ఆశీర్వాదాన్ని తెచ్చే ఒక సందర్శనం
1 జక్కయ్య యేసును తన అతిథిగా సంతోషముతో చేర్చుకున్నాడు. మరి ఆ సందర్శనం ఎంత ఆశీర్వాదకరంగా పరిణమించింది!—లూకా 19:2-9.
2 నేడు, ‘దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుటకు,’ సంఘ శిరస్సుగా యేసుక్రీస్తు పెద్దలకు నిర్దేశనాన్నిస్తాడు. (1 పేతు. 5:2, 3; యోహా. 21:15-17) కూటాల్లో బోధించడమూ, క్షేత్ర సేవలో నాయకత్వం వహించడమూ వంటి పనులకు తోడు, సంఘంలోని పైవిచారణకర్తలు సంఘంలోని ప్రతి సభ్యునికీ ప్రేమపూర్వకమైన, వ్యక్తిగత సహాయాన్ని అందిస్తారు. అందుకని అప్పుడప్పుడు, పెద్దలు మీ పట్ల వ్యక్తిగత శ్రద్ధను కనపర్చే సందర్భాల కోసం మీరు ఎదురుచూడవచ్చు—అది మీ ఇంట్లోనో, రాజ్య మందిరంలోనో, లేక క్షేత్ర సేవలో కలిసి పనిచేస్తున్నప్పుడో, లేక మరితర సందర్భాల్లోనో కావచ్చు. పెద్దలు సందర్శించడానికి వస్తున్నారని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఏమాత్రం ఆందోళనపడనవసరం లేదు. వారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారంటే దానర్థం మీలో ఏదో లోపం ఉందని కాదు. మరైతే కాపరి సందర్శనం ఉద్దేశమేమిటి?
3 పౌలు తాను ‘వారేలాగున్నారో చూడడానికి’ సహోదరుల దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. (అపొ. 15:36) అవును, ప్రేమపూర్వక కాపరులకు వలెనే, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి పెద్దలు చాలా ఆసక్తికలిగి ఉన్నారు. మీకు సహాయకరంగా, అభివృద్ధిదాయకంగా ఉండగల ఆధ్యాత్మిక మద్దతును ఇవ్వాలని వారు అనుకుంటారు. మన ప్రేమపూర్వక కాపరి అయిన యెహోవా, మనపట్ల సరిగ్గా అటువంటి వ్యక్తిగత శ్రద్ధే ప్రదర్శించబడాలని ఇచ్ఛయిస్తున్నాడు.—యెహె. 34:11.
4 పెద్దల సందర్శనాల్ని స్వాగతించండి: ‘వారు స్థిరపడవలెనని, ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణపొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను వారికిచ్చుటయే’ పౌలు తన సహోదరులను సందర్శించడానికిగల ఉద్దేశం. (రోమా 1:11, 12) ఈ చివరి కష్టకాలాల్లో మనకందరికీ ఆధ్యాత్మిక ప్రోత్సాహం అవసరం, విశ్వాసంలో స్థిరంగా కొనసాగడానికి సహాయం అవసరం. కాపరి సందర్శనానికి మీరు అనుకూలంగా ప్రతిస్పందిస్తే అది నిస్సందేహంగా చక్కని పరస్పర ప్రోత్సాహానికి నడిపిస్తుంది.
5 పెద్దల కాపరి పని నుండి వచ్చే ప్రయోజనాలు అనేకం, వాటిని స్వీకరించండి. మీరు కలత చెందుతున్న ఏదైనా నిర్దిష్టమైన విషయం లేక ఏదైనా ప్రశ్న మీకుంటే, సహాయం చేయడానికి సంఘంలో పెద్దలున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఏ విషయం గురించైనా సరే వారితో చర్చించడానికి సంకోచించకండి. యెహోవా చేసిన ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాటును హృదయపూర్వకంగా స్వీకరించి, అటువంటి సందర్శనం వల్ల రాగల ఆశీర్వాదాలనుబట్టి సంతోషించండి.