యెహోవా సేవలో ప్రయాసపడేందుకు మనం సంతోషిస్తాం!
1 అపొస్తలుడైన పౌలు తన క్రైస్తవ పరిచర్యను నిర్వర్తించేందుకు తనను తాను ‘వ్యయపరచుకోవడానికి’ సంతోషించాడు. (2 కొరిం. 12:15) అదే విధంగా నేడు, అనేకమంది క్రైస్తవులు శ్రద్ధగా పయినీరు సేవ చేస్తున్నారు. బరువైన కుటుంబ బాధ్యతలున్న ఇతరులు, తమకు ఎన్నో పనులున్నా, ప్రతీవారం పరిచర్యలో పాల్గొనేందుకు సమయం కేటాయిస్తున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరికొంతమంది రాజ్యసంబంధ విషయాలకు మద్దతునివ్వడానికి తమకున్న పరిమిత శక్తిని ఉపయోగిస్తున్నారు. వయసుతో, పరిస్థితులతో నిమిత్తం లేకుండా యెహోవా సేవలో ప్రయాసపడే యెహోవా ప్రజలను చూడడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా!
2 పొరుగువారిపట్ల ప్రేమ: యెహోవా సేవలో మనం చేయగలిగినంత చేయడంవల్ల, దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమను కనపర్చడంవల్ల మనకు నిర్మలమైన మనస్సాక్షి లభిస్తుంది. పౌలు సువార్తను ప్రకటించడంలో తన శక్తినంతా ధారపోశాడు కాబట్టి సంతోషంగా ఇలా చెప్పగలిగాడు: “మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.” (అపొ. 20:24, 26; 1 థెస్స. 2:8) మన పరిస్థితులు అనుమతించినంతమేరకు పరిచర్యలో పాల్గొనడం, మనమీదకు రక్తాపరాధం రాకుండా చేస్తుంది.—యెహె. 3:18-21.
3 ఇతరులకు సహాయం చేయడానికి ప్రయాసపడడం మనకు సంతోషాన్నిస్తుంది. (అపొ. 20:35) ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “రోజంతా యెహోవా సేవలో గడిపి సాయంకాలానికల్లా ఇంటికొచ్చేసరికి నాకు అలసటగా ఉండడం వాస్తవమే. అయినా, నేను సంతోషంగానే ఉన్నాను. నానుండి ఎవరూ దూరంచేయలేని ఆనందాన్ని ఇచ్చినందుకు యెహోవాకు నేను కృతజ్ఞుణ్ణి.”
4 దేవునిపట్ల ప్రేమ: యెహోవా సేవలో ప్రయాసపడడానికిగల ప్రాముఖ్యమైన కారణమేమిటంటే, అలా చేయడం మన పరలోకపు తండ్రిని సంతోషపరుస్తుంది. దేవునిపట్ల మనకున్న ప్రేమ, మనమాయన ఆజ్ఞలను పాటించేలా అంటే ప్రకటించడం, శిష్యులను చేయడం వంటి ఆజ్ఞలను పాటించేలా మనలను పురికొల్పుతుంది. (1 యోహా. 5:3) ప్రజలు ఉదాసీనంగా ఉన్నా లేదా వ్యతిరేకించినా యెహోవా కోసం కష్టపడి పనిచేయడంలో కొనసాగడానికి మనం సంతోషిస్తాం.
5 పరిచర్యలో వెనుకబడడానికి ఇది సమయం కాదు. మనం కోతకాలంలో జీవిస్తున్నాం. (మత్త. 9:37) కోతకాలంలో రైతు సాధారణంగా ఎక్కువ గంటలు పనిచేస్తాడు, ఎందుకంటే పంట పాడవకముందే దానిని పోగుచేయడానికి ఆయనకు చాలా తక్కువ సమయముంటుంది. ఆధ్యాత్మిక కోతపనికి కూడా పరిమిత సమయమే అనుమతించబడింది. కాబట్టి మనం జీవిస్తున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎడతెగక ఉత్సాహంగా పరిచర్యలో ప్రయాసపడడంలో కొనసాగుదాం.—లూకా 13:24;1 కొరిం. 7:29-31.