ప్రకటించేందుకు అవకాశాలను సృష్టించుకోండి
1 క్రైస్తవ సంఘంలో, వివిధ రకాల జీవన పరిస్థితుల్లోవున్నవారు ఉన్నారు. అయినా, మనమందరమూ యెహోవాను స్తుతించాలనే నిర్ణయం విషయంలో ఐక్యంగా ఉన్నాం. (కీర్త. 79:13) ఒకవేళ అనారోగ్యంవల్ల లేదా ఇతర క్లిష్ట పరిస్థితులవల్ల మనం సువార్త ప్రకటించడంలో అంతగా పాల్గొనలేకపోతున్నట్లయితే, ప్రకటించే అవకాశాల్ని మనమెలా సృష్టించుకోవచ్చు?
2 దైనందిన కార్యకలాపాల్లో: యేసు, ప్రతీదినం ప్రజలను కలుసుకోవడానికి దొరికే అవకాశాలను సాక్ష్యమివ్వడానికి ఉపయోగించుకునేవాడు. సుంకపు మెట్టునొద్ద నుండి వెళ్తున్నప్పుడు మత్తయితో, ప్రయాణిస్తున్నప్పుడు జక్కయ్యతో, విశ్రమించే సమయంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడాడు. (మత్త. 9:9; లూకా 19:1-5; యోహా. 4:6-10) మన దైనందిన కార్యకలాపాల్లో మనం కూడా మామూలు సంభాషణను సాక్ష్యమిచ్చేందుకు అవకాశంగా మార్చుకోవచ్చు. బైబిలును, కొన్ని కరపత్రాలను లేదా బ్రోషురులను ఎప్పుడూ మన దగ్గర ఉంచుకున్నట్లయితే, మన నిరీక్షణ గురించి మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉంటాం.—1 పేతు 3:15.
3 మీ అంగవైకల్యంవల్ల మీరు ఇంటింటి పరిచర్యలో ఎక్కువగా భాగం వహించలేకపోతున్నారా? అలాగైతే, మిమ్మల్ని సందర్శించే వైద్య సిబ్బందికి, మిమ్మల్ని కలిసే ఇతరులకు సాక్ష్యమిచ్చే అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి. (అపొ. 28:30, 31) మీ పరిస్థితులు మిమ్మల్ని తరచూ ఇంటిపట్టునే ఉంచుతున్నట్లయితే, టెలిఫోన్ ద్వారా లేదా ఉత్తరాలు వ్రాయడం ద్వారా సాక్ష్యమివ్వడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒక సహోదరి సాక్షులు కాని తన కుటుంబ సభ్యులకు క్రమంగా ఉత్తరాలు వ్రాస్తూ ఉంటుంది. తన ఉత్తరాల్లో బైబిలులోని ప్రోత్సాహకరమైన తలంపులను, సాక్ష్యమిచ్చేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలను కూడా చేర్చి వ్రాస్తుంది.
4 ఉద్యోగస్థలంలో లేదా పాఠశాలలో: యెహోవాను స్తుతించాలనే మన కోరిక, మనం మన ఉద్యోగస్థలంలో లేదా పాఠశాలలో సహితం సత్యపు విత్తనాలు విత్తేందుకు అవకాశాలను సృష్టించుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎనిమిది సంవత్సరాల ఒక ప్రచారకుడు తేజరిల్లు!లో చంద్రుని గురించి చదివినదానిని తన తరగతిలో ఉన్నవారితో చెప్పాడు. ఆ సమాచారాన్ని ఎక్కడ కనుగొన్నాడో తెలుసుకున్న తరువాత, వాళ్ళ టీచరు కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమంగా తీసుకోవడం ఆరంభించింది. మన ఉద్యోగస్థలంలోనైతే, ఇతరులు చూడగలిగే చోట బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పెడితే వారు ప్రశ్నలు అడగడానికి, మనం సాక్ష్యమివ్వడానికి అది మంచి అవకాశాన్నిస్తుంది.
5 మీ దైనందిన కార్యకలాపాల్లో సాక్ష్యమిచ్చే అవకాశాలను సృష్టించుకోవడానికిగల వివిధ మార్గాల గురించి మీరు ఆలోచించగలరా? మన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ప్రతీదినం ‘దేవునికి స్తుతియాగము చేయడానికి’ కృషి చేద్దాం.—హెబ్రీ. 13:15.