కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 8 పేజీ 107-పేజీ 110 పేరా 1
  • సముచితమైన స్వరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సముచితమైన స్వరం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వరము, వ్యవధి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • స్వరభేదం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉపదేశాత్మక సమాచారము, స్పష్టంగా అందించబడింది
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • స్వరాన్ని, వేగాన్ని మార్చడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 8 పేజీ 107-పేజీ 110 పేరా 1

8

సముచితమైన స్వరం

మీరు ఏమి చెయ్యాలి?

అవసరమైనంత బిగ్గరగా గానీ తీవ్రమైన స్వరంతో గానీ మాట్లాడండి. ఎంత బిగ్గరగా లేదా తీవ్రంగా మాట్లాడితే సరిపోతుందో నిర్ణయించుకోవడంలో (1) ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు, వారు ఎలాంటి నేపథ్యాల నుండి వచ్చారు అన్నదాన్నీ (2) శ్రద్ధ మళ్ళించే శబ్దాలనూ (3) చర్చించబడుతున్న సమాచారాన్నీ (4) మీ లక్ష్యాన్నీ పరిగణలోకి తీసుకోండి.

ఎందుకు ప్రాముఖ్యం?

మీరు చెబుతున్నదాన్ని ఇతరులు సులభంగా వినలేకపోతే వాళ్ళ మనస్సులు అటు ఇటు వెళ్తుండవచ్చు. మీరు చెప్పే సమాచారం వారికి స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. మరోవైపు, మీరు మరీ బిగ్గరగా మాట్లాడితే ప్రజలకు చిరాకు కలగవచ్చు, అమర్యాదగా మాట్లాడుతున్నట్లు కూడా అనిపించవచ్చు.

బహిరంగ ప్రసంగీకుడికి అవసరమైనంత స్వరం లేకపోతే ప్రేక్షకుల్లో కొందరు నిద్రపోవడం మొదలుపెట్టవచ్చు. ప్రచారకుడు, క్షేత్రపరిచర్యలో మరీ మృదువుగా మాట్లాడితే గృహస్థుడి శ్రద్ధను నిలబెట్టలేకపోవచ్చు. కూటాల్లో ప్రేక్షకులు చేసే వ్యాఖ్యానాలను తగినంత బిగ్గరగా చెప్పకపోతే, హాజరైవున్నవారికి అవసరమైన ప్రోత్సాహం లభించదు. (హెబ్రీ. 10:24,25) మరొకవైపు, ఒక ప్రసంగీకుడు అవసరం లేనప్పుడు స్వరాన్ని పెంచితే ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కోపం కూడా రావచ్చు.—సామె. 27:14.

మీ ప్రేక్షకులను పరిగణలోకి తీసుకోండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తితోనా? ఒక కుటుంబంతోనా? క్షేత్రసేవ కోసం కూడుకున్న ఒక చిన్న గుంపుతోనా? సంఘమంతటితోనా? లేక పెద్ద సమావేశంలోనా? ఒకచోట సముచితంగా ఉన్న స్వరం మరొకచోట అలావుండకపోవచ్చన్నది స్పష్టం.

దేవుని సేవకులు అనేక సందర్భాల్లో పెద్ద సభల్లో మాట్లాడారు. సొలొమోను కాలంలో, యెరూషలేములోని ఆలయ ప్రారంభోత్సవానికి, శబ్ద పరికరాలు ఏమీ లేవు. కాబట్టి, సొలొమోను ఎత్తైన వేదిక మీద నిలబడి, “మహాశబ్దముతో” ప్రజలను దీవించాడు. (1 రాజు. 8:55; 2 దిన. 6:13) శతాబ్దాల తర్వాత సా.శ. 33 పెంతెకొస్తు రోజున, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ఆసక్తిగలవారూ ఎగతాళిచేసేవారూ మిళితమై ఉన్న ఒక సమూహం, యెరూషలేములోని క్రైస్తవుల చిన్న గుంపు చుట్టూ గుమిగూడింది. పేతురు ఆచరణాత్మక జ్ఞానాన్ని చూపిస్తూ, “లేచి నిలిచి బిగ్గరగా” మాట్లాడాడు. (అపొ. 2:14) ఆ విధంగా ఆయన శక్తివంతమైన సాక్ష్యమిచ్చాడు.

మీరు ఆయా పరిస్థితుల్లో సముచితమైన స్వరంతో మాట్లాడుతున్నారా లేదా అన్నది ఎలా చెప్పగలరు? అది తెలుసుకోవడానికి సహాయపడే శ్రేష్ఠమైన కొలమానాల్లో ఒకటి శ్రోతల ప్రతిస్పందన. శ్రోతల్లో కొందరు వినడానికి తీవ్రప్రయత్నం చేస్తున్నట్లు మీరు గమనిస్తే, మీరు మీ స్వరాన్ని పెంచడానికి కృషి చేయాలి.

మనం మాట్లాడుతున్నది ఒక వ్యక్తితోనైనప్పటికీ ఒక గుంపుతోనైనప్పటికీ వారి నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవడం జ్ఞానయుక్తం. ఎవరికైనా వినికిడి శక్తి తక్కువగా ఉంటే మీరు మీ స్వరం పెంచవలసిన అవసరం ఉండవచ్చు. కానీ, పెద్దవయస్సు మూలంగా కొంచెం నెమ్మదిగా ప్రతిస్పందించేవారికి గట్టిగా అరవడం నచ్చకపోవచ్చు. అది అమర్యాదకు సూచనగా కూడా ఎంచబడవచ్చు. కొన్ని సంస్కృతుల్లో, ఒక వ్యక్తి మరీ బిగ్గరగా మాట్లాడడం, ఆయన కోపిష్ఠి, సహనంలేనివాడు అన్నదానికి రుజువుగా దృష్టించబడుతుంది.

శ్రద్ధను మళ్ళించే చప్పుళ్ళను పరిగణలోకి తీసుకోండి. మీరు క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు ఎలాంటి స్వరంతో మాట్లాడవలసిన అవసరం ఉందన్నది, మీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఉంటుందనడంలో సందేహం లేదు. వాహనాల రాకపోకల వల్ల వచ్చే చప్పుళ్ళతో, అల్లరి పిల్లల చప్పుళ్ళతో, మొరిగే కుక్కలతో, బిగ్గరగా వినిపిస్తున్న సంగీతంతో లేదా టీవీ శబ్దంతో మీరు పోటీపడవలసి ఉండవచ్చు. మరొకవైపు, దగ్గర దగ్గర ఇళ్ళున్న ప్రాంతాల్లో మీరు మరీ బిగ్గరగా మాట్లాడితే మీరు పొరుగువాళ్ళ అవధానాన్ని ఆకర్షిస్తారేమోనని గృహస్థుడు కలతచెందవచ్చు.

సంఘంలోనైనా సమావేశాల్లోనైనా ప్రసంగమిచ్చే సహోదరులు సహితం వివిధ పరిస్థితులను అధిగమించాల్సిందే. ఇంటింటి పరిచర్యలో ప్రజలతో మాట్లాడడానికీ తగిన శబ్ద సౌకర్యాలున్న మంచి హాలులో ప్రసంగించడానికీ చాలా తేడా ఉంది. లాటిన్‌ అమెరికాలో ఇద్దరు మిషనరీలు, ఆసక్తి గల ఒక వ్యక్తి ఇంటి లోపలి మండువాలో బహిరంగ ప్రసంగమిస్తుండగా బయట టపాకాయిలు కాలుస్తున్నారు, సమీపంలో ఒక కోడిపుంజు ఒకటే కూస్తూ ఉంది!

అలా ఒక ప్రసంగం మధ్యలో శ్రోతల ఏకాగ్రతకు భంగం కలిగించేదేదైనా జరగవచ్చు, అప్పుడు అది సద్దుమణిగే వరకు ఆగడం గానీ స్వరం పెంచడం గానీ చేయవల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఉదాహరణకు, రేకు కప్పు ఉన్న ఒక గదిలో ఒక కూటం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా కుండపోతగా వర్షం కురిస్తే, ప్రసంగీకుడు చెప్పేది ప్రేక్షకులకు వినబడడం దాదాపుగా అసాధ్యం కావచ్చు. అలాగే, చంటి బిడ్డ ఏడ్చినా, ఆలస్యంగా వచ్చే వారి మూలంగా ఏకాగ్రతకు భంగం కలిగినా నిశ్చయంగా అది ఒక సవాలుగా ఉంటుంది. శ్రద్ధ మళ్ళించే శబ్దాలను అధిగమించడం నేర్చుకోండి, అప్పుడు మీరు సమర్పించే సమాచారం నుండి ప్రేక్షకులు పూర్తిగా ప్రయోజనం పొందగలుగుతారు.

సౌండ్‌ ఆంప్లిఫైయింగ్‌ (ధ్వనిని పెంచే) పరికరాలు అందుబాటులో ఉండడం సహాయకరంగా ఉంటుంది, అయితే ఆ పరికరాలు కొన్ని పరిస్థితుల్లో ప్రసంగీకుడు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేకుండా చేయలేవు. అయితే తరచూ కరెంటు పోయే ప్రాంతాల్లో, ప్రసంగీకులు మైక్రోఫోన్‌ లేకుండానే తమ ప్రసంగాన్ని కొనసాగించబద్ధులైవున్నారు.

చర్చించబోతున్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకోండి. మీరు ఎంత బిగ్గరగా మాట్లాడడం అవసరమన్నది, మీ ప్రసంగంలో ఉన్న సమాచార స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు చర్చిస్తున్న విషయానికి బలం అవసరమైతే, మరీ మృదువుగా మాట్లాడడం ద్వారా సమాచారాన్ని అందించే తీరుకు బలం లేకుండా చేయకండి. ఉదాహరణకు, ప్రేమ చూపమన్న ఉపదేశాన్ని చదివేటప్పటి కన్నా లేఖనాల్లోని అధిక్షేపణలను చదువుతున్నప్పుడు మీ స్వరం బలంగా ఉండాలి. మీ స్వరాన్ని మీ సమాచారానికి తగినట్లు మార్చండి, అయితే శ్రోతల శ్రద్ధ ప్రసంగం నుండి మళ్ళి మీ గురించి ఆలోచించేలా చేయకుండా జాగ్రత్తపడండి.

మీ లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోండి. ఎంతో ఆసక్తిగా చురుగ్గా ఉండేలా మీ ప్రేక్షకులను పురికొల్పాలని మీరు అనుకుంటున్నట్లయితే మీరు కొంచెం ఎక్కువ దృఢమైన స్వరంతో మాట్లాడడం అవసరం కావచ్చు. మీరు వారి ఆలోచనా సరళిని మార్చాలనుకుంటున్నట్లయితే, మరీ గట్టిగా మాట్లాడి వారికి విముఖత కలిగించకండి. మీరు ఓదార్చాలని ప్రయత్నిస్తున్నట్లయితే సాధారణంగా మృదువైన స్వరాన్ని ఉపయోగించడమే మంచిది.

సమర్థంగా స్వరం పెంచి మాట్లాడడం.పనిలో బాగా మునిగివున్న ఒకరి శ్రద్ధను ఆకట్టుకునేందుకు మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, స్వరం పెంచి మాట్లాడడం తరచూ సహాయకరంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇది తెలుసు. అందుకే, పిల్లలు ఆటలు ఆపి తిరిగి రావలసిన సమయమైనప్పుడు తల్లిదండ్రులు వాళ్ళను పిలిచేటప్పుడు స్వరం పెంచుతారు. ఒక సంఘ కూటం గానీ సమావేశం గానీ క్రమపద్ధతిలో జరిగేలా చేసేందుకు అధ్యక్షుడు స్వరం పెంచి మాట్లాడవలసిన అవసరముండవచ్చు. ప్రచారకులు క్షేత్ర పరిచర్య చేస్తున్నప్పుడు, ఇంటి బయట పెరట్లో పనిచేస్తున్నవారిని పలకరించేటప్పుడు బిగ్గరగా మాట్లాడవచ్చు.

ఒకరి శ్రద్ధను ఆకట్టుకున్న తర్వాత కూడా, కావలసినంత బిగ్గరగా మాట్లాడడం ప్రాముఖ్యం. మాట్లాడేవ్యక్తి స్వరం మరీ పేలవంగా వస్తున్నట్లుంటే, ఆయన సరిగ్గా సిద్ధపడలేదని గానీ ఆయన చెబుతున్న విషయం మీద ఆయనకే నమ్మకం లేదని గానీ వింటున్న వ్యక్తికి అనిపించవచ్చు.

చెబుతున్న సమాచారంలో ఏదైనా ఆజ్ఞ ఉంటే స్వరం పెంచడం, చర్య తీసుకునేలా ప్రజలను ప్రేరేపించగలదు. (అపొ. 14:9,10) అలాగే బిగ్గరగా ఆజ్ఞాపించడం విపత్తును తప్పించవచ్చు. ఫిలిప్పీలో ఒక చెరసాల నాయకుడు, ఖైదీలు పారిపోయారనుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. “అప్పుడు పౌలు—నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.” ఆ విధంగా ఒక ఆత్మహత్య జరగకుండా నివారించబడింది. ఆ చెరసాల నాయకుడికీ ఆయన ఇంటివారికీ పౌలు, సీల సాక్ష్యమివ్వగా వారందరు సత్యాన్ని స్వీకరించారు.—అపొ. 16:27-33.

మీ స్వరాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు. సముచితమైన స్వరంతో మాట్లాడడం నేర్చుకునేందుకు కొందరికి మామూలు కన్నా ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి స్వరం సన్నగా ఉండడం వల్ల, సముచితమైనంత బిగ్గరగా మాట్లాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన ప్రయత్నిస్తే మెరుగుపడడం సాధ్యం కావచ్చు, అయినప్పటికీ ఆయన మృదు భాషిగానే ఉండవచ్చు. మీరు శ్వాస తీసుకోవడానికీ మీ భంగిమకూ శ్రద్ధ చూపండి. నిటారుగా నిలబడడం కూర్చోవడం అభ్యసించండి. మీ భుజాలను వెనక్కు పెట్టండి. గాఢంగా ఊపిరి పీల్చుకోండి. మీ ఊపిరితిత్తుల క్రింది భాగాన్ని గాలితో నింపండి. మీరు పీల్చుకునే గాలిని సరిగ్గా నియంత్రించుకుంటే, మాట్లాడేటప్పుడు మీరు మీ స్వరాన్ని నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది.

మరీ బిగ్గరగా మాట్లాడడమే కొందరికున్న సమస్య. వారు బహిరంగ ప్రదేశంలో గానీ రణగొణ ధ్వనులతో నిండిన పరిసరాల్లో గానీ పనిచేయడం వల్ల అలా మాట్లాడడం అలవరుచుకొని ఉంటారు. మరి కొందరు, అందరూ అరుస్తున్నట్లు మాట్లాడే నేపథ్యం నుండో, అవాంతరాలు తరచూ కలిగే నేపథ్యం నుండో వచ్చివుండవచ్చు. ఆ కారణంగా వాళ్ళు సంభాషణలో భాగం వహించే ఏకైక మార్గం, మిగతా వాళ్ళ కన్నా బిగ్గరగా మాట్లాడడమేనని అనుకుంటారు. “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి” అన్న బైబిలు ఉపదేశాన్ని అనుసరించడంలో వారు ప్రగతిని సాధిస్తుండగా, వారు ఇతరులతో సంభాషించేటప్పుడు అవసరానికి అనుగుణంగా స్వరాన్ని తగ్గించడం గానీ పెంచడం గానీ చేస్తారు.—కొలొ. 3:12.

మంచి సిద్ధపాటూ క్షేత్రసేవలో క్రమంగా పాల్గొనడం వల్ల వచ్చే అనుభవమూ యెహోవాకు ప్రార్థన చేయడమూ మీరు సముచితమైన స్వరంతో మాట్లాడేందుకు మీకు సహాయపడతాయి. వేదిక మీద మాట్లాడుతున్నా, క్షేత్ర పరిచర్యలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా మీరు చెబుతున్న విషయాలను వినడం ద్వారా ఎదుటివారు ఎలా సహాయం పొందగలరన్న దానిపైనే మీ ఆలోచనలను కేంద్రీకరించండి.—సామె. 18:21.

స్వరం పెంచి మాట్లాడే అవసరం ఎప్పుడు రావచ్చు?

  • పెద్ద గుంపులోని ప్రజల శ్రద్ధను నిలబెట్టాలనుకున్నప్పుడు.

  • శ్రద్ధను మళ్ళించే చప్పుళ్ళను అధిగమించాలనుకున్నప్పుడు.

  • చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నప్పుడు శ్రోతల శ్రద్ధను ఆకట్టుకోవాలనుకున్నప్పుడు.

  • చర్య తీసుకొనేలా పురికొల్పాలనుకున్నప్పుడు.

  • ఒక వ్యక్తి శ్రద్ధనైనా ఒక గుంపు శ్రద్ధనైనా ఆకట్టుకోవాలనుకున్నప్పుడు.

ఎలా మెరుగుపరుచుకోవచ్చు?

  • మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారి ప్రతిస్పందనలను గమనించండి; వారు సులభంగా వినగలిగేలా సముచితమైన స్వరంతో మాట్లాడండి.

  • మీరు ఊపిరి పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల క్రింది భాగాన్ని గాలితో నింపడం నేర్చుకోండి.

అభ్యాసం: అపొస్తలుల కార్యములు 19:23-41 వచనాలను మొదట మౌనంగా చదువుతూ ఆ వృత్తాంతంలోను ఆ సందర్భంలోను వెల్లడి చేయబడిన సన్నివేశాన్ని అర్థం చేసుకోండి. మాట్లాడుతున్నది ఎవరో ఎటువంటి దృక్పథం చూపించారో పరిశీలించండి. ఆ తర్వాత, ఒక్కో భాగాన్ని తగినంత స్వరంతో చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి