క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
2000వ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే క్రొత్త సమావేశ దిన కార్యక్రమ అంశం “దేవుని లోతైన సంగతులను పరిశోధించడం.” (1 కొరిం. 2:10, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) మనం ఏ అమూల్యమైన సంగతులను నేర్చుకోబోతున్నాం.
చాలా మంది ప్రజలు, జ్ఞానం కొరకైన తమ అన్వేషణలో తాము కనుగొన్న దాన్నిబట్టి సేదదీర్పు పొందడం లేదు. మనమైతే బైబిలు మూలంగా ఉత్తేజితులమౌతున్నాం. ఈ విషయాన్ని, ప్రాంతీయ పైవిచారణకర్త, తను నిర్వహించబోయే భాగంలో, “దేవుని వాక్యాన్ని వెదకడం సేదదీర్పునిస్తుంది” అనే భాగంలో చూపిస్తాడు. అతిథి ప్రసంగీకుడు, “మీరు రాజ్య ప్రకటనను ఎలా దృష్టిస్తారు?” అనే ప్రశ్నను గురించి చర్చిస్తూ, దేవుని లోతైన సంగతులను పరిశోధించడానికీ, సువార్త ప్రకటన పనికీ గల సంబంధాన్ని చూపిస్తాడు.
దేవుని వాక్యాన్ని లోతుగా త్రవ్వేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయపడగలరు? “మీ పిల్లల మనసుల్లో దేవుని వాక్యాన్ని నాటండి” అనే భాగంలో ఆచరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి. సంఘంలోని ఆధ్యాత్మిక పరిపక్వత గల వాళ్ళతో సహవసించడం ద్వారా క్రైస్తవ యౌవనస్థులు ఆరోగ్యకరమైన రీతిలో ప్రభావితులౌతున్నారు. “పెద్దవాళ్ళ నుండి నేర్చుకునే యౌవనస్థులు” అనే భాగంలో, యౌవనస్థులు ఎలా అనుకూలమైన రీతిలో ప్రభావితులౌతున్నారన్నది చూపించబడుతుంది.
యెహోవా మర్మములను బయల్పరచే దేవుడు. దాచి ఉంచబడిన ఆధ్యాత్మిక నిధుల కోసం ఈ కాలంలో మనం శ్రద్ధాపూర్వకంగా ఎందుకు అన్వేషించాలి? అతిథి ప్రసంగీకుడు, “యెహోవా లోతైన సంగతులను క్రమానుసారంగా బయల్పరుస్తాడు” అనే ప్రసంగంలో, ప్రాచీన కాలాల్లోను ఆధునిక కాలాల్లోను యెహోవా ఏమి బయల్పరచాడన్న దాని గురించి వివరిస్తాడు. ఇది, “దేవుని లోతైన సంగతులను పరిశోధించడం”లో కొనసాగాలన్న మన దృఢ నిశ్చయాన్ని బలపరుస్తుంది.
సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పుడే పథకం వేసుకోండి. యెహోవాకు తాము చేసుకున్న సమర్పణను బాప్తిస్మం ద్వారా తెలియజేయాలనుకునేవాళ్ళు సాధ్యమైనంత త్వరగా సంఘాధ్యక్షుడికి తెలియజేయాలి. మనం అక్కడ వినే విషయాలు, దేవుని వాక్యంలో జాగ్రత్తగా పరిశోధన చేయాలన్న మన హృదయపూర్వక కోరికను బలపరుస్తాయి. కనుక, ఆధ్యాత్మిక నిర్దేశాలు లభించే ఈ ప్రత్యేక దినాన్ని వదులుకోకండి!