ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందజేయడం
ఉత్తరాలు, లక్షలాది మంది జీవితాలనూ ప్రవర్తననూ మెరుగుపరిచాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అధిక శాతం పుస్తకాలు నిజానికి ఉత్తరాలే. మనం నేడు, క్రొత్త విశ్వాసులను బలపరచడానికీ స్నేహితులతో స్నేహాన్ని కొనసాగించడానికీ ప్రత్యేక బాధ్యతలను చేపట్టిన సహోదర సహోదరీలను ప్రోత్సహించడానికీ కష్టాలను ఎదుర్కొంటున్నవారిని బలపరచడానికీ సంఘ కార్యకలాపాలను నిర్వహించడానికీ అవసరమైన సమాచారాన్ని తెలియజేయడానికీ ఉత్తరాలు వ్రాస్తాము.—1 థెస్స. 1:1-8; 5:27; 2 పేతు. 3:1,2.
సాక్ష్యమివ్వడానికి కూడా ఉత్తరాలు వ్రాయడం సమర్థమైన మార్గమే. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు, మనం స్వేచ్ఛగా క్షేత్రసేవ చేయలేని ఎంతో భద్రతా ఏర్పాట్లు గల అపార్ట్‌మెంట్ బిల్డింగుల్లో గానీ రెసిడెన్స్ హోటళ్ళలో గానీ ఉంటున్నారు. కొందరు ఇంట్లో ఎక్కువ సమయం ఉండరు కాబట్టి, మనం ఇంటింటి సేవచేస్తున్నప్పుడు అలాంటి వారిని కలవలేము. మరికొందరు, మారుమూల ప్రాంతాల్లోను జైళ్ళలోను నివసిస్తున్నారు.
అనారోగ్యం, ప్రతికూల వాతావరణం, లేదా కర్ఫ్యూ వంటి వాటి మూలంగా మనం కొన్నిసార్లు ఇంట్లోనే ఉండిపోవలసి వస్తుంది. మీ బంధువుకు గానీ మీరు అనియతంగా మాట్లాడిన ఒకరికి గానీ మరింత సాక్ష్యమిచ్చేందుకు మీరు ఒక ఉత్తరం వ్రాయగలుగుతారా? మీ బైబిలు విద్యార్థుల్లో ఎవరైనా మరోచోటికి తరలివెళ్ళారా? వారి ఆధ్యాత్మిక ఆసక్తి చల్లారిపోకుండా ఉండేందుకు అవసరమైనది మీ ఉత్తరమే కావచ్చు. లేదా ఇటీవలే పెండ్లి చేసుకున్నవారితో గానీ తల్లిదండ్రులైనవారితో గానీ మరణం మూలంగా తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారితో గానీ లేఖనాల్లో నుండి సముచితమైన సమాచారాన్ని పంచుకోవచ్చు.
ఉత్తరం ద్వారా సాక్ష్యమివ్వడం
మీరు ఇంతకు ముందెప్పుడూ కలవని వ్యక్తికి సాక్ష్యమివ్వడానికి ఉత్తరం వ్రాస్తున్నట్లయితే, మొదట మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవలో భాగం వహిస్తున్నారని వివరించవచ్చు. సముచితం అనిపిస్తే, మీరు యెహోవాసాక్షుల్లో ఒకరని కూడా చెప్పండి. మీరు వెళ్ళి ఆయనను వ్యక్తిగతంగా కలిసే బదులు ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నారో తెలపండి. మీరు ఆయనతో ముఖాముఖి మాట్లాడుతున్నట్లే వ్రాయండి. అయితే, “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అనే నిర్దేశాన్ననుసరిస్తూ మీరు మీ గురించి ఎంత మేరకు తెలియజేయాలన్నది గంభీరంగా ఆలోచించండి.—మత్త. 10:16.
మీరు ఆయన దగ్గరికి వెళ్ళుంటే ఏమి చెప్పేవారో అది కూడా ఉత్తరంలో వ్రాయండి. బైబిలు చర్చలను ప్రారంభించి కొనసాగించడమెలా? అనే చిన్న పుస్తకంలోని ఒక ఉపోద్ఘాతాన్ని లేదా ఇటీవలి మన రాజ్య పరిచర్య సంచికలోని లేఖనాధారిత అందింపును తీసుకొని అవసరమైన మార్పులు చేసి వ్రాయండి. మీరు ఒక ప్రశ్న వేసి, దాని గురించి ఆలోచించమని ఆ వ్యక్తిని ప్రోత్సహించవచ్చు. కొందరు ప్రచారకులైతే బైబిలు ప్రశ్నలకు జవాబులనిచ్చే ఉచిత కార్యక్రమం ఒకటి ఉందని వివరించి, మనకున్న అధ్యయన సహాయకాల్లో ఒక దాన్ని తీసుకొని దానిలోని కొన్ని అధ్యాయాల శీర్షికలను ఉదాహరిస్తారు. సాక్ష్యమిచ్చేందుకు వ్రాయబడిన ఒక నమూనా ఉత్తరం 73వ పేజీలో కనిపిస్తుంది. అది మీకు కొన్ని తలంపులను ఇవ్వవచ్చు, అయితే సమాచారాన్ని మారుస్తూ ఉండడం మంచిది. లేకపోతే కొంతకాలానికి, ప్రజలకు ఒకే విధమైన ఉత్తరం మళ్ళీ మళ్ళీ అందుతూ ఉంటుంది.
అపరిచితుల నుండి వచ్చిన పెద్ద ఉత్తరాలు చదవడానికి కొందరు ఇష్టపడరు. కాబట్టి మీరు ఉత్తరాన్ని క్లుప్తంగా వ్రాయడం జ్ఞానయుక్తమైన పని. దాన్నందుకునే వ్యక్తి అది చదివి విసుగు చెందేంతగా పొడిగించక క్లుప్తంగా వ్రాసి ముగించండి. రాజ్య మందిరంలోని కూటాలకు హాజరవ్వండంటూ ముద్రిత ఆహ్వానాలను జతచేయడం సముచితం. మీరు ఒక కరపత్రాన్నో బ్రోషుర్‌నో ఒక కావలికోట, లేదా తేజరిల్లు! సంచికనో జతచేసి, మీరు కోరుకుంటే ఇవి క్రమంగా అందజేయబడతాయని తెలియజేయవచ్చు. లేదా చర్చించబడిన విషయాన్ని గురించి మరెక్కువగా చర్చించేందుకు మీ ఇంటికి రావచ్చా అని అడగండి.
వ్రాయవలసిన విధానాన్ని గురించి ఒక మాట
ఇప్పుడు నమూనా ఉత్తరం చూడండి. అదెలా ఉందో గమనించండి: (1) అది నీటుగా ఉంది, గజిబిజిగా లేదు. (2) కవర్ పోయినా ఉత్తరం వ్రాసిన వ్యక్తి పేరు, జవాబు వ్రాయవలసిన చిరునామా ఉత్తరం అందుకున్న వ్యక్తి దగ్గర ఉంటాయి. (3) ఉత్తరం ఉద్దేశం మొదటి పేరాలో సరళంగా సూటిగా వ్రాయబడింది. (4) ముఖ్యమైన ఒక్కో తలంపు ఒక్కో పేరాలో వ్రాయబడింది. (5) ఈ ఉత్తరం ఉద్దేశం దృష్ట్యా, దీనిని మరీ నియతంగా గానీ మరీ అనియతంగా గానీ వ్రాయలేదు.
సంఘ కార్యదర్శి, బ్రాంచి కార్యాలయానికి వ్రాసే ఉత్తరం వంటి ఇంకాస్త నియతమైన ఉత్తరంలో కార్యదర్శి పేరు, ఆయనకు జవాబు వ్రాయవలసిన చిరునామా, తేదీతో పాటు సంఘం పేరు కూడా వ్రాయాలి. ఉత్తరం ఎవరికి వ్రాస్తున్నారో ఆ వ్యక్తి పేరు లేదా ఆ సంస్థ పేరు, చిరునామా కూడా వ్రాయాలి. దాని తర్వాత, సరైన సంబోధన ఉండాలి. ఉత్తరాన్ని ముగించే ముందు, కొన్ని భాషల్లో, సంతకంపైన “మీ స్నేహితుడు” “మీ శ్రేయోభిలాషి” వంటి వ్యక్తీకరణలు కనిపిస్తాయి. సంతకం సొంత దస్తూరీలో ఉండాలి.
ఏ ఉత్తరంలో అయినా, అక్షర దోషాలు లేకుండా ఉండడానికీ వ్యాకరణానికీ విరామ చిహ్నాలకూ నీటుగా ఉండడానికీ శ్రద్ధనివ్వండి. అది మీ ఉత్తరానికి, దానిలో ఉన్న మీ సందేశానికి హుందాతనాన్ని ఇస్తుంది.
కవరు మీద, రిటర్న్ అడ్రస్‌ను ఎల్లప్పుడూ వ్రాయండి, మీ సొంత చిరునామాను వ్రాయడం మంచిది. మీరు అపరిచితులకు ఉత్తరం ద్వారా సాక్ష్యమిస్తున్నప్పుడు మీ సొంత చిరునామా వ్రాయడం జ్ఞానయుక్తం కాదని మీకనిపిస్తే, స్థానిక రాజ్య మందిర చిరునామాను రిటర్న్ అడ్రస్‌గా వ్రాయడానికి పెద్దల అనుమతిని తీసుకోండి, సంఘానికి ఉత్తరాలు వచ్చే చిరునామా లేకపోతే సంఘం కోసం వచ్చే ఉత్తరాలను అందుకునే పెద్ద చిరునామాను వ్రాయడానికి ఆ పెద్ద అనుమతి తీసుకోండి. దీని కోసం, ఎన్నడూ బ్రాంచి కార్యాలయ చిరునామాను ఉపయోగించకూడదు, ఎందుకంటే అలా ఉపయోగిస్తే, బ్రాంచి కార్యాలయమే ఆ ఉత్తరాన్ని పంపిందని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అది అయోమయానికి దారితీస్తుంది. జవాబు పంపవలసిన రిటర్న్ అడ్రస్ వ్రాయకుండా సాహిత్యం పంపినా బ్రాంచి కార్యాలయమే పంపిందని అపార్థం చేసుకోవచ్చు.
మీరు కావలసినన్ని స్టాంపులు అంటించండి, మీరు సాహిత్యాన్ని కూడా పంపిస్తున్నట్లయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తపడండి. కావలసినన్ని స్టాంపులు అంటించకపోతే ఉత్తరం అందుకునే వ్యక్తికి చార్జీ పడవచ్చు, అది వారు సందేశాన్ని మెచ్చుకోకుండా చేయగలదు. అనేక దేశాల్లో ఒక బ్రోషుర్ గానీ పత్రిక గానీ పంపేటప్పుడు, పోస్టల్ చార్జ్ కేవలం ఉత్తరం పంపించేదానికన్నా ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోండి.
సరైన విధానం
మీరు ఉత్తరం వ్రాయడం ముగించిన తర్వాత, దానిలో ఉన్న సమాచారాన్ని మదింపు చేసుకునేందుకు ఒకసారి చదవండి. అది ఎలా ఉంది? అది స్నేహభావంతోనూ అభ్యంతరం కలిగించని విధంగానూ ఉందా? మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం కనబరచడానికి ప్రయత్నించవలసిన లక్షణాల్లో ప్రేమా దయా ఉన్నాయి. (గల. 5:22-24) అంగీకరించలేని విధానం గానీ ప్రతికూల భావం గానీ కనిపిస్తే మీ మాటల్లో కావలసిన సవరింపులను చేసుకోండి.
మీరు వెళ్ళలేని చోట్లకు ఉత్తరం వెళ్ళగలదు. ఈ వాస్తవమే దానిని పరిచర్యలో ప్రాముఖ్యమైన ఉపకరణంగా చేస్తోంది. మీ ఉత్తరం మీకూ మీ విలువలకూ ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక, అది ఏమి చెబుతోంది, అది ఎలా కనిపిస్తోంది, ఎలా అనిపిస్తుంది అన్నవి ఆలోచించండి. ఒక అమూల్యమైన జీవితం జీవ మార్గంలోకి నడవడం ప్రారంభించేందుకు, బలపరిచేందుకు, ప్రోత్సహించేందుకు సరిగ్గా అవసరమైన దానిని మీ ఉత్తరం ఇవ్వవచ్చు.