కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 112
  • పరలోకం అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరలోకం అంటే ఏమిటి?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటన 21:1—‘కొత్త ఆకాశం, కొత్త భూమి’
    బైబిలు వచనాల వివరణ
  • నిత్య సంతోషం పరలోకంలోనా లేక ఈ భూమిపైనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 112
మేఘాల మీద మెరుస్తున్న సూర్యుడు

పరలోకం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లో “పరలోకం” అనే పదాన్ని ముఖ్యంగా మూడు విషయాలను సూచించడానికి ఉపయోగించారు: (1) ఆకాశం; (2) అదృశ్య ప్రాణులు ఉండే స్థలం; (3) ఉన్నతమైన స్థానం. బైబిల్లో పరలోకం అనే పదం సందర్భాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కో విషయాన్ని సూచిస్తుంది.a

  1. ఆకాశం. ఇక్కడ “పరలోకం” అనే పదం భూమి వాతావరణాన్ని అంటే గాలులు వీచే, పక్షులు ఎగిరే, మేఘాలు వర్షాన్ని-మంచును కురిపించే, మెరుపుల్ని మెరిపించే స్థలాన్ని సూచిస్తుంది. (కీర్తన 78:26; సామెతలు 30:19; యెషయా 55:10; లూకా 17:24) ఇది అంతరిక్షాన్ని, అంటే “సూర్య చంద్ర నక్షత్రములు” ఉండే స్థలాన్ని కూడా సూచిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 4:19; ఆదికాండము 1:1.

  2. అదృశ్య ప్రాణులు ఉండే స్థలం. “పరలోకం” అనే పదం ఆత్మ ప్రాణులు ఉండే స్థలాన్ని కూడా సూచిస్తుంది. ఇది భౌతిక విశ్వం కన్నా పైన, ఈ విశ్వానికి అవతల ఉంటుంది. (1 రాజులు 8:27; యోహాను 6:38) ఈ స్థలంలో “ఆత్మ” ప్రాణి అయిన యెహోవా దేవుడు, ఆయన సృష్టించిన మరితర ఆత్మ ప్రాణులైన దేవదూతలు ఉంటారు. (యోహాను 4:24; మత్తయి 24:36) కొన్ని సందర్భాల్లో ఈ పదం, “పరిశుద్ధదూతల సమాజము” అయిన నమ్మకమైన దేవదూతల్ని సూచించడానికి ఉపయోగించబడింది.—కీర్తన 89:5-7.

    బైబిల్లో “పరలోకం” అనే పదం ఆత్మ ప్రాణులు ఉండే స్థలంలో యెహోవా ఉండే ఖచ్చితమైన చోటును, ఆయన ‘నివాసస్థలాన్ని’ సూచించడానికి కూడా ఉపయోగించబడింది. (1 రాజులు 8:43, 49; హెబ్రీయులు 9:24; ప్రకటన 13:6) ఉదాహరణకు యెహోవా సన్నిధిలోకి ఇక ఏమాత్రం రాలేకుండా సాతాను, అతని దయ్యాలు లేదా చెడ్డదూతలు పరలోకం నుండి తోసివేయబడతారని బైబిలు ప్రవచించింది. అయితే ఆయన సన్నిధి నుండి తొలగించబడినా, వాళ్లు ఉండేది కూడా ఆత్మప్రాణుల స్థలంలోనే.—ప్రకటన 12:7-9, 12.

  3. ఉన్నతమైన స్థానానికి గుర్తు. బైబిల్లో “పరలోకం” అనే పదం ఉన్నతమైన స్థానాన్ని, సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజ్యాధికారుల్ని సూచించడానికి ఉపయోగించబడింది. ఆ స్థానంలో ఉన్నది:

    • విశ్వ సర్వాధిపతి అయిన యెహోవా దేవుడు.—2 దినవృత్తాంతములు 32:20; లూకా 15:21.

    • మానవ ప్రభుత్వాల్ని తొలగించి వాటి స్థానంలో వచ్చే దేవుని రాజ్యం. బైబిలు ఈ రాజ్యాన్ని “క్రొత్త ఆకాశము” అని అంటుంది.—యెషయా 65:17; 66:22; 2 పేతురు 3:13.b

    • పరలోకానికి వెళ్లే నిరీక్షణతో భూమ్మీదున్న క్రైస్తవులు.—ఎఫెసీయులు 2:6.

    • తమ పౌరులను పరిపాలిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న మానవ ప్రభుత్వాలు.—యెషయా 14:12-14; దానియేలు 4:20-22; 2 పేతురు 3:7.

    • ప్రస్తుతం ఈ లోకాన్ని పరిపాలిస్తున్న చెడ్డదూతలు లేదా దయ్యాలు.—ఎఫెసీయులు 6:12; 1 యోహాను 5:19.

పరలోకం ఎలా ఉంటుంది?

ఆత్మ ప్రాణులు ఉండే స్థలంలో ఎంతో పని జరుగుతుంటుంది. అక్కడ “ఆయన [యెహోవా] వాక్యము నెరవేర్చే” వేవేల, కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు.—కీర్తన 103:20, 21; దానియేలు 7:10.

పరలోకంలో అమితమైన తేజస్సు ఉంటుందని బైబిలు చెప్తోంది. (1 తిమోతి 6:​15, 16) యెహెజ్కేలు పరలోకాన్ని దర్శనంలో చూసినప్పుడు అక్కడ అతనికి “తేజస్సు” కనిపించింది. దానియేలుకు తేజస్సుతోపాటు “అగ్నివంటి ప్రవాహము” కనిపించింది. (యెహెజ్కేలు 1:​26-​28; దానియేలు 7:​9, 10) పరలోకం పవిత్రంగా, పరిశుభ్రంగా, అందంగా ఉంటుంది.—కీర్తన 96:6; యెషయా 63:15; ప్రకటన 4:2, 3.

బైబిలు పరలోకం గురించి ఇస్తున్న వివరాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. (యెహెజ్కేలు 43:2, 3) అయితే, పరలోకం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం మానవులకు అసాధ్యం, అదృశ్య ప్రాణులు ఉండే ఆ స్థలం మన ఊహకు అందనిది.

a  “పరలోకం” అని అనువదించిన హీబ్రూ పదం “ఎత్తయిన,“ లేదా “ఉన్నతమైన” అనే అర్థమున్న మూల పదాల నుండి వచ్చింది. (సామెతలు 25:3) ద న్యూ బ్రౌన్‌, డ్రైవర్‌, అండ్‌ బ్రిగ్స్‌, హీబ్రూ అండ్‌ ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌, 1029వ పేజీ చూడండి.

b  McClintock and Strong‘s Cyclopedia యెషయా 65:17 లోని కొత్త ఆకాశము, “కొత్త రాజ్యాన్ని, అంటే కొత్త ప్రభుత్వాన్ని” సూచిస్తుందని చెప్తోంది.—4వ సంపుటి, 122వ పేజీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి