మీ జీవిత నాణ్యతను మెరుగుపర్చుకునేందుకు ఐదు మార్గాలు
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోని తేజరిల్లు! విలేఖరి
ద్రవ్యోల్బణం, రోగం, కుపోషణ, దారిద్ర్యం వంటి సమస్యలు వర్ధమాన దేశాల్లో బాగా వ్యాపించిపోతున్న సమస్యలు. కనీసం మానవుని దృక్కోణం నుండి చూస్తే, వీటికి సత్వర పరిష్కారమనేది సమీప భవిష్యత్తులో ఉన్నట్లు లేదు. మీరు వర్ధమాన దేశంలో నివసిస్తున్నట్లయితే, మీరు మీ జీవిత నాణ్యతను మెరుగుపర్చుకునేందుకు మీరు చేయగలది ఏదైనా ఉందా? అవును, ఉంది! క్రింద ఇవ్వబడిన ఐదు సలహాలు మీకు సహాయకరంగానూ ఆచరణాత్మకంగానూ ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు.
మొదటిది: ఒక తోట వేసుకోండి
“తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ అన్నము దొరకును” అని బైబిలులోని సామెతలు 28:19 చెబుతుంది. నిజానికి, చాలా కొద్ది స్థలంలో ఎంత మేరకు పండించవచ్చో మీరు చూసినప్పుడు ఆశ్చర్యపోవచ్చు. లి జార్డిన్ పుటగర్ సూ లే ట్రుపీక్ (ఉష్ణమండల ప్రాంతంలో కూరగాయల తోట) అనే తన పుస్తకంలో, రచయితయైన హెన్క్ వేయన్బర్క్ ఇలా చెబుతున్నాడు, 500 నుండి 1,000 చదరపు అడుగుల భూమిలో, ఆరుగురు సభ్యులుగల కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించవచ్చు!
మీరు పండించగల వాటిని కొనుగోలు చేసి మీ ఆదాయాన్ని ఎందుకు వ్యయం చేయాలి? మట్టిని బట్టి, వాతావరణాన్ని బట్టి, మీ ఇంటి పరిసరాల్లోనే బెండకాయ, సింలా మిర్చి, పాలకూర, కొత్తిమీర, టీగ్రాస్, ఉల్లిపాయలు, కర్రపెండలం, గుమ్మడికాయ, చిలకడ దుంప, చెరుకు, టమాటా, దోసకాయ, జొన్నలు పండించవచ్చు. అలాంటి తోట మీ కుటుంబ భోజనానికి వేడినీళ్ళకు తోడు చన్నీళ్ళలాగైనా ఉంటుంది. మీ అవసరానికి సరిపోగా అమ్మేందుకు కూడా మిగులవచ్చు.
మీకు కావలసినంత భూమి ఉన్నట్లయితే, అనేక రకాల పండ్లను కాసే చెట్లను నాటే విషయాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. కొన్ని సందర్భాల్లో, కేవలం ఒక్క చెట్టే మీకూ మీ కుటుంబమూ తినగల్గేదాని కన్నా ఎక్కువ పండ్లను కాయగలదు. కంపోస్టింగ్ గురించి—నిర్జీవ సేంద్రీయ పదార్థ రిసైక్లింగ్ ప్రక్రియను గురించి, దానిని ఎరువుగా ఉపయోగించడాన్ని గురించి తెలుసుకోవడం మీ ఆహార ఉత్పత్తిని మెరుగుపరచుకునేందుకు మీకు సహాయపడుతుంది. చెట్లు ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడమూ, మీ కుటుంబానికి అదనపు ఆదాయాన్నివ్వడం కన్నా ఎక్కువే చేస్తాయి. సరైన చోట్ల ఉన్న చెట్లు మీకు నీడను, శుభ్రమైన గాలినీ ఇస్తాయి, మీ పరిసరాలను మరింత అందమైనవిగా, ఆహ్లాదకరమైనవిగా చేస్తాయి.
మీకు తోటను పెంచడాన్ని గురించి అంతగా తెలియకపోతే ఏమి చేయవచ్చు? ఈ విషయంలో అనుభవమున్న స్నేహితులూ, పొరుగువారూ, లేదా పరిచయస్థులూ మీకున్నారా? అయితే మరి వారి సహాయాన్నీ, లేదా సలహాను ఎందుకు అడగకూడదు? తోటవేయడాన్ని గూర్చిన కొన్ని పుస్తకాలను కొనుక్కోవడం గానీ, అరువుకు తీసుకోవడంగానీ చేయవచ్చు.—తేజరిల్లు! (ఆంగ్లం) మే 22, 1974 సంచికలోని “కూరగాయల తోటను పెంచకూడదూ?” అనే శీర్షికను చూడండి.
రెండవది: పెద్ద మొత్తంలో కొనుక్కోండి
పప్పూ, బియ్యం, నూనె వంటి ప్రాథమిక పదార్థాలను చిన్న మొత్తాల్లో కొంటారా మీరు? అలాగైతే, మీ బడ్జెట్లోని ఎక్కువ భాగాన్ని మీరు వృథా చేస్తున్నారేమో. సాధ్యమైతే, అలాంటి ఆహార పదార్థాలను రెండు, మూడు, లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబాలతో కలిసి పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. కొన్ని పండ్లనూ, కూరగాయలనూ వాటి సీజన్లో పెద్ద మొత్తంలో కొనడం వలన కూడా మీరు డబ్బును ఆదా చేయగలరు. కొన్ని సందర్భాల్లో, మీరు వస్తువులను టోకు మీద కూడా కొనవచ్చు.
మూడవది: ఆహారాన్ని నిల్వచేసే కళను నేర్చుకోండి
పెద్ద మొత్తాల్లో కొనడం త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేయాలి అనే ప్రశ్నను లేవదీస్తుంది. ఆహార పదార్థాన్ని ఎండబెట్టడమనేది బాగా అమలులోవున్న, ఆచరణాత్మకమైన పద్ధతి. ఆఫ్రికాలోని చాలా మంది స్త్రీలు పండ్లనూ, బెండకాయలనూ, చిక్కుడుకాయలను, సొరకాయలను, గుమ్మడి గింజలను, ఔషధి చెట్లను ఎండబెట్టడం ద్వారా జీవనోపాధిని కల్పించుకుంటారు. ఎండబెట్టడానికి ప్రత్యేక ఉపకరణమేమీ అవసరం లేదు. ఆ పదార్థాన్ని శుభ్రమైన స్థలంలో ఈగలు వాలకుండా ఉండేందుకు పలుచని బట్టతో కప్పి ఉంచడం గానీ, వ్రేలాడదీయడం గానీ చేయవచ్చు. మిగతా పనిని గాలీ, ఎండా పూర్తి చేస్తాయి.—తేజరిల్లు! (ఆంగ్లం) ఆగస్టు 8, 1975 సంచికలోని, “తక్కువ వనరులతో అవసరాలను తీర్చుకోగలరా?” అనే శీర్షికను చూడండి.
నాల్గవది: జంతువులను, పక్షులను, చేపలను పెంచడానికి ప్రయత్నించండి
సొంతంగా, కోళ్ళనూ, మేకలనూ, పావురాలనూ, లేదా ఇతర పెంపుడు జంతువులను పెంచుకోవడం మీకు సాధ్యమవుతుందా? అనేక ప్రాంతాల్లో మాంసం ఖరీదైన భోజనంగా మారింది. కానీ, ఇతరుల చిన్న తోడ్పాటుతో, జంతువుల చిన్న మందను ఎలా పెంచాలో మీరు నేర్చుకోవచ్చు. మీరు చేపలను తినడాన్ని ఆస్వాదిస్తారా? అలా అయితే, చిన్న చేపల కొలనును ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. మాంసం, గ్రుడ్లు, మరియు చేపల్లో, ఇనుము, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉంటాయి. అవి మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యమైనవి.
ఐదవది: సరైన పారిశుద్ధ్యాన్ని పాటించండి
మీ కుటుంబ ఆరోగ్యానికి పారిశుద్ధ్యం కూడా చాలా ప్రాముఖ్యం. అన్ని రకాల రుగ్మతలకు కారణమయ్యే ఎలుకలనూ, ఈగలనూ, బొద్దింకలనూ అపరిశుభ్ర పరిస్థితులు ఆకర్షిస్తాయి. సరైన పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు మీ సమయమూ, ప్రయత్నమూ అవసరం. కానీ పారిశుద్ధ్యానికయ్యే ఖర్చు, మందులకూ, డాక్టర్ ఫీజులకూ అయ్యే ఖర్చు కన్నా తక్కువే. ప్రామాణిక పారిశుద్ధ్యం అనేది ఒక్కో వ్యక్తిని బట్టీ, దేశాన్ని బట్టీ కొంతమేరకు వ్యత్యస్తంగా ఉండవచ్చు. అయినప్పటికీ, అన్నిచోట్లా అన్వయించదగిన, అందరికీ వర్తించే కొన్ని సూత్రాలున్నాయి.
ఉదాహరణకు, టాయిలెట్ సౌకర్యాలనే తీసుకోండి. కొన్ని మారుమూల ప్రాంతాల్లో టాయిలెట్లు చాలా చాలా మురికిగా ఉంటాయి. అవి శిథిలమై రోగాలకూ, వ్యాధులకూ ముఖ్య కారణమవుతున్నాయి. పరిశుభ్రంగా ఉండగల లెట్రిన్లను లేదా మరుగుదొడ్లను తక్కువ ఖర్చులో ఎలా కట్టించవచ్చనే విషయంపై స్థానిక హెల్త్ వర్కర్లు మీకు నిర్దేశాలను ఇవ్వవచ్చు.
మీ ఇంటి విషయమేమిటి? ఇంటిని శుభ్రంగా సరైన విధంగా ఉంచుతున్నారా? స్వచ్ఛమైన గాలి ఉందా? మీ వంటగది విషయమేమిటి? దాన్ని శుభ్రంగా, చక్కగా అమర్చబడి ఉంటుందా? ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార పదార్థాన్ని శుభ్రంగా ఉంచాలి, సరైన విధంగా వండాలి. క్రిములూ, పరాన్న జీవులు కలుషితమైన నీటిలో వర్థిల్లుతాయి. కనుక నీటిని ఉపయోగించే ముందు వాటిని వడగట్టడం గానీ, కాగబెట్టడం గానీ చేయండి. ప్లేట్లను వేడి నీటితో కడగండి. ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోండి. నీటిని శుభ్రమైన పాత్రల్లో మూసివుంచి నిల్వచేయండి.
పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవాలనుకుంటే, కుక్కలనూ, పిల్లులనూ, కోళ్ళనూ, మేకలనూ వంటగదిలోనికి రానివ్వకండి. ఆహారమున్న పాత్రలపైనా, పెనంపైనా ఎలుకలు గానీ చుంచెలుకలుగానీ తిరగడానికి అనుమతించకూడదు. ఎలుకల బోను ఆ సమస్యను పరిష్కరించవచ్చు.—తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబర్ 22, 1988 సంచికలోని “పారిశుద్ధ్య సవాళ్ళను ఎదుర్కోవడం” అనే శీర్షికను చూడండి.
చివరికి, కేవలం దేవుని రాజ్యం మాత్రమే మానవజాతి యొక్క సమస్త సమస్యలను పూర్తిగా పరిష్కరించగలదు. (మత్తయి 6:9, 10) అయితే, అంతవరకూ, మీ జీవిత నాణ్యతను మెరుగుపర్చుకునేందుకు ఈ సరళమైన సలహాలు మీకు సహాయపడగలవు.
[18వ పేజీలోని చిత్రం]
తోట వేసుకోండి
[19వ పేజీలోని చిత్రం]
పెద్ద మొత్తంలో కొనుక్కోండి
[19వ పేజీలోని చిత్రం]
ఆహారాన్ని నిల్వచేసే కళను నేర్చుకోండి
[20వ పేజీలోని చిత్రం]
జంతువులను పక్షులను చేపలను పెంచడానికి ప్రయత్నించండి
[20వ పేజీలోని చిత్రం]
సరైన పారిశుద్ధ్యాన్ని పాటించండి