యౌవన సహోదరులారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా?
1. ఓ యౌవన సహోదరుడు 1 తిమోతి 3:1లో ఉన్న నిర్దేశాన్ని ఎప్పటినుండి పాటించాలి?
1 “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడు.” (1 తిమో. 3:1) సంఘంలో సేవావకాశాలను చేపట్టేందుకు అర్హత సాధించమని ఆ ప్రేరేపిత మాటలు సహోదరుల్ని ప్రోత్సహిస్తున్నాయి. అలా అర్హత సాధించాలంటే మీరు వయసులో పెద్దవాళ్లయి ఉండాలా? నిజానికి, మీరు చిన్నప్పటినుండే ఆ దిశగా అడుగులు వేయడం మంచిది. అలా చేస్తే మీరు అవసరమైన శిక్షణను పొందుతారు, మీ అభివృద్ధిని చూపించగలుగుతారు. ఆ విధంగా పెద్దవాళ్లయ్యేసరికి పరిచర్య సేవకునిగా నియమితులౌతారు. (1 తిమో. 3:10) మీరు బాప్తిస్మం తీసుకున్న యౌవన సహోదరుడైతే, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు?
2. స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా అలవర్చుకోవచ్చు, దాన్ని ఎలా చూపించవచ్చు?
2 స్వయంత్యాగ స్ఫూర్తి చూపించండి: హోదా కోసం కాదుగానీ దొడ్డ పని చేయడం కోసమే మీరు కృషి చేస్తున్నారని గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు సహోదరసహోదరీలకు సహాయం చేయాలనే కోరికను అలవర్చుకోండి. యేసు ఉంచిన చక్కని మాదిరిని ధ్యానించడం ద్వారా మనం అలా చేయవచ్చు. (మత్త. 20:28; యోహా. 4:6, 7; 13:4, 5) ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడానికి మీకు సహాయం చేయమని యెహోవాను అడగండి. (1 కొరిం. 10:24) మీరు సంఘంలోని వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు అవసరమైన సహాయాన్ని చేయగలరా? రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే విషయంలో లేదా ఇతర నిర్వహణా పనులు జరిగేటప్పుడు మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా? దైవపరిపాలన పరిచర్య పాఠశాలలో ప్రసంగించాల్సిన వాళ్లు రానప్పుడు మీరు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఇతరుల కోసం కష్టపడడంలో ఆనందం ఉందని మీరు గుర్తిస్తారు.—అపొ. 20:35.
3. ఆధ్యాత్మికతను కలిగి ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, దానిని ఎలా పెంపొందించుకోవచ్చు?
3 ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి: ఒక వ్యక్తి సంఘంలో సేవచేయడానికి ప్రత్యేకమైన తెలివితేటలు లేదా సహజ సామర్థ్యాలకంటే ఆధ్యాత్మికతను కలిగివుండడం చాలా ప్రాముఖ్యం. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యెహోవాని, యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకుని వాళ్లలా ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు. (1 కొరిం. 2:15, 16) ఆ వ్యక్తి ‘ఆత్మ ఫలంలోని’ లక్షణాలను ప్రదర్శిస్తాడు. (గల. 5:22, 23) దేవుని రాజ్యానికి సంబంధించిన పనులకు ప్రథమ స్థానమిచ్చే ఆసక్తిగల రాజ్య ప్రచారకుడిగా ఉంటాడు. (మత్త. 6:33) వ్యక్తిగత అధ్యయనాన్ని క్రమంగా చేయడం ద్వారా మీరు మంచి ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోవచ్చు. అందులో ప్రతీరోజు బైబిలు చదవడం, ప్రతీ కావలికోట సంచికను చదవడం, కూటాలకు చక్కగా సిద్ధపడి హాజరవ్వడం ఉన్నాయి. (కీర్త. 1:1, 2; హెబ్రీ. 10:24, 25) యౌవనస్థుడైన తిమోతిని ఆధ్యాత్మిక ప్రగతి సాధించమని పౌలు ప్రోత్సహిస్తున్నప్పుడు ఆయన ఇలా రాశాడు: ‘నీ బోధనుగూర్చి జాగ్రత్త కలిగియుండుము.’ (1 తిమో. 4:15, 16) కాబట్టి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీకు ప్రసంగం ఉంటే దానికి బాగా సిద్ధపడండి. పరిచర్యకు సిద్ధపడండి, క్రమంగా పాల్గొనండి. పయినీరు సేవ, బెతెల్ సేవ, ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు హాజరవ్వడం వంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని, వాటికి అనుగుణంగా కృషి చేయండి. ‘యౌవనేచ్ఛల నుండి పారిపోవడానికి’ మీ ఆధ్యాత్మికత మీకు సహాయం చేస్తుంది.—2 తిమో. 2:22.
4. నమ్మకస్థులుగా, విశ్వసనీయులుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
4 నమ్మకస్థులుగా, విశ్వసనీయులుగా ఉండండి: మొదటి శతాబ్దంలో, విధవరాండ్రకు ఆహారాన్ని పంచిపెట్టే పనికి నియమించబడిన సహోదరులు “మంచి పేరు పొందిన” వాళ్లు. ఆ సహోదరులు తప్పకుండా నమ్మకస్థులుగా, విశ్వసనీయులుగా నిరూపించుకుని ఉంటారు. అందుకే ఆ పని సవ్యంగా జరుగుతుందో లేదో అని ఆందోళన చెందాల్సిన అవసరం అపొస్తలులకు రాలేదు. దాంతో, అపొస్తలులు ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి నిలపగలిగారు. (అపొ. 6:1-4) కాబట్టి, మీకు సంఘంలో ఏదైనా నియామకం వచ్చినప్పుడు, దాన్ని చేయడానికి శాయశక్తులా కృషిచేయండి. ఓడను నిర్మించే విషయంలో తనకిచ్చిన నిర్దేశాలన్నీ జాగ్రత్తగా పాటించిన నోవహును ఆదర్శంగా తీసుకోండి. (ఆది. 6:22) నమ్మకంగా ఉండేవాళ్లను యెహోవా అమూల్యంగా ఎంచుతాడు, అంతేకాక అది మీ ఆధ్యాత్మిక పరిణతిని కూడా చూపిస్తుంది.—1 కొరిం. 4:2; “శిక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలు” అనే బాక్సును చూడండి.
5. యౌవన సహోదరులు లక్ష్యాలను ఎందుకు చేరుకోవాలి?
5 ప్రవచనాలు తెలియజేస్తున్నట్లుగా సమకూర్చేపనిని యెహోవా వేగవంతం చేస్తున్నాడు. (యెష. 60:22) ప్రతీ సంవత్సరం సుమారు రెండున్నర లక్షలమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఎంతోమంది కొత్తవాళ్లు సత్యంలోకి వస్తుండడం వల్ల సంఘ బాధ్యతల్ని చూసుకోవడానికి అర్హులైన ఆధ్యాత్మిక పురుషుల అవసరం చాలా ఉంది. మునుపెన్నటికన్నా ఇప్పుడు, యెహోవా సేవలో చేయడానికి ఎంతో పని ఉంది. (1 కొరిం. 15:58) యౌవన సహోదరులారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా? అలాగైతే మీరు దొడ్డపని చేయాలని కోరుకుంటున్నట్లే!
[5వ పేజీలోని చిత్రం]
ఎంతోమంది కొత్తవాళ్లు సత్యంలోకి వస్తుండడం వల్ల సంఘ బాధ్యతల్ని చూసుకోవడానికి అర్హులైన సహోదరుల అవసరం చాలా ఉంది
[6వ పేజీలోని చిత్రం]
శిక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలు
నియామకాలను ఇవ్వడంతో పాటు వాటికి అవసరమైన శిక్షణను పెద్దలు ఇచ్చినప్పుడు, అర్హులైన యౌవన సహోదరులు ప్రయోజనం పొందుతారు. కూటం ముగిసిన తర్వాత ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు స్టేజి మీద కూర్చుని ఒక ప్రచారకుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడాయన ఒక అబ్బాయి తనకు దగ్గర్లో నిలబడి ఉండడాన్ని గమనించి, ‘నాతో ఏదైనా మాట్లాడాలా?’ అని అడిగాడు. దానికి ఆ చిన్ని సహోదరుడు, ప్రతీ కూటం తర్వాత స్టేజీని శుభ్రం చేసే పని తనకు అప్పగించారని చెప్పాడు. తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే తనకు అప్పగించిన పనిని పూర్తి చేయకుండా వెళ్లడం ఆ అబ్బాయికి ఇష్టం లేదు. అది విన్న ప్రాంతీయ పర్యవేక్షకుడు సంతోషంగా స్టేజీ మీద నుండి దిగిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇలా చెప్పాడు: “ఆ సంఘంలోని పెద్దలు అర్హులైన యౌవన సహోదరులకు సంఘ నియామకాలను క్రమంగా ఇవ్వడం ద్వారా చక్కని శిక్షణను ఇస్తున్నారు. అందుకే ఆ పెద్దలు, దాదాపు నేను ఆ సంఘాన్ని సందర్శించిన ప్రతీసారీ యౌవన సహోదరుల్ని పరిచర్య సేవకులుగా నియమించమని సిఫారసు చేసేవాళ్లు.”