అన్ని కాలాలకు ఉపయోగపడే సందేశం ఉన్న వీడియో
దేవునిపై నమ్మకముంచిన దావీదు అనే వీడియోలోని ముఖ్యాంశం ఏమిటి? దావీదులాగే మనం కూడా యెహోవా మీద నమ్మకం ఉంచాలన్నదే దాని ముఖ్యాంశం. (కీర్త. 91:2) దావీదు జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలను చిత్రంలో చూడడం ద్వారా ఆయన ఆదర్శం నుండి నేర్చుకోవడానికి పిల్లలకూ పెద్దలకూ సహాయం లభిస్తుంది. (కీర్త. 31:14) మనకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ డీవీడీలో “వీడియో క్విజ్”తోపాటు అనేక “లెర్నింగ్ ఆక్టివిటీస్” కూడా ఉన్నాయి.
వీడియోను చూసి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: (1) యెహోవా మరింత మంచి రాజును ఎందుకు ఎన్నుకున్నాడు? (1 సమూ. 15:10, 11; 16:1) (2) ఆయన దావీదు సహోదరులలో వేరే ఎవ్వరినీ ఎందుకు ఎన్నుకోలేదు? (1 సమూ. 16:6, 7) (3) దావీదు సితార వాయించడాన్ని సౌలు ఎందుకు ఇష్టపడ్డాడు? (1 సమూ. 16:14-23) (4) గొల్యాతు ఎవరు? (1 సమూ. 17:4-10) (5) దావీదు గొల్యాతుతో ఎందుకు పోరాడాలనుకున్నాడు? (1 సమూ. 17:23, 24, 36, 37) (6) యోనాతాను ఎవరు? (1 సమూ. 14: 1) (7) సౌలు ఏ సమయంలో దావీదుకు బద్ద శత్రువు అయ్యాడు? (1 సమూ. 18:25-29) (8) దావీదు సౌలును ఎందుకు చంపలేదు? (1 సమూ. 26:7-11) (9) సౌలు ఎలా చనిపోయాడు? (1 సమూ. 31:1-6) (10) యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఎలా స్పందించాడు? (2 సమూ. 1:11, 12) (11) యెహోవా దావీదుకు ఏమని వాగ్దానం చేశాడు? (2 సమూ. 7:12, 13, 16) (12) దావీదు ఎలాంటి గంభీరమైన తప్పిదం చేశాడు? (2 సమూ.11:1-5, 14-17) (13) తాను చేసినదానికి ఎంతో విచారపడుతున్నానని దావీదు ఎలా చూపించాడు? (కీర్త. 51) (14) దావీదు యౌవనుడైన సొలొమోనుకు ఏ పాఠాలను బోధించాడు? (1 రాజు. 2:1-4; 1 దిన. 22:6-13; 28:9, 10) (15) యేసు పరిపాలన దావీదుకు, యోనాతానుకు, మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?—యెష. 11:6-9; యోహా. 11:25, 26.
ఇప్పుడు, ఇలా ధ్యానించండి: దావీదు దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని వ్యక్తిగతంగా మీరు ఎలా అనుకరించవచ్చు?
తల్లిదండ్రులారా, దావీదులాగే దేవుని మీద నమ్మకం ఉంచడంలో ఉన్న శాశ్వత ప్రాముఖ్యతను మీ పిల్లలకు బోధించండి.—కీర్త. 56:11.