అంగవైకల్యమున్నా ఫలవంతమైన సేవ చేయడం
1 యెహోవా సాక్షుల్లో అంగవైకల్యంగల చాలామందిలో మీరూ ఒకరైనా, పరిచర్యలో మీరు ఫలదాయకంగా ఉండగలరు. వాస్తవానికి మీ పరిస్థితి మీరితరులకు సాక్ష్యమిచ్చి, వారిని ప్రోత్సహించే ప్రత్యేకావకాశాల్ని మీకివ్వగలదు.
2 సాక్ష్యమిచ్చే అవకాశాలు: అంగవైకల్యంతో పోరాడుతున్న అనేకులు పరిచర్యలో సంపూర్తిగా భాగం వహిస్తున్నారు. ఉదాహరణకు, ఆపరేషన్ కారణంగా అటుఇటు తిరుగలేని, మాట్లాడలేని తీవ్ర పరిస్థితి ఏర్పడిన ఒక సహోదరి, రద్దీగావుండే ఫుట్పాత్ దగ్గర తన భర్త కారు ఆపితే పత్రికలు అందించేపని తాను చేయగల్గుతున్నట్టు కనుగొంది. ఒక సందర్భంలో ఆమె కేవలం రెండు గంటల్లో 80 పత్రికలు అందించింది. మీ ప్రత్యేక పరిస్థితి ఇతరత్రా కలవడానికి కష్టమయ్యే వారిని కలుసుకొనేలా చేయవచ్చు. అట్లయితే, వారినే మీ ప్రత్యేక సేవా ప్రాంతంగా దృష్టించండి.
3 మీ ప్రకటనా పనెంతో ఫలదాయకంగా ఉండగలదు! మీ కృతనిశ్చయాన్ని, మీ జీవితంమీద బైబిలు సత్యం చూపిన మంచి ప్రభావాన్ని ఇతరులు గమనిస్తుండగా, వారు రాజ్య సందేశానికి ఆకర్షితులు కావచ్చు. అంతేకాకుండా, గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వారిని మీరు కలిసినప్పుడు దేవుని వాక్యంనుండి ఓదార్పునిచ్చేందుకు మీ జీవితానుభవం మిమ్మల్ని సంసిద్ధులను చేస్తుంది.—2 కొరిం. 1:4.
4 మీరు ఇతరులను బలపర్చగలరు: 37 సంవత్సరాలపాటు కృత్రిమ ఊపిరితిత్తులకు పరిమితమైనా, 17 మందికి బైబిలు సత్యాన్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం పొందడానికి సహాయంచేసిన లారెల్ జీవితగాథ చదివి మీరు ప్రోత్సహింపబడలేదా? అదేవిధంగా, యెహోవా సేవలో తీవ్రంగా శ్రమించేందుకు మీ మాదిరి తోటి విశ్వాసుల్ని పురికొల్పగలదు.
5 మీకు ఇష్టమైనంతగా పరిచర్యలో పాల్గొనకుండా మీ పరిస్థితులు మిమ్మల్ని ఆటంకపరిచినా, మీరు ఇతరుల్ని బలపర్చవచ్చు. ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “తీవ్ర అంగవైకల్యంగల వ్యక్తి సహితం ఇతరులకు గొప్ప సేవచేయగలడని నేను తెలుసుకున్నాను. నేను, నా భార్య సంఘమందున్న వివిధ వ్యక్తులకు ఒకరకంగా మద్దతుగా ఉండేవాళ్ళము. ఎందుకంటే మాకున్న పరిస్థితినిబట్టి మేమన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండేవాళ్ళం.” అయితే, మీ అంగవైకల్యం మూలంగా, అన్నిసమయాల్లో మీరనుకున్నంత ఆసక్తిగా మీరు పని చేయలేకపోవచ్చు, అది అర్థంచేసుకోదగినదే. అయినా, కొద్దిపాటి సహాయంతో పరిచర్యలో మీరు చురుకుగా భాగం కలిగియుండవచ్చు. కాబట్టి, మీకేదైనా సహాయం అవసరమైతే, పెద్దల దృష్టికి లేదా సంఘంలో మీకు సహాయం చేయగల ఇతరుల దృష్టికి ఈ విషయం తీసుకురావడానికి సంశయించకండి.
6 యెహోవా తనను సేవించేందుకు మీరుచేసే సమస్తం గమనిస్తూ, మీరు పూర్ణాత్మతో చేసే సేవయందు సంతోషిస్తాడు. (కీర్త. 139:1-4) మీరాయనపై ఆధారపడుతుండగా, మీరు ఫలవంతమైన, అర్థవంతమైన పరిచర్య చేసేలా ఆయన మిమ్మల్ని బలపర్చగలడు.—2 కొరిం. 12:7-10.