మన క్షేత్రంలో యోగ్యులైన వారిని వెదకడం
1 జనవరి 2008 మన రాజ్య పరిచర్య సంచికలో ప్రత్యేకంగా ఇవ్వబడిన మధ్యపేజీ మన సందేశంపట్ల దేశంలో మారుతున్న ప్రజల వైఖరిని గురించి మనలను అప్రమత్తులను చేసింది, అంతేకాక, మనం దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి సహాయపడే దేవుని వాక్యంలోని సూత్రాలను మనకు తెలియజేసింది. మీ క్షేత్రంలో ప్రజల వైఖరి మారడం గమనించారా? మనల్ని వ్యతిరేకించేవారిలో అనేకమంది, మనం బలవంతంగా లేదా ఒప్పించి మతమార్పిడి చేయిస్తున్నామని అనుకుంటారు. అంతేకాక వారికి మతావేశపరులైన క్రైస్తవమత ప్రచారకులపట్ల ఉన్న ప్రతికూల దృక్పథమే మనపట్ల కూడా ఉండవచ్చు. అందువల్లే అల్లరిమూక గుమిగూడి సహోదర, సహోదరీలను అరెస్టు చేయిస్తున్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలా చూసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు? ఒక మార్గమేమిటంటే, సందర్భానికి తగ్గట్టుగా మనం మాట్లాడే విధానాన్ని మలచుకోవడం.
2 ప్రజలు పిలువకుండా మనమే చొరవతీసుకొని వారివద్దకు వెళతాం కాబట్టి మనం ఇంటింటి సేవలో, దుకాణాల్లో లేదా అనియతంగా సాక్ష్యమిచ్చేటప్పుడు మనం ముందుగా మాట్లాడుతున్న వ్యక్తికి నిజంగా ఆసక్తి ఉందా, అతను హింసాత్మకంగా మారే లేదా మనమీద దాడిచేయడానికి గుంపును పోగుచేసే వ్యక్తిలా ఉన్నాడా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఇలా నిర్ధారించుకోవడం చాలా అవసరం, మీ క్షేత్రంలో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లైతే ఇలా చేయడం మరింత ప్రాముఖ్యం. అలా మనం అనవసరమైన వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడవచ్చు, దేవుని వాక్యం ప్రోత్సహించేది కూడా అదే.—లూకా 10:5, 6.
3 ఆధ్యాత్మికంగా ఎవరికి సహాయం అవసరమో మనమెలా గుర్తించవచ్చు? ఒక విషయాన్ని లేదా ఒక ప్రశ్నను లేవదీసి, వారు ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి. బైబిలు గురించి మాట్లాడడంగానీ లేదా ప్రచురణను అందివ్వడంగానీ చేయకుండా సాధారణ విషయాల గురించి కొద్దిసేపు మాట్లాడండి. సాధారణంగా, మీరు క్రైస్తవులని వారికి చెప్పకపోయినా, మీరు మాట్లాడే వ్యక్తి ఎలాంటివాడో గ్రహించగలరు. గృహస్థుడు సంభాషణను కొనసాగించాలని అనుకుంటున్నాడో లేదో మాటల మధ్యలో ఒకసారి అడిగి తెలుసుకోవడం మంచిది. అతనికి ఇష్టంలేదు అని మీకు స్పష్టంగా అనిపించినా లేదా ఆ విషయాన్ని అతనే మీకు చెప్పినా మనం సంభాషణను కొనసాగించకూడదు. (మత్త. 7:6) వెంటనే స్నేహపూర్వకంగా సంభాషణను ఆపేసి, అక్కడనుండి వెళ్ళిపోవడం మంచిది.
4 మనం పరిచర్యలో ఇప్పుడు చేసుకోబోయే మార్పులనుబట్టి భవిష్యత్తులో వచ్చే మన రాజ్య పరిచర్యలోని ప్రతిపాదనల్లో కూడా మార్పులు ఉంటాయి. అయితే మనం ఎంతవరకు మార్పులు చేసుకోవాలనేది మన స్థానిక క్షేత్రంలో వ్యతిరేకత ఎంతగా ఉంది అనేదానిపై ఆధారపడివుంటుంది కాబట్టి ఈ విషయమై సంఘంతో చర్చించమని పెద్దలసభ ప్రోత్సహించబడింది.
5 యేసు తన అపొస్తలులను పరిచర్యకు పంపించేముందు వారితో ఇలా చెప్పాడు: “మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచే[యుడి].” (మత్త. 10:11) మన సందేశానికి వారు ప్రతిస్పందించే తీరునుబట్టి అందరూ యోగ్యులు కారని తెలుస్తుంది. కొందరు కోపంగా ప్రతిస్పందిస్తారు. ఈ విషయాన్ని ముందుగానే ఊహించి యేసు మత్తయి 10:12-14 లోని ఉపదేశాన్నిచ్చాడు. ఈ ఉపదేశానికి అనుగుణంగా, మరింత కోపాన్ని తెప్పించే సంభాషణను కొనసాగించే బదులు సమాధానంతో అక్కడనుండి వెళ్ళిపోవాలి. మనం పూర్తినమ్మకంతో విషయాలను యెహోవా న్యాయమైన తీర్పుకు విడిచిపెట్టవచ్చు.