2003 “దేవుణ్ణి మహిమపరచండి” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
1 నమ్మకస్థుడైన తన ప్రవక్త యెషయా ద్వారా యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి.” (యెష. 51:4) అంతకంతకూ అపాయకరంగా తయారవుతున్న ఈ అంత్యకాలంలో యెహోవా ఆజ్ఞలకు అవధానమివ్వడం మునుపటికంటే ఇప్పుడు మరింత ప్రాముఖ్యం అని మనం అంగీకరించమా? మనం యెహోవా చెప్పేవాటిని ‘చెవియొగ్గి వినడానికి’ ఒక మార్గమేమిటంటే, ఆరాధన కోసం సమకూడమని ఆయన ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడం. మన వార్షిక జిల్లా సమావేశాలు ఇచ్చే ప్రత్యేక అవకాశం కోసం మనం ఎంతగా ఎదురు చూస్తామో కదా! యెహోవాసాక్షుల పరిపాలక సభ 2003వ సంవత్సరంలో ఇండియా బ్రాంచి క్షేత్రంలో అనేక జిల్లా సమావేశాలు నిర్వహించడానికి మళ్ళీ ఏర్పాట్లు చేసింది.
2 గత సంవత్సరం ఇండియాలో జరిగిన ఆధ్యాత్మికంగా పునరుత్తేజకరమైన “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశాలకు 33,372 మంది హాజరయ్యారు. జరిగిన తొమ్మిది సమావేశాలకు సంబంధించి 807 మంది తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించడాన్ని చూడడం హృదయాన్ని సంతోషపరుస్తుంది. సమావేశ ప్రతినిధులు ఈ సమావేశాల్లో చేయబడిన ఏర్పాట్లను చూసి ఎంతో కదిలించబడ్డారు. నాలుగు సమావేశ నగరాల్లోని (చెన్నై, కొచ్చి, ముంబాయి, సికింద్రాబాద్) సహోదర సహోదరీలు దేశమంతటి నుండి వచ్చిన ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు, వారిలో చాలామందికి అంత పెద్ద గుంపును చూడడం వారి జీవితాల్లో అదే మొదటిసారి. ప్రతినిధులందరూ ఆహ్లాదకరమైన సహవాసాన్ని, ఆధ్యాత్మిక పోషణను ఆనందించారనడంలో సందేహం లేదు. అలాంటి ప్రోత్సాహం పొందిన తర్వాత, మనం మన ప్రేమను మన సత్క్రియలను అధికం చేసుకోవడానికి ప్రేరేపించబడలేదా? ఈ అనుకూలమైన సమయంలో ఇంకా ఎక్కువమంది ప్రజలు దేవుణ్ణి మహిమపరచేలా వారికి సహాయం చేయడానికి మనం ఇప్పుడు ఖచ్చితంగా మరింత సంసిద్ధంగా ఉన్నాము, మరింత ఎక్కువ ప్రేరేపించబడ్డాము.—2 కొరిం. 6:1, 2.
3 మనం 2003 జిల్లా సమావేశం గురించి ఆలోచిస్తుండగా మన అమూల్యమైన సౌభ్రాతృత్వాన్ని అనుభవించడానికీ, యెహోవా దయచేసిన ఐకమత్యానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికీ మనం కొత్త అవకాశాల కోసం ఎదురు చూద్దాము. మన సమావేశాల కోసం ఇప్పుడు చేయబడుతున్న ఏర్పాట్ల నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ఏమి చేయవచ్చు?
4 ప్రతీరోజు హాజరవండి: నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా అందించబడే ఉపదేశం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనం సమావేశ కార్యక్రమమంతటికీ హాజరయ్యేలా నిశ్చయపరచుకోవాలని కోరుకుంటాము. (మత్త. 24:45) సమావేశపు మూడు రోజులూ హాజరవడానికి మీరు మీ యజమానిని సెలవు అడగాలా? యెరూషలేముకు వెళ్ళి గోడలను పునర్నిర్మించడానికి అర్తహషస్త రాజు నుండి అనుమతి కోరేముందు నెహెమ్యా “ఆకాశమందలి దేవునికి ప్రార్థన” చేశాడు. (నెహె. 2:4) సమావేశపు మూడు రోజులూ హాజరవడానికి మీ యజమానిని సెలవు అడిగేందుకు ధైర్యం కోసం మీరు కూడా అలాగే ప్రార్థన చెయ్యాలి. మీ యజమాని మీకు సెలవు ఇవ్వడానికి ఇష్టపడకపోతే అప్పుడెలా? మన సమావేశాల్లో లభించే ఉపదేశం మనం నిజాయితీగల, కష్టపడి పనిచేసే, నమ్మకస్థులైన పనివారిగా ఉండడానికి సహాయపడుతుందని వారికి వివరిస్తే అది, బహుశా వారు అనుకూలంగా ప్రతిస్పందించేలా చేయవచ్చు. అంతేకాక మనకు అవిశ్వాసులైన కుటుంబ సభ్యులుంటే, మన సమావేశ ప్రణాళికల గురించి వారికి సాధ్యమైనంత త్వరగా తెలియజేయడం ప్రేమపూర్వకమైన చర్య.
5 కొత్త రూమింగ్ ఏర్పాటు: పెద్ద జిల్లా సమావేశానికి హాజరయ్యే వందలాది మందికి వసతి ఏర్పాటు చేయడం ఎల్లప్పుడూ పెద్ద పనిగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది హోటళ్ళలో, డార్మిటరీల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. సహోదరులకు హోటల్ గదులు ఏర్పాటు చేయడానికి—కొన్ని సందర్భాల్లో తక్కువ ధరలతో ఏర్పాటు చేయడానికి—సమావేశపు రూమింగ్ విభాగాలు సంతోషిస్తాయి అయితే చాలామంది సహోదరులు స్వయంగా ఏర్పాట్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
6 వసతి అవసరమయ్యేవారందరికీ సహాయం చేయడానికి, రూమింగ్కు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ సరళీకృతం చేయడానికి ఈ సంవత్సరం “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశాలకు హాజరవుతున్నవారి కోసం ఒక కొత్త పద్ధతిని ఉపయోగించాలని బ్రాంచి కార్యాలయం నిర్ణయించుకుంది. రూమింగ్ విభాగం ఎవ్వరికి హోటల్ గదులను ముందుగానే బుక్ చెయ్యదు కానీ దానికి బదులుగా ఆసక్తిగల వారు హోటళ్ళను స్వయంగా సంప్రదించి తమ ఏర్పాట్ల గురించి చర్చించుకోవడానికి వీలుగా సిఫార్సు చేయబడిన హోటళ్ళ లిస్టును, గదుల ఖరీదును మాత్రమే అందజేయాలని మేము నిర్ణయించాము. అయితే ఇది డార్మిటరీ కావాలనుకునేవారికి అన్వయించదు. వారు సమావేశపు రూమింగ్ విభాగం ద్వారా తమ వసతిని బుక్ చేసుకోవచ్చు.
7 డార్మిటరీలు: చాలా సందర్భాల్లో, సంఘాలకు హోటళ్ళ వివరాలకు చెందిన మొదటి లిస్టు పంపించిన ఒక నెల తర్వాత డార్మిటరీల గురించి సమాచారం పంపించబడుతుంది. ఈ విధమైన వసతి కావాలనుకునేవారు, సమావేశపు రూమింగ్ విభాగం సంఘాలకు పంపించే లిస్టులో ఇవ్వబడే ఉపదేశాలను పూర్తిగా పాటించాలి.
8 ప్రత్యేక అవసరాలు: ప్రత్యేక అవసరాలుగల వారిని చూసుకోవడానికి అవసరమయ్యే ఏర్పాట్లలో అధిక శాతాన్ని అలాంటి వారు హాజరయ్యే స్థానిక సంఘానికి చెందినవారు చూసుకోవడం అలవాటుగా జరుగుతోంది. అలాంటి వారి పరిస్థితుల గురించి తెలిసిన పెద్దలు, ఇతరులు వారికి ప్రేమపూర్వకంగా సహాయం చేశారు, అది ప్రశంసనీయమైనది. ఆ సహాయంలో తరచూ ఇతరులను—పూర్తికాల సేవలో ఉన్నవారిని, వృద్ధులను, అశక్తత కలవారిని లేదా అవసరంలో ఉన్నవారిని—తమ గుంపుతోపాటు తీసుకువెళ్ళడం ఉంటుంది. సహోదరులు అలాంటి వారికి సమావేశ ఏర్పాట్లు చేసుకోవడానికి సహాయం చేయడం లేదా సాధ్యమైతే అవసరంలో ఉన్నవారికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం లాంటి ఇతర విధాల్లో కూడా సహాయం చేశారు. (యాకో. 2:15-17; 1 యోహా. 3:18) అలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపించడం కొనసాగుతుందని మాకు నమ్మకం ఉంది. (యోహా. 13:35) అయితే ప్రత్యేక అవసరాలున్న వారు స్వయంగా తమ ఏర్పాట్లు చేసుకోలేకపోతే, వారు హాజరయ్యే సంఘం కూడా ఆ ఏర్పాట్లు చేయలేకపోతే అలాంటి వారికి సమావేశపు రూమింగ్ విభాగం వసతి ఏర్పాటు చేస్తుంది. అలాంటి వారు తమ సంఘంలోని సమావేశపు కోఆర్డినేటర్‌ను స్పెషల్ నీడ్స్ రూమ్ రిక్వెస్ట్ ఫారమ్ అడగవచ్చు, అప్పుడు ఆయనతో తమ పరిస్థితిని చర్చించవచ్చు.
9 ప్రత్యేక అవసరాలున్న వారు మాత్రమే ఈ ఫారమ్‌ను ఉపయోగించాలి. వారు దాన్ని పూరించి సమావేశపు కోఆర్డినేటర్‌కు తిరిగి ఇవ్వాలి. ఆయన అది పూర్తిగా పూరించబడి, స్పష్టంగా ఉందా లేదా చూసి పరిస్థితులను నిర్ధారించుకుంటాడు. ఆయన దాన్ని సమావేశపు రూమింగ్ విభాగానికి పంపించినప్పటికీ, రూమింగ్ విభాగం వారికి నేరుగా వారి వసతి గురించి తెలియజేస్తుంది. ప్రత్యేక అవసరాలుగల వారి పరిస్థితులకు అనుగుణంగా వారి వసతి కోసం సహోదరుల ఇళ్ళు లేదా హోటల్ గదులు ఏర్పాటు చేయబడతాయి. ఇళ్ళలో కల్పించబడే వసతి కేవలం పరిమితమైన డబ్బుగలవారికి మాత్రమేనని గుర్తుంచుకోండి, అలాంటివారికి సహోదరుల ఇళ్ళలో వసతి ఏర్పాటు చేయకపోతే వారు చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఈ ఏర్పాటు చేయబడింది. సెలవుల్లో ఊరు వెళ్ళడానికి లేదా ఇతర కారణాల కోసం డబ్బు ఆదా చేసేందుకు ఉచిత వసతి లేదా తక్కువ ధరకు లభ్యమయ్యే గదులు కావాలని కోరుకునేవారి కోసం కాదు ఈ ఏర్పాటు. అంతేకాక ఇళ్ళలో ఇవ్వబడే వసతి కేవలం సమావేశ దినాల్లో మాత్రమే. ఆ పట్టణంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా సమావేశానికి ముందు లేదా సమావేశం తర్వాత అదనపు రోజులు ప్రతినిధులకు తమ ఇళ్ళలో వసతి కల్పించాలని సహోదరుల నుండి ఆశించడం సరైనది కాదు.
10 వేరే సమావేశానికి హాజరవడం: మీకు నియమించబడిన సమావేశానికి కాక వేరే సమావేశానికి హాజరవ్వాల్సిన పరిస్థితులు ఎదురైతే, మీకు ఆ ప్రాంతంలో హోటల్ గది అవసరమైతే దయచేసి మీ సంఘ కార్యదర్శిని సంప్రదించండి. సమావేశపు ముఖ్య కార్యాలయం అడ్రస్‌ను ఆయన మీకు ఇస్తాడు. మీ రిక్వెస్టును తగిన అడ్రస్‌కు పంపించండి, మీ అడ్రస్ వ్రాసి స్టాంపు అతికించివున్న కవర్‌ను కూడా పంపించండి. ఆ పట్టణంలోని రూమింగ్ విభాగం ద్వారా సిఫార్సు చేయబడిన హోటళ్ళ కొత్త లిస్టును, వాటి ధరలను మీకు పంపిస్తారు.
11 మనం వేడుకగా ఉన్నాము: యెహోవాసాక్షులకు లోకంలోని ఇతర ప్రజలకు మధ్యవున్న తేడాను ప్రజలు గమనిస్తారా? ఖచ్చితంగా! అయితే కొన్నిసార్లు హోటల్ మేనేజర్లు మన గురించి ప్రతికూల వ్యాఖ్యానాలు చేశారు. ప్రతినిధులు బుక్ చేసుకున్న గదులను కాన్సిల్ చేస్తున్నారని లేదా కొన్ని సందర్భాల్లో తమ ధరలో చేర్చబడని సౌకర్యాలు కల్పించమని అడుగుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో యెహోవాసాక్షుల సమావేశ ప్రతినిధులను తమ హోటళ్ళలో ఉంచుకోవడానికి ఇష్టపడమని వారు అభిప్రాయపడ్డారు. మనం మన దేవుడైన యెహోవా నామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, మనలను ఇతరులు దగ్గరగా గమనిస్తున్నారని మనలో అందరూ గ్రహించడం లేదని ఇది సూచిస్తోంది.
12 అయితే సంతోషకరమైన విషయమేమిటంటే హోటల్ మేనేజర్లు చేసిన వ్యాఖ్యానాల్లో అధికశాతం అనుకూలమైనవే. ఒక పట్టణంలో ఒక మేనేజర్ ఇలా చెప్పాడు: “సభలు సమావేశాలతో మేము ఎల్లప్పుడూ వ్యవహరిస్తూనే ఉంటాము, కానీ మీరే చాలా సహకరించే స్వభావంగల ప్రేమగల ప్రజలు.” “గతవారం మావద్ద మరో మతానికి చెందిన ప్రజలున్నారు. వారికీ మీకూ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది.” “మీరు సహాయం చేస్తారని, సహకరిస్తారని మేము ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండవచ్చు.” “పైనుండివచ్చు జ్ఞానము” మన వ్యక్తిత్వంపై ఎలా అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుందో గ్రహించేందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు మనకు సహాయం చేయవా? (యాకో. 3:17) మనము ‘లోకానికి వేడుకగా ఉన్నాము’ కాబట్టి మన ప్రవర్తన ఎల్లప్పుడూ మన దేవుడైన యెహోవా హుందాతనాన్ని, వైభవాన్ని ప్రతిబింబించాలి.—1 కొరిం. 4:9.
13 “ఈ లోకపు నటన గతించుచున్నది” కాబట్టి మనం ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండడానికి మన జిల్లా సమావేశాల సహాయం మనకు కావాలి. (1 కొరిం. 7:31) మూడు రోజులు హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి కృషి చేయడం అవసరం, కానీ అది ప్రతిఫలదాయకమైనదే. ఈ సంవత్సరం “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశం, సాతాను లోకంపై యెహోవా తీర్పు అమలు చేయబడడం కోసం ఎదురుచూస్తుండగా మనం స్థిరంగా ఉండడానికి సహాయం చేసేందుకు రూపొందించబడింది. యెహోవా మన కోసం సిద్ధం చేసిన ఉపదేశాన్ని పొందకుండా మనలను ఆపుచేయడానికి మనం దేనినీ అనుమతించకుండా ఉందాం.—యెష. 51:4, 5.
[3వ పేజీలోని బాక్సు]
కార్యక్రమ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉదయం 9:30 - సాయంత్రం 5:00 ఆదివారం
ఉదయం 9:30 - సాయంత్రం 4:05