సృష్టిలో అద్భుతాలు
కణాలు చేసే అద్భుతం—ఒకే కణం నుండి వేర్వేరు అవయవాలు రావడం
తల్లి కడుపులో, కంటికి కనిపించని ఒక చిన్న కణంతో మనిషి ప్రాణం పోసుకుంటాడు. ఆ కణాన్నే జైగోట్ (Zygote) అంటారు. ఆ ఒక్క కణం విభజన చెంది, దాని నుండి 200 కన్నా ఎక్కువ రకాల కణాలు పుట్టుకొస్తాయి. వాటి ఆకారం, సైజు, పనితీరు వేర్వేరుగా ఉంటాయి. తర్వాత కొన్ని నెలలకి పూర్తిగా ఎదిగిన ఒక బిడ్డ పుడతాడు.
ఆలోచించండి: ముందు, జైగోట్లో ఉన్న డిఎన్ఎ (DNA) నుండి అచ్చం అలాంటి ఇంకో కాపీ తయారై, ఆ జైగోట్ రెండుగా విడిపోతుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఈ కొత్త కణాలన్నీ మొదట్లో ఒకేలా ఉంటాయి. ఆ కణాల ప్రత్యేకత ఏంటంటే, వాటి DNAలో అన్నిరకాల కణాలు లేదా అవయవాలు తయారవ్వడానికి కావాల్సిన సమాచారం ఉంటుంది.
తల్లి కడుపులో జైగోట్ ఏర్పడిన ఒక వారం తర్వాత, కణాలు రెండు రకాలుగా మారతాయి. కొన్ని కణాలు పిండంగా (Embryo) తయారౌతాయి. ఇంకొన్ని కణాలు ఆ పిండం ఎదగడానికి సహాయపడే ప్లాసెంటాగా (Placenta), కణజాలాలుగా (Tissues) తయారౌతాయి.
మూడో వారం కల్లా, పిండంలోని కణాలు మూడు భాగాలుగా ఏర్పడతాయి. పై భాగంలో ఉన్న కణాలేమో మెదడు, నోరు, చర్మం పై పొర, నాడీ కణాలుగా, ఇంకా ఇతర కణాలుగా మారతాయి. మధ్య భాగంలో ఉన్న కణాలేమో రక్తం, ఎముకలు, కిడ్నీలు, కండరాలు, ఇంకా వేరే కణజాలాలుగా మారతాయి. లోపలి భాగంలో ఉన్న కణాలేమో మిగతా అవయవాలుగా అంటే ఊపిరితిత్తులు, మూత్రాశయం (Bladder), జీర్ణ వ్యవస్థగా (Digestive System) తయారౌతాయి.
కడుపులోని బిడ్డ ఎదిగే కొద్దీ, కణాల విభజన జరిగి 200 కన్నా ఎక్కువ రకాల కణాలు తయారౌతాయి.
బిడ్డ తల్లి కడుపులో ఉన్నంత కాలం, కొన్ని కణాలు ఒంటరిగా లేదా గుంపులుగా పిండంలో ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్తూ ఉంటాయి. ఇంకొన్ని కణాలేమో ఒకచోట పోగయ్యి రకరకాలుగా అంటే పొరల్లా, తాళ్లలా, తొర్రల్లా మారతాయి. అలా జరగాలంటే, కణాలన్నీ ఒక జట్టులా ఉంటూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలి. నిజంగా అది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఉదాహరణకు, పొరల్లా పోగైన కణాలు ముడుచుకుని ఒక దశలో చిన్నచిన్న గొట్టాల్లా తయారౌతాయి. పిండం మొత్తంలో ఒకేసారి చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ గొట్టాలు పొడవుగా పెరిగి, కొమ్మల్లా మారి, చివరికి అవన్నీ కలిసి రక్త నాళాలుగా (Blood Vessels), రక్త ప్రసరణ వ్యవస్థగా ఏర్పడతాయి.
ఒక బిడ్డ పుట్టడానికి కొన్ని వేల కోట్ల కణాలు సరైన సమయంలో, సరైన విధంగా, సరైన చోట చేరి వేర్వేరు అవయవాలుగా తయారౌతాయి.
మీరేమంటారు? ఇలా మారే శక్తి కణాలకు దానంతట అదే వచ్చిందా? లేదా ఎవరైనా అలా చేశారా?