నూతన లోకం ఎప్పుడొస్తుంది
ఈ ప్రస్తుత విధానం గతించిపోయిన తరువాత దేవుని నూతన లోకం వస్తుంది. కాని ‘ఈ లోకం అంతమౌతుందని మనం నిజంగా నమ్మవచ్చా?’ అని మీరడుగవచ్చు. అయితే, ముందెప్పుడైనా అలా ఒక లోకం అంతమైందా? పరిశీలిద్దాము.
సాక్ష్యాధారంగా, మునుపొకసారి ఒక లోకం అంతమైంది. “ఆ నీళ్లవలన అప్పుడున్న [నోవహు కాలంనాటి] లోకము నీటి వరదలో మునిగి నశించెను.” దేవుడు “పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అని బైబిలు చెబుతుంది.—2 పేతురు 2:5; 3:6.
నాశనమైంది “భక్తిహీనుల సమూహము” లేక ఒక దుష్ట విధానమని గమనించండి. అంతమైంది భూగ్రహము, నక్షత్రాలతో కూడిన ఆకాశములు, లేక మానవ కుటుంబం కాదు. జలప్రళయాన్ని తప్పించుకున్నవారు విస్తరించినప్పుడు, మరో లోకం (మన ప్రస్తుత లోకం) ఉనికిలోకి వచ్చింది. దీనికి ఏం సంభవిస్తుంది?
నోవహు కాలంనాటి లోకం నాశనమైందని చెప్పిన తరువాత బైబిలు ఇంకా ఇలా కొనసాగిస్తుంది: “ఇప్పుడున్న ఆకాశమును భూమియు . . . అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” (2 పేతురు 3:7) అగ్ని లోక నాశనాన్ని సూచిస్తుంది. వాస్తవానికి, “[నేడు ఉనికిలోవున్న] లోకము . . . గతించిపోవుచున్నది.” (1 యోహాను 2:17) కాని ఎప్పుడు?
యేసు అపొస్తలులు యీ విషయం తెలుసుకోవాలనుకున్నారు, అందుకే వారు “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పు”మని అడిగారు. (మత్తయి 24:3) దానికి జవాబుగా యేసు, దాని నెరవేర్పు సమయంలో జీవిస్తున్న వారు ఒక లోకం త్వరలో అంతం కాబోతుందని తెలుసుకోటానికి సహాయం చేసే ఒక సూచననిచ్చాడు; దాని స్థానంలో ఒక నూతన లోకం వస్తుంది. ఏమిటా సూచన?
సూచన
ఆ సూచన అనేక భాగాలను కలిగి ఉంది, అవును అనేక సంఘటనలు ప్రవచింపబడ్డాయి. ఆ సూచన నెరవేరాలంటే, ఇవన్నీ విశేషమైన రీతిలో, ప్రాముఖ్యంగా ఒకే సమయంలో అంటే ఒకే తరంలో జరుగవలసి ఉంది. (మత్తయి 24:34) ఏమిటా సంఘటనలు?
యేసు చెప్పిన వాటిలో కొన్ని ఇవి: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును.” “అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు . . . అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.”—లూకా 21:10, 11; మత్తయి 24:7-9, 12.
ఈ లోక “అంత్యదినాలను” సూచించే ఇతర పరిస్థితుల గురించి అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు . . . మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”—2 తిమోతి 3:1-5.
పూర్వపు యుద్ధాలను మించిన అంతర్జాతీయ యుద్ధాలు, గొప్ప భూకంపాలు, విస్తృతమైన తెగుళ్లు, కరవులు, క్రీస్తు అనుచరులను ద్వేషించడం, హింసించడం, అక్రమం విస్తరించడం, విపరీతంగా పెరిగిపోతున్న అపాయకరమైన కాలాల వంటి ఈ సంగతులన్నిటి గురించి మీరు కచ్చితంగా చూసో, వినో ఉండవచ్చు. వీటితోపాటు, దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేయును” అని బైబిలు ప్రవచిస్తోంది. (ప్రకటన 11:18) ఇప్పుడే మానవులు భూమిని నాశనం చేస్తున్నారు!
నవంబరు 1992లో, వార్తాపత్రికలు ఇలాంటి వార్తాశీర్షికలు ప్రచురించాయి: “భూమి నాశనాన్ని గురించి ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.” నోబుల్ బహుమాన గ్రహీత, సంబంధిత శాస్త్రవేత్తల సంఘానికి అధ్యక్షుడునైన డా. హెన్రీ కెండాల్ ఇలా చెప్పారు: “ఈ హెచ్చరిక అతిశయోక్తి కాదు, అది నిర్హేతుకమైన భయం కాదు.” ఒక వార్తాపత్రిక శీర్షిక ఇలా నివేదించింది: “హెచ్చరికను గురించి ఏకీభవించిన 1,575 మంది శాస్త్రవేత్తల పట్టిక, అంతర్జాతీయ వైజ్ఞానిక వర్గంలోని ప్రముఖుల వివరణ పట్టికలా ఉంది.” మన భూమి పూర్తి నాశనాన్ని గూర్చి వారిచ్చిన హెచ్చరిక అలక్ష్యం చేయకూడనిదే!
దీన్ని గూర్చి సందేహించనవసరం లేదు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అవును, ఈ లోకాంతము అని యేసు తెల్పిన ప్రాముఖ్యమైన ప్రవచనంతోసహా ఆ సూచన యందలి అన్ని భాగాలు నెరవేరుతున్నాయి. (మత్తయి 24:14) దేవుని రాజ్య సువార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడినప్పుడు అంతం వస్తుందని యేసు చెప్పాడు. మరి ప్రవచింపబడిన రీతిగా, ఆ ప్రకటించేపని ఇప్పుడు యెహోవాసాక్షుల ద్వారా చేయబడుతుంది!
మీరేమి చేయవలసిన అవసరముంది
కాబట్టి, దేవుని నూతన లోకం అతి త్వరలో వస్తుందన్న వాస్తవాన్ని అన్ని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. అయినా, మీరు ఈ లోకాంతాన్ని తప్పించుకొని, నూతన లోకంలో జీవాన్ని పొందాలంటే, మీరు చేయవలసినపని ఉంది. “లోకము గతించిపోవుచున్నది” అని చెప్పిన తరువాత, మీరు చేయవలసినదేమిటో బైబిలిలా వివరిస్తుంది: “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.
కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దాన్ని చేయాలి. మీరిది చేయటానికి సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు. అప్పుడు మీరు దేవుని నూతన లోక ఆశీర్వాదాలను నిరంతరం అనుభవించటానికి ఈ లోకాంతాన్ని తప్పించుకోగలరు. (g93 10/22)
[Picture Credit Line on page 10]
NASA photo
[10వ పేజీలోని చిత్రం]
మహా శ్రమల తరువాత వెంటనే నూతన లోకం వస్తుంది