అధ్యాయం 25
హస్తప్రయోగం అలవాటును ఎలా మానుకోవచ్చు?
“నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు హస్తప్రయోగం అలవాటైంది. తర్వాత, దేవుడు ఈ అలవాటును ఎలా చూస్తాడో అర్థంచేసుకున్నాను. నేను దానికి లొంగిపోయిన ప్రతీసారి చాలా ఘోరంగా అనిపించేది. ‘అసలు నాలాంటి వాణ్ణి దేవుడు ఎలా ప్రేమిస్తాడు?’ అని అనుకునేవాణ్ణి.”—లూయీజ్.
యుక్తవయసు వచ్చినప్పుడు, లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి. దానివల్ల, కొందరు హస్తప్రయోగానికి (masturbation) అలవాటు పడే అవకాశం ఉంది.a అదేం పెద్ద తప్పు కాదని చాలామంది అంటారు. “దానివల్ల ఎవరికీ నష్టం జరగదు” అని వాళ్లు సమర్థించుకుంటారు. అయితే ఆ అలవాటుకు దూరంగా ఉండడానికి చాలా మంచి కారణమే ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. అదుపులేని లైంగిక వాంఛ వాటిలో నుండే పుడుతుంది.’ (కొలొస్సయులు 3:5) హస్తప్రయోగం లైంగిక వాంఛను చంపేయదు, బదులుగా దాన్ని పెంచి పోషిస్తుంది. అలాగే, కింద ఉన్న కారణాలను కూడా పరిశీలించండి:
● హస్తప్రయోగం అలవాటు, మనం కేవలం మన గురించే ఆలోచించుకునేలా చేస్తుంది. ఉదాహరణకు, హస్తప్రయోగం చేసేటప్పుడు ఒక వ్యక్తి మనసంతా తన శరీరం పొందుతున్న సుఖం మీదే ఉంటుంది.
● హస్తప్రయోగానికి అలవాటుపడిన వాళ్లు ఎదుటివాళ్లను (పురుషుడైతే స్త్రీలను, స్త్రీ అయితే పురుషులను) కేవలం తమ కోరికలు తీర్చే వస్తువులుగా చూస్తారు.
● హస్తప్రయోగం ద్వారా అలవడిన స్వార్థపూరిత ఆలోచనాతీరు వల్ల, వివాహంలోని లైంగిక సంబంధం నుండి సంతృప్తి పొందలేరు.
కోరికలు కలిగినప్పుడు వాటిని తీర్చుకోవడానికి హస్తప్రయోగం చేసే బదులు, ఆత్మనిగ్రహం చూపించడానికి కృషి చేయండి. (1 థెస్సలొనీకయులు 4:4, 5) అందుకోసం, లైంగిక కోరికలు కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండమని బైబిలు ప్రోత్సహిస్తుంది. (సామెతలు 5:8, 9) కానీ ఇప్పటికే మీరు ఆ అలవాటుకు బానిస అయిపోతే అప్పుడెలా? బహుశా మీరు దాన్ని మానుకోవడానికి ప్రయత్నించినా అది మీవల్ల కాలేదు. దాంతో ఇక మీరు దాన్నుండి బయటపడలేరని, దేవుడు కోరుకుంటున్నట్లు ఎప్పటికీ జీవించలేరని మీకు అనిపిస్తుండవచ్చు. పేత్రో అనే యువకుడు అలాగే అనుకున్నాడు. అతను ఇలా చెప్తున్నాడు, “నేను దానికి లొంగిపోయినప్పుడు చాలా ఘోరంగా అనిపించేది, నేను చేసిన తప్పుకు ఎప్పటికీ క్షమాపణ ఉండదని నాకు అనిపించేది. ప్రార్థన చేయడం కూడా కష్టంగా ఉండేది.”
మీకు కూడా అలాగే అనిపిస్తుంటే, ధైర్యం కోల్పోకండి. మీరు విజయం సాధించగలరు. చాలామంది యువతీయువకులు, చివరికి పెద్దవాళ్లు కూడా ఆ అలవాటును మానుకోగలిగారు. మీరు కూడా మానుకోగలరు!
మీ అపరాధ భావాలతో పోరాడడం
పైన చూసినట్లు, హస్తప్రయోగానికి అలవాటుపడిన వాళ్లు అపరాధ భావాలతో సతమతమౌతుంటారు. నిజమే, “దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం” ఆ అలవాటు మానుకోవడానికి మీకు ఒక ప్రేరణగా ఉండగలదు. (2 కొరింథీయులు 7:11) కానీ మరీ ఎక్కువగా దుఃఖపడడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. దానివల్ల మీరు పూర్తిగా నిరుత్సాహపడిపోయి, ఆ అలవాటును మానుకోవాలనే పోరాటాన్ని ఆపేసే ప్రమాదం ఉంది.—సామెతలు 24:10.
కాబట్టి పరిస్థితిని సరైన విధంగా చూడడానికి కృషి చేయండి. హస్తప్రయోగం ఒక అపవిత్రమైన అలవాటు. అది మిమ్మల్ని ‘రకరకాల కోరికలకు, సుఖాలకు బానిసలుగా’ చేసి, తప్పుడు ఆలోచనా విధానాల్ని మీలో పెంపొందిస్తుంది. (తీతు 3:3) అదే సమయంలో, హస్తప్రయోగం వ్యభిచారం అంత ఘోరమైన లైంగిక పాపం కాదు. (యూదా 7) కాబట్టి మీకు ఒకవేళ హస్తప్రయోగం అలవాటు ఉంటే, మీరు క్షమించరాని పాపం చేస్తున్నారని అనుకోకండి. బదులుగా, ఆ కోరికను అణిచివేస్తూ మీ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు విజయం సాధిస్తారు!
ఎప్పుడైనా మళ్లీ ఆ తప్పు చేస్తే, నిరుత్సాహపడడం సహజమే. కానీ ఒక్కసారి తప్పు చేయగానే మీరు చెడ్డవాళ్లు అయిపోరు. కాబట్టి మీ అలవాటుతో పోరాడుతూ ఉండండి. ఏ కారణం వల్ల లొంగిపోయారో ఆలోచించుకొని, మళ్లీ అలా జరగకుండా చూసుకోండి.
సమయం తీసుకొని దేవుని ప్రేమ గురించి, కరుణ గురించి లోతుగా ఆలోచించండి. బలహీనత కారణంగా ఒకసారి పాపం చేసిన కీర్తనకర్త దావీదు ఇలా రాశాడు: “తండ్రి తన కుమారుల మీద కరుణ చూపించినట్టు, యెహోవా తనకు భయపడేవాళ్ల మీద కరుణ చూపించాడు. ఎందుకంటే, మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు.” (కీర్తన 103:13, 14) అవును, యెహోవా మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు, “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడు. (కీర్తన 86:5) అదే సమయంలో, మెరుగవ్వడానికి మనం గట్టిగా కృషి చేయాలని ఆయన ఆశిస్తాడు. కాబట్టి మీ అలవాటును మానుకోవడానికి మీరు ఏమేం పనులు చేయవచ్చు?
మీ వినోదాన్ని పరిశీలించుకోండి. లైంగిక కోరికలు రేకెత్తించే సినిమాలు, టీవీ కార్యక్రమాలు లేదా వెబ్సైట్లు మీరు చూస్తుంటారా? కీర్తనకర్త “వ్యర్థమైనవాటిని చూడకుండా నా కళ్లను పక్కకు తిప్పు” అని దేవునికి ప్రార్థించాడు.b—కీర్తన 119:37.
వేరేవాటి మీద మనసుపెట్టడానికి గట్టిగా ప్రయత్నించండి. విలియమ్ అనే క్రైస్తవుడు ఈ సలహా ఇస్తున్నాడు: “నిద్రపోయే ముందు, ఏవైనా బైబిలు విషయాలు చదవండి. రోజు చివర్లో మన ఆలోచన దేవుని విషయాల మీద ఉండడం చాలా ప్రాముఖ్యం.”—ఫిలిప్పీయులు 4:8.
మీ సమస్య గురించి ఎవరితోనైనా మాట్లాడండి. మీరు నమ్మే స్నేహితునితో లేదా కుటుంబ సభ్యునితో ఈ విషయం గురించి మాట్లాడాలంటే మీకు సిగ్గు అనిపించవచ్చు. కానీ అలా మాట్లాడడం ఆ అలవాటును మానుకోవడానికి మీకు సహాయం చేయగలదు! డేవిడ్ అనే క్రైస్తవుడు అదే చెప్తున్నాడు, అతను ఇలా అంటున్నాడు: “నేను మా నాన్నతో ఒంటరిగా దీని గురించి మాట్లాడాను. అప్పుడు ఆయన అన్న మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నాకు భరోసా ఇస్తున్నట్టు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ‘నిన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది.’ ఎందుకంటే ఆయనతో ఆ విషయం గురించి మాట్లాడడానికి నేనెంతో ధైర్యం కూడగట్టుకున్నానని ఆయనకు తెలుసు. ఆయన అన్న ఆ మాట నన్ను ఎంతో ప్రోత్సహించింది, దాన్ని మానేయాలనే పట్టుదలను ఇంకా పెంచింది.
“అప్పుడు, మా నాన్న నాకు కొన్ని లేఖనాలు చూపించి, నా పరిస్థితి చేయిదాటిపోలేదని అర్థం చేసుకునేలా సహాయం చేశాడు. తర్వాత, నేను చేసిన తప్పు ఎంత గంభీరమైనదో అర్థం చేసుకోవడానికి మరికొన్ని లేఖనాలు చూపించాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు. నేను ఒకవేళ మళ్లీ దానికి లొంగిపోతే నిరుత్సాహపడవద్దని, ఇంకొంచెం ఎక్కువకాలం ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించమని నాకు చెప్పాడు.” చివరికి డేవిడ్ ఏమంటున్నాడు? అతను ఇలా చెప్తున్నాడు: “నా సమస్య గురించి తెలిసినవాళ్లు, నాకు సహాయం చేసేవాళ్లు ఒకరు ఉండడం వల్ల చాలా ప్రయోజనం పొందాను.”c
[అధస్సూచీలు]
a హస్తప్రయోగం అనేది దానంతట అదే కలిగే లైంగిక ప్రేరణ లాంటిది కాదు. ఉదాహరణకు, ఒక యువకుడు నిద్ర లేచినప్పుడు అంగస్తంభన కలగవచ్చు, లేదా వీర్యస్ఖలనం కావొచ్చు. అలాగే ఒక యువతికి అనుకోకుండానే లైంగిక ప్రేరణలు కలగవచ్చు, ముఖ్యంగా రుతుస్రావానికి ముందు లేదా ఆ తర్వాత అలా జరగవచ్చు. దానికి భిన్నంగా, హస్తప్రయోగం అంటే కావాలనే తననుతాను లైంగికంగా ప్రేరేపించుకోవడం.
ముఖ్య వచనం
“యౌవన కోరికల నుండి పారిపో; పవిత్రమైన హృదయంతో ప్రభువు పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి గట్టిగా కృషిచేయి.”—2 తిమోతి 2:22.
సలహా
కోరికలు బలపడక ముందే ప్రార్థన చేయండి. ఆ పరిస్థితిని ఎదిరించడానికి మీకు “అసాధారణ శక్తి” ఇవ్వమని యెహోవా దేవుణ్ణి అడగండి.—2 కొరింథీయులు 4:7.
మీకు తెలుసా?
బలహీనంగా ఉన్న ఏ వ్యక్తైనా లైంగిక కోరికలకు లొంగిపోవచ్చు. కానీ నిజమైన పురుషుడు లేదా స్త్రీ మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆత్మనిగ్రహం చూపిస్తారు.
నేను చేయాల్సిన పనులు!
నేను పవిత్రమైన విషయాల మీద మనసు నిలపాలంటే ...
కోరికకు లొంగిపోయే బదులు ఇలా చేస్తాను ...
ఈ అంశం గురించి మా అమ్మను లేదా నాన్నను ఈ ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ...
మీకు ఏమనిపిస్తుంది?
● యెహోవా “క్షమించడానికి సిద్ధంగా” ఉన్నాడని గుర్తుంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?—కీర్తన 86:5.
● లైంగిక కోరికల్ని పెట్టిన దేవుడే ఆత్మనిగ్రహం అలవర్చుకోమని మీకు చెప్తున్నాడంటే, ఆయనకు మీ మీద ఎలాంటి నమ్మకం ఉంది?
[చిత్రం]
“ఆ సమస్య నుండి బయటపడిన తర్వాత యెహోవా ముందు నా మనస్సాక్షి స్వచ్ఛంగా ఉంది, నేను దేని కోసమూ దాన్ని వదులుకోను!”—సెర.
[చిత్రం]
పరుగెత్తేటప్పుడు ఒక్కసారి పడిపోతే మళ్లీ మొదటినుండి ఆరంభించాల్సిన అవసరం లేదు, అలాగే హస్తప్రయోగంతో పోరాడే విషయంలో ఒక్కసారి ఓడిపోతే, అప్పటిదాకా చేసిన కృషి వృథా అయినట్టు కాదు.