అధ్యాయం 27
“ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!”
1, 2. దేవుని మంచితనం నుండి ఎవరెవరు ప్రయోజనం పొందుతున్నారు? ఈ లక్షణం గురించి బైబిలు ఏం నొక్కిచెప్తుంది?
సాయంత్రం కొంతమంది చిన్ననాటి స్నేహితులు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, సూర్యాస్తమయాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇంకో ఊరిలో తన పొలాల్ని చూసి, ఒక రైతు ముఖం వెలిగిపోతుంది. ఎందుకంటే నల్లటి మేఘాలు కమ్ముకొచ్చాయి, గొంతు ఎండిపోయిన పంటకు తొలకరి వాన దాహం తీరుస్తుంది. వేరేచోట ఒక జంట, వాళ్ల అబ్బాయి వేస్తున్న బుడిబుడి అడుగుల్ని చూసి మురిసిపోతున్నారు.
2 వాళ్లకు తెలిసినా, తెలియకపోయినా వాళ్లందరూ యెహోవా దేవుని మంచితనం నుండి ప్రయోజనం పొందుతున్నారు. దేవుణ్ణి నమ్మే కొంతమంది, “దేవుడు మంచివాడు” అని ఊరికే అంటూ ఉంటారు. కానీ బైబిలు దాన్ని ఇంకా నొక్కిచెప్తూ, ఇలా అంటుంది: “ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!” (జెకర్యా 9:17) అయితే, ఈ రోజుల్లో చాలామందికి ఆ మాటల అర్థం ఏంటో తెలీదు. ఇంతకీ యెహోవా దేవుడు మంచివాడు అంటే దానర్థం ఏంటి? ఆయన మంచితనం నుండి మనలో ప్రతీ ఒక్కరం ఎలా ప్రయోజనం పొందుతున్నాం?
దేవుని ప్రేమ నుండి పుట్టుకొచ్చిన ఒక అందమైన కొమ్మ
3, 4. మంచితనం అంటే ఏంటి? యెహోవా మంచితనం, ఆయన ప్రేమలో నుండి పుట్టుకొచ్చిన ఒక కొమ్మ అని ఎందుకు చెప్పవచ్చు?
3 ఇప్పుడున్న చాలా భాషల్లో “మంచితనానికి” ఒక ప్రత్యేకమైన అర్థం అంటూ ఏమీ లేదు. కానీ బైబిలు, అసలు మంచితనం అంటే ఏంటో చెప్తుంది. మంచితనం అంటే, ముఖ్యంగా సుగుణాలు, ఉన్నతమైన నైతిక విలువలు ఉండడం. కాబట్టి, ఒక విధంగా మంచితనం యెహోవాలో అణువణువునా నిండిపోయింది అని చెప్పవచ్చు. శక్తి, న్యాయం, తెలివితో సహా ఆయన లక్షణాలన్నీ పూర్తిగా మంచివి. అయితే, ఈ మంచితనం అనేది ప్రేమలో నుండి పుట్టుకొచ్చిన ఒక కొమ్మ అని చెప్పవచ్చు. ఎందుకు?
4 మంచితనం అనేది వేరేవాళ్లకు సహాయం చేసేలా కదిలించే లక్షణం. మంచితనం నీతి కంటే గొప్పదని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమీయులు 5:7) ఒక నీతిమంతుడు నియమాల్ని, నిబంధనల్ని తూ.చ. తప్పకుండా పాటిస్తాడు. కానీ ఒక మంచివాడు అంతకంటే ఎక్కువే చేస్తాడు. అంటే ఆయనే చొరవ తీసుకుని, వేరేవాళ్లకు మేలు చేసే అవకాశాల కోసం వెదుకుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూడబోతున్నట్టుగా, యెహోవా సరిగ్గా అలాంటివాడే. అవును, అలాంటి మంచితనం యెహోవాకున్న అపారమైన ప్రేమ నుండి పుడుతూ ఉంటుంది.
5-7. “మంచి బోధకుడా” అని పిలిస్తే యేసు ఎందుకు ఒప్పుకోలేదు? అలా ఆయన ఏ ముఖ్యమైన సత్యాన్ని నొక్కిచెప్పాడు?
5 మంచితనంలో యెహోవాకు సాటి ఎవ్వరూ లేరు. యేసు చనిపోవడానికి కొంతకాలం ముందు, ఒకతను ఒక ప్రశ్న అడగడానికి వచ్చి ఆయన్ని “మంచి బోధకుడా” అని పిలిచాడు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవ్వరూ లేరు.” (మార్కు 10:17, 18) ఆ జవాబు వినగానే మీకు కొంచెం తికమకగా అనిపించవచ్చు. యేసు అతన్ని ఎందుకు సరిదిద్దాడు? నిజంగా యేసు “మంచి బోధకుడే” కదా?
6 అతను యేసు దగ్గర మార్కులు కొట్టేయడానికే “మంచి బోధకుడా” అని పిలిచాడని తెలుస్తుంది. అప్పుడు యేసు అణకువ చూపించి, ఘనతంతా తన పరలోక తండ్రికే ఇచ్చాడు. ఎందుకంటే, యెహోవా మాత్రమే సర్వోన్నత స్థాయిలో మంచివాడు. (సామెతలు 11:2) అయితే ఇక్కడ యేసు ఒక ముఖ్యమైన సత్యాన్ని కూడా నొక్కిచెప్తున్నాడు. అదేంటంటే, యెహోవా మాత్రమే ఏది మంచి, ఏది చెడు అనే ప్రమాణాల్ని పెడతాడు. సర్వాధిపతిగా ఆయనకు మాత్రమే, మంచిచెడులను నిర్ణయించే హక్కు ఉంది. ఆదాముహవ్వలు దేవుని మాట వినకుండా, మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండు తినడం ద్వారా, ఆ హక్కును తమ చేతుల్లోకి తీసుకోవాలని చూశారు. కానీ యేసు వాళ్లలా కాకుండా, ప్రమాణాల్ని పెట్టే అధికారాన్ని వినయంగా తన తండ్రికే వదిలేశాడు.
7 అంతేకాదు, మంచివన్నీ యెహోవా నుండే వస్తాయని యేసుకు తెలుసు. “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” ఆయన నుండే వస్తాయి. (యాకోబు 1:17) ఏదంటే అది, ఎంతంటే అంత ఉదారంగా ఇవ్వడం ద్వారా యెహోవా మంచితనాన్ని ఎలా చూపిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.
ఏరులై పారుతున్న యెహోవా మంచితనం
8. యెహోవా మనుషులందరి మీద ఎలా మంచితనం చూపిస్తున్నాడు?
8 ఈ భూమ్మీద బ్రతికిన ప్రతీ ఒక్కరు యెహోవా మంచితనం నుండి ప్రయోజనం పొందినవాళ్లే. కీర్తన 145:9 ఇలా చెప్తుంది: “యెహోవా అందరికీ మంచి చేస్తాడు.” ఆయన ఏయే విధాలుగా అందరికీ మంచి చేస్తాడు? బైబిలు ఇలా చెప్తుంది: “మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు. ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ, ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.” (అపొస్తలుల కార్యాలు 14:17) ఎప్పుడైనా కమ్మని భోజనం తిన్న తర్వాత, మీకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందా? ఎప్పటికప్పుడు తాజా నీరు ఇచ్చేలా భూమిని, ‘పుష్కలంగా పంటను ఇచ్చేలా రుతువుల్ని’ యెహోవా చేసుండకపోతే మనందరం పస్తులు ఉండాల్సి వచ్చేది. మరి అదంతా ఆయన మంచితనం కాదంటారా? యెహోవా అలాంటి మంచితనాన్ని తనను ప్రేమించేవాళ్ల మీదే కాదు, ప్రతీ ఒక్కరి మీద కురిపిస్తున్నాడు. యేసు ఇలా అన్నాడు: “ఆయన దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు.”—మత్తయి 5:45.
9. ఆపిల్ పండు యెహోవా మంచితనం గురించి ఏం చెప్తుంది?
9 ఎప్పుడూ చూసే సూర్యుడు, వర్షం, రుతువులే కదా అని చాలామంది యెహోవా కురిపిస్తున్న ఉదారతను పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకు, ఆపిల్ విషయమే తీసుకోండి. భూమ్మీద చాలా దేశాల్లో, ఆపిల్ అంటే తెలియనివాళ్లే ఉండరు. అది అమోఘమైన రుచితో, తియ్యటి రసంతో, విలువైన పోషకాలతో ఉండే అందమైన పండు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 రకాల ఆపిల్స్ ఉన్నాయి. అవి ఎరుపు రంగు నుండి బంగారు రంగు వరకు, పసుపు రంగు నుండి పచ్చ రంగు వరకు ఉన్నాయి. అలాగే, ద్రాక్షపండు కంటే కాస్త పెద్ద సైజు నుండి దగ్గరదగ్గర కొబ్బరి బొండాం సైజు వరకు ఉన్నాయి. మీరు ఒక చిన్న ఆపిల్ విత్తనాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఇదేం ఉందిలే అనిపించవచ్చు. కానీ దాని నుండే ఒక అందమైన చెట్టు వస్తుంది. (పరమగీతం 2:3) మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆపిల్ చెట్టు పూతతో ఎంత బాగుంటుందంటే, ఒక అందమైన పూల కిరీటంతో ముస్తాబు చేసినట్టు ఉంటుంది. సెప్టెంబరు-అక్టోబరు వచ్చేసరికల్లా దానికి కాయలు వస్తాయి. ప్రతీ సంవత్సరం సగటున ఒక ఆపిల్ చెట్టు ఎన్ని కాయలు ఇస్తుందంటే, దాదాపు 19 కేజీల బరువుండే అట్టపెట్టెలు 20 దాకా నిండుతాయి! అలా 75 సంవత్సరాల వరకు దానికి కాయలు కాస్తూనే ఉంటాయి.
యెహోవా ‘ఆకాశం నుండి వర్షాల్ని, పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్ని’ ఇస్తున్నాడు
ఈ చిన్న విత్తనం నుండి వచ్చే చెట్టు ఎన్నో సంవత్సరాల పాటు ఆహారాన్ని, ఆనందాన్ని ఇస్తుంది
10, 11. మన శరీరం దేవుని మంచితనాన్ని ఎలా రుజువు చేస్తుంది?
10 యెహోవా తన అపారమైన మంచితనం వల్ల, మన శరీరాన్ని “అద్భుతంగా” తయారుచేశాడు. మన చుట్టూ ఉన్న వాటిని చూసే, వినే, వాసన పీల్చే, రుచిచూసే, స్పర్శించే సామర్థ్యంతో దాన్ని తయారు చేశాడు. (కీర్తన 139:14) మొదటి పేరాలో చెప్పిన సన్నివేశాల గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. ఏది చూసి వాళ్లు సంతోషిస్తున్నారు? సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశంలో కనిపించే ఎరుపు, బంగారు, వంకాయ రంగులా? పొలాల మీద ఒక తెరలా కురుస్తున్న వర్షమా? సంతోషంతో ఎరుపెక్కిన పిల్లాడి పాలబుగ్గలా? మన కన్ను వందల-వేల రంగుల్ని, ఆఖరికి లక్షల రంగుల్ని కూడా చూడగలదు! ఇక వినే విషయానికొస్తే మనకు ఇష్టమైనవాళ్ల గొంతు పలికే ఫీలింగ్స్‌ని, చెట్ల మధ్య నుండి వీస్తున్న గాలి శబ్దాన్ని, పిల్లాడి కేరింతల్ని మనం గుర్తుపట్టగలం. వీటన్నిటిని మనం చూసి, విని ఆనందించగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? బైబిలు ఇలా చెప్తుంది: “వినే చెవి, చూసే కన్ను రెండిటినీ యెహోవాయే చేశాడు.” (సామెతలు 20:12) అయితే, యెహోవా ఇచ్చిన సామర్థ్యాల్లో అవి రెండు మాత్రమే.
11 వాసన చూసే సామర్థ్యం, యెహోవా మంచితనానికి ఇంకో రుజువు. మన ముక్కు వెయ్యి నుండి దాదాపు ఒక లక్ష కోట్ల వరకు వాసనలు పసిగట్టగలదు. ఇష్టమైన వంట చేస్తున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు, పువ్వుల గుబాళింపు, రాలిన ఆకుల పరిమళం, వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన, ఇవి కొన్ని ఉదాహరణలే. స్పర్శ విషయానికొస్తే, దానివల్లే పిల్లగాలి పెట్టే గిలిగింతల్ని, ఇష్టమైనవాళ్ల వెచ్చని కౌగిలిని, నున్నటి పండు కోమలత్వాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. ఇక ఆ పండును కొరకగానే, రుచి చూసే సామర్థ్యం బరిలోకి దిగుతుంది. పండులో దాగివున్న రసం నాలుకకు తాకగానే, రకరకాల రుచులు నోట్లో సందడి చేస్తాయి. అవును, యెహోవాను ఇలా స్తుతించడానికి మనకు బోలెడు కారణాలున్నాయి: “నీ మంచితనం ఎంత విస్తారమైనది! నీకు భయపడేవాళ్ల కోసం నువ్వు దాన్ని దాచివుంచావు.” (కీర్తన 31:19) ఇంతకీ, యెహోవా తనకు భయపడేవాళ్ల కోసం మంచితనాన్ని ఎలా దాచివుంచాడు?
శాశ్వత ప్రయోజనాలు తెచ్చే మంచితనం
12. యెహోవా చేసిన ఏ ఏర్పాట్లు చాలా ముఖ్యమైనవి? ఎందుకు?
12 యేసు ఇలా చెప్పాడు: “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి’ అని రాయబడివుంది.” (మత్తయి 4:4) నిజానికి మనం తినే ఆహారం కన్నా, బైబిల్లో ఉన్న యెహోవా మాటలు మనకు ఎక్కువ మంచి చేస్తాయి. ఎందుకంటే, అవి మనల్ని శాశ్వత జీవితానికి నడిపిస్తాయి. ఈ పుస్తకంలోని 8వ అధ్యాయంలో చూసినట్లు, యెహోవా తనకున్న చక్కదిద్దే శక్తిని ఉపయోగించి ఈ చివరి రోజుల్లో ఆధ్యాత్మిక పరదైసును కడుతున్నాడు. అందులో ఉండే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారం.
13, 14. (ఎ) యెహెజ్కేలు ప్రవక్త ఒక దర్శనంలో ఏం చూశాడు? దాని నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? (బి) తన నమ్మకమైన సేవకులు శాశ్వత జీవితం పొందడం కోసం యెహోవా ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?
13 బైబిల్లో ఉన్న ఒక ప్రవచనం, దేవుడు అన్నిటినీ ఎలా కొత్తవిగా చేస్తాడో చెప్తుంది. యెహెజ్కేలు ప్రవక్త ఒక దర్శనంలో, తిరిగికట్టిన ఒక గొప్ప ఆలయాన్ని చూశాడు. ఆ ఆలయం నుండి నీళ్లు పారుతున్నాయి. ఆ నీళ్లు వెళ్లేకొద్దీ లోతు, వెడల్పు పెరిగి ఒక పెద్ద ప్రవాహంలా తయారయ్యాయి. ఆ నది వెళ్లిన ప్రతీచోట దీవెనల్ని ఇస్తుంది. ఆ నది ఒడ్డున ఉన్న చెట్లు చక్కగా కాయలు కాస్తూ ఆహారం ఇస్తున్నాయి, వాటి ఆకులేమో స్వస్థత కోసం ఉపయోగపడుతున్నాయి. ఆ నది వల్ల, ఉప్పు తప్ప జీవమే ఉండని మృత సముద్రంలోని నీళ్లు మంచిగా అయ్యాయి, దానికి జీవం వచ్చింది. (యెహెజ్కేలు 47:1-12) ఇంతకీ ఈ దర్శనానికి అర్థం ఏంటి?
14 ఆలయం గురించిన ఆ దర్శనానికి అర్థం ఏంటంటే, యెహోవా స్వచ్ఛమైన ఆరాధనను మళ్లీ గాడిలో పెడతాడు. అది మళ్లీ ఆయన నీతి ప్రమాణాలకు తగ్గట్టు ఉంటుంది. ఆ దర్శనంలో ఉన్న నదిలాగే, శాశ్వత జీవితం కోసం దేవుడు చేసిన ఏర్పాట్లు, ఆయన ప్రజల దగ్గరికి అంతకంతకూ ఎక్కువగా పారతాయి. 1919 లో స్వచ్ఛమైన ఆరాధనను గాడిలో పెట్టినప్పటి నుండి, శాశ్వత జీవితాన్నిచ్చే ఏర్పాట్లతో యెహోవా తన ప్రజల్ని దీవిస్తున్నాడు. ఎలా? బైబిలు, బైబిలు ప్రచురణలు, మీటింగ్స్, సమావేశాలు ఇవన్నీ లక్షలమందికి ముఖ్యమైన సత్యాల్ని అందజేశాయి. వాటి ద్వారా, శాశ్వత జీవితం ఇవ్వడం కోసం దేవుడు చేసిన అన్నిటికంటే ముఖ్యమైన ఏర్పాటు గురించి తన ప్రజలకు నేర్పించాడు. అదే, క్రీస్తు విమోచన క్రయధనం. దానివల్ల యెహోవాను నిజంగా ప్రేమించి, ఆయనకు భయపడే వాళ్లందరూ మంచి మనస్సాక్షితో ఉండవచ్చు, శాశ్వత జీవితాన్ని పొందవచ్చు.a కాబట్టి ఈ చివరి రోజుల్లో లోకంలోని ప్రజలు ఆధ్యాత్మిక కరువుతో అలమటిస్తుంటే, యెహోవా ప్రజలు మాత్రం ఆధ్యాత్మిక విందును ఆరగిస్తున్నారు.—యెషయా 65:13.
15. వెయ్యేళ్ల పరిపాలనలో యెహోవా మంచితనం ఎలా ఏరులై పారుతుంది?
15 అయితే యెహెజ్కేలు దర్శనంలో చూసిన నది, ఈ పాత వ్యవస్థ నాశనం అవ్వడంతో ఆగిపోదు. బదులుగా, అది క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో కూడా ఇంకా ఎక్కువగా పారుతూ ఉంటుంది. ఆ సమయంలో యెహోవా, మెస్సీయ రాజ్యం ద్వారా విమోచన క్రయధన బలి విలువను పూర్తిగా అన్వయించి, నమ్మకమైన మనుషుల్ని మెల్లమెల్లగా పరిపూర్ణతకు తీసుకొస్తాడు. అప్పుడు యెహోవా మంచితనాన్ని బట్టి మనం ఇంకెంత పులకరించిపోతామో కదా!
యెహోవా మంచితనం నుండి పుట్టుకొచ్చిన రెమ్మలు
16. యెహోవా మంచితనంలో వేరే లక్షణాలు కూడా ఉన్నాయని బైబిలు ఎలా చూపిస్తుంది? వాటిలో కొన్ని ఏంటి?
16 యెహోవా మంచితనంలో, ఉదారంగా ఇవ్వడం ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మోషేకు ఇలా చెప్పాడు: “నేను నా మంచితనం అంతా నీ ముఖం ముందు నుండి వెళ్లేలా చేస్తాను, యెహోవా అనే నా పేరును నీ ముందు ప్రకటిస్తాను.” బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “యెహోవా అతని ముందు నుండి దాటివెళ్తూ ఇలా ప్రకటించాడు: ‘యెహోవా, యెహోవా, ఆయన కరుణ, దయ గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు.’” (నిర్గమకాండం 33:19; 34:6, అధస్సూచి) కాబట్టి యెహోవా మంచితనంలో ఎన్నో చక్కని లక్షణాలు ఉన్నాయి. వాటిలో రెండిటిని ఇప్పుడు చూద్దాం.
17. దయ అంటే ఏంటి? యెహోవా అపరిపూర్ణ మనుషుల మీద ఎలా దయ చూపించాడు?
17 “దయ.” ఈ లక్షణానికి, కనికరానికి దగ్గరి సంబంధం ఉంది. యెహోవా ఇతరులతో ఎలా ఉంటాడో అది చెప్తుంది. మామూలుగా అధికారం ఉన్నవాళ్లు కటువుగా, దురుసుగా, పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. కానీ యెహోవా మాత్రం మృదువుగా, దయగా ఉంటాడు. ఉదాహరణకు, ఆయన అబ్రాముతో ఇలా అన్నాడు: “దయచేసి నీ తల ఎత్తి, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు చూడు.” (ఆదికాండం 13:14) చాలా అనువాదాలు “దయచేసి” అనే పదాన్ని తీసేశాయి. కానీ, మొదట రాసిన హీబ్రూలో అది ఆజ్ఞ కాదుగానీ ఒక విన్నపం అని సూచించే పదం ఒకటుందని బైబిలు పండితులు అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. (ఆదికాండం 31:12; యెహెజ్కేలు 8:5) ఒక్కసారి ఊహించుకోండి: మట్టి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, ఈ విశ్వానికే సర్వాధిపతి “దయచేసి” అనే మాట వాడుతున్నాడు! ఈ లోకంలో ఎటు చూసినా ప్రజలు క్రూరంగా, కఠినంగా, మర్యాద లేకుండా ఉంటున్నారు. కానీ మన దేవుడైన యెహోవా దయగా ఉంటాడని తెలుసుకోవడం సంతోషంగా అనిపించట్లేదా?
18. యెహోవా “ఎంతో సత్యవంతుడు” అంటే అర్థం ఏంటి? ఆ మాటల్ని బట్టి మనం ఎందుకు సంతోషించవచ్చు?
18 “ఎంతో సత్యవంతుడు.” ఈరోజుల్లో నిజాయితీ అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదు. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు మనుషుల్లా అబద్ధాలు చెప్పడు.” (సంఖ్యాకాండం 23:19) నిజానికి తీతు 1:2 చెప్తున్నట్టు, ఆయన “అబద్ధమాడలేని దేవుడు.” ఆయన అంత మంచివాడు! కాబట్టి యెహోవా మాటిచ్చిన వాటిని మనం పూర్తిగా నమ్మవచ్చు. ఆయన ఏదైనా మాటిస్తే, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బైబిలు యెహోవాను “సత్యవంతుడివైన దేవా” అని కూడా పిలుస్తుంది. (కీర్తన 31:5) అంటే ఆయన అబద్ధాలు చెప్పకుండా ఉండడం మాత్రమే కాదు, సత్యాన్ని కూడా మెండుగా పంచుతాడు. ఆయన అన్నీ తన దగ్గరే పెట్టేసుకుని రహస్యాల్ని దాచిపెట్టే దేవుడు కాదు. బదులుగా, తన దగ్గరున్న అపారమైన తెలివిని తన నమ్మకమైన సేవకులకు ఉదారంగా పంచుతూ, వాళ్లపై వెలుగును ప్రకాశింపజేస్తాడు.b ఆయన చెప్పే సత్యాలకు తగ్గట్టు ఎలా జీవించాలో కూడా ఆయన వాళ్లకు నేర్పిస్తాడు. దానివల్ల వాళ్లు ‘సత్యంలో నడవగలుగుతారు.’ (3 యోహాను 3) ఇంత మంచివాడైన యెహోవా గురించి మనలో ప్రతీ ఒక్కరికి ఏమనిపించాలి?
“యెహోవా మంచితనాన్ని బట్టి” మనం ప్రకాశిస్తాం
19, 20. (ఎ) యెహోవా మంచితనం మీద హవ్వకు ఉన్న నమ్మకాన్ని సాతాను ఎలా దెబ్బతీశాడు? దానివల్ల ఏమైంది? (బి) యెహోవా మంచితనాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు?
19 ఏదెను తోటలో సాతాను హవ్వతో మాట్లాడుతున్నప్పుడు, చాలా తెలివిగా యెహోవా మంచితనం మీద ఆమెకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూశాడు. యెహోవా ఆదాముకు ఇలా చెప్పాడు: “ఈ తోటలోని ప్రతీ చెట్టు పండ్లను నువ్వు తృప్తిగా తినొచ్చు.” ఆ తోటలో వేలకొద్దీ చెట్లు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దని యెహోవా చెప్పాడు. అయినా సాతాను చాకచక్యంగా తన మొదటి ప్రశ్నను ఎలా వేశాడో చూడండి. అతను హవ్వతో ఇలా అన్నాడు: “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?” (ఆదికాండం 2:9, 16; 3:1) ఇక్కడ సాతాను యెహోవా మాటల్ని మార్చిచెప్పి, దేవుడు తమకు ఏదో దక్కకుండా చేస్తున్నాడని హవ్వ అనుకునేలా చేశాడు. బాధాకరంగా, హవ్వ సాతాను బుట్టలో పడిపోయింది. హవ్వ తనకు అన్నీ ఇచ్చిన దేవుని మంచితనాన్ని అనుమానించడం మొదలుపెట్టింది. ఆమెలాగే, ఆ తర్వాత చాలామంది దేవుని మంచితనాన్ని అనుమానించారు.
20 అలాంటి పిచ్చి అనుమానాలు ఎంత బాధను, వేదనను మిగిల్చాయో మనం కళ్లారా చూస్తున్నాం. కాబట్టి యిర్మీయా 31:12 లో ఉన్న ఈ మాటల్ని మనసులో ఉంచుకుందాం: “యెహోవా మంచితనాన్ని బట్టి . . . వాళ్ల ముఖాలు ప్రకాశిస్తాయి.” అవును, యెహోవా మంచితనాన్ని బట్టి సంతోషంతో మన ముఖాలు ప్రకాశించాలి. మంచితనానికే నిలువెత్తు రూపమైన మన దేవుని ఉద్దేశాల్ని మనం ఎప్పుడూ అనుమానించకూడదు. మనం ఆయన్ని పూర్తిగా నమ్మవచ్చు, ఎందుకంటే ఆయన తనను ప్రేమించేవాళ్ల మంచిని తప్ప ఇంకేదీ కోరుకోవట్లేదు.
21, 22. (ఎ) యెహోవా మంచితనాన్ని బట్టి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? (బి) తర్వాతి అధ్యాయంలో ఏ లక్షణం గురించి చూస్తాం? దానికీ, మంచితనానికి తేడా ఏంటి?
21 అంతేకాదు, మన దేవుని మంచితనం గురించి వేరేవాళ్లకు చెప్పే అవకాశం వచ్చినప్పుడు మనం సంబరపడతాం. యెహోవా ప్రజల గురించి కీర్తన 145:7 ఇలా చెప్తుంది: “నీ అపారమైన మంచితనాన్ని గుర్తుచేసుకున్నప్పుడు వాళ్ల స్తుతులు పొంగిపొర్లుతాయి.” మనం ఊపిరి తీసుకునే ప్రతీరోజు, యెహోవా మంచితనం నుండి ఏదోక విధంగా ప్రయోజనం పొందుతూనే ఉంటాం. మీరు ప్రతీరోజు, ప్రత్యేకించి ఏదైనా ఒక విషయంలో యెహోవాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు అలవాటు చేసుకోకూడదు? యెహోవా మంచితనం గురించి ఆలోచిస్తూ, దాని గురించి రోజూ ఆయనకు థ్యాంక్స్ చెప్తూ, నలుగురికీ ఆయన మంచితనం గురించి చెప్పడం వల్ల మనం మంచి దేవుడైన యెహోవాలా ఉండగలుగుతాం. ఆయనలాగే మనం వేరేవాళ్లకు మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు, యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతాం. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “ప్రియ సహోదరుడా, చెడ్డవాళ్లను కాదుగానీ మంచివాళ్లను ఆదర్శంగా తీసుకో. మంచి చేసేవాళ్లు దేవునివైపు ఉన్నారు.”—3 యోహాను 11.
22 యెహోవా మంచితనం వేరే లక్షణాలతో కూడా ముడిపడి ఉంది. ఉదాహరణకు, యెహోవా “అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు.” (నిర్గమకాండం 34:6) మంచితనాన్ని యెహోవా అందరి మీద చూపిస్తాడు, కానీ విశ్వసనీయ ప్రేమను మాత్రం తన నమ్మకమైన సేవకుల మీదే చూపిస్తాడు. తర్వాతి అధ్యాయంలో దాని గురించి చూద్దాం.
a యెహోవా మంచితనానికి, విమోచన క్రయధనం కన్నా గొప్ప ఉదాహరణ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే, కోటానుకోట్ల దేవదూతల్లో ఎవరో ఒకర్ని పంపించే బదులు, యెహోవా తన ఒక్కగానొక్క ప్రియ కుమారుణ్ణి మనకోసం చనిపోవడానికి పంపించాడు.
b బైబిలు మంచి కారణంతోనే సత్యాన్ని, వెలుగుతో ముడిపెడుతుంది. కీర్తనకర్త ఇలా పాడాడు: “నీ వెలుగును, నీ సత్యాన్ని పంపించు.” (కీర్తన 43:3) ఎవరైతే తన దగ్గర నేర్చుకోవాలని, లేదా తన దగ్గర వెలుగు పొందాలని కోరుకుంటారో వాళ్ల మీద ఆధ్యాత్మిక వెలుగు ఎక్కువగా పడేలా యెహోవా చేస్తాడు.—2 కొరింథీయులు 4:6; 1 యోహాను 1:5.