క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
సత్యారాధనను తీవ్రంగా వ్యతిరేకించేవారి ఎదుట స్థిరంగా నిలబడడం ఎలా సాధ్యం? మనల్ని భక్తిహీన లోకంలోకి తిరిగి లాగేందుకు ఎడతెగక జరిగే ప్రయత్నాన్ని మనమెలా తిప్పికొట్టవచ్చు? ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నలకు 2009వ సేవా సంవత్సరపు ప్రాంతీయ సమావేశ కార్యక్రమం జవాబిస్తుంది. “మేలు చేత కీడును జయించుము” అన్నది సమావేశాంశం. (రోమా. 12:21) సమావేశ కార్యక్రమంలో ఏయే ప్రసంగాలుంటాయో పరిశీలిద్దాం.
జిల్లా పైవిచారణకర్త, “మేలుచేత కీడును జయించడానికి బలపర్చబడ్డాం,” “అతినమ్మకం విషయంలో జాగ్రత్త!,” “త్వరలోనే దుష్టత్వమంతా లేకుండా పోతుంది!,” “లోకాన్ని జయించడానికి మన విశ్వాసాన్ని బలపర్చుకోవడం” వంటి ప్రసంగాలనిస్తాడు. ప్రాంతీయ పైవిచారణకర్త, రోమా 13:11-13 ఆధారంగా “ఇది నిద్ర మేల్కొనాల్సిన వేళ!” మరియు సామెతలు 24:10 ఆధారంగా “శ్రమదినమున కృంగిపోకండి” అనే అంశాలపై ప్రసంగిస్తాడు. అంతేకాక మనం, ప్రాంతీయ పైవిచారణకర్త ఇచ్చే “ప్రాంతీయ అవసరాలపట్ల శ్రద్ధ వహించడం” అనే ప్రసంగం కోసం కూడా ఎదురుచూస్తాం. “పయినీరు సేవ ద్వారా మీరీ ‘పరిచర్యలో పనికలిగి’ ఉండగలరా?” అనే మరో ప్రోత్సాహకరమైన ప్రసంగం కూడా ఉంటుంది. రెండు గోష్ఠిల్లో మొదటిది “అపవాది తంత్రములను ఎదిరించండి.” సాంకేతిక పరిజ్ఞానం, వినోదం, విద్య వంటి రంగాల్లో అపవాది కుతంత్రాలను గుర్తించి, వాటిని తిరస్కరించేందుకు ఈ గోష్ఠి సహాయం చేస్తుంది. “ఈ ఆపద్దినాన్ని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకోండి” అనే గోష్ఠి ఎఫెసీయులు 6:10-18లో ఇవ్వబడిన ప్రేరేపిత ఉపదేశాన్ని మరింత పూర్తిగా ఎలా అన్వయించుకోవాలో మనకు చూపిస్తుంది.
కీడును జయించడానికి, రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి సూటిగా సంబంధముంది. (ప్రక. 12:17) సాతాను యెహోవాసాక్షులపై ఎడతెరపి లేకుండా దాడి చేస్తాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు! (యెష. 43:10, 12) కానీ మనం “మేలుచేత కీడును జయిస్తూ ఉండాలి” అని నిశ్చయించుకున్నాం కాబట్టి అపవాది చిత్తుగా ఓడిపోతాడు. ఈ ప్రాంతీయ సమావేశపు రెండు రోజుల కార్యక్రమం నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకోండి.