మీరు పూర్తికాల సాక్షియేనా?
1 ఈ ప్రశ్నకు అవును అని మీరు జవాబిస్తారా? యెహోవాసాక్షులైన అందరూ పూర్తికాల పరిచర్యలో చేరలేకపోయినప్పటికీ, మనమందరమూ ఆయన పుర్తికాల సాక్షులమని మనలను మనం దృష్టించాలని ఆశించడం సహేతుకం కాదంటారా? తప్పకుండా మనమలా దృష్టించాలి.
2 భాగకాలిక క్రైస్తవులముగా ఉండే ప్రసక్తే లేదు. యేసు తన తండ్రిని గూర్చి ఇలా అన్నాడు: “ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును.” (యోహాను 8:29) అదే విధంగా భావించిన పౌలు “మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని మనకు ఉద్బోధించాడు. (1 కొరిం. 10:31) కనుక, మనం యెహోవా పూర్తికాల సేవకులమని మనమందరమూ తప్పకుండా దృష్టించాలి. మనం ఈ విధంగా తలంచడం మనం చేసే ప్రతి పనిలోనూ మనం మంచిని చేసేలా మనపై ప్రభావం చూపుతుంది.
3 రుజువును పరిగణించండి: మన వేషభాషలూ, మన ప్రవర్తనా మనం నిజంగా యెహోవాసాక్షులమన్న విషయాన్ని మిగతా ప్రజలకు తెలియజేస్తాయి. మనం ప్రాంతీయ పరిచర్యలో ఉన్నప్పుడు లేదా క్రైస్తవ కూటాలకు హాజరయ్యేటప్పుడు మన వేషం నిరాడంబరంగాను, మన భాష ఆరోగ్యకరమైనదిగాను, మన ప్రవర్తన మంచిదిగాను ఉండవలసిన అవసరాన్ని గూర్చిన స్పృహ మనకుండాలి. అయినప్పటికీ, మనం స్కూల్‌కు వెళ్తున్నా, లౌకిక ఉద్యోగం చేస్తున్నా లేదా వినోదంలో పాల్గొంటున్నా, మనలను గూర్చిన ప్రతిదీ మనం యెహోవా ప్రమాణాలకనుసారంగా జీవిస్తున్నామనే దానికి రుజువునివ్వాలి.
4 యేసు ఇలా అన్నాడు: “కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. . . . మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్త. 5:14-16) మనం చేసే ప్రతి విషయంలోను, అన్ని సమయాల్లోనూ ఇది నిజమై ఉండాలి. మనమెక్కడున్నాం, లేదా ఏం చేస్తున్నాం అనే కారణాన్ని బట్టి మనం సాక్ష్యమియ్యడానికి వెనుకంజవేస్తున్నట్లు మనం ఎప్పుడైనా కనుగొంటే, ‘నేను యెహోవాను భాగకాలం సేవిస్తున్నానా లేక పూర్తికాలం సేవిస్తున్నానా?’ అని మనలను మనమే ప్రశ్నించుకోవలసిన అవసరముంది. దేవుని రాజ్య సువార్తను గురించి మాట్లాడే అవకాశాన్ని మనమెన్నడూ జారవిడుచుకోకుండా ఉందాం.
5 “మీరు పుర్తికాల సాక్షియేనా?” అనే ప్రశ్నకు “అవును!” అని ప్రతిధ్వనించే జవాబును ఇవ్వగలిగినప్పుడు మనం యెహోవాను ఘనపరుస్తామనీ, సంతోషపరుస్తామనీ జ్ఞాపకముంచుకోండి.