చిరపుంజి—భూమ్మీద అత్యధిక వర్షపాతంగల ప్రాంతాల్లో ఒకటి
ఇండియానుండి తేజరిల్లు! రచయిత
భూమ్మీద అత్యధిక వర్షపాతంగల ప్రాంతాల్లో ఒకటా? అదెలా సాధ్యం? ఇండియాలో ఎక్కడ చూసినా నీటి కొరత ఉంటుంది, చాలామటుకు అసలు గొడుగు పట్టుకెళ్ళాల్సిన అవసరమే ఉండదాయె! ఏ ఆసక్తికరమైన ప్రదేశం గురించి మేము వర్ణిస్తున్నాము? అది చిరపుంజి—ఈశాన్య భారతదేశపు రాష్ట్రమైన మేఘాలయలోని ఒక పట్టణం. ఈ రాష్ట్రం బంగ్లాదేశ్‌కు ఆనుకొని ఉంది. మేఘాలయ ఎంత సుందరమైన ప్రదేశమంటే అది “తూర్పునున్న స్కాట్లాండ్” అని పిలువబడింది. మేఘాలయ అంటేనే “మేఘాలకు నిలయం” అని అర్థం. అయితే, చిరపుంజి భూమ్మీద అత్యధిక వర్షపాతంగల ప్రాంతాల్లో ఒకటని ఎంతోకాలంగా ఎందుకు ఎంచబడుతోంది? అచ్చెరువొందించే ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు వెళ్దాం పదండి.a
మనం మన ప్రయాణాన్ని షిల్లాంగ్ నుండి ప్రారంభిద్దాం, అది మేఘాలయకు రాజధాని. టూరిస్ట్ బస్సెక్కి దక్షిణం వైపుగా వెళ్ళాలి. బారులు తీరివున్న కొండలు, పచ్చిక బయళ్ళు మన ప్రక్క నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటే, ముందుకి చూసినప్పుడు అల్లంత దూరాన మన కోసం వేచివున్న మేఘాలు కనిపిస్తాయి, చప్పున మేఘాలయ అన్న పేరు గుర్తుకు వచ్చి, ఎంత సార్థకనామధేయమో అనిపించక మానదు.
మన రోడ్డు, గుబురైన చెట్లతో నిండివున్న లోతైన లోయ గుండా పాములా మెలికలు తిరుగుతూ పైకి ఎగబ్రాకుతోంది. జలపాతాలు ఎంతో ఎత్తునుంచి క్రిందికి దూకుతూ ఆ లోయగుండా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నదికి జలాన్నందిస్తున్నాయి. మన బస్సు మౌడక్కి వచ్చి ఆగుతుండగా, క్రింది స్థాయి మేఘాలు కొండల మధ్య అలా నెమ్మదిగా ప్రయాణించడం కనిపిస్తుంది. అకస్మాత్తుగా అవి అటువైపు కన్పిస్తున్న సుందర దృశ్యాన్ని కప్పేస్తాయి, అదే వేగంతో మళ్ళీ కనుమరుగైపోయి ఆ దృశ్యాన్ని కంటి ముందుకి తెస్తాయి. కొంచెంసేపు ఆ మేఘాలు మనలను కూడా కమ్మేస్తాయి, దాంతో ఆ తెల్లని మెత్తని మేఘాల్లో మనం కనిపించకుండా అదృశ్యమైపోతాము. కానీ, త్వరలోనే ఆ తర్వాత ఆ మేఘాలు ఎగిరిపోతాయి, సూర్యుడు అద్భుతమైన ప్రకృతి అందాలను కంటి ముందు సాక్షాత్కరింపజేస్తాడు.
చిరపుంజి సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తున ఉంది. మనమా పట్టణానికి చేరుకునే సరికి ఒక్క వర్షమేఘం కూడా కనబడ్డంలేదు, ఎవరి చేతుల్లోనూ గొడుగుల్లేవు. అక్కడ పర్యాటకులమైన మనం మాత్రమే కుండపోతగా కురిసే వర్షాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాము! మరిక వర్షం ఎప్పుడు కురిసేట్లు?
ఉష్ణమండల ప్రాంతాల్లో, సూర్యుడు సముద్రాల్లోని వేడి ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో జలాన్ని ఆవిరిచేసినప్పుడు మాత్రమే పెద్ద వర్షాలు కురుస్తాయి. హిందూ మహాసముద్రం నుండి తేమతో నిండిన గాలులు హిమాలయ పర్వతాల దక్షిణ పల్లాలను తాకి పైకి లేస్తాయి, చివరికి కుంభవృష్టిగా కురుస్తాయి. ఆ విధంగా అవి తమ భారాన్ని దించుకుంటాయి. ఆ వర్షాలు మేఘాలయ పీఠభూమిపై అధికంగా కురుస్తాయి. అంతేగాక, ఎత్తైన ఈ ప్రాంతంలో పగటిపూట సూర్యుడు తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తుండడం మూలంగా వర్షపు మేఘాలు పైకి వెళ్ళి, సాయంత్రం పూట గాలి చల్లబడేంత వరకు అలాగే పీఠభూమికి పైగా నడయాడుతూ ఉంటాయి. వర్షం ఎక్కువగా రాత్రిపూటే ఎందుకు పడుతుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
1861 జూలై నెలలో చిరపుంజిలో ఆశ్చర్యకరంగా 930 మీటర్ల వర్షం కురిసింది! 1860 ఆగస్టు 1 నుండి 1861 జూలై వరకు చూస్తే 12 నెలల కాలంలో 2,646 మీటర్ల వర్షం కురిసింది. నేడు చిరపుంజిలో సంవత్సరానికి సగటున 180 రోజుల్లో వర్షం కురుస్తుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షం విపరీతంగా పడుతుంది. వర్షం చాలా మట్టుకు రాత్రిపూట పడుతుంది గనుక పర్యాటకులు వర్షంలో తడవనవసరం లేకుండానే చక్కగా ప్రకృతి అందాలను వీక్షించగలరు.
అంత వర్షం పడుతుంది గనుక ఈ ప్రాంతంలో నీటి కొరతను అనుభవించడమన్న విషయం తలంపుకి రాదు. అయితే, చలికాలంలో సరిగ్గా అదే జరుగుతుంది. వర్షాకాలంలోని నీరంతా ఎక్కడికి పోతుంది? చిరపుంజి పట్టణానికి సరిగ్గా వెలుపల పెద్ద మొత్తంలో అడవుల నాశనం జరుగుతోంది. ఆ కారణంగా దాదాపు వర్షమంతా ఎత్తైన ఈ పీఠభూమి నుండి క్రింది ప్రాంతాలకు జారిపోతుంది. ఆ నీరు పల్లపు భూముల్లోని నదుల్లోకి ప్రవహిస్తుంది, ఈ నదులు ఎక్కువగా బంగ్లాదేశ్‌లోకి వెళ్తాయి. కాలువలకు ఆనకట్టలు కట్టాలని, జలాశయాలను నిర్మించాలని పథకాలు వేయబడుతున్నాయి. కానీ మౌసిన్రామ్లోని కొండజాతి రాజు జి.ఎస్. మాంగ్యాంగ్ ప్రకారం “నీటి సమస్యను తీర్చడానికి ఎటువంటి గట్టి ప్రయత్నాలూ” జరగడంలేదు.
చిరపుంజిని సందర్శించడం నిజంగానే ఉత్తేజభరితంగా ఉంది, క్రొత్త విషయాలు తెలిశాయి. ఈ ప్రాంతంలో ఎంత సుందరమైన దృశ్యాలున్నాయో కదా! దాదాపు 300 జాతుల ఆర్కిడ్లు, కీటకాలను భక్షించే మొక్కలైన విశిష్ట పిచర్ ప్లాంట్లతో సహా చూపరులను ఇట్టే ఆకర్షించే పూలు ఇక్కడ ఉన్నాయి. అంతేగాక, మనం చూసి ఆనందించడానికి ఎంతో వైవిధ్యంగల వన్యప్రాణులున్నాయి, పరిశోధించదగిన సున్నపురాయి గుహలు, పరిశీలించదగిన పెద్ద పెద్ద రాతినిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని విస్తృతమైన నారింజపండ్ల తోపుల్లో మధురమైన నారింజలు ఉత్పత్తి అవుతాయి, అవే తోపుల్లో రుచికరమైన నారింజ తేనెను సహజ ప్రక్రియలో ఉత్పత్తి కూడా చేస్తారు. ఇవన్నీ “మేఘాలకు నిలయం” అయిన మేఘాలయ సందర్శకుల కోసం, భూమ్మీద అత్యధిక వర్షపాతంగల ప్రాంతాల్లో ఒకటైన చిరపుంజి సందర్శకుల కోసం ఎదురుచూస్తున్నాయి.(g01 5/8)
[అధస్సూచి]
a హవాయీ ద్వీపమైన కావూయిలోని వైయలియల్ అనే పర్వతంలోను, అలాగే చిరపుంజికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌసిన్రమ్ అనే గ్రామంలోను కొన్నిసార్లు చిరపుంజిని మించిన వర్షపాతం నమోదు చేయబడింది.
[28వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
చిరపుంజి
ఇండియా
[చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[29వ పేజీలోని చిత్రం]
కీటకాలను భక్షించే పిచర్ ప్లాంట్ అనబడే ఈ మొక్క భూమ్మీది ఈ ప్రాంతంలో విశిష్టమైనది
[29వ పేజీలోని చిత్రం]
జలపాతాలు లోయగుండా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నదికి జలాన్నందిస్తున్నాయి
[చిత్రసౌజన్యం]
Photograph by Matthew Miller