పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన సహోదరసహోదరీల్లారా,
ప్రేమ చూపించడంలో, మన పరలోక తండ్రియైన యెహోవాకు ఎవరూ సాటిరారు. అందుకే, “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతోంది. (1 యోహా. 4:8) యెహోవా సర్వశక్తిమంతుడే అయినా, ఆయన వాక్యం ఎప్పుడూ “దేవుడు శక్తి” అని పిలవడం లేదు. ఆయన పరిపాలన ముఖ్యంగా ప్రేమ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఆయనకు దగ్గరవ్వాలని అనుకుంటాం.
సంతోషకరంగా, తనను సేవించమని యెహోవా మనల్ని బలవంతపెట్టడం లేదు. ఆయన నియంత కాదు. యెహోవా, తన మీద ప్రేమతోనే మనం ఆయనను సేవించాలని కోరుకుంటున్నాడు. మనమలా చేసినప్పుడు, ఆయన పరిపాలన కావాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం. ఎందుకంటే, ఆయన పరిపాలన ప్రేమ, న్యాయాల మీద ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. ఇది మానవ చరిత్ర ఆరంభం నుండి రుజువౌతూనే ఉంది.
యెహోవా, తనకు లోబడేలా ఆదాముహవ్వలను బలవంతపెట్టే బదులు, సొంతగా నిర్ణయించుకునే అవకాశం ఇచ్చాడు. నిజంగా యెహోవా మీద ప్రేమ, ఆయన తమకోసం చేసినవాటి పట్ల కృతజ్ఞత ఉంటే వాళ్లు సాతాను మాట విని యెహోవాకు ఎదురుతిరిగే వాళ్లు కాదు.
ఆ తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో చివరిసారి మాట్లాడుతూ, ‘చూడండి, నేడు నేను జీవాన్ని మేలును, మరణాన్ని కీడును మీ ఎదుట ఉంచాను’ అన్నాడు. (ద్వితీ. 30:15) ఆ ప్రజలకు, తామెలా జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా, యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: ‘యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేకపోతే, మీరు ఎవరిని సేవిస్తారో మీరే నిర్ణయించుకోండి.’ అప్పుడు ఇశ్రాయేలీయులు, “లేదు, యెహోవాను అనుసరించడం మేము ఎన్నటికీ మానము” అని జవాబిచ్చారు. (యెహో. 24:15, 16, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఇప్పుడు మన నిర్ణయం కూడా అదే. మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయనను అనుసరించడం “ఎన్నటికీ మానము.”
నిజ క్రైస్తవులమైన మనకు, స్వేచ్ఛాచిత్తం అంటే ఏమిటో తెలుసు. సహోదరసహోదరీలకు సలహాను, దిద్దుబాటును ఇచ్చే అధికారం పెద్దలకున్నా, వాళ్ల జీవితాల మీద గానీ విశ్వాసం మీద గానీ అధికారం చెలాయించడానికి ప్రయత్నించరు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలా చెప్పడంలేదు గానీ మీ ఆనందానికి సహకారులమై ఉన్నాం, విశ్వాసం వల్లే మీరు నిలకడగా ఉన్నారు.’—2 కొరిం. 1:24.
ఏ పనైనా, బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా చేస్తే ఎంతో సంతృప్తి పొందుతాం. మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, దాన్ని ప్రేమతో చేయాలని యెహోవా చెబుతున్నాడు. అదెంత ప్రాముఖ్యమో దేవుని ప్రేరేపణతో పౌలు రాసిన మాటల్లో చూడొచ్చు. ఆయనిలా అన్నాడు: ‘బీదల పోషణ కోసం నా ఆస్తంతా ఇచ్చినా, కాల్చడానికి నా శరీరాన్ని అప్పగించినా, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు.’—1 కొరిం. 13:3.
లక్షలాదిమంది సహోదరసహోదరీలు యెహోవామీద హృదయపూర్వక ప్రేమతో ఆయనను సేవించడం ఆయనకెంత సంతోషాన్ని, మహిమను తీసుకొస్తుందో కదా!
యెహోవా కూడా తన సేవకులందర్నీ ఎంతో ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా, లోకాన్నీ అది పురికొల్పే స్వార్థాన్నీ కాకుండా యెహోవాను ప్రేమిస్తున్న పిల్లలారా, యౌవనులారా మిమ్మల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. మేము కూడా మిమ్మల్నందర్నీ చాలా ప్రేమిస్తున్నామనే నమ్మకంతో ఉండండి.—లూకా 12:42, 43.
సహోదరసహోదరీలారా, యౌవనులారా యెహోవా మీదున్న ప్రేమతో మీరంతా కలిసి గత ఏడాది 174,86,97,447 గంటల్ని పరిచర్యలో గడిపారు. ప్రేమ వల్లే, ప్రపంచవ్యాప్తంగా 77,82,346 మంది ప్రచారకులు క్షేత్రసేవలో భాగం వహించారు. యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు గుర్తుగా 2,68,777 మంది బాప్తిస్మం తీసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అంటే, సగటున ప్రతీవారం 5,168 మంది బాప్తిస్మం తీసుకున్నారు, వాళ్లలో చాలామంది యౌవనులే. ఇవన్నీ మన హృదయాల్ని ఎంత ఆనందంతో నింపుతున్నాయో కదా!
మనం అంతానికి దగ్గర్లో ఉన్నాం కాబట్టి, దేవుని ప్రజలు ఎన్నో కష్టాలు, సవాళ్లు, హింస, అనారోగ్యం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్లలో కొందరు, వృద్ధాప్యం వల్ల బాధపడాల్సి రావచ్చు. అయినా సరే, ఎన్నటికీ ‘వెనుకతీయకూడదని,’ ‘అధైర్యపడకూడదని’ మనం నిశ్చయించుకున్నాం. మిమ్మల్నందర్నీ మేము ఎంతో ప్రేమిస్తున్నాం.—హెబ్రీ. 10:39; 2 కొరిం. 4:16.
మీ సహోదరులు,
యెహోవాసాక్షుల పరిపాలక సభ