మన పరిచర్య—నిజమైన ప్రేమకొక అభివ్యక్తీకరణ
1 మన పరిచర్య ద్వారా, మనం రెండు గొప్ప ఆజ్ఞలకు విధేయతను చూపిస్తాం. (మత్త. 22:37-39) యెహోవా ఎడల మనకున్న ప్రేమ, ఆయన్ని గురించి అనుకూలంగా మాట్లాడేలా మనల్ని ప్రేరేపిస్తుంది. పొరుగువారి ఎడల మనకున్న ప్రేమ, వాళ్లు కూడా మనవలే యెహోవాను ప్రేమించి, నిత్యజీవ బహుమానాన్ని పొందు వరుసలో తమను ఉంచుకొనగల్గేలా దేవుని చిత్తాన్ని గూర్చిన, ఆయన సంకల్పాల్ని గూర్చిన జ్ఞానాన్ని వెదికేందుకు వారిని ప్రోత్సహించడానికి మనల్ని కదిలిస్తుంది. అయితే, మన పరిచర్య ద్వారా, మనం యెహోవా నామాన్ని ఘనపరుస్తాం, అమూల్యమైన రాజ్యనిరీక్షణను మన పొరుగువారితో పంచుకుంటాం. అవును, మన పరిచర్యయనేది దేవుని ఎడలా, మానవుల ఎడలా గల నిజమైన ప్రేమకొక అభివ్యక్తీకరణయై ఉంది.
2 అన్ని సందర్భాల్లోనూ సమస్త ప్రజలతో మాట్లాడేలా మనకున్న ప్రేమ మనల్ని కదిలిస్తుంది. (1 కొరిం. 9:21-23) ఉదాహరణకు: విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక క్రైస్తవ పెద్ద, ఓ రోమన్ క్యాథలిక్ ప్రీస్టు ప్రక్కన కూర్చున్నాడు. పెద్ద యుక్తిగా కొన్ని ప్రశ్నల్ని అడగడం ద్వారా ప్రీస్టును చర్చలోకి దించి, ఆ తర్వాత ఆ చర్చను రాజ్యంవైపు మళ్లించాడు. ఆ ప్రీస్టు విమానం దిగే సమయానికల్లా, అతడు మన పుస్తకాల్లో రెండింటిని తీసుకున్నాడు. పొరుగువాని ఎడల తనకు గల నిజమైన ప్రేమకు ఆ పెద్ద వ్యక్తపర్చిన ఈ అభివ్యక్తీకరణ మూలంగా ఎంత చక్కటి ఫలితం వచ్చింది!
3 నిజమైన ప్రేమ ప్రకటించమని మనల్ని ప్రేరేపిస్తుంది: సహాయ పయినీరు పనిలోనూ, పూర్తికాల పయినీరు పనిలోనూ ఉన్న వాళ్లు దేవుని ఎడలా, పొరుగువారి ఎడలా నిజమైన ప్రేమను నిశ్చయంగా వ్యక్తపరుస్తున్నారు. ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయపడేందుకు పయినీర్లు తమ సమయాన్నీ, శక్తినీ ఎల్లవేళలా త్యాగం చేస్తున్నారు. ఇలా చేయడానికి వారినేది ప్రేరేపిస్తోంది? ఒక పయినీరు ఇలా చెప్పింది: “ప్రేమనేది దేవుని ఆత్మ ఫలమని నాకు తెల్సు. అదే గనుక లేకపోతే, నేను సత్యంలో ఉండి ఉండకపోయేదాన్ని, ఒక పయినీరుగా ఉండడం సంగతైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ప్రేమ నేను ప్రజల ఎడల శ్రద్ధకలిగి, వారి అవసరాల్ని తెలుసుకునేలా చేస్తుంది, ప్రజలు ప్రేమకు ప్రతిస్పందిస్తారని నేను గ్రహించాను.” ప్రజల ఎడల యేసు అలాంటి ప్రేమనే చూపించాడు. ఒకసారి ఆయనా, అలసిపోయిన ఆయన శిష్యులూ ఒకానొకచోట ‘కొంచెముసేపు అలసట తీర్చుకోవడానికి’ వెళ్తున్నప్పుడు, ప్రజలు వారికన్నా ముందే అక్కడకి చేరుకున్నారు. యేసు ఏం చేశాడు? “వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధిం[చేందుకు]” ఆయన తన వ్యక్తిగత అవసరాల్ని ప్రక్కన పెట్టాడు.—మార్కు 6:30-34.
4 మనం అందించే సువార్తను ప్రజలు తిరస్కరించినప్పుడు సహితం, ప్రేమను బట్టి కదిలించబడి వాళ్లు రక్షణపొందడానికి సహాయపడేందుకు మనం చేయగలిగినదంతా చేశామని తెలిసికొని, మనం ఆంతరంగిక ఆనందాన్ని పొందుతాం. చివరకు మనమంతా క్రీస్తుచే తీర్పుతీర్చబడినప్పుడు, ‘మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించడం’ ద్వారా మనం నిజమైన ప్రేమను చూపించామని మనం ఎంతో సంతోషిస్తాం.—2 తిమో. 4:5.