క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము
క్రొత్త సేవా సంవత్సరంలోని ప్రత్యేక సమావేశ దిన అంశానికి గట్టి లేఖనాధారముంది: “దేవునికి లోబడివుండండి—అపవాదిని ఎదిరించండి.” (యాకో. 4:7) క్లిష్టమైన ఈ కాలంలో సరైన మార్గనిర్దేశకమది! దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తాం కాబట్టి, సాతానుకు మనం ప్రత్యక్ష విరోధులమవుతాము. మన విశ్వాసాన్ని నశింపజేసే సాతాను దుష్ట పన్నాగాలను ఎదిరిస్తూ దృఢంగా ఎలా నిలబడాలో ఈ కార్యక్రమము మనకు బోధిస్తుంది. ఈ సమావేశంలో మనం అందుకోబోయే కొన్ని ఆధ్యాత్మిక రత్నాలు ఏవి?
‘కుటుంబ సభ్యులుగా దైవిక విధేయతను చూపించడం’ వల్ల, లోక ఒత్తిడులను విజయవంతంగా ప్రతిరోధించడానికి కుటుంబాలు ఎలా బలపరచబడతాయో ప్రాంతీయ పైవిచారణకర్త తెలియజేస్తాడు. ఆ రోజు అతిథి ప్రసంగీకుడిచ్చే తన మొదటి ప్రసంగం, “అపవాదిని ఎదిరించడమంటే ఏమిటి?” మన ఆధ్యాత్మికతను నశింపజేసే సాతాను లక్ష్యాలను ప్రతిరోధించడానికి మనం దృఢమైన చర్యల్ని ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో తెలియజేస్తుంది. రెండు భాగాలు ప్రత్యేకంగా యౌవనస్థుల కోసం తయారు చేయబడ్డాయి, వాళ్ళు కూడా అపవాది పన్నాగాల విషయంలో అప్రమత్తులై ఉండాలి. ఇప్పుడు వయోజనులుగావున్న చాలామంది క్రైస్తవులు, తాము యౌవనస్థులుగా ఉన్నప్పుడు ఐహిక వాంఛల అనుసారంగా వెళ్ళడానికి నిరాకరించారు. మనం వారి సొంత అనుభవాలను కొన్నింటిని విని ఆనందిస్తాము.
మానవ సమాజంలోని వారందరూ అధికారానికి లోబడి ఉండాలి. అందుకే, అతిథి ప్రసంగీకుని ముగింపు ప్రసంగం మనం దైవిక విధేయత కనబరచవలసిన నాలుగు రంగాలను గురించి నొక్కి చెబుతుంది: (1) ప్రభుత్వాలకు, (2) సంఘంలో, (3) ఉద్యోగ స్థలంలో, (4) కుటుంబంలో. ఎంత చక్కని ఆచరణాత్మకమైన కార్యక్రమం!
ఈ ప్రత్యేక సమావేశ దినమున బాప్తిస్మం పొందాలనుకునేవారు వీలైనంత త్వరగా పైవిచారణకర్తకు తెలియజేయాలి. మనమందరం క్యాలెండర్లలో తేదీని గుర్తు పెట్టుకుని, మొత్తం సమావేశ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. మనం యెహోవాకు నిరంతరం లోబడి ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదాలను తప్పకుండా పొందుతాము.