యెహోవాకు మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవాటిని సమర్పించడం
1 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆయనకు అర్పించబడే జంతువులు ‘దోషములేకుండా’ ఉండాలని స్పష్టం చేసింది. కళంకమున్న జంతువు అంగీకరింపబడేదికాదు. (లేవీ. 22:18-20; మలా. 1:6-9) అంతేకాదు, బలి అర్పించినప్పుడు క్రొవ్వు అంతా అంటే శ్రేష్ఠమైన భాగమంతా యెహోవాకే చెందేది. (లేవీ. 3:14-16) ఇశ్రాయేలీయుల తండ్రిగా, యజమానిగా అత్యంత శ్రేష్ఠమైనదాన్ని పొందేందుకు యెహోవా అర్హుడు.
2 ప్రాచీన కాలాల్లో చూపించినట్లే, నేడు మనం సమర్పించేవాటి నాణ్యత విషయంలో దేవుడు ఎంతో ఆసక్తి చూపిస్తాడు. మన సేవ యెహోవాపట్ల తగిన భయభక్తులను ప్రతిబింబించాలి. వ్యక్తులనుబట్టి పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నది నిజమే. అయినా మనం మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవాటినే సమర్పిస్తున్నామని నిర్ధారించుకునేందుకు మనల్ని మనం పరిశీలించుకోవడం ప్రాముఖ్యం.—ఎఫె. 5:10.
3 పూర్ణహృదయంతో చేసే సేవ: మన పరిచర్య యెహోవాకు ఘనతను తేవాలి, శ్రోతల హృదయాలను స్పృశించాలి అంటే అది యాంత్రికంగా చేసే సేవలా ఉండకూడదు. మన దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ మనం మాట్లాడే మాటలు, కృతజ్ఞతతో నిండిన మన హృదయాల్లో నుండి పొంగుకురావాలి. (కీర్త. 145:7) అలా మన హృదయాలు కృతజ్ఞతతో నిండివుండాలంటే వ్యక్తిగత బైబిలు పఠనానికి, అధ్యయనానికి ఒక మంచి కార్యక్రమాన్ని పాటించడం ఎంతో అవసరం.—సామె. 15:28.
4 యెహోవాకు మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవాటిని సమర్పించడంలో, ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమను అనుకరించడం కూడా ఒక భాగమే. (ఎఫె. 5:1, 2) ప్రజల పట్ల మనకున్న ప్రేమ, మనం జీవాన్నిచ్చే సత్య సందేశాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోవడానికి ప్రయత్నించేందుకు మనల్ని పురికొల్పుతుంది. (మార్కు 6:34) అది మనం మాట్లాడేవారి పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించేందుకు మనల్ని పురికొల్పుతుంది. అది మనం వారిని మొదటిసారి కలుసుకున్న తర్వాత కూడా వారి గురించి ఆలోచించేలాచేస్తూ, వారిని పునర్దర్శించేలా మనలను ప్రోత్సహిస్తుంది. అది వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేందుకు మనకు సాధ్యమైనదంతా చేసేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది.—అపొ. 20:24; 26:28, 29.
5 “స్తుతియాగము”: యెహోవాకు మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవాటిని సమర్పించడానికి మరోమార్గం ఏమిటంటే పరిచర్యలో మనం పట్టుదలగా కృషి చేయడం. మనం చక్కని వ్యవస్థీకరణతో మన చేతిలో ఉన్న పనిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, మనకు అందుబాటులోవున్న సమయంలోనే మనమెంతో మంచిని సాధించగలం. (1 తిమో. 4:10) బాగా సిద్ధపడితే మనం స్పష్టంగా దృఢనమ్మకంతో మాట్లాడగలుగుతాము, తత్ఫలితంగా సానుకూలమైన ప్రతిస్పందన లభించే సాధ్యత ఎక్కువగా ఉంటుంది. (సామె. 16:21) మనం ఇతరులతో సువార్తను పంచుకొంటుండగా, మన హృదయపూర్వకమైన మాటలు “స్తుతియాగము” అని సబబుగానే పిలవబడుతాయి.—హెబ్రీ. 13:15.