కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wt అధ్యా. 21 పేజీలు 184-191
  • యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది
  • అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇశ్రాయేలీయులు అనుగ్రహ స్థానాన్ని కోల్పోయారు
  • ‘పరలోకంలో ఉన్నవాటిని’ సమకూర్చడం
  • ‘భూమిమీద ఉన్నవాటిని’ సమకూర్చడం
  • భవిష్యత్తులో అద్భుతమైన స్వాతంత్ర్యముంది
  • యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
    “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
  • దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
wt అధ్యా. 21 పేజీలు 184-191

అధ్యాయం ఇరవై ఒకటి

యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది

1, 2. (ఎ) బుద్ధిసూక్ష్మతగల తన ప్రాణులకు సంబంధించి యెహోవా సంకల్పమేమిటి? (బి) దేవుని ఆరాధకుల ఐక్య కుటుంబంలో ఎవరెవరున్నారు?

బుద్ధిసూక్ష్మతగల సృష్టి ప్రాణులందరు అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమై, దేవుని పిల్లలుగా మహిమాన్విత స్వాతంత్ర్యం అనుభవించాలన్నదే యెహోవా ప్రేమపూర్వక సంకల్పం. నీతిని ప్రేమించే వారందరు హృదయపూర్వకంగా కోరుకునేది కూడా అదే.

2 యెహోవా తన సృష్టికార్యాలను ఆరంభించినప్పుడే ఆ దివ్య సంకల్పం నెరవేర్చడం ఆరంభించాడు. ఆయన మొట్టమొదట ఒక కుమారుణ్ణి సృష్టించాడు, ఆ కుమారుడు పునరుత్థానమైనప్పటి నుండి “దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” ఉన్నాడు. (హెబ్రీయులు 1:​1-3) దేవుడే స్వయంగా సృష్టించిన ఆ కుమారుడు నిరుపమానుడు. ఆ తర్వాత, ఆ కుమారుని ద్వారానే మిగతావాళ్ళందరు అంటే, మొదట పరలోకంలో దేవదూతలు, ఆ తర్వాత భూమ్మీది మానవులు ఉనికిలోకి వచ్చారు. (యోబు 38: 7; లూకా 3:​38) వారంతా కలిసి ఒకే విశ్వ కుటుంబంగా తయారయ్యారు. వారందరికి యెహోవాయే దేవుడు, విశ్వ సర్వాధిపతి, ప్రేమగల తండ్రి.

3. (ఎ) మన మొదటి తల్లిదండ్రుల నుండి మనందరం వారసత్వంగా ఏమి పొందాము? (బి) ఆదాము సంతానం కోసం యెహోవా ఎలాంటి ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడు?

3 ఉద్దేశపూర్వకంగా పాపం చేసినవారిగా మన మొదటి మానవ తల్లిదండ్రులకు మరణశిక్ష విధించబడినప్పుడు, దేవుడు వారిని ఉపేక్షించి ఏదెను నుండి వెళ్ళగొట్టాడు. అలా వారు ఆయన విశ్వ కుటుంబంలో స్థానాన్ని పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:​22-24; ద్వితీయోపదేశకాండము 32:​4, 5) మనందరం వారి సంతానమే కాబట్టి మనం పాపపు స్వభావాలతో జన్మించాము. అయితే ఆదాము హవ్వల సంతానంలో కొందరు నీతిని ప్రేమించేవారిగా ఉంటారని యెహోవాకు తెలుసు. అందుకే వారు ‘దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యం పొందడానికి’ ఆయన ప్రేమపూర్వకంగా ఒక ఏర్పాటు చేశాడు.​—⁠రోమీయులు 8:​20, 21.

ఇశ్రాయేలీయులు అనుగ్రహ స్థానాన్ని కోల్పోయారు

4. యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు?

4 ఆదాము సృష్టించబడిన దాదాపు 2,500 సంవత్సరాల తర్వాత, యెహోవా కొంతమంది మానవులకు తనతో ప్రత్యేక సంబంధం కలిగివుండే ఆధిక్యతను ఇచ్చాడు. ఆయన ప్రాచీన ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎంపిక చేసుకొని వారికి తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. (ఆదికాండము 12:​1, 2) ఆయన వారిని ఒక జనాంగముగా చేసి తన సంకల్పం నిమిత్తం వారిని ఉపయోగించాడు. (ద్వితీయోపదేశకాండము 14:​1, 2; యెషయా 43: 1) అయితే వారు ఇంకా పాపమరణాలకు బానిసలుగానే ఉన్నారు కాబట్టి, ఆదాము హవ్వలు మొదట్లో అనుభవించిన మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని వారు అనుభవించలేకపోయారు.

5. ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట తమ ప్రత్యేక స్థానాన్ని ఎలా పోగొట్టుకున్నారు?

5 అయినప్పటికి, ఇశ్రాయేలీయులు దేవుని యెదుట అనుగ్రహ స్థానం అనుభవించారు. యెహోవాను తమ తండ్రిగా గౌరవించి, ఆయన సంకల్పానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత కూడా వారికివుంది. వారు ఆ బాధ్యత నెరవేర్చే ప్రాముఖ్యత గురించి యేసు నొక్కిచెప్పాడు. (మత్తయి 5:​43-48) అయితే ఇశ్రాయేలు జనాంగం అలా చేయలేకపోయింది. ఆ యూదులు “దేవుడొక్కడే మాకు తండ్రి” అని చెప్పుకున్నా వారి క్రియలు, వారు కనబరచిన స్వభావం వారి వాదన అబద్ధమని నిరూపిస్తున్నాయని యేసు ప్రకటించాడు. (యోహాను 8:​41, 44, 47) సా.శ. 33 లో దేవుడు ధర్మశాస్త్రాన్ని రద్దుచేయడంతో ఇశ్రాయేలీయులకు ఆయనతో ఉండే ప్రత్యేక సంబంధం ముగిసింది. అంటే ప్రజలు ఇక ఎన్నటికి దేవునితో అనుగ్రహ సంబంధాన్ని అనుభవించలేరని దానర్థమా?

‘పరలోకంలో ఉన్నవాటిని’ సమకూర్చడం

6. పౌలు ఎఫెసీయులు 1:​8-10 లో ప్రస్తావించిన ‘ఏర్పాటు’ సంకల్పమేమిటి?

6 మానవుల్లోని కొందరు దేవునితో ప్రత్యేక సంబంధాన్ని అనుభవించగలుగుతారని అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఉదాహరణకు, విశ్వాసంగల వారు దేవుని కుటుంబ సభ్యులయ్యేందుకు యెహోవా చేసిన ఏర్పాటు గురించి పౌలు ఇలా వ్రాశాడు: “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన [దేవుడు] తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.” (ఎఫెసీయులు 1:​8-10) ఈ ‘ఏర్పాటుకు’ యేసుక్రీస్తే కేంద్రబిందువు. ఆయన ద్వారానే మానవులు దేవుని ఎదుట అంగీకృత స్థితికి తీసుకురాబడ్డారు. వారిలో కొందరికి పరలోకంలో ఉండే ఉత్తరాపేక్ష ఉంది. అయితే అంతకంటే ఎక్కువమంది ప్రజలు భూమిపై నిరంతరం జీవిస్తారు.

7. ‘పరలోకములో ఉన్నవి’ అంటే ఎవరు?

7 సా.శ. 33 పెంతెకొస్తు మొదలుకొని మొదట ‘పరలోకములో ఉన్నవాటికి’ అంటే పరలోక రాజ్యంలో క్రీస్తు తోటి వారసులుగా ఉండేవారిపై అవధానం ఉంచబడింది. యేసు బలి విలువపై వారి విశ్వాసం ఆధారంగా, దేవుడు వారిని నీతిమంతులుగా ప్రకటించాడు. (రోమీయులు 5:​1, 2) తగిన సమయంలో, యూదులు, అన్యులు కూడా చేర్చబడ్డారు, అలా “పరలోకములో ఉన్న” వారు 1,44,000 మంది అవుతారు. (గలతీయులు 3:​26-29; ప్రకటన 14: 1) వారిలో శేషము మాత్రమే ఇంకా భూమిపై ఉన్నారు.

‘భూమిమీద ఉన్నవాటిని’ సమకూర్చడం

8. ‘భూమిమీద ఉన్నవి’ అంటే ఎవరు, యెహోవాతో వారి సంబంధమేమిటి?

8 ఆ ఏర్పాటే ‘భూమిమీద ఉన్నవాటిని’ కూడా సమకూరుస్తోంది. భూమిపై నిత్యం జీవించే ఉత్తరాపేక్షతో లక్షలాది మంది ఇప్పుడు సమకూర్చబడుతున్నారు. రాజ్య వారసుల శేషముతో ఐకమత్యంగా వారు యెహోవా నామమును ఘనపరుస్తూ ఆయన ఆరాధనను ఉన్నతపరుస్తున్నారు. (యెషయా 2:​2, 3; జెఫన్యా 3: 9) వారు యెహోవాను జీవదాతగా గుర్తించారు కాబట్టి వారు కూడా ఆయనను “తండ్రీ” అని సంబోధిస్తున్నారు. యేసు చిందించిన రక్తంపై విశ్వాసం ఆధారంగా వారు ఆయన ఎదుట అంగీకృత స్థానాన్ని కలిగివుంటారు. (ప్రకటన 7:​9, 14) కాని వారు ఇప్పటికి అపరిపూర్ణులుగా ఉన్నారు కాబట్టి, వారు దేవుని పిల్లలుగా సంపూర్ణంగా అంగీకరించబడడం ఇంకా భవిష్యత్తులో జరుగుతుంది.

9. రోమీయులు 8:21 లో మానవాళికి ఏ వాగ్దానం ఉంది?

9 భూనిరీక్షణగల వారు మానవ సృష్టి “నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడే” కాలం కోసం ఇప్పుడు అత్యాసక్తితో ఎదురుచూస్తున్నారు. (రోమీయులు 8:​20, 21) క్రీస్తు, ఆయన పరలోక సైన్యము అర్మగిద్దోనుతో మహాశ్రమలను ముగించిన తర్వాత ఆ విడుదల ఆరంభమవుతుంది. అంటే సాతాను విధానమంతా నాశనం చేయబడిన వెంటనే క్రీస్తు రాజ్యాధికారంతో వెయ్యేండ్ల పరిపాలనా దీవెనలు ఆరంభమవుతాయని దాని భావం.​—⁠ప్రకటన 19:​17-21; 20: 6.

10. యెహోవా సేవకులు ఏ స్తుతిగీతం పాడతారు?

10 “ప్రభువా [యెహోవా], దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; యెహోవా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరు” అని ఆనందంగా ప్రకటించే ఆయన పరలోక సేవకుల భావాలనే భూమ్మీది యెహోవా సేవకులు ప్రతిధ్వనించినప్పుడు అదెంతో మనోహరంగా ఉంటుంది. (ప్రకటన 15:​3-4) అవును యెహోవా సేవకులందరు అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించడంలో ఐక్యమవుతారు. మృతులు సహితం పునరుత్థానం చేయబడతారు, తమ స్వరాలు కలిపి యెహోవాను స్తుతించే అవకాశం వారికి ఇవ్వబడుతుంది.​—⁠అపొస్తలుల కార్యములు 24:​14, 15.

భవిష్యత్తులో అద్భుతమైన స్వాతంత్ర్యముంది

11. మహాశ్రమలు తప్పించుకొనేవారు ఎలాంటి మహాద్భుత స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు?

11 అర్మగిద్దోనుతో ముగిసే మహాశ్రమలు భూమ్మీది దుష్టత్వాన్ని తుడిచివేసిన తర్వాత, అపవాదియగు సాతాను ఇక ‘ఈ యుగ సంబంధమైన దేవతగా’ ఉండడు. యెహోవా ఆరాధకులు సాతాను నికృష్ట ప్రభావంతో పోరాడవలసిన అవసరం ఇక ఉండదు. (2 కొరింథీయులు 4: 4; ప్రకటన 20:​1, 2) అబద్ధమతం యెహోవాకు తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తూ, మానవ సమాజాన్ని విభజించేదిగా ఇక ఉండదు. సత్య దేవుని ఆరాధకులు మానవ ప్రభుత్వాధికారుల అన్యాయాలను, మోసాలను ఇక అనుభవించరు. అది ఎంతటి మహాద్భుత స్వాతంత్ర్యమో కదా!

12. పాపము నుండి, దాని ప్రభావాల నుండి అందరూ ఎలా విడిపించబడతారు?

12 ‘లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లగా’ యేసు, మానవాళి పాపాలన్నింటిని కొట్టివేయడానికి తన బలి విలువను ఉపయోగిస్తాడు. (యోహాను 1:​29) యేసు భూమిపై ఉన్నప్పుడు ఒక వ్యక్తి పాపాలు క్షమించినప్పుడు దానికి రుజువుగా క్షమించబడిన ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. (మత్తయి 9:​1-7; 15:​30, 31) అదేవిధంగా దేవుని రాజ్యానికి పరలోక రాజుగా క్రీస్తు యేసు గ్రుడ్డివారిని, మూగవారిని చెవిటివారిని, అంగవైకల్యం గలవారిని, మానసిక రోగులను, మరితర వ్యాధిగలవారెవరినైనా అద్భుతరీతిలో స్వస్థపరుస్తాడు. (ప్రకటన 21:​3, 4) విధేయులుగా ఉండే వారందరి తలంపులు, క్రియలు వారికి, అలాగే దేవునికి ప్రీతికరంగా ఉండేలా “పాపనియమము” పూర్తిగా కొట్టివేయబడుతుంది. (రోమీయులు 7:​21-23) వెయ్యేండ్లు ముగిసేసరికి వారు సంపూర్ణ మానవ పరిపూర్ణతకు, అద్వితీయ సత్య దేవుని ‘స్వరూపానికి, పోలికకు’ తీసుకురాబడతారు.​—⁠ఆదికాండము 1:​26.

13. వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో క్రీస్తు ఏ చర్య తీసుకుంటాడు, దాని ఫలితమేమిటి?

13 క్రీస్తు మానవాళిని పరిపూర్ణతకు తీసుకువచ్చిన తర్వాత, ఈ కార్యం కోసం తనకివ్వబడిన అధికారాన్ని ఆయన తిరిగి తన తండ్రికే అప్పగిస్తాడు: “ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.” (1 కొరింథీయులు 15:​24, 25) వెయ్యేండ్ల రాజ్య పరిపాలన దాని సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తుంది; కాబట్టి యెహోవాకు మానవాళికి మధ్య ఇక ఈ అనుబంధ ప్రభుత్వం ఉండవలసిన అవసరం ఉండదు. పాపమరణాలు పూర్తిగా తీసివేయబడి మానవాళి విమోచించబడింది కాబట్టి యేసు ఇక విమోచకుడిగా ఉండవలసిన అవసరం ఉండదు. బైబిలు ఇలా వివరిస్తోంది: “సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.”​—⁠1 కొరింథీయులు 15:​28.

14. పరిపూర్ణ మానవులందరు దేనికి గురవుతారు, ఎందుకు?

14 దాని తర్వాత, తాము అద్వితీయ సత్య దేవుణ్ణి నిత్యం ఆరాధించేందుకు ఎంపిక చేసుకున్నామని నిరూపించుకొనే అవకాశం పరిపూర్ణులైన మానవాళికి ఇవ్వబడుతుంది. కాబట్టి యెహోవా వారిని తన పిల్లలుగా సంపూర్ణంగా స్వీకరించేముందు, ఆ పరిపూర్ణ మానవులను చివరిగా ఒక పరీక్షకు గురిచేస్తాడు. సాతాను, అతని దయ్యాలు అగాధము నుండి విడుదల చేయబడతారు. యెహోవాను నిజంగా ప్రేమించే వారికి అది ఏమాత్రం హానికరంగా పరిణమించదు. కాని ఎవరైనా అవిశ్వసనీయంగా ప్రవర్తించి యెహోవాకు అవిధేయులైతే, మొదటి తిరుగుబాటుదారునితో, అతని దయ్యాలతోపాటు వారు శాశ్వతంగా నాశనం చేయబడతారు.​—⁠ప్రకటన 20:​7-10.

15. యెహోవా బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరి మధ్య మళ్ళీ ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది?

15 అప్పుడు ఆ చివరి పరీక్షలో దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించిన పరిపూర్ణ మానవులందరిని యెహోవా తన పిల్లలుగా స్వీకరిస్తాడు. అప్పటినుండి వారు దేవుని విశ్వ కుటుంబంలో భాగంగా దేవుని పిల్లలు పొందే మహిమాన్విత స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. భూమ్యాకాశాల్లోని బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరు ఆయనను అద్వితీయ సత్య దేవునిగా ఆరాధించడంలో మళ్ళీ ఐక్యమౌతారు. యెహోవా సంకల్పం మహిమాన్విత విజయం సాధిస్తుంది! సంతోషకరమైన, శాశ్వతమైన, ఆ విశ్వ కుటుంబంలో మీరు సభ్యులుగా ఉండాలనుకుంటున్నారా? అలాగయితే 1 యోహాను 2:​17 లో బైబిలు చెబుతున్న మాటలను మీరు లక్ష్యపెట్టాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”

పునఃసమీక్షా చర్చ

• ఏదెనులో తిరుగుబాటు జరగక ముందు, యెహోవా ఆరాధకులందరికి ఆయనతో ఎలాంటి సంబంధం ఉండేది?

• దేవుని సేవకులకు ఏ బాధ్యత ఉంది?

• ఇంకా ఎవరు కూడా దేవుని పిల్లలౌతారు, ఐక్యారాధనకు సంబంధించిన యెహోవా సంకల్పానికి ఇదెలా ముడిపడి ఉంది?

[190వ పేజీలోని చిత్రం]

విధేయులైన మానవులు భూవ్యాప్త పరదైసులో జీవితాన్ని అనుభవిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి