దేవుని మార్గంలో నడవడాన్ని దీనులకు బోధించండి
1. శిష్యులను చేయడంలో ఏమి ఇమిడివుంది?
1 మొదటి శతాబ్దపు క్రీస్తు శిష్యులు ‘మార్గమునకు’ చెందినవారని పిలువబడ్డారు. (అపొ. 9:2) నిజ క్రైస్తవత్వంలో ఒకవ్యక్తి జీవితవిధానమంతా ఇమిడివుంది. (సామె. 3:5, 6) కాబట్టి మనం బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు బైబిలు సిద్ధాంతాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం ఇవ్వడం మాత్రమే సరిపోదు. యెహోవా మార్గంలో నడిచేందుకు కూడా బైబిలు విద్యార్థులకు సహాయం చేయాలి.—కీర్త. 25:8, 9.
2. దేవుని ఆజ్ఞలను అనుసరించేందుకు ఒక బైబిలు విద్యార్థిని ఏమి పురికొల్పుతుంది?
2 యెహోవాపట్ల, యేసుపట్ల ప్రేమ: అపరిపూర్ణ మానవులు తమ ఆలోచనలను, వైఖరిని, సంభాషణను, ప్రవర్తనను దేవుని చిత్తానుసారంగా మలుచుకోవడం ఎంత కష్టమో కదా! (రోమా. 7:21-23; ఎఫె. 4:22-24) అయితే, దీనులకు దేవునిపట్ల, ఆయన కుమారునిపట్ల ఉండే ప్రేమ, ఆ సవాలును అంగీకరించడానికి పురికొల్పుతుంది. (యోహా. 14:15; 1 యోహా. 5:3) మన బైబిలు విద్యార్థులు ఈ ప్రేమను పెంపొందించుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
3. యెహోవాపట్ల, యేసుపట్ల ప్రేమ పెంపొందించుకోవడానికి విద్యార్థులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
3 యెహోవా వ్యక్తిత్వం తెలుసుకోవడానికి మీ విద్యార్థికి సహాయం చేయండి. ఒక సహోదరుడు ఇలా వివరించాడు: “ప్రజలు అపరిచిత వ్యక్తిని ప్రేమించలేరు, కాబట్టి నేను అధ్యయన ఆరంభంలో నుండే వారికి బైబిలు నుండి దేవుని పేరు బోధిస్తాను, అంతేగాక యెహోవా గుణాలను నొక్కిచూపించడానికి అవకాశాల కోసం చూస్తాను.” యేసు మాదిరిని నొక్కిచెప్పడం అలా చేయడానికి శ్రేష్ఠమైన మార్గం. (యోహా. 1:14; 14:9) అంతేకాక, దేవుడు, ఆయన కుమారుడు ప్రదర్శించిన అద్భుతమైన లక్షణాల గురించి విద్యార్థి ధ్యానించడానికి సహాయం చేసేందుకు బైబిలు బోధిస్తోంది పుస్తకంలో ప్రతీ అధ్యాయం చివర ఉండే పునఃసమీక్ష బాక్సును ఉపయోగించండి.
4. (ఎ) చాలామంది విద్యార్థులకు ప్రకటించడం ఎందుకు సవాలుగా ఉంటుంది? (బి) మన బైబిలు విద్యార్థులు క్రైస్తవ పరిచర్యలో తమ మొదటి అడుగులు వేసేందుకు మనమెలా సహాయం చేయవచ్చు?
4 మాదిరిద్వారా బోధించండి: బోధకులముగా, మార్గనిర్దేశకులముగా మనం మన క్రియల ద్వారా దేవుని మార్గంలో నడవడమంటే ఏమిటో ఇతరులకు చూపిస్తాం. (1 కొరిం. 11:1) ఉదాహరణకు, చాలామంది బైబిలు విద్యార్థులకు అపరిచితులతో తమ నమ్మకాల గురించి చెప్పే అలవాటు లేకపోవచ్చు. కాబట్టి ప్రకటించే, శిష్యులను చేసే పనిలో పాల్గొనడానికి వారికి అవసరమయ్యే ప్రేమ, విశ్వాసం, ధైర్యం పెంపొందించుకోవడంలో వారికి సహాయం చేయడానికి మనకు ఓర్పు, నైపుణ్యం అవసరంకావచ్చు. (2 కొరిం. 4:13; 1 థెస్స. 2:2) మన విద్యార్థులకు నిర్దేశం ఇవ్వాలనే కోరిక, క్రైస్తవ పరిచర్యలో వారు తమ మొదటి అడుగులు వేస్తుండగా వారికి తోడుగా ఉండేందుకు మనల్ని పురికొల్పుతుంది.
5. దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో ఇమిడివున్నదానిని ఆచరించడానికి విద్యార్థులకు మంచి మాదిరి ఎలా సహాయం చేస్తుంది?
5 క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఇతర ప్రాముఖ్యమైన అంశాల్లో కూడా మీరుంచే మాదిరి మీ విద్యార్థులకు ఉపదేశాన్నివ్వగలదు. మీరు అనారోగ్యులను సందర్శిస్తున్నప్పుడు, సంఘంలో ఇతరులను హృదయపూర్వకంగా పలకరిస్తున్నప్పుడు వారు ప్రేమను క్రియల్లో చూస్తారు. (యోహా. 15:12) మీరు రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో భాగం వహిస్తున్నప్పుడు లేదా ఇతరులకు సహాయకరంగా ఉండే పనులు చేస్తున్నప్పుడు సేవ ఎలా చేయాలో వారికి బోధిస్తారు. (యోహా. 13:12-15) మీరు సరళమైన జీవనవిధానాన్ని గడుపుతున్నట్టు గమనించినప్పుడు వారు ‘రాజ్యమును మొదట వెదకడం’ అంటే ఏమిటో గ్రహిస్తారు.—మత్త. 6:33.
6. ఇతరులు యెహోవాను సేవించేందుకు సహాయం చేయడంవల్ల ఏమి లభిస్తుంది?
6 దేవుని వాక్యంనుండి ఇతరులకు బోధించడానికి, శిష్యులను చేయడానికి చాలా కృషి అవసరం. కానీ దీనులు “సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని” చూడడంలో ఎంత ఆనందం ఉందో కదా!—3 యోహా. 4.