‘జ్ఞానులవలె నడుచుకోండి’
1 యేసు నన్ను వెంబడించమని నలుగురు జాలర్లకు చెప్పినప్పుడు, వారు నిర్ణయం తీసుకోవడానికి తటపటాయించకుండా ‘వెంటనే ఆయనను వెంబడించారు.’ (మత్త. 4:18-22) అదే విధంగా, తార్సువాడైన సౌలు క్రైస్తవత్వాన్ని స్వీకరించి చూపును తిరిగిపొందినప్పుడు, ఆయన కూడా ‘వెంటనే సమాజమందిరములలో యేసు గురించి ప్రకటిస్తూ వచ్చాడు.’ (అపొ. 9:20) సమయం ముందుకు సాగుతూనే ఉంటుంది, అది ఒకసారి చేజారిపోయిందంటే ఇక శాశ్వతంగా చేజారిపోయినట్లే. అందుకే, మనం మన సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో ‘జ్ఞానులవలె నడుచుకోవడం’ ప్రాముఖ్యం.—ఎఫె. 5:15, 16.
2 అనూహ్య సంఘటనలు: యెహోవాను ఆరాధించడానికి నేడు మనకున్న అవకాశాలు రేపుండకపోవచ్చు. (యాకో. 4:14) ‘అనూహ్య’ సంఘటనలను ఎవరూ తప్పించుకోలేరు. (ప్రసం. 9:11, NW) అంతేకాక, మనమందరం వృద్ధులమౌతున్నాం, యెహోవా సేవలో మనం చేయగలిగేదాన్ని మన వృద్ధాప్య “దుర్దినములు” పరిమితం చేయడాన్ని ఈ ప్రస్తుత విధానంలో మనం తప్పించుకోలేం. (ప్రసం. 12:1) కాబట్టి దేవునికి సమర్పించుకోవడాన్ని వాయిదావేయడం లేదా ప్రస్తుతం మనకు సాధ్యమైనమేరకు మన పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి ముందు అనుకూలమైన పరిస్థితుల కోసం వేచివుండడం జ్ఞానయుక్తం కాదు. (లూకా 9:59-62) అబ్రాహాము తన జీవితాన్ని జ్ఞానయుక్తంగా, యెహోవా సేవకే అంకితం చేశాడు కాబట్టి, ఆయన తన వృద్ధాప్యంలో ప్రశాంతంగా, సంతృప్తికరంగా జీవించి “మంచి ముసలితనమున” చనిపోయాడు.—ఆది. 25:8.
3 కాలము సంకుచితమైనది: మనకున్న సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలని కూడా మనం కోరుకుంటాం, ఎందుకంటే ‘కాలము సంకుచితమైనది.’ (1 కొరిం. 7:29-31) త్వరలోనే ఈ పాత విధానం అంతమౌతుంది. “భూమి పైరు” కోయబడే సమయంలో గొర్రెల్లాంటి వ్యక్తులను సమకూర్చే గొప్ప పనిలో పాల్గొనే అవకాశాలు ఉండవు. (ప్రక. 14:15) పరిచర్యలో ఎక్కువగా ఉపయోగించే సమయాన్ని జీవితపు చింతలు, అవరోధాలు దోచుకోనివ్వకుండా మనం జాగ్రత్తపడాలి. (లూకా 21:34, 35) కోత పనిలో మనం చాలా చురుగ్గా పాల్గొన్న గతాన్ని గుర్తుచేసుకోవడం మనకెంత సంతృప్తినిస్తుందో కదా!
4 మనకు లభించే ఆనందించదగ్గ సేవాధిక్యతలను జారవిడుచుకోకుండా మనమెల్లప్పుడూ జాగ్రత్తపడాలి. “‘నేడు’ అనబడు సమయముండగానే,” యెహోవా సేవలో మనం చేయగల్గినదంతా చేయాలని తీర్మానించుకుందాం. (హెబ్రీ. 3:13) అలా చేయడం ద్వారా మనం జ్ఞానులమని నిరూపించుకుంటాం ఎందుకంటే, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.”—1 యోహా. 2:17.