాటలో
పని చేయడం, డబ్బు సంపాదించడం ముఖ్యమే. కానీ, యెహోవా ఆరాధనను పక్కన పెట్టేంతగా వాటిలో మునిగిపోకూడదు.
మీరేం నేర్చుకున్నారు?
పనిని దాని స్థానంలో ఉంచడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
ఉన్నవాటితో సంతృప్తిగా జీవిస్తే మీరు ఎలా ప్రయోజనం పొందుతారు?
తన ప్రజల అవసరాలను తీరుస్తానని యెహోవా ఇచ్చిన మాట మీద మీకు నమ్మకం ఉందని ఎలా చూపించవచ్చు?
ఇవి కూడా చూడండి
డబ్బు ఉండడం తప్పు అని బైబిలు చెప్తుందా?
డబ్బును ఎలా ఉపయోగిస్తే దేవుడు సంతోషిస్తాడో తెలుసుకోండి.
జూదం కేవలం సరదా కోసం ఆడేదా?
జూదం ఆడుతూ దొంగతనాలు చేసిన ఒకతను తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో చూడండి.
“గుర్రపుపందాలంటే నాకు పిచ్చి ఉండేది” (కావలికోట, ఏప్రిల్-జూన్ 2012)