‘దేవుని వాక్యము బలముగలది’
1 “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉందని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీ. 4:12) ఆయనలా అనడంలో అర్థమేమిటి? బైబిల్లో లభించే దేవుని వాక్యం లేక సందేశం ప్రజలమీద బలమైన ప్రభావాన్ని చూపుతుంది. బైబిల్లో ఉన్న జ్ఞానానికి ఒకరి జీవితాన్ని మంచిగా మార్చగల శక్తి ఉంది. అది ఇచ్చే ఓదార్పు నిరీక్షణలు మానవులను జీవదాతయైన యెహోవా దేవునికి దగ్గర చేస్తాయి. దాని సందేశం యథార్థహృదయం గలవారిని నిత్యజీవితానికి నడిపించే మార్గంలో నడిపిస్తుంది. అయినప్పటికీ, ఈ ఫలితాలను చూడాలంటే, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనం బైబిలును ఉపయోగించాలి.
2 అవకాశమున్నప్పుడల్లా ఒక లేఖనాన్ని చదవండి: అనేకమంది ప్రచారకులు పరిచర్యలో బైబిలు ఉపయోగించే అలవాటును మర్చిపోయారన్నట్లుగా కన్పిస్తోంది. మీకు కూడా అలానే అవుతోందా? చాలామంది దగ్గర సుదీర్ఘ సంభాషణకు సమయం ఉండడం లేదు, అందుకని బహుశా మీరు కేవలం సాహిత్యాన్ని అందించడానికి లేక ఒక లేఖనాన్ని వల్లె వేయడానికి అలవాటు పడిపోయారేమో. సువార్తను అందించేటప్పుడు బైబిలు తెరిచి కనీసం ఒక్క వచనమైనా చదవడానికి తీవ్రంగా కృషి చేయమని ప్రచారకులందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము, ఆ విధంగా, మన సందేశం నిజంగానే బైబిల్లోనిదేనన్న విషయాన్ని ఎదుటి వ్యక్తి చూడడానికి వీలవుతుంది.
3 బైబిలు చదివే అలవాటు చాలా కొద్దిమందికే ఉన్నప్పటికీ, ప్రజలకు అదంటే సాధారణంగా గౌరవం ఉంది. బిజీగా ఉండే ప్రజలు కూడా, నేరుగా దేవుని వాక్యంనుండి చదివే సందేశాన్ని వినడానికి తరచుగా ఒకటి రెండు నిమిషాలు వెచ్చిస్తారు. సమయోచితమైన ఒక లేఖనాన్ని చక్కగా చదివి దాన్ని స్నేహపూర్వకంగా క్లుప్తంగా వివరించినప్పుడు, వినేవారిపై యెహోవా వాక్యపు శక్తి మంచి ప్రభావం చూపుతుంది. కాని మీ ప్రారంభపు మాటలతో బైబిల్లోని ఒక వచనానికి ఎలా వంతెన కడతారు?
4 పత్రికా పనిలో దీన్ని ప్రయత్నించండి: పత్రికా పని చేసేటప్పుడు ఒక ప్రయాణ పైవిచారణకర్త లేఖనాలను ప్రభావవంతంగా ఉపయోగిస్తాడు. ఆయన తన జేబులో ఒక చిన్న బైబిలు తీసుకువెళ్తాడు. పత్రికలను అందించి క్లుప్తంగా ఒక ఆర్టికల్ గురించి చెప్పిన తర్వాత, ఆయన సంకోచించకుండా బైబిలు తెరిచి ఆ ఆర్టికల్‌కు సంబంధించిన ఒక వచనాన్ని చదువుతాడు. మీరు కూడా, అలాగే పత్రికలో పేర్కొనబడిన వాగ్దానం గురించి చెప్పిన తర్వాత, “ప్రోత్సాహకరమైన ఈ వాగ్దానం గురించి మీకేమనిపిస్తుంది?” అని అడిగి, ఆ వాగ్దానానికి సంబంధించిన లేఖనం చదవడం ద్వారా చాలా సులభంగా చేయవచ్చు.
5 వినే ప్రతి వ్యక్తితో, బైబిలు నుండి ఒకటి లేక రెండు వచనాలను పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. దాని ప్రేరణాశక్తి దేవునికి దగ్గరయ్యేందుకు ఇంకా ఎక్కువ మందికి మార్గం తెరవగలదు.—యోహా. 6:44.