క్షేత్రసేవా పద్ధతులను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటున్నారా?
1 సువార్త ప్రకటించడమనే పవిత్ర నియామకాన్ని మనం నెరవేరుస్తుండగా, ఎల్లప్పుడూ దేవుని జ్ఞానాన్ని, ఆయన వాక్యంలోవున్న వృత్తాంతాలను ఉదాహరణలుగా తీసుకుని, మనం ఉపయోగించే పద్ధతుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుందాం. మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవుడు తమకిచ్చిన నియామకాన్ని ఎలా నెరవేర్చారో, అదే సమయంలో ఆచరణాత్మక జ్ఞానాన్ని ఎలా చూపించారో అపొస్తలుల కార్యములులోని వృత్తాంతం తెలియజేస్తుంది. (మత్త. 28:19, 20) ఉదాహరణకు ఈకొనియలో తలెత్తిన పరిస్థితుల కారణంగా పౌలు, మరో ప్రాంతంలో ప్రకటించడానికి అక్కడినుండి వెళ్ళిపోయాడు. (అపొ. 14:5, 6) ప్రజలకు సువార్త ప్రకటించే విధానంలో మార్పు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన, ఆయన అనుచరులు గ్రహించినప్పుడు వారు వేర్వేరు పద్ధతుల్లో ప్రకటించారు. (అపొ. 16:13) వ్యతిరేకించేవారికి భయపడి కాదుగానీ, మనం యెహోవాకు విధేయత చూపిస్తూనే ఉండాలంటే పరిస్థితులను బట్టి మార్పు చేసుకోవాల్సిన అవసరమున్నప్పుడు మనం సాక్ష్యమివ్వడానికి కొన్ని పద్ధతులనే అనుసరించాలని మొండిగా పట్టుపట్టము. (ఫిలి. 1:27, 28; అపొ. 5:29) మనం అలాంటి ఆచరణాత్మక జ్ఞానాన్ని చూపిస్తున్నామా?
2 ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు సత్యారాధనను వ్యతిరేకించేవారు ఇంకా ఉన్నారని చూపిస్తున్నాయి. మతోన్మాదుల కార్యకలాపాల వెనక వివిధ ఉద్దేశాలున్నా నిజ క్రైస్తవుల ఉద్దేశాలను శంకించేలా ప్రజలను తప్పుదోవ పట్టించడానికీ, సువార్త ప్రకటించబడకుండా నిరోధించడానికీ సాతాను అలాంటి వారిని ఉపయోగించుకోవచ్చు. పౌలు కాలంలో ఎఫెసులో కూడా అదే జరిగింది. (అపొ. 19:23-28) అలా వివిధ రకాల కుతంత్రాలు ఉపయోగించబడుతున్నాయి కాబట్టి యెహోవా నామాన్ని ఆయన సంకల్పాన్ని ప్రకటిస్తూనే ఉండాలని మనం నిశ్చయించుకోవడం అవసరం, అయితే మనం మన పద్ధతులను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి.
3 చక్కని వ్యవస్థీకరణ: మనం చేసే పనివైపుకు అనవసరమైన అవధానం మళ్ళకుండా ఉండాలంటే క్షేత్రసేవా గ్రూపుల గురించి శ్రద్ధతీసుకొనే పెద్దలు, పరిచర్య సేవకులు గ్రూపు క్షేత్రసేవకు వెళ్ళకముందే ఎవరు ఎవరితో ఎక్కడ పనిచేయాలనేది తెలియజేయాలి. సహోదర సహోదరీలు ఎక్కడ పనిచేయాలనేదాని గురించి సూచనలు తీసుకుంటూ గుంపులు గుంపులుగా వీధుల్లో నిలబడి, వచ్చేపోయేవారి అవధానాన్ని ఆకర్షించడం కంటే ఇదెంత జ్ఞానయుక్తమైనదో కదా! క్షేత్రసేవా గుంపుపై నాయకత్వం వహించే సహోదరుడు ముందుగా సిద్ధపడితే, ఎవరికి ఏ క్షేత్రం కేటాయించబడిందో ముందే చెప్పగలుగుతాడు, అలాచేస్తే క్షేత్రంలో పెద్దపెద్ద గుంపులు ఏర్పడే అవకాశం ఉండదు.
4 పరిచర్య చేస్తున్నప్పుడు ఇతరులకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తించకుండా ఉండడం జ్ఞానయుక్తమైనది. ఒకప్పుడు ధైర్యంగా, ఇతరులకు భిన్నంగా ఉండడం సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అలా ఉండడం ప్రకటించడంలో కొనసాగకుండా మిమ్మల్ని అడ్డుకోవడమేగాక మీకు లేదా ఇతరులకు ప్రమాదం కూడా తీసుకురావచ్చు. మన పద్ధతుల్లో మార్పులు చేసుకోకుండా ఉండడం మూర్ఖత్వమే అవుతుంది. క్షేత్రసేవా గుంపులు మరీ పెద్దగా ఉండకపోవడం మంచిది. క్షేత్రంలోకి ఎక్కువమంది కలిసి ‘దండెత్తినట్లుగా’ వెళ్ళకూడదు. ఇద్దరిద్దరు ప్రచారకులకు రెండుమూడు వారాల కోసం సరిపోయేంత క్షేత్రాన్ని ఇవ్వండి. వాళ్ళు దాన్ని తమకు అనుకూలమైన సమయంలో పూర్తిచేయవచ్చు, కానీ ఎంతవరకు చేశారనేది గ్రూపు పైవిచారణకర్తకు తెలియజేస్తూ ఉండాలి. గ్రూపు పైవిచారణకర్తలు, క్షేత్రసేవా గ్రూపులపై నాయకత్వం వహించేవారందరూ ఇంతవరకు ఉపయోగిస్తున్న విధానంలో మార్పు చేసుకోవడం అవసరం.
5 క్షేత్రసేవా పద్ధతులను మార్చుకుంటున్నారా? సాధ్యమైనచోట ఇంటింటి పరిచర్యలో కొనసాగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడూ వేరే విధాలుగా సాక్ష్యమివ్వడం జ్ఞానయుక్తమైనదై ఉండవచ్చు. లేదా ఇతర దేశాల్లో మన సహోదరులు చేస్తున్నట్లుగా, ఏదైనా ఒక వీధిలో ఒక ఇంట్లో మాట్లాడి మరో వీధికి వెళ్ళిపోయి అక్కడ మరో ఇంట్లో మాట్లాడవచ్చు. నిజమే ఇలా చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ ఇలా చేయడం, ఇంటింటికీ రాజ్య సువార్త ప్రకటించడమనే మన పనిని అడ్డుకోవడానికి వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలను నిరోధించవచ్చు.
6 క్షేత్రసేవ చేస్తున్నప్పుడు పరిసరాల్లో ఏమి జరుగుతోందో గమనిస్తూ ఉండడం అవసరమని గుర్తుంచుకోండి. మీ చుట్టూవున్నవారు చేస్తున్న దానివెనుకున్న ఉద్దేశమేమిటో గ్రహించి సమస్యలను తప్పించుకోగలుగుతారు. మీరు ఎవరితోనైనా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి చెబుతున్న దానిని జాగ్రత్తగా వినండి. మీరు పరిచయవాక్యాలు ఏమి చెప్పాలనేదాని గురించి ముందుగా ఆలోచించుకొని, దానికి అవతలి వ్యక్తి ఇచ్చే సమాధానాన్ని వింటే వాళ్ళు శాంతంగా ఉన్నారో లేదో వెంటనే గ్రహించగలుగుతారు. మంచి సిద్ధపాటు మీకు కాపుదలగా ఉంటుంది. సముచితమైనచోట, మన గురించి మన ఉద్దేశం గురించి యథార్థంగా ప్రశ్నలు అడిగేవారికి సమాధానమివ్వడానికి యెహోవాసాక్షులు ఇస్తున్న జవాబు అనే కరపత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు.
7 యెహోవా దేవునిపై ఆధారపడడం మానకండి. మీరు పరిశుద్ధాత్మ కోసం అడిగితే ఆయన దానిని మీకు అనుగ్రహిస్తాడు. (లూకా 11:13) మన ప్రకటనా పనిలో వివిధ రకాల పద్ధతులను ఉపయోగించడానికి ఇష్టపడడం ద్వారా, పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసుకునే ఆయన సర్వోత్తమ మాదిరిని అనుసరిస్తాము. యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, ఎవరైనా నిరోధించగల ఒకే విధమైన ప్రణాళికను అనుసరించడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన లక్ష్యం, ఆయన ఉద్దేశానికి అనుగుణంగానే నెరవేరుతుంది.—యెష. 55:11; ఎఫె. 1:9-11.