దైవిక జ్ఞానానికున్న అత్యున్నత విలువ
1 నేడు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించే ప్రయత్నాలపై యెహోవాసాక్షులు దృష్టి సారించాలని కొందరు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులు మనం చేసే బైబిలు విద్యా పనికున్న అతి శ్రేష్ఠమైన విలువను గ్రహించడంలో విఫలమవుతున్నారు. అది ‘హింసాకొయ్యను గురించిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి’ అని అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగానే ఉంది. (1 కొరిం. 1:18, NW) నిజానికి, క్రైస్తవ పరిచర్య నేడు భూమిపై జరిగించబడుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని అని మనకు తెలుసు.
2 ఇప్పుడే మెరుగైన జీవితం: మానవాళి సమస్యలను పరిష్కరించడానికి మానవులు చేసిన ప్రయత్నాలు చాలా పరిమితమైన ఫలితాలను మాత్రమే సాధించాయి. నేరం వ్యాపించడాన్ని చట్టాలు అరికట్టలేదు. శాంతి ఒప్పందాలు, శాంతి పరిరక్షక దళాలు యుద్ధాన్ని అంతమొందించలేదు. సామాజిక కార్యక్రమాలు బీదరికాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యాయి. (కీర్త. 146:3, 4; యిర్మీ. 8:9) దీనికి భిన్నంగా రాజ్య సందేశం, దేవునికి ఆమోదయోగ్యమైన నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి లక్షలాదిమంది ప్రజలకు సహాయం చేస్తూ వారి జీవితాలను మార్చివేసింది. (రోమా. 12:2; కొలొ. 3:9, 10) అలా మారడం ద్వారా, వారు ఇప్పుడే మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.—1 తిమో. 4:8.
3 ఒక అద్భుతమైన భవిష్యత్తు: దైవిక జ్ఞానం మనం ప్రస్తుత జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయం చేయడమే కాకుండా భవిష్యత్తు కోసం సమర్థవంతంగా ప్రణాళిక వేసుకోవడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. (కీర్త. 119:105) ప్రస్తుత విధానాన్ని మార్చే వ్యర్థ ప్రయత్నాలు చేయకుండా అది మనలను ఆపుతోంది. (ప్రసం. 1:15; రోమా. 8:20) మనం కేవలం భ్రమతో నిండిన లక్ష్యాలను సాధించడానికి మన జీవితాలను వ్యర్థం చేసుకోవడంలేదు కాబట్టి మనం ఎంత కృతజ్ఞులమో కదా! బదులుగా మనం నీతి నివసించబోయే ‘క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి’ విషయమై యెహోవా చేసిన ఖచ్చితమైన వాగ్దానానికి సంబంధించి కృషి చేయడంపై అవధానం నిలుపుతాం. యెహోవా తీర్పు దినం వచ్చినప్పుడు, దైవిక జ్ఞానంపై ఆధారపడినవారు సరైన ఎంపిక చేసుకున్నారనేది ఖచ్చితంగా నిరూపించబడుతుంది.—2 పేతు. 3:10-13; కీర్త. 37:34.
4 ‘ఈ లోక జ్ఞానములో’ పూర్తిగా మునిగిపోయిన వారికి దైవిక జ్ఞానం పనికిరానిదిగా కనిపించవచ్చు, అయితే నిజానికి కేవలం అది మాత్రమే అనుసరించదగ్గ ఆచరణాత్మక విధానం. (1 కొరిం. 1:21; 2:6-8) అందువల్ల, ‘అద్వితీయ జ్ఞానవంతుడైన’ దేవుని సంబంధిత సందేశాన్ని భూవ్యాప్తంగా ప్రకటించడంలో మనం కొనసాగుదాం.—రోమా. 16:25-27.