బైబిలు ఉద్దేశము
నమ్మకద్రోహం జరిగిన తరువాత దాంపత్య జీవితం కాపాడబడగలదా?
“వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడని . . . మీతో చెప్పుచున్నానని వారితో అనెను.”—మత్తయి 19:9.
యేసుక్రీస్తు ఆ మాటలతో విశ్వాసఘాతకం చేసిన భర్తకు/భార్యకు విడాకులివ్వాలని నిర్ణయించుకునేందుకు క్రైస్తవ భార్యకు/భర్తకు అనుమతినిచ్చాడు.a అయినప్పటికీ, నిర్దోషియైన భార్య/భర్త తమ దాంపత్య జీవితాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటే, దంపతులిరువురూ తమ వివాహ బంధాన్ని తిరిగి పటిష్ఠం చేసుకోవాలని తీర్మానించుకుంటే అప్పుడేమిటి? దంపతుల ముందు ఏ సవాళ్ళుంటాయి, వాళ్ళు వాటిని ఎలా విజయవంతంగా ఎదుర్కోగలరు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు బైబిలు ఎలా సహాయపడుతుందో చూద్దాం.
పడగొట్టబడిన ఇల్లు
నమ్మకద్రోహం వలన ఎంత హాని కలిగిందన్నది మనం మొదట గ్రహించాలి. భార్యాభర్తలు “ఇద్దరు కాక ఏకశరీరముగా” ఉండాలని వివాహ ఆరంభకుడు సంకల్పించాడని యేసు క్రీస్తు వివరించాడు. “గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” కూడా ఆయన చెప్పాడు. అవును, మనుష్యులను విడదీయరాని విధంగా కలిపేందుకే వివాహ ఏర్పాటు జరిగింది. ఒక వ్యక్తి వ్యభిచారం చేసి వివాహ ప్రమాణాన్ని ఉల్లంఘించినప్పుడు వేదనాజనకమైన పర్యవసానాలు కలుగుతాయి.—మత్తయి 19:6; గలతీయులు 6:7.
నిర్దోషియైన భార్య అనుభవించే బాధ దీనికి రుజువునిస్తుంది. వ్యభిచారం వలన కలిగే ఫలితాలను తుపాను ఇళ్ళను పడగొట్టడం వలన కలిగే ఫలితాలతో పోల్చవచ్చు. డా. షర్లీ పి. గ్లాస్ ఇలా అభిప్రాయపడింది: “తన భార్య/భర్త చనిపోయి ఉంటే దీనికన్నా కాస్త నయంగా ఉండేది అని నేను చికిత్స చేసిన చాలా మంది నిరపరాధులైన రోగులు చెప్పారు.” నిజమే, తమ భార్యను/భర్తను మరణమందు కోల్పోయిన కొందరు దానితో ఏకీభవించకపోవచ్చు. అయితే, వ్యభిచారం తీవ్రమైన బాధకు కారణం కాగలదు. జరిగిన మోసం నుండి కొందరు ఎన్నటికీ పూర్తిగా తేరుకోలేరు.
అలాంటి మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకుంటూ, ‘వ్యభిచారం వల్ల వివాహబంధం అంతం కావలసిందేనా?’ అని ఒకరు అడగవచ్చు. అది తప్పనిసరేమీ కాదు. లేఖనాధారంగా విడాకులివ్వాలని తీర్మానించుకునే స్వేచ్ఛ నమ్మకస్థురాలైన భార్యకు ఉంది కానీ తను అలా చేయడానికి బద్ధురాలు కాదు అని వ్యభిచారాన్ని గూర్చి యేసు చేసిన ప్రస్తావన చూపిస్తుంది. వ్యభిచారాన్ని ఏదీ సమర్థించలేదు. కానీ, అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా దెబ్బతిన్నదానిని తిరిగి పటిష్ఠం చేసుకోవాలని బలపరచుకోవాలని కొందరు దంపతులు నిర్ణయించుకుంటారు.
నిజమే, వివాహ భాగస్వాములు ఇరువురూ ఒకరికొకరు నమ్మకంగా ఉన్నప్పుడే తమ దాంపత్య బంధంలో కావలసిన మార్పులు చేసుకోవడం మంచిది. అయితే, నమ్మకద్రోహం జరిగినప్పటికీ, తమ దాంపత్య జీవితాన్ని కాపాడుకోవాలని కొందరు నిర్దోషులైన వివాహభాగస్వాములు నిర్ణయించుకుంటారు. అన్నీ చక్కబడతాయిలే అన్న తలంపుతో నిర్ణయం తీసుకోకుండా, నిర్దోషియైన భార్య పర్యవసానాలను తూచి చూడాలి. తన పిల్లల అవసరాలను, అలాగే తన స్వంత ఆత్మీయ, ఉద్వేగ, శారీరక, మరియు ఆర్థిక అవసరాలను గూర్చి ఆమె ఆలోచించుకోవచ్చు.b తన దాంపత్య జీవితాన్ని కాపాడుకోగలదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా జ్ఞానపూర్వకంగా ఉంటుంది.
దాంపత్య జీవితం కాపాడబడగలదా?
తుపాను చేత నాశనం చేయబడిన ఇంటిని పునఃనిర్మించే ముందు దానిని పూర్వపు స్థితికి తేవచ్చో లేదో నిర్మించే వ్యక్తి తప్పనిసరిగా నిశ్చయించుకోవాలి. అలాగే, నమ్మకద్రోహం వలన దెబ్బతిన్న బంధాన్ని పునఃపటిష్ఠం చేసుకునే ముందు దంపతులు, ముఖ్యంగా, నిర్దోషియైన భార్య తమ దాంపత్య జీవితంలో సన్నిహిత సంబంధాన్ని నమ్మకాన్ని తిరిగి దృఢపరచుకునే సాధ్యతను గూర్చిన వాస్తవమైన మదింపు చేసుకునేందుకు ఇష్టపడుతుంది.
దోషియైన భర్త నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తున్నాడా లేక దానికి బదులు, ఇప్పటికీ “తన హృదయమందు” వ్యభిచారం చేస్తున్నాడా అన్నది పరిగణించవలసిన ఒక విషయం. (మత్తయి 5:27, 28) ఆయన మారుతానని వాగ్దానం చేస్తున్నప్పటికీ, తన అనైతిక సంబంధాన్ని వెంటనే తెంచుకోవడానికి వెనుకంజవేస్తున్నాడా? (నిర్గమకాండము 20:14; లేవీయకాండము 20:10; ద్వితీయోపదేశకాండము 5:18) ఇప్పటికీ అతని కళ్ళు పరస్త్రీల మీదికి పోతున్నాయా? తను వ్యభిచారం చేసినందుకు కారణం తన భార్యేనని నిందిస్తున్నాడా? అలాగైతే, దాంపత్య జీవితాన్ని యథాస్థితికి తీసుకురావాలన్న ప్రయత్నాలు సఫలమయ్యే సాధ్యత లేదు. మరొకవైపు ఆయన ఆ అక్రమ సంబంధాన్ని తెంచుకొని, తన తప్పిదానికి తనే బాధ్యుడని ఒప్పుకుంటే, తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ పటిష్ఠం చేసుకునేందుకు తనను తాను పూర్తిగా బద్ధుణ్ణిగా చేసుకున్నాడని చూపించినట్లయితే, ఒకరోజు నిజమైన నమ్మకం మళ్ళీ కలగగలదని ఆశించేందుకు ఆయన భార్య ఒక ఆధారాన్ని కనుగొనగలదు.—మత్తయి 5:29.
అలాగే, నమ్మకస్థురాలైన భార్య క్షమించేందుకు సిద్ధం కాగలదా? జరిగిన దానినిబట్టి కలిగిన బాధను ఆమె వ్యక్తం చేయకూడదనో లేక ఏమీ జరగలేదన్నట్లు నటించాలనో దాని భావం కాదు. తాను కఠిన ప్రయత్నం చేయాలని, కొంత కాలం తర్వాత అమిత కోపాన్ని మనస్సులో ఉంచుకోకూడదని దాని భావం. అలా క్షమించేందుకు సమయం పట్టవచ్చు కానీ, దాంపత్యాన్ని మళ్ళీ పటిష్ఠం చేసే గట్టి పునాదిని వేసుకునేందుకు అది సహాయపడగలదు.
“శిథిలాలను” తీసివేయడం
తమ దాంపత్యాన్ని కాపాడుకునేందుకు నమ్మకస్థురాలైన భార్య తీర్మానించుకున్న తర్వాత, దంపతులు గైకొనవలసిన కొన్ని చర్యలేవి? తుపాను వలన కూలిపోయిన ఇంటి చుట్టూ ఉన్న శిథిలాలను తీసివేయవలసినట్లే, దాంపత్య సంబంధమైన “శిథిలాలను” తీసివేయాలి. దంపతులిరువురూ తమ భావోద్వేగాలను పరస్పరం తెలియజేసుకుంటే అది కొంతమేరకు సాధ్యం కాగలదు. సామెతలు 15:22, NW ఇలా చెబుతుంది: “సమాలోచన లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.” “సమాలోచన” అని అనువదించబడిన హెబ్రీ పదం సన్నిహితత్వాన్ని సూచిస్తుంది. అది కీర్తన 89:7, NWలో “సన్నిహితుల గుంపు” అని అనువదించబడింది. కనుక, అది కేవలం పైపై సంభాషణ కాక, నిజాయితీతోకూడిన, మనఃపూర్వకంగా చేసే సంభాషణయై ఉండాలి, ఇరువురూ తమ లోతైన భావాలను తెలియజేసుకునే సంభాషణయై ఉండాలి.—సామెతలు 13:10.
ఉదాహరణకు, కొన్ని సందర్భాలలో నమ్మకస్థురాలైన భార్య తన భర్తను అడిగేందుకు మరి కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. ఆ సంబంధం ఎలా మొదలయ్యింది? అది ఎంత కాలం కొనసాగింది? దాని గురించి ఎవరెవరికి తెలుసు? నిజమే, దంపతులు ఈ విషయాలను చర్చించాలంటే వేదనాభరితంగానే ఉంటుంది. అయితే, మళ్ళీ నమ్మకముంచేందుకు ఇలాంటి విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని నమ్మకస్థురాలైన భార్య అనుకోవచ్చు. అలాగైతే, విశ్వాసఘాతకుడైన భర్త నిజాయితీగా, నెమ్మదిగా జవాబులివ్వడం మంచిది. విషయాలను పరస్పరం తెలియజేసుకోవడం అనేది బాధపెట్టేందుకు కాదు కానీ బాధను మాన్పేందుకేనని గుర్తుంచుకుని ఆయన ప్రేమపూర్వకంగా, దయాపూర్వకంగా విషయాలను వివరంగా చెప్పాలి. (సామెతలు 12:18; ఎఫెసీయులు 4:25, 26) జరిగిన దానినిబట్టి తమకు కలిగిన భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఇద్దరూ వివేచనను, ఆత్మనియంత్రణను కలిగి ఉండాలి, తదనుభూతితో వినాలి.c—సామెతలు 18:13; 1 కొరింథీయులు 9:25; 2 పేతురు 1:6.
యెహోవాసాక్షులైతే, సంఘ పెద్దల నుండి సహాయాన్ని అర్థించాలనుకోవచ్చు. దంపతుల ఆత్మీయ క్షేమాన్ని గురించి, సంఘ ఆత్మీయ క్షేమాన్ని గురించి పెద్దలు చింత కలిగి ఉంటారు. నిజమే, వ్యభిచారం వంటి గంభీరమైన పాపాలను చేసిన క్రైస్తవులు పెద్దల ఎదుట ఆ విషయాన్ని వెంటనే ఒప్పుకోవాలి. వ్యభిచారం చేసిన వ్యక్తి పెద్దలను కలిసినప్పుడు యథార్థమైన పశ్చాత్తాపాన్ని కనబరచి ఉంటాడు, అలా ఆయన సంఘంలో కొనసాగేందుకు అనుమతించబడి ఉంటాడు. అలాంటప్పుడు, పెద్దలు ఆ దంపతులకు తోడ్పాటునివ్వడంలో కొనసాగుతూ ఉండవచ్చు.—యాకోబు 5:14, 15.
మళ్ళీ పటిష్ఠం చేసుకోవడం
దంపతులు తమ భావాలను సాధ్యమైనంత మేరకు దృఢం చేసుకున్న తర్వాత తమ దాంపత్య జీవితంలో ముఖ్యమైన విషయాలను సవరించుకునే మంచి స్థితిలో ఉంటారు. హృదయపూర్వకమైన సంభాషణ కొనసాగుతూ ఉండవలసిన అవసరం ఉంది. ఏ విషయాల్లో బలహీనతలు కనిపిస్తే ఆ విషయాల్లో తప్పకుండా సరైన మార్పులు చేసుకోవాలి.
మార్పులు చేసుకోవలసిన అవసరత ముఖ్యంగా దోషియైన భర్తపైనే ఉంటుంది. అయితే, నమ్మకస్థురాలైన భార్య దాంపత్య జీవితంలోని లోటుపాట్లను సరిచేసుకునేందుకు తన వంతు కృషి తాను చేయాలి. అంటే, దానర్థం ఆమె కారణంగానే వ్యభిచారం జరిగిందనో లేక ఆయన వ్యభిచరించడం సమర్థనీయమనో కాదు—అలాంటి పాపం చేయడానికి సమర్థనీయమైన ఏ కారణమూ లేదు. (ఆదికాండము 3:12; 1 యోహాను 5:3 పోల్చండి.) పరిష్కరించవలసిన సమస్యలు దాంపత్య జీవితంలో ఉండివుండవచ్చన్నదే దాని భావం. మళ్ళీ పటిష్ఠం చేసుకోవలసిన పని సమిష్టిగా చేయవలసిన పని. ఇరువురూ పంచుకునే సూత్రాలను లక్ష్యాలను బలపరచే అవసరముందా? ఆత్మీయ కార్యక్రమాలు నిర్లక్ష్యం చేయబడ్డాయా? పెద్ద బలహీనతలను కనుగొని అవసరమైన మార్పులను చేసుకోవడం బాగా దెబ్బతిన్న దాంపత్య జీవితాన్ని మళ్ళీ పటిష్ఠం చేసుకునేందుకు ఎంతో ప్రాముఖ్యం.
శ్రద్ధతీసుకోవడం
చక్కగా నిర్మించబడిన ఇంటి గురించి కూడా క్రమంగా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. అలా అయితే మళ్ళీ పటిష్ఠం చేసుకున్న బంధాన్ని కాపాడుకునేందుకు అది ఎంత ప్రాముఖ్యం. తాము తీసుకున్న క్రొత్త నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్న తమ దృఢ నిశ్చయం సమయం గడుస్తున్న కొలది బలహీనమయ్యేందుకు దంపతులు అనుమతించకూడదు. మునుపటిలా సరిగ్గా సంభాషించకపోవడం వంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే, వారు వెంటనే వాటిని సరిదిద్దుకోవడానికి చర్య గైకొని, అలా ముందుకు కొనసాగాలి.—సామెతలు 24:16; గలతీయులు 6:9.
అన్నిటి కన్నా ప్రాముఖ్యంగా, భార్యాభర్తలు తమ ఆత్మీయ దినచర్యకు అధిక ప్రాముఖ్యతనివ్వాలి, అది గానీ, తమ దాంపత్య జీవితంగానీ మిగిలిన విషయాల తరువాతి విషయంగా మారేందుకు అనుమతించకూడదు. కీర్తన 127:1 ఇలా చెబుతుంది: “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.” అలాగే, “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని” యేసు హెచ్చరించాడు.—మత్తయి 7:24-27.
అవును, బైబిలు సూత్రాలు అన్వయించుకోవడం కష్టమైనందువల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తే, నమ్మకానికి మరొక పరీక్షా తుపాను వచ్చినప్పుడు దాంపత్య జీవితం మళ్ళీ దెబ్బతింటుంది. అయితే, భార్యాభర్తలిరువురూ అన్ని విషయాల్లోను బైబిలు ప్రమాణాలను అనుసరిస్తే, వారి దాంపత్య జీవితంలో దైవిక ఆశీర్వాదం ఉంటుంది. దాంపత్య జీవితంలో విశ్వాసంగా ఉండేందుకు వారికి అతి శక్తివంతమైన ప్రోత్సాహకం కూడా ఉంటుంది. వివాహ ఆరంభకుడైన యెహోవా దేవునిని ప్రీతిపర్చాలనే కోరికయే ఆ ప్రోత్సాహకం.—మత్తయి 22:36-40; ప్రసంగి 4:12.
[అధస్సూచీలు]
a వ్యభిచారం చేసిన తన భర్తకు/భార్యకు విడాకులివ్వాలని తీర్మానించుకునేందుకు ఒక వ్యక్తికి గట్టి కారణాలున్నాయి. ఈ విషయాన్ని గురించిన విశదమైన చర్చ కొరకు సెప్టెంబరు 8, 1995 తేజరిల్లు!లోని “బైబిలు ఉద్దేశము: జారత్వాన్ని క్షమించాలా వద్దా?” అనే శీర్షికను చూడండి.
b విశ్వాసఘాతకం చేసినది పురుషుడన్నట్లుగా చెబుతున్నాం. స్త్రీలకన్నా రెండు రెట్లు ఎక్కువగా పురుషులే విశ్వాసఘాతకం చేశారని ఒక సర్వే అంచనావేస్తుంది. అయితే చర్చించిన విషయాలు నిర్దోషియైన వివాహ భాగస్వామి క్రైస్తవ పురుషుడైనప్పుడు కూడా సమానంగా వర్తిస్తాయి.
c చక్కగా వినడాన్ని గూర్చిన సమాచారం కొరకు, తేజరిల్లు! జనవరి 22, 1994 (ఆంగ్లం), 6-9 పేజీలు, డిశంబరు 8, 1994, 10-13 పేజీలు చూడండి.